వివాహము |
రచన: సన్నిధానం నరసింహశర్మ
వేడుక సంస్కృతిలో భాగం. మనిషి పుట్టిన దగ్గర్నుంచి చనిపోయేవరకూ జరుపుకునే అన్ని వేడుకలూ ఈ సంస్కృతిలో భాగమే. ఇలాంటి వేడుకల్లో అతి ముఖ్యమైన వేడుక వివాహం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఈ వేడుక సాగుతుంది. తెలుగువారు జరుపుకునే వివాహవేడుకకీ కొన్ని ప్రత్యేకత లున్నాయి. ప్రాంతాలనుబట్టి, కులాలనుబట్టి చిన్నచిన్న మార్పులుంటాయి.
భారతదేశంలో వివాహం అనేది ఒక సంస్కారం. ఒక సుదీర్ఘ మానవ జీవనవ్యవస్థలో అయిదువేల సంవత్సరాల నుండో ఆ పై నుండో వస్తూ సాగుతూన్న ఒక నాగరిక వ్యవస్థావిశేషం. అది వైయక్తికంగా కనిపించే కల్యాణమైనా సమాజ కల్యాణ కార్యాలలో ఒకటి. అది పదిమందికి చెందిన కళ్ల వేడుక. బంధుమిత్ర సపరివార శుభాకాంక్షల డోలిక.
ఆదిమయుగ కాలం సంగతి వేరు. సంచార జాతులుగా సమాజ మానవసందోహాలున్న వాళ్ల స్థితిగతులు వేరు. ఇష్టమైన తావుల్లో కొన్నాళ్లుండడం మరోచోటికి బయలుదేరడం. వేటాడడాలు! పొట్ట నింపుకోవడాలు. ఇష్టమైనట్లు వ్యవహరిస్తూ స్త్రీ పురుషులు కలుస్తూ మానవసృష్టిని కొనసాగించిన ఆ కాలం, ఆ సందర్భాలూ వేరు. అదీ మన చరిత్రే. గడచిన చరిత్రే. అయితే ఇప్పుడు కొనసాగుతున్నది నడుస్తున్న వివాహవ్యవస్థ. వైదికమైనది. సంచార జాతులు సమూహజాతులయ్యాయి. వ్యవసాయం, పశుపాలన, అవసర కార్యకలాపాలలో ఇతర మానవుల అవసరాన్ని గుర్తించడం… ఇలా సాగుతూండగా` కూడు, గూడు, ఉనికిలతో ‘మనికి’ మనిషి ప్రధాన అవసరమైంది. తాత్కాల అంశాలు శాశ్వత అంశాలయ్యాయి. కట్టుబాట్లు సామాజిక మయ్యాయి.
ఒప్పుదలలు సామాజికమైన సందర్భాలలో సంస్కారాలు కాలానుగుణంగా పరిమళించాయి. వివాహం మానవ జీవనచరిత్రలో భాగమైంది.
వేద కాలంలోనే వివాహవ్యవస్థ దాఖలాలు లేకపోలేదు. ఊర్వశీ పురూరవుల కథనం ఋగ్వేదంలోనిదే. ఋగ్వేదంలో వివాహ సూక్తం అని పదవ మండలంలో 85వ సూక్తం వుంది. సూర్యుని కుమార్తె సూర్యను సోమునికిచ్చి పెళ్లి జరిపించిన అంశం భాసిస్తోంది.
యజ్ఞయాగాల కాలంలో పెళ్లి కాకపోతే పురుషునికి గుర్తింపు లేదు. తైత్తిరీయ బ్రాహ్మణంలో` ‘అయజ్ఞియో వా ఏషయో పత్నీకః’ అని వుంది. అంటే భార్య లేనివాడు యజ్ఞహీనుడు అని. అంతేకాదు, అందులోనే, ‘అథో అర్థోవా ఏష ఆత్మవః యత్ పత్నీ’ అనీ వుంది. అంటే భార్య లేనివాడు, ఏకాకి అయిన వాడు అసంపూర్ణుడు అని. అందుకే భార్య అనే ఆమె సరదాగా అనుకునే వన్ ఫోర్తాంగి కాదు; ఆమె అర్థాంగి.
ఒకటీ రెండూ కాదు మనకు నూట ఎనిమిది ఉపనిషత్తులున్నాయి. అందులో ఒకటైన తైత్తిరీయోపనిషత్తులో శిక్షావల్లిలో గురువు శిష్యునితో ‘ప్రజాతమ్తం మా వ్యవచ్ఛేత్సీః’ అని ప్రబో ధించాడు. దాని అర్థం సంతానసూత్రానికి గండికొట్టకు నాయనా అని. ఆయురారోగ్య భాగ్యాలతో తులతూగాలని నిండు నూరేళ్లు జీవించాలని మానవుల శుభాకాంక్ష. భారతీయ శుభా కాంక్షలకు అతిశయోక్తి అలంకారాలుండి అవి రోదసి దాకా ప్రయాణిస్తాయి. ‘ఆచంద్రతారార్కం’ విలసిల్లాలని దీవించడంలో ఎంత పెద్దమనసు. ప్రపంచమానవుడు తలెత్తుకుని చెప్పుకోతగ్గ శుభా కాంక్ష భారతీయులది.
