Nandanam Smashana Vatika |
సాధారణంగా స్మశాన వాటిక అంటే మనకు గుర్తువచ్చేది.. ఎవరైనా చనిపోతే అక్కడకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరుపుతారు అని… కానీ ఇక్కడ ఒక స్మశాన వాటిక ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, సేవాకేంద్రంగా, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రంగా మారింది.
తమిళనాడులోని కోయంబత్తూరు నగరానికి సమీపంలో మెట్టుపాలెయం పట్టణం ఉంది. ఇక్కడ కాశీ వద్ద గంగా నది ప్రవహిస్తున్న తీరుగా పశ్చిమం నుండి తూర్పు వైపునకు భవానీ నది ప్రవహిస్తున్నది. భవానీ నది ఒడ్డున ఒకప్పుడు పాత శ్మశానవాటిక ఉండేది. అంత్యక్రియల కోసం చాలా మంది హిందువులు అక్కడికి వస్తూ ఉంటారు. 20 ఏళ్ల క్రితం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్తలు సహాయంతో 36 కుల సంఘాల నాయకులు ఆ ప్రదేశాన్ని నందనవనం చేసేందుకు కృషి చేశారు. అక్కడ మంచి ఘాట్‌ని నిర్మించారు. ఆ సమయంలో ఆ నదిలో పురాతణ శివలింగం దొరికింది. ఆ శివలింగంతో అక్కడే ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత గోశాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక ధ్యాన మందిరం కూడా ఉంది. ఒక ఆధునిక శ్మశానవాటిక నిర్మించారు.
అలాగే అక్కడ అందుబాటులో ఉన్న వ్యర్థాలతో సేంద్రీయ ఎరువులు తయారు చేయడానికి ఒక యూనిట్ ప్రారంభించారు. నందనవనం కమిటీ చుట్టుపక్కల ప్రజల వైద్య సేవల కోసం అంబులెన్స్‌ను నడుపుతోంది. నందనం అభివృద్ధి కోసం 36 కుల సంఘం నాయకులు కలిసి పనిచేస్తున్నారు. అక్కడ ఎలాంటి కుల వివక్ష కనపడదు. బ్రాహ్మణ పురోహితులు అక్కడ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. చుట్టుపక్కల 50 గ్రామాల నుండి అన్ని కులాలకు చెందిన హిందువులు అక్కడికి వచ్చి మరణించిన వారి ఆప్తులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కమిటీ నిర్వహకుల ప్రకారం కరోనా విపత్కర కాలంలో ఇక్కడ రోజుకు 25 మందికి అంత్యక్రియలు జరిగాయి. “కులమేదైనా హిందువులందరికీ ఒకే స్మశాన వాటిక ” అనే సందేశాన్ని గడిచిన 20 సంవత్సరాలుగా నందనం ప్రపంచానికి అందిస్తున్నది.
Nandanam Smashana Vatika |