పరాయి సొత్తు
పూర్వం కాంచననగరాన్ని పురుషోత్తముడు పాలించేరోజులలో ఆయనకి రాత్రి పన్నెండు గంటలకు నిద్రపట్టక తన అంత:పురములో పచార్లు చేస్తున్నాడు. ఆయనకి కోశాగారం నుండి వెలుతురు కనిపించింది. చాలా ఆశ్చర్యం కలిగింది. వెంటనే సేవకులను ఆజ్ఞాపించి కోశాగారం వైపు బయలుదేరారు. అక్కడికి వెళ్ళి చూడగా కోశాధికారి కూర్చుని లెక్కలు చూచుకుంటూ కన్పించారు. రాజుగారు "ఈ వేళప్పుడేంచేస్తున్నారు." అన్నారు. "లెఖ్ఖచూచుకుంటున్నాను" " ఈ అర్ధరాత్రి కూర్చుని చెయ్యవలసిన పనియేముంది? ఏం ఎమయినా లెఖ్ఖ తక్కువైనదా లేక ఎక్కువయినాదా? అనడిగాడు రాజు. "ఎక్కువయింది ప్రభూ!" అన్నాడు కోశాధికారి. "అవునా! మంచిదే! ఎక్కువయితే రేపు చూడవచ్చు ఎలాగెక్కువయిందో" అని రాజుగారంటే, కోశాధికారి " లేదు ప్రభూ! ఎవరైనా ఒక పేదవాడి డబ్బు పొరపాటుతో వచ్చి మన ధనముతో వచ్చి చేరిందేమో! అలాగయితే ఆ పేదవాడి "ఆక్రందన" మన ఖజానానే కాదు ! మన రాజ్యాన్ని కూడా భస్మం చేస్తుంది. అందుకే మొదటనే లెఖ్ఖ చూసి మనం ఆ పేదవాడి డబ్బు తీసి ప్రక్కకు జమ చేయాలి". అన్నాడు కోశాధికారి.
ఆ మాటలకు రాజుగారు ముగ్ధుడై తనుకూడా కోశాధికారితో కుర్చుని లెఖ్ఖ చూసి పేదవాడి డబ్బు పేదవాడికి జమ కట్టారు.
మరునాడు రాజు పురుషోత్తముడు సభ చేసి రాత్రి జరిగినదంతా వివరించి , పేదవాడిని పిలిపించి వాని సొమ్మును వానికి ఇచ్చివేసి, కోశాదికారిని తన కంఠహారం తీసి అలంకరించబోయాడు. రాజు గారి సత్కారాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ, "ప్రభూ! మీరు ధర్మంగా పరిపాలిస్తున్నారు కాన, మీ సేవకులమైన మేము కూడా ఆ ధర్మాన్ని పాలిస్తున్నాము. ఈ ఘనత తమదే ప్రభూ!" అంటూ తిరిగి ఆ హారాన్ని తన ప్రభువు మెడలో అలంకరించాడు. సభ కోశాధికారి చేసిన పని సమర్ధిస్తూ, హర్షద్వానాలు చేసింది.