Shivratri |
| శివరాత్రి నాడు ఆచరించవలసిన విధులు |
స్నాన, సంధ్యాదికములు పూర్తిచేసుకుని, నిత్యపూజ అయిన తరువాత
శ్లో|| శివరాత్రి వ్రతంహ్యేతత్ కరిష్యేహం మహాఫలం ।
నిర్విఘ్నం కురుమే దేవా త్వత్ ప్రసాదాత్ జగత్పతే ॥
అని మహాదేవుడయిన శివుని మనసా ఆత్మతో ధ్యానించి సంకల్పం చేసి, చతుర్దశి తిథి అంతా
నిరాహారుడై ఉపవాసం చేయాలి. ఉపదేశం ఉన్నవారు శివపంచాక్షరీ మంత్రమును అంగన్యాస,
కరన్యాసములతో అనుసరించి సహస్రానికి (వెయ్యి) తక్కున లేకుండా జపించాలి. వెయ్యికి పైన
ఎంతైనా శివపంచాక్షరీ మంత్రము జపించవచ్లును.
“ఓం నమశ్శివాయ” అనే మంత్రమునే శివపంచాక్షరీ మంత్రమంటారు. ఈ మంత్రం యథాశక్తి జపించిన తర్వాత మారేడుదళం గ్రహించి, పాలతో కలిపిన తీర్ధంలో శివలింగం పై తర్పణంగా విడిచిపెట్టాలి. ఇలాగ దినమంతా శివపూజతోనూ, ధ్యానంతోను, రుద్రాభిషేకంతోను గడపాలి. ఈ రుద్రాభిషేకమును శక్తి కలిగినవారు మహన్యాస పూర్వకముగా గాని, లేక లఘున్యాస పూర్వకముగా కాని చేయవచ్చు.
శివలింగము స్పటికంతో చేసినది గాని లేక నర్మదానదిలో దొరికిన బాణంతో చేసిన బాణలింగం గాని లేదా మట్టితో చేసిన పార్టివ లింగము కాని ఏర్పాటు చేసి దాని పై మహాదేవుడయిన శివుని ధ్యాన, ఆవాహనాది షోడశోపచారములు చేసి రుద్రముతో అభిషేకము చేయాలి. నేటి కాలంలో అనేకులు లీటర్ల కొద్ది పాలు, ఇతర ద్రవ్యాలతో అభిషేకం ఆడంబరంగా చేస్తున్నారు. నిజానికి పంచామృత మంత్రాల సమయంలో మాత్రమే కొద్ది పరిమాణంలతో ఆయా ద్రవ్యాలు వాడాలి, మిగతా అభిషేకం అంతా చల్లని సుగంధభరిత జలంతో మాత్రమే చేయాలి. ఇదియే శాస్త్రవిహితము. అంతేకాక పంచామృతాలలో అనేకులు ఏ పాలు పడితే ఆ పాలు, ఏ పెరుగు పడితే ఆ పెరుగు వాడుతున్నారు. కేవలం ఆవుపాలు ఆవుపాలతో తోడేసిన పెరుగును మాత్రమే వాడాలి. అలా ఆచరించిన అభిషేకమే సత్సలితాన్ని ఇస్తుంది. గంగాజలంతో కాని, కేవలం అభిమంత్రించిన నీళ్ళతో గాని, రుద్రాభిషేకము చేయవచ్చును.