సుఖదుఃఖాల త్రాసులో ఊగిసలాడే మానవులు వీలైనంతగా ఆనందంతోనే గడపాలనుకోవడం సహజం. ఇన్నాళ్ల, ఇన్నేళ్ల ఆచారవ్యవహారాల్లో పదిమంది కలిసి తినడం, ఆనందించడం ఒక సామాజిక విశేషం. భారతీయుని జీవనంలో పుట్టింది మొదలు సంస్కారాలు, దానాలూ ధర్మాలు, అన్నప్రాశనం, కేశ ఖండనం, అక్షరాభ్యాసం వాటితో మాత్రమే ఊరుకోవడం లేదు.
పిల్లవాడు కాని పిల్ల కాని అడుగులేస్తే అరిసెలు, పలుకులొస్తే పంచదారచిలకలు, గడప దాటితే గారెలు, బోర్లా పడితే బూరెలు, గృహరాజ్యంలో ఆనందాల పంపకంలో స్త్రీ పురుషుల సంయుక్త కార్యాలు లేకుండా, ఇరుగు పొరుగుల వారు పాల్గొనకుండా ఒక్కటీ జరగదు. చిన్నప్పుడే ఇన్ని తతంగాలుండగా యుక్తవయస్సులు వచ్చాక జరిగే వివాహ సంస్కారంలో కొన్ని తతంగాలుండడం రకరకాలుగా ఉండడం సహజం.
భారతదేశంలో శాస్త్రం ఆచారమైంది. ఆచారం చట్టమైంది. సమాజమే సాక్షి అయిన న్యాయవ్యవస్థ యిది.
వివాహం ఒక సంతానవ్యవస్థ. అది స్త్రీ పురుషుల లైంగిక సౌఖ్యాలకు ఒక కట్టుబాటు. వివాహం ఒక ఆర్థికవ్యవస్థ. భార్య, వారసులు ఏర్పడి ఆస్తుల సంక్రమణానికి అది ఓ పునాది. భారతీయవ్యవస్థలో అధర్మపత్నులకు తావు లేదు; ధర్మపత్నులకే గౌరవాదరాలు.
పెళ్ళిళ్లు రెండు రకాలు:
1) అమంత్రకం అంటే మంత్రాలు లేకుండా చేసేవి,
2) సమంత్రకం అంటే మంత్రాలతో చేసేవి. వేదాలు శాస్త్రాలను అనుసరించి దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సమంత్రక వివాహాలు ఉద్దేశించబడినాయి. మేళతాళాలు, విందులు, వినోదాలతో జరిగే వివాహాలలో వివిధ రకాల తతంగాలు ఒకనాటి మానవుల ఆకాంక్షలు, మంత్రాల ద్వారా అంతరార్థాలు తెలిపేలా వుంటాయి.
వధువు: దేనికైనా ఓ పవిత్రతను కలిగించడం దైవభక్తితో దేవతల శక్తులతో అనుసంధానించడం భారతీయ జీవన విధానంలో ఉంటూ వచ్చింది. వధువు అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతుల ఒకే ఆత్మ రూపం. పచ్చని ప్రకృతిసంపదకు ఓ శక్తిస్వరూపం. సంపదకు ఓ సంకేతం.
వరుడు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆత్మరూపం వరుడు. విజయాలు చేపట్టడానికి సంసిద్ధుడై వున్న సిద్ధపురుషు డతడని విశ్వాసం.
వివాహంలో తతంగాలు రకరకాలుగా ఉన్నా ప్రధానమైనవి 35.
అవి: 1) పెళ్లిచూపులు, 2) నిశ్చితార్థం, 3) స్నాతకం, 4) కాశీ ప్రయాణం, 5) వరపూజ – ఎదుర్కోలు, 6) గౌరీపూజ, 7) మంగళస్నానాలు, 8) కన్యావరణం, 9) మధుపర్కాలు, 10) యజ్ఞోపవీతధారణ, 11) మహాసంకల్పం, 12) కాళ్లు కడుగుట, 13) సుముహూర్తం – అంటే బెల్లం, జీలకర్ర నెత్తి మీద పెట్టడం, 14) కాళ్లు తొక్కించడం, 15) కన్యాదానం, 16) స్వర్ణజలాభి మంత్రం, 17) యోత్త్రేబంధనం, 18) మంగళసూత్రధారణ, 19) తలంబ్రాలు, 20) బ్రహ్మముడి, 21) అంగుళీయకాలు తియ్యడం, 22) సప్తపది – పాణిగ్రహణం, 23) హోమం, 24) సన్నికల్లు తొక్కించడం, 25) రాజహోమం, 26) స్థాలీపాకం, 27) నాగవల్లి, 28) సదస్యం, 29) నల్లపూసలు కట్టడం, 30) అరుం ధతీ దర్శనం, 31) ఉయ్యాలలోని బొమ్మను అప్పజెప్పడం, 32) అంపకాలు – గృహప్రవేశం, 33) సత్యనారాయణస్వామి వ్రతం, 34) కంకణవిమోచనం, 35) గర్భాదానం.
