Vedam |
వేదం - అనాది నిధనం
వేదం మనల్ని శాసించగలదు, అందుకే శాస్త్రం అని పేరు. "శాస్త్ర జ్ఞానం భహు క్లేశం బుద్దే శ్చలన కారణం" శాస్త్రాలు అనేకం, శాస్త్రాలను చదివి మనం తెల్సుకోవాలంటే, ఒక్కోటి ఒక్కో రకంగా కనిపిస్తాయి అందులో ప్రతిపాదించిన విషయాలు. అనేక చోట్ల ఒకదానితో ఒకటి వైవిధ్యంగానూ కనిపిస్తాయి. అట్లాంటప్పుడు ఆ శాస్త్రీయమైన గ్రంథాలను చదివి ఆ విషయాలను తెల్సుకోవడం అనేది కష్టం.
మరి శాస్త్రాలనే ఎందుకు చదవాలి అంటే, మనకు అలౌకికమైన అర్థాలను తెల్సుకోవాలి అంటే శాస్త్రం తప్ప మరొక ప్రమాణం లేదు. ఎందుకంటే మన కున్న ఇంద్రియాలకి శక్తి సంకుచితమైనది. జ్ఞానం కలగాలి అంటే ఇంద్రియాల వల్లనో లేక ఊహించైనా కదా కలగాలి. ఇంద్రియాల వల్ల కల్గాలి అంటే ఇంద్రియాలకి సంపూర్ణమైన శక్తి లేదు. ఎదురుగుండా ఉండే వస్తువులనే మనం ఎన్నింటినో చూడలేం. అన్ని రకాల శబ్దాలని వినగల్గుతున్నామా!! అన్ని ఇంద్రియాలకీ ఉన్న శక్తి చాలా అల్పమైనది. అందుకే ఇంద్రియాల ద్వారా అన్నింటినీ తెల్సుకోలేం.
మనం చూసినవాటిని బట్టి కొంత ఊహిస్తాం. దీన్ని అనుమానం అని అంటారు. మనం ఇంద్రియాల బట్టి తెల్సుకున్న దాన్ని మానం అని అంటాం, దీన్ని అనుసరించి కల్గిన జ్ఞానాన్ని మనం అనుమానం అని అంటారు. ఒకటని ఊహించి ఉంటాం, కానీ అది మరొకటి అయి ఉండవచ్చు. లౌకికమైన విషయాలయందే మనకున్న ఇంద్రియల శక్తి సంకుచితం, మన ఊహ అల్పం అయితే మనకు తెలియనటువంటి అలౌకికమైన అనేక విషయాలను గుర్తించడంలో ఇంద్రియాలు కానీ, ఊహ కానీ పనికిరావు.
వీటిని చెప్పగలిగేది వేదం ఒక్కటే. దీన్నే శాస్త్రం అని అంటారు. దాని ఏరకమైన దోషాలు ఉండవు. సంకుచితత్వం దానికి లేదు కారణం అది ఎవరూ తయారుచేసింది కాదు, ఎవరో కల్పించి వ్రాసినది కాదు. శాస్త్రం అపౌరుషేయం. అంటే జ్ఞానం కల జీవ సామాన్యం కానీ, దేవుడు కానీ వ్రాసినది కాదు. దేవుడిని మనం గుర్తిస్తున్నాం అంటే శాస్త్రం చెప్పింది కనక గుర్తిస్తున్నాం. మన కంటికి కనిపించాడు కనక నమ్ముతున్నామా, లేదు కదా. ఆత్మను చూసా మనం గుర్తిస్తున్నాం? శాస్త్రం చెప్పింది కనక విశ్వసిస్తున్నాం. వేదానికి ఆది లేదు, అనాధి అని అంటారు. రామాయణాన్ని వాల్మికి త్రేతా యుగంలో వ్రాసెను, భారతాన్ని వేద వ్యాసుడు ద్వాపర యుగంలో వ్రాసెను అని చెబుతాం. భాగవతాన్ని ద్వాపర అంతంలో బదరికాశ్రమంలో అలకనందా నది, సరస్వతి నది కలిసే కేశవ ప్రయాగ అనే ఒక ప్రదేశంలో ఉన్న పర్వతంపై కూర్చొని వ్రాస్తున్నాను అని వేద వ్యాసుడే చెబుతాడు. అట్లా వేదానికి వ్రాసినవాడు కానీ, ఒక