కాలమాన పరిస్థితులు మారడం వల్ల 35 తతంగాలున్నా వర్తమానకాలంలో
1) సమావర్తనం, 2) కన్యావరణము, 3) కన్యాదానము, 4) సుముహూర్తము, 5) పాణిగ్రహణము, 6) అగ్ని పరిచర్య, 7) లాజహోమము, 8) సప్తపది, 9) నక్షత్ర దర్శనము అనే వాటిలో వివాహాన్ని నిర్వహిస్తున్నారు. వీలునుబట్టి ప్రాధాన్యాన్ని గ్రహించడాన్ని బట్టి వీటికి కొన్ని కలిపి నిర్వహిస్తున్నారు. స్థితిగతులు బాగా ఉండి స్థిమిత వాతావరణం ఉన్న రోజుల్లో తతంగాలు, విందులు అన్నీ కొన్నిరోజుల పాటు జరిగేవి. అసలీ వివాహాలు హిందూ ధార్మికవ్యవస్థ ఏర్పడినప్పటి నుండి చూస్తే 8 రకాలుగా ఉండేవి.
1) బ్రహ్మవివాహం:
ధార్మికమైన వేద సంబంధితమైన పెళ్లి. పిల్లతండ్రి` విద్యావంతుడైన వరుని స్వయంగా పిలిచి శక్తికొలది నగలు, బట్టలతో కుమార్తెను వరుని చేతిలో పెట్టడం పాణిగ్రహణం చేయించే పెళ్లి.
2) దైవవివాహం:
ఆపస్తంబ గృహ్యసూత్రంలో చెప్పిన దాన్ని అనుసరించి యజ్ఞసందర్భంలో కన్యను దక్షిణగా ఇవ్వడం. పురోహితులు వారి రక్షకులైన మహారాజ పాలకుల నుండి అంద మైన కన్యల్ని పరిగ్రహించడం ఈ పెళ్లిలో జరిగేది. యజ్ఞాలూ అవీ తగ్గడంతో ఈ దైవవివాహ పద్ధతి తగ్గింది.
3) ప్రాజాపత్యం:
ఇది యాజ్ఞవల్క్యస్మృతిలో చెప్ప బడిరది. వధువు తండ్రి యోగ్యుడైన వరుణ్ణి ఎన్నుకొని వధూ వరులు ధార్మిక కృత్యాలలో ఒకరినొకర్ని అనుసరించడానికి ఉద్దేశించి చేసే వివాహం. ఈ పెండ్లి చేసుకున్న వరుడు జీవితం జీవితమంతా గృహస్థుడుగానే వుండాలి. అర్థాంగి జీవించి వుండగా సన్యాసి కారాదు.
4) ఆర్ష వివాహం:
ఒకటి రెండు గోమిధునాల్ని గ్రహించి మాత్రమే చేసే వివాహం.
5) ఆసుర వివాహం:
వరుడు వధువుకు ఆమె సంబంధీకులకు శక్తి కొలదీ ధనమిచ్చి వివాహం చేయాలని. కొందరు స్మృతికర్తలు ఈ పద్ధతిని వ్యతిరేకించారు. బోధాయనుడు –
క్రీతా ద్రవ్యేణ యానారీ వ సా పత్నీ విధేయతే
నసాదైవేన సాప్రిత్యే దాసీం తాకవయో విదుః॥
అంటే కన్యను అమ్మినవాడు దారుణమైన నరకంలో పడి పోతాడు. అంతేకాదు, అటూ ఇటూ ఏడు తరాల పుణ్యాన్ని పోగొట్టుకునేవాడైపోతాడు.
6) గాంధర్వ వివాహం:
స్త్రీ పురుషులిద్దరూ ఇష్టపడి ఒకర్ని మరొకరు అనుసరించాలనే దృక్పథంతో చేసే పెళ్లి. ఇదిప్రేమ మూలకంగా జరిగే పెళ్లి, అశ్వలంయనుడు, హరివగౌతములు, మనువులు వేరువేరుగా ఈ వివాహ విషయంలో వివరించినారు.
ఇచ్ఛాయాన్యోన్య సంయోగః కన్యాయాశ్చ వరస్యచ
గాంధర్వస్య తు విజ్ఞేయో మైధున్యః కామసంభవః
అన్నాడు మనువు. అంటే కామభావ వశీభూతులైన స్త్రీ పురుషులు ఇష్టపడి ఇద్దరూ కలవడం. మహాభారత శకుంతలా దుష్యంతులది గాంధర్వమే. అయితే గాంధర్వపద్ధతిలో కన్య నిచ్చేవారికి రాయితీ వుంది. అలా ఇచ్చేవారు గంధర్వలోకంలో పూజింపబడతారు.
7) పైశాచిక వివాహం:
ఇది ఓ రకమైన బలాత్కార వివాహం. హాయిగా నిద్రపోయే ఆడపిల్లని అపహరించుకుపోయి చేసుకునే పెళ్లి. దీనిని ప్రాచీనులు నిరసించారు. మనువు ‘పైశాచశ్చాష్టయో ధమః అన్నాడు. అంటే అష్టవిధ వివాహాల్లో అథమ వివాహం పైశాచికమని.
8) రాక్షస వివాహం:
అమ్మాయి బంధువుల్ని, సంబంధీ కుల్ని హింసలు పెట్టి అయినా లేక వాళ్లని చంపి అయిన అమ్మాయిని దొంగిలించుకుపోవడం రాక్షసం. యుద్ధ ప్రీతి కల వాళ్లల్లో మొదట్లో ఇది వున్నా తరువాత దానికదే అంతరించింది.
తరువాత తరువాత స్వయంవర వివాహాలు వచ్చాయి. ఇందులో సభాముఖంగా కన్యలు వరుణ్ణి ఎంపిక చేసుకోవడం వుండేది. అయితే ఇది రాజులకి మాత్రం చెందిన వ్యవహారంగా వుండేది.
ఇవన్నీ పురాణ చారిత్రక కాలవివాహాలుగా గమనించాలని, వర్తమానకాలంలో`
1) పెద్దలు నిర్ణయించిన వివాహాలు,
2) ప్రేమ వివాహాలు. అంటే arranged and love marriagesగా స్థిరమయ్యాయి.
అయితే చాలామట్టుకు హిందూ వివాహాలు సాంప్రదాయికంగా మంత్ర, మంగళవాయిద్య, విందు వినోదాలతో జరుగు తున్నాయి. కనుక ప్రధాన వివాహతతంగాలు ముఖ్యమైనవి తెలుసుకుంటే ఇవి ఇందుకా అని తెలుస్తుంది. అనాదిగా వస్తున్న ఒక వ్యవస్థ తాలూకు పారమార్థిక అంశాలూ ఆచారాలూ కూడా తెలుస్తాయి. నాగరిక సమాజం సవాలక్ష సంస్కరణలకి ఆలవాల మైనా కొన్ని సంప్రదాయాలు పరంపరగా కొనసాగడానికి కారణా లుంటాయి. వెనకటి కాలంలో అయిదురోజుల పాటు వివాహాలు జరిగేవి. పెళ్లిరోజుకు పదిరోజులు ముందే దగ్గరి చుట్టాలు ప్రేమతో వచ్చి పెళ్లి పనులలో సహకరించేవారు.
కొన్ని వివాహ తతంగాలు
రకరకాల ఆచారాలున్నాయి. కొన్నికొన్ని ఆలోచించి పెట్టినవి. మరికొన్ని అవసరార్థం పెట్టినవి.
- పెళ్లిచూపులు: ‘చూపులు కలిసిన శుభవేళ’లు పెళ్లికి చాలా ముఖ్యం. మంచిరోజున మంచి ముహూర్తంలో పెళ్లి చూపులు ఏర్పాటుచేస్తారు. సోమ, మంగళవారాలు మంచివి కావు. చవితి, షష్ఠి, అష్టమి, ద్వాదశి, అమావాస్యలు కాకుండా మంచి నక్షత్రాలుండేలా చూసి, వర్జ్యాలు, దుర్ముహూర్తాలు లేకుండా పెళ్లిచూపులుండాలి. పిల్లను చూడడానికి రమ్మని పిల్లవాని తల్లిదండ్రులకు కబురు పంపాలి. అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు చూసుకొని పరస్పరం అభిప్రాయాలు తెలుపుకోవాలి. రెండువైపులవారు ఒకరి వివరాలు ఒకరు తెలుసుకోవాలి. నచ్చు బాట్లు తెలుసుకోవాలి.
- నిశ్చితార్థం: నిశ్చితార్థానికీ మంచి ముహూర్తం చూడాలి. పెట్టుపోతల వివరాలు మాట్లాడుకోవాలి. తరువాత కన్యాదాత ఇంటికి వెళ్లి మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకొంటాం అని తెలిపి, ‘ధ్రువంతేరాజా!’ అనే వేదమంత్ర పఠనాలతో అమ్మాయికి కొత్తబట్టలు పెట్టి పూలుపళ్లు ఇచ్చి ‘శీఘ్రమేవ వివాహసిద్ధి రస్తు,’ అనాలి. లగ్నపత్రికలు రాయించి పరస్పరం పుచ్చుకోవాలి. తరువాత వధూవరుల పెద్దలు దోషాలు లేని ముహూర్తాన్ని పెట్టించుకోవాలి. లగ్నపత్రికపై పసుపుకుంకుమలు రాసి, దేవుని దగ్గర పెట్టాలి. తరువాత లగ్నపత్రికలు మార్చుకోవాలి. వెనకటి కాలంలో రాగిరేకుపై లగ్నపత్రిక రాసేవారు. లగ్న పత్రికను ప్రార్థించేవారు.
- అంకురారోపణం: ఒక మంచి ముహూర్తం చూడాలి. ఇంటిని అలంకరించుకోవాలి. ఐదు మూకుళ్లలో పుట్టమట్టిని నింపాలి. ఆ మూకుళ్లలోకి బ్రహ్మేంద్రాదుల్ని ఆవాహన చేయాలి. నవధాన్యాలు తెచ్చి గోక్షీరంతో క్షాళన చెయ్యాలి. మూకుళ్లలో వాటిని నింపి నీళ్లు పోయాలి. పంచపాలికలంటే ఈ మూకుళ్లే. పెళ్లిరోజున వీటిని కల్యాణమండపంలో ఉంచాలి. 16 రోజుల పండుగనాడు పూజలు నిర్వర్తించి మట్టిని చెట్ల పాదుల్లో పొయ్యాలి.
- పెండ్లికుమార్తె / పెండ్లికుమారుని చేయడం: కన్యాదాత ఇంట్లో బంధువులు స్నేహితుల సమక్షంలో సువాసినుల మధ్య పెళ్లికుమార్తెను చేయాలి. పురోహితుడి చేత కులదేవతా పూజ చేయించాలి. షోడశోపచార పూజ చేయించడానికి పెళ్లికొడుకుతో బాటు, బావమరది వరసయ్యే పిల్లాడిని తోడ పెండ్లికొడుకుని చేయాలి. మంగళహారతులు పాడిరచి ఇద్దర్నీ దీవింపజేయాలి.