కాలం కానీ లేదు. అందుకే వేదాన్ని నిత్యం అని అంటారు. ఒకప్పుడు గిర్తించబడి ఉంటుంది, ఒక్కోసారి ఎవ్వరూ గుర్తించక మరుగున పడి ఉంటుంది. దాన్ని గుర్తించే వ్యక్తి ఉన్నప్పుడు తిరిగి ప్రకాశిస్తుంది. మన వాతావరణంలో ఎన్నో తరంగాలు ఉంటాయి, ఒక పరికరం పెట్టినప్పుడే కదా అవి మనకు అందుతున్నాయి. పరికరంలేనంత మాత్రాన అవి లేవు అని చెప్పలేం. వేదం అనేది నిత్యమైనది.
ఏదో ఒకరకమైన యోగ శక్తి విశేషం చేత, సాధనా సామర్థ్యం చేత, వారున్న సమాధి స్థితిలో వాటిని గుర్తించారు. వారినే ద్రష్టలు అని అంటారు. కల్పించారు అని చెప్పరు. దర్శించారు అని చెబుతాం. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని గుర్తించడానికి ముందు భూమికి గురుత్వాకర్షణ శక్తి లేక పోలేదు. అట్లా వేద శాస్త్రం అనేది ఎప్పటికీ ఉండేది అందుకే అనాది నిధనం అని అంటారు.
వేదం - అపౌరుషేయం
మనం లోకంలో ఉన్నవాటిల్లో శ్రేష్ఠమైనవేవో వాటిని పొందాలని అనుకుంటాం, పొందినవాటిని నిలుపుకొనే ప్రయత్నం చేస్తాం. దానికి మన శరీరాన్ని, జ్ఞానేంద్రియాలని, ఆలోచనలని, చుట్టూ ఉన్న పరిసరాలను మరియూ మనకు మంచి చెప్పే పెద్దలను తోడు చేసుకొని జీవన యాత్ర కొనసాగిస్తాం. మనం పోదే ఫలితం ఎప్పటికీ నిలిచి ఉండేదై ఉండాలి. వేదాలు మనం కోరుకునే కోరికలు ఎట్లా ఉండాలి, వాటిని పొందాలంటే మన ఆచరించాల్సిన ధర్మం ఎట్లా ఉండాలి, అట్లా చేస్తే వచ్చే ఫలితం తాత్కాలికమా, ఎక్కువకాలం నిలిచేదా లేక ఎప్పటికీ నిలిచేదా అనే విషయలను తెలుపుతాయి.
వేదం అంటే 'వేదయతి ఇతి వేదాః' విజ్ఞాన గని. మనలో జ్ఞానాన్ని వెలిగించేది అని అర్థం. విజ్ఞానం అనేది అర్థవంతమైన శబ్దరూపంలో కలది వేదం. అవి సహజమైన శబ్దాలు. లోకంలో మనం జంతువుల అరుపులు సహజంగా ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి. అయితే అవి జీవ నిర్మితాలు. అట్లానే ఎప్పటికీ ఒకే రకంగా ఉండే సహజమైన శబ్దాలను వేదం అని అంటారు. ఈ విశ్వం యొక్క మూలం ఓంకారమని 'ఓమ్ ఇతి ఏతత్' అని, ఆ ఓంకారం నుండి వెలువడినదే వేదం అంటే. దాన్ని దర్శించిన ఋషులు వారి శిష్యులకు అందించారు. అట్లా ఋషుల మాటల ద్వారానే మన వరకు అందుతోంది. కేవలం వారి నోటి మాటల వలే ఉండేదే తప్ప పుస్తకరూపంలో ఉండేది కాదు, అది వారికుండే మేధాశక్తి అంత గొప్పది. వేదాన్ని ఉచ్చరించే క్రమం ఉంటుంది, ఎవరు నేర్చినా అట్లానే ఉచ్చరించాలి. ఒకరి ద్వారానే నేర్వాలి తప్ప పుస్తకం చూసి నేర్చేది కాదు. దాన్ని మననం చేస్తే మనల్ని రక్షిస్తుంది కనక 'మన్-త్ర' మంత్రాల రూపంలో ఉంటుంది.