- రక్షాబంధనం: తొమ్మిది వరసల తెల్లదారం పసుపుతో తడిపి మామిడి ఆకునుగాని, పసుపుకొమ్ము కాని కలిపి తోరం చేయాలి. ‘రక్షాకంకణ దేవతాపూజ వివాహంగత్వే సరక్షార్థం రక్షాబంధనం కరిష్యే’ అని చదవాలి.
బాసికం:
శుభికే ముహమారోహ శుభయంతే ముఖం మమ
మమత్వం శోభయముఖం భూయాసీం మేశ్రియంకురు
ముఖానికి అందం కలిగించడం కోసం బాసికను ధరింప జేస్తారు. భాసికము బాసికము అయిందా అనిపిస్తుంది. నుదుటికి క్షేమదాయకం బాసికం. దృష్టిదోషం పడకుండా ఇది ఉపయో గిస్తుంది. వధూవరులకు ఇద్దరికీ వుంటుంది. బాసిక ఒక ఆభరణం వంటిది. బాసిక పూజ కూడా చేస్తారు. పెండ్లికొడుకు చేయగానే కొందరు కడతారు, కల్యాణానికి ముందే కొందరు కడతారు.
- గౌరీదేవి పూజ: శుభాలను కలిగించేది గౌరీదేవి. ఆమె కన్యలో లీనమై వుంటుందని భావిస్తారు. దీర్ఘ సుమంగళిగా ఉండడానికి పెళ్లికుమార్తెచే గౌరీపూజ చేయిస్తారు. ఆయుష్యా భివృద్ధికీ గౌరీపూజను చేయిస్తారు.
- సమావర్తనం: సమావర్తనం అంటే తిరిగి రావడం. వరుడు గురుకులవిద్యను పూర్తి చేసుకుని, గురువు ఆజ్ఞ తీసుకొని మరీ గృహస్థధర్మాన్ని స్వీకరించడానికి తీర్థయాత్రలు చేసి తిరిగిరావడాన్ని సమావర్తనం అంటారు. వచ్చేముందు గురువు శిష్యునికి సత్య, ధర్మ, వేద అంశాల పట్ల, మాతృ, పిత, గురువు, అతిథి వంటి వారి పట్ల ఏ విధంగా ఉండాలో బోధిస్తాడు.
- స్నాతకం: గృహస్థాశ్రమంలో చేరడానికి జరిపే తతంగం స్నాతకం. ఇందు గురించి సర్వప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇది దేహశుద్ధి కొరకు (మరో అర్థంలో కాదులెండి) చేసే అంశం. క్షుర కర్మ చేయించుకోవాలి. తరువాత వేన్నీళ్ల స్నానం చేయాలి. స్నాతుడవడమే స్నాతకం. విద్యాభ్యాసం తరువాత చేసే సంస్కారాన్ని స్నాతకం అంటారు. ఓ రకంగా సమావర్తన సంస్కారాన్ని కూడా స్నాతకం అనడం వుంది. స్నాతకం మంత్రపూర్వకంగా జరుగుతుంది. ఆ మంత్రాలకు చింతనలు రాలతాయి.
అపోహిష్థామయోభువః తాన ఊర్జే దధాతవ! మహేరణాయ చక్షసేః
అంటే ఓ ఉదకవలులారా! మాకు మీరు సుఖాల్ని కలుగ జేస్తారు. మాకు మీ దయవల్లే అన్నం దొరుకుతోంది. మీవల్ల వచ్చిన శక్తి ద్వారా మేము గొప్ప జ్ఞానాన్ని పొందజాలుతున్నాము. ఇంకా సత్సంగాన్ని ప్రసాదించవలసిందని ఇలా ఇలా చాలా ఆకాంక్షలు స్నాతక శ్లోకాలలో ఉంటాయి. భవిష్యకాలం బాగా వుండాలనే కోరికలుంటాయి. ఆ కోరికల్లో దేశభక్తి పాలు కూడా వుంటుంది.
సమాజంచ విరాజంచాభి శ్రీర్యాచనోగృహే! లక్ష్యేరాష్ట్రస్య యాముఖే తయామాసగం స్నజామసి స్వాహా!
అంటే నేను నివసించే ఇల్లూ దేశమూ సిరిసంపదలతో తులతూగాలి అని. ఈ స్నాతకం వరుని ఇంట్లోగాని, కల్యాణమండపంలో, విడిదిలోగాని పురోహితుని ఆధ్వర్యంలో జరగాలి.
- కాశీయాత్ర: మానవ సంబంధాలను కుటుంబ సంబంధాలను మరింతగా ఆత్మీయం చేయడంలో భారతీయ వివాహ తతంగాలు ప్రధానపాత్ర వహిస్తాయి. పెళ్లికొడుకు పసుపుగుడ్డను మెళ్లో వేసుకుని, గొడుగు పట్టుకుంటాడు. చేత్తో కర్ర పుచ్చుకుంటాడు. కాళ్లకు పాదుకలు వేసుకుంటాడు. నేను బ్రహ్మచారి గానే జీవితం గడుపుతాను. ధర్మమార్గంలో జీవితం గడపడానికి కాశీ వెడతానని బయలుదేరతాడు. పెళ్లి జరగవలసిననాడు కాశీ వెడితే కథే అడ్డంగా మారి అర్థం లేనట్లవుతుంది. అందువల్ల బాజాభజంత్రీల మధ్య కన్యాదాతగాని వరుని బావమరిదిగాని వరుడి వద్దకు వెళ్లి గడ్డం క్రింద బెల్లంముక్క పెట్టి మరీ బ్రతిమాలతాడు. ‘ఓ బ్రహ్మచారిగారూ! మీరు మీ కాశీ ప్రయా ణాన్ని విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకుని సుఖా లతో గృహస్థాశ్రమంలోనే వుండిపొండి,’ అని బెల్లంముక్క నోటిలో పెడతాడు. ఈ వేడుకను బంధుమిత్రులంతా చక్కని వేడుకగా తిలకిస్తారు. వరుడు అంగీకరిస్తాడు. కాశీయాత్ర మానేస్తాడు. సంసారయాత్రకు అంగీకరిస్తాడు.