అది మనం ఈ నాడు చూసే సంస్కృత భాషలో ఉన్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే సంస్కృత భాష వేద శబ్దాలను ఇమడ్చుకొనేట్టు సుసంస్కృతం చేయబడ్డ భాష. ఆకాలంలో ఉన్న వాడుక భాషలోని కొన్ని పదాలను, వేద శబ్దాలను కలిపి చేసిన భాష సంస్కృతం. లోకంలో ఎన్నో భాషలు మనకు ఈనాడు కనిపిస్తున్నాయి, మరి వేదం ఆ భాషలవారికి చెందినది కాదా అంటే, ఈ నాడు వ్యవహారంలో ఉన్న ప్రతి భాష ఏదో ఒక నాడు సంస్కృత భాష నుండి ఏర్పడ్డవే, భాషా పరిజ్ఞానం ఉన్న వారు చెప్పే విషయం ఇది. వేదం అనేది ఒక భాషకు కూడ అందనిది. ఎందుకంటే భాషలనేవి మనుష్యులు అవసరంకోసం ఏర్పర్చుకున్నవి. వేద శబ్దాల్లోంచి సంస్కరించబడి ఉన్న భాష సంస్కృతం అవడంచే ఆ భాషలో మనకు వేదం కనిపిస్తుంది. భాషలు, అక్షరాలు ఇవన్నీ ఏర్పడక ముందే శబ్దం అనేది ఉంది. వేదాలు అనేవి ఒకరు ఏర్పర్చిన శబ్దం కాదు. సహజ శబ్దాలను మనం వేదాలు అని అంటాం. ఏర్పాటుచేసుకున్న శబ్దాలని మనం భాషలు అంటాం. అయితే వేదాన్ని సహజ శబ్దం అని ఎలా అనగలం అంటే, ఆ శబ్దాలలో ఇమిడి ఉన్న ఆ విధానం అనేది మన భాషా ప్రావిణ్యానికి అందనిదిలా కనిపిస్తుంది కాబట్టి. వేదం విని నేర్వాల్సిందే తప్ప చదివి నేర్చేది కాదు.
ఈ ప్రకృతిలో ఇంత విశ్వం తయారుకావడానికి కారణమైన వేద శబ్దాలను మన ఋషులు తపస్సమాధి దశలో వాటిని గుర్తించారు. వాటిని తమ శిష్యులకు అందించారు.
అయితే ఇది శ్రవణ పరంపర. ఉచ్చారణ- అనుచ్చారణ క్రమంగా వేదాధ్యయనం సాగేది. అది విని నేర్చేది కనక శృతి అని పేరుపెట్టారు. పదే పదే ధ్యానించేది కనక ఆమ్నాయము అని అంటారు.
అయితే దాన్ని తెలుసుకుంటే మనకు ఏమడిగితే దాన్ని ఇస్తుంది, తెలిపేది మరియూ కావల్సిన లాభాన్ని ఇచ్చేది కనక వేదం అని పేరు పెట్టారు.భగవంతునికి కూడా అది ఎప్పటిదో తెలియదు కనక దాన్ని నిత్యం అని పేరు పెట్టారు.