- హోమవిధానం: గోమయంతో నేల అలకాలి. అప్పుడు బియ్యప్పిండితో ఎనిమిది కోణాల ముగ్గు వేయాలి. దానిపై పసుపుతో స్వస్తికం రచించి కుంకంబొట్లు పెట్టాలి. పూవులూ అక్షతలూ వేయాలి. గంధం కర్ర లేదా మామూలు కర్రో తీసుకుని దానిపై హారతి కర్పూరం వేసి వెలిగించాలి. అందులో నేయి వేస్తూ షోడశోపచార పూజలు చేయాలి. ఇందుకై పురోహితునితో తగు మంత్రాలు చదివించాలి. చివరికి హోమం బూడిదకు బొట్టు పెట్టుకోవాలి.
- కన్యావరణం: యాత్రలకు వెడదామనుకున్న బ్రహ్మచార వరుడి దగ్గరికి వధువు తండ్రి వెళ్లి నా అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమ ధర్మాన్ని పొందవలసిందని కోరతాడు. అంగీకరించిన వరుడు మేళతాళాల మధ్య, బంధుమిత్ర బృందాల కోలాహలం మధ్య పెళ్లివారింటికి వస్తాడు. దీనిని వరాగమనం అనడం వుంది, కన్యావరణం అనడమూ వుంది. ఈ సందర్భంగా ఉన్న వేదమంత్రాలు అర్ధవంతంగా ఉంటాయి. వరుడు గోత్రప్రవరలు చెప్పుకొంటాడు.
- గణపతి పూజ: పళ్లెం నిండుగా బియ్యం పోయాలి. పసుపు గణపతిని చేసి తమలపాకు పైగాని మారేడు లేక మామిడి ఆకుపై గాని ఉంచాలి. అక్షితలతో పూవులతో పూజించాలి. వివాహం శుభాంతం, సుఖాంతం అవడానికి గణపతి పూజ చాలా ముఖ్యం.
- కలశపూజ: నీటితో నిండిన చిన్న బిందెను తీసుకోవాలి. పిండి, పసుపులతో ఆరు కోణాల ముగ్గు పెట్టి మధ్యలో ఓం రాసి దానిపై కలశాన్ని పెట్టాలి. అందులో పచ్చకర్పూరం, జవ్వాజి, పునుగు కలిపిన మిశ్రమం వెయ్యాలి. బిందె చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టాలి. ‘కలశస్యముఖే విష్ణుః’ శ్లోకం చదువు కోవాలి.
- పుణ్యాహవాచనం: శుభమైన కార్యాలు జరిగేచోటును శుద్ధి చేసే పవిత్రకార్యం పుణ్యాహవచనం. అంటే ఈరోజు శుభ దినం అని పెద్దలచే పలికించడం. వధూవరుల శరీరశుద్ధి, కళ్యాణమండపం శుద్ధికి, వాయుశుద్ధికి, స్థల పవిత్రీకరణకు ఈ కార్యం అవసరం. కలశంలో మామిడాకులు వేసి, దర్భలుంచి, కొబ్బరికాయ ఉంచి, అక్షతలు, గంధం, పువ్వులు వేసి ఆ నీటి లోకి దేవతల్ని ఆవాహన చేయాలి. మంగళవాక్కుల్ని వింటాంగాక అనే ఉపనిషద్వాక్యాలను పఠించాలి. అమృతత్వాన్ని కీర్తిని ఇమ్మన్ని అగ్నిని అడగాలి. మంత్రపూత జలాన్ని నాలుగుదిక్కులా జల్లాలి.
- వరపూజ: వీరపూజ దేశభక్తులకు అవసరం. వరపూజ వివాహానికి అవసరం. కల్యాణమండపంలో పనికివచ్చిన వరుణ్ణి లక్ష్మీనారాయణ రూపంగా భావించి పానకం బిందెతో ఎదురు వెళ్లి కన్యాదాత భార్యతో వెళ్లి వరుని పాదాలు పళ్లెంలో పెట్టి కడుగుకొని నీళ్లు తలపై జల్లుకుంటాడు. పానకాన్ని వరునికి బంధువులకీ పంచుతారు.
- మధుపర్కం: తేనె, పెరుగు, నెయ్యి కలిపితే ఏర్పడే తీయని పానీయం మధుపర్కం. ఇది వరునికి బంధువులకీ ఇవ్వాలి. కానీ కొందరు పంచదార ఇస్తున్నారు. పెండ్లికుమారునికి ఈ సందర్భంలో ఇచ్చే పంచెలచాపుని మధుపర్కం అంటారు. మధుపర్కాలు కట్టుకున్న వరుడిలో కొత్తకళ వస్తుంది.
- వధువును గంపలో తేవడం: పూర్వం మేనరికాల వివాహాలు బాగా జరిగేవి. వెదురుగంప వెదురుపాత్ర క్రింద లెక్క. మేనమామ కూడా ఇంకొకకరితో వివాహం చేయడానికి అంగీకరించారనడానికి చిహ్నంగా వధువు మేనమామ గంపలో పెండ్లి కూతురిని కూర్చోబెట్టి వరుని ఎదురుగా ఉంచి కన్యాదానానికి సాక్షీభూతుడయ్యే ఒక ఆచారం ఈనాటికీ వ్యవహారంలో ఉంది.
- తెర పట్టడం: సుముహూర్తం రాకుండా వధూవరులు ఒకరినొకరు చూసుకోకుండా మధ్యలో తెర పట్టుకుంటారు. వరుడు పరమాత్మగాను, వధువు జీవాత్మగాను భావించుకొని మధ్యలో మాయతెర తొలగడం వంటిది తెర తీయడం.
- కన్యాదానం: విద్య, భూమి, వస్తు దానాలలాగే కన్యా దానం. ఆ కన్య మెడలో మంగళసూత్రం కట్టి గృహస్థధర్మంలోకి వరుడు వస్తాడు. కన్యాదాత వరుని కాళ్లు కడిగి కన్యాదానం చేస్తూ తాను లక్ష్మీనారాయణునికే కన్యాదానం చేశానని భావిస్తారు. కొబ్బరికాయ, పండ్లు, పువ్వులు అక్షతలు ఉన్న వధువు కుడి చేతిని వరుని కుడిచేతిలో ఉదకపూర్వకంగా ఉంచి దానమిస్తారు.
వరుడు ప్రతిగ్రహ మంత్రాలు చదువుతూ స్వీకరిస్తాడు. మధువు శరీర గుణగణవర్ణన చేస్తూ కన్యాదానం చేస్తారు. పెళ్లిప్రమాణాల్ని పురోహితుడు చెప్పగా వధూవరులు చేస్తారు.
ధర్మాలలో అర్థకామాలలో ఈ వధువును కాదని నేనేమీ చేయను అని వరుడు ప్రమాణం చేస్తాడు. అనేక కోట్ల ఏళ్లు సత్య లోకంలో నివసించే యోగ్యత రావాలంటే కన్యాదానం చేయాలి. పాపవిముక్తికి కూడా కన్యాదానం వినియోగపడుతుంది. అంతేకాదు, ఈ సర్వభూమండలాన్నీ దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలం కన్యాదానం వల్ల లభిస్తుంది. చూర్ణిక అనే సంస్కృత గద్యను పఠించి బహువిధ దేవతా శుభాకాంక్షలూ కలిగేలా చేస్తారు.
- సుముహూర్తం: నిర్ణయ ముహూర్తానికి ముందే పురోహి తులు పవిత్ర వివాహ మంగళ శ్లోకాల్ని చదువుతారు. దీనివల్ల నవగ్రహ ఆశీస్సులు కూడా పొందడానికి వీలవుతుంది. జీలకర్ర బెల్లం కలిపిన ముద్దను సుముహూర్త సమయాన వధూవరుల శిరస్సులపై ఉంచుతారు. శాస్త్రవేత్తలు జీలకర్ర, బెల్లం కలిపి నూరిన ముద్ద. శిరస్సుల్ని చేరితే శక్తి కలుగుతుందని, విద్యుచ్ఛక్తి వంటి ఒకానొక శక్తి ఇరువురికీ లభిస్తుందని చెబుతారు. ఒకరి తలపై మరొకరు చేతులుంచడం ద్వారా ఆకర్షణ అభిమానాలు పెరుగుతాయి. ఒకరికొక్కరు వశం కావడానికి వీలవుతుంది.
- యుగచ్ఛిద్రాభిషేకం: (కాడి రంధ్రం నుండి అభిషేకం) ఇరవై దర్భల్ని కలిపి అయిదు దర్భలుగా చుడతారు. గుండ్రంగా చుడతారు. గుండ్రంగా చుడతారు. దానిపై బండి కాడిని పట్టుకుని ఎడమవైపు రంధ్రంలో బంగారముంచి దాని ద్వారా నీటిని వధువుపై పడేట్లా చేస్తారు. వధువు ఆయురారోగ్యాలతో శాశ్వతంగా పరిఢవిల్లడానికి దీనిని చేస్తాం. దీనివలన పుట్టబోయే సంతతికికూడా మంచి జరుగుతుందని విశ్వాసం.
- యోక్త్రధారణ: 24 దర్భల్ని 32 అంగుళాల పొడవున్న దానిగా పేనితే ఆ తాడును యోక్త్రం అంటారు. దీనిని వధువు నడుముకి చుట్టి ముడివేస్తారు. దీన్ని నడుం బిగించడంగా యజ్ఞయోగ్యురాలుగా దీక్ష గైకొనడంగా భావిస్తారు.
- మాంగల్యపూజ: కొన్ని బియ్యం పళ్లెంలో పోస్తారు. వీటిని పళ్లెం నిండుగా పరచాలి. అందులో మంచి కొబ్బరిబొండం, తాంబూలం పెట్టి తమలపాకుల్లో మంగళసూత్రాలు, మట్టెలుతో కొబ్బరిబొండం పై పెట్టాలి. వాటికి వధూవరులచే షోడశ విధ పూజలు నిష్ఠగా చెయ్యాలి. మంగళసూత్రాల్ని మంచి ఆచారాలున్న వారిచే, శుభప్రద మనసులచే చలువ చేతుల వారిచే స్పృశింపజేయాలి.