ప్రతి ప్రాణి పురుష విభాగంలోకే చెందుతుంది, ఇక పరమాత్మ కూడా ఉత్తమ పురుషుడు, అంటే ఒక పురుష విభాగంలోకే చెందుతాడు. అందుకే అయన వ్రాసింది కూడా కాదు వేదం. ఎవ్వరూ తమకు తోచినట్లు కల్పించి చెప్పినది కాదు వేదం. అవి ఒక పుస్తకం కాదు అని గుర్తించాలి. ఎవ్వరూ తమకు తోచినట్లు వ్రాసినది కాదు కనక అపౌరుషేయం అని పేరు. ఈ సృష్టి అంతా ఆ వేద శబ్దంచే సృజించబడి ఉంది. ఆ వేద శబ్దం కు అంత శక్తి ఉంది అన్న మాట.
మరి ఏమిటి వేదం ? "యస్య విశ్వసితం వేదాః" వేదాలు భగవంతుని ఊపిరి వంటివి అని చెప్పారు. అయన నిర్ణయించింది కూడా కాదు. ఆయన అనుభవించ కలడు. ఆయన ఎట్లా ఉన్నాడో, వేదాలు అట్లానే నిత్యం ఉంటాయి.
వేద శబ్దాన్ని తీసుకొని దీనికి ఇది ఇంత అర్థం అని చెప్పలేం. జన్మ నిచ్చే తల్లిని మనం అమ్మ అని పిలుస్తాం, మరొక భాషలో మా అని, తాయార్ అని ఇలా వివిద శబ్దాలతో పిలుస్తారు. అయితే ఆ వ్యక్తిని చెప్పడానికి ఇన్ని శబ్దాలు ఆ అమ్మని చెప్పటానికే ఏర్పడ్డవి, కానీ ఈ శబ్దాలకి అర్థం అమ్మ అవుతుందా? అమ్మని పూర్తిగా ఈ శబ్దం చెప్పగలదా ? శబ్దం అనేది అనిత్యం, ఇప్పుడు ఉంటుంది, కొంత సమయానికి ఉండదు. ఆయితే ఆ అమ్మ ఎప్పటికి అక్కడ నిలిచి ఉంది. అమ్మలో మార్పు లేదు. ఆ శబ్దంలో కనిపించని ప్రేమ,వాత్సల్యం అనే గుణాలు ఆ అమ్మలో కనిపిస్తున్నాయి. కనుక శబ్దం అనేది చాలా తక్కువ, దాని అర్థం చాల ఎక్కువ. అందుకే వేద శబ్దానికి ఇది అర్థం అని చెప్పడం కష్టం. అలా చెప్పడం సముద్రాన్ని చిన్న పాత్రలో నింపే ప్రయత్నం చేసినట్లే అవుతుంది.
అయితే ఈ వేదాలతోనే ఇంత సృష్టి జరిగింది కనక సృష్టికి ప్రతి సృష్టి చేయగలగొచ్చు అనడానికి విశ్వామిత్రుడే ఉదాహరణ. మన జన్మకి ప్రవృత్తికి కారణం వేదమే, కేవలం మనమే కాదు ఈ విశ్వం అంతటికీ కారణం వేదమే, తల్లిని ఎట్లా అయితే పూజిస్తామో, కృతజ్ఞత కల్గి ఉంటామో ఆ వేదానికీ మనం కృతజ్ఞత కల్గి ఉండాలి. ఆ వేదం పురాణాల ద్వారా, స్మృతుల ద్వారా ఇలా వివిద రకాలుగా అందవచ్చు కనక వాటిని గూర్చి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం, కానీ అది ఇంతే అని అర్థం కట్టలేం. మనం అదృష్టం మనం ఆ సంప్రదాయంలో ఉన్నాం. వాటిని మనం పరిరక్షించుకుందాం.