- మంగళసూత్రధారణం: శుభప్రదమైన ఆనందసూత్రం మంగళసూత్రం. రెండు పళ్లేల తలంబ్రాలపై మంగళసూత్రాలు పెట్టి వరుడు ఆనందంగా మాంగల్యదేవతను ఆహ్వానిస్తాడు. షోడశోపచార పూజ సూత్రాలకి చేయించాలి. వరుడు వధువుకు ఎదురుగా నిలబడి వధువు కంఠంలో అలంకరిస్తాడు.
అతడు` "మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా కంఠేబద్నామి శుభగే సంజీవశరదాం శతమ్" అనే మంత్ర పవిత్ర శ్లోకాన్ని చదువుతాడు. నా జీవితం, జీవనవిధానం దీనిమీదే ఆధారపడి ఉంది. నీవు దీనిని కంఠాన ధరించి నిండు నూరేళ్లూ జీవించెదవుగాక! అంటూ మూడు ముళ్లూ వేసి వివాహబంధ సంబంధీకుడవుతాడు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు కనుక మూడిం టికీ ముళ్లు వేయడం జీవన ఆనందబంధాలకు హేతువవు తుంది.
ఆశీరక్షతలు ఆనందాల తలంబ్రాలు: పవిత్ర ప్రధానమైన మంగళసూత్రధారణ అయ్యాక వధూవరులు ఆనంద హృదయ భారాలతో పోటాపోటీగా తలంబ్రాల అక్షతలు ఒకరి తలపై ఒకరు పోసుకుంటారు. జీవన ఆనందపరమార్థాలకి చేరువయ్యామని పులకరిస్తారు. క్షత అంటే విరిగేది, అక్షత అంటే విరగనిది. విరగని బంధానికి అక్షత దాఖలా తలన్పాలు – తలంబ్రాలు అంటే తలపై బియ్యం అని అర్థం. ఈ తలలపై బియ్యం పోసుకోవడంతో వివాహపు శాశ్వతపు నెయ్యం పరిమళిస్తుంది.
- బ్రహ్మముడి వేయడం: వధువు చీర, వరుడి ఉత్తరీయం అంచుల్ని కలిపి ముడివేయడం బ్రహ్మముడి వేయడం. పురోహితుల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు కొంగుల్లో ముడి వేసుకొని శాశ్వతంగా పదిలపరచుకోవడానికి ఇది శుభసంకరం.
- సన్నికల్లు తొక్కడం: దృఢంగా నిలబడడానికి జీవితంలో వేటినైనా ఎదుర్కొనడానికి సంసిద్ధత తెల్పడానికి సన్నికల్లు తొక్కిస్తారు. అగ్నిహోత్రానికి ఉత్తరం వైపు సన్నికల్లు ఉంచి వధువు కుడికాలు చేత తొక్కిస్తారు. కలహానికి ఎవరైనా వస్తే వారిని కూడా నీవు దృఢంగా ఎదుర్కో అనే సంకేతం ఉండడం ఆశ్చర్యపరచినా మహిళ దృఢంగా బాధ్యతగా ఉండాలనేది చెప్పడం ఇందులో ఉంది. వధూవరుల కాళ్ల క్రింద సానపెట్టి కుడికాలుతో ఎడమ కాలును ఒకరితో ఒకరు మూడుసార్లు తొక్కించాలి. దీనివలన పరస్పర స్పర్శ, ప్రేమ బీజాంకురాలు ఏర్పడడం జరుగుతుంది.
- ఉంగరాలు తీయడం: పాలూనీళ్లూ కలిపి మూతి సన్నగా ఉండే నిండు నీళ్లబిందెలో వుంగరం వేయగా వధూవరులు ఒకరి చేతులొకరు తాకుతూ ఉంగరాన్ని వెతుకుతూ బిడియాన్ని దూరం చేసుకోవడం ఈ తతంగ ఉద్దేశం.
- పాణిగ్రహణం: వరుడు తన కుడిచేత్తో వధువు కుడిచేతిని మంత్రపూర్వకంగా పట్టుకోవడం పాణిగ్రహణం. ఇందులో బొటనవ్రేలు పెట్టుకుంటే మగసంతానం ప్రాప్తిస్తుందని ఇలా కొన్ని విశ్వాసాలున్నాయి. చంద్రుడూ, గంధర్వుడూ, అగ్ని హోత్రుడూ — ఈ ముగ్గురూ దేవతలూ నిన్ను వరించాక మనుష్యుణ్ణయిన నేను వరించాను. దేవతాప్రీతితో మనం సంతానభాగ్యం, వివిధ భాగ్యాలు పొందగలం అనేది అంతరార్థాలు కల మంత్రాలు చదవబడతాయి.
- సప్తపది: అగ్నిహోత్రుడు పవిత్రుడు. అగ్నిసాక్షిగా వివాహం జరుగుతుంది. ఆయన ఎదుట మంత్రసమన్వితంగా ఏడడుగులు నడుస్తారు. దీనినే సప్తపది అంటారు. ఈ మాటలో పది తెలుగు పది కాదు, సంస్కృత పదం. సప్త R ఏడు, పద R పదాలు, అడుగులు కలిసి నడవడం. సకల సంపదలూ క్రమంగా ఏడు విభాగాలుగా పొందడం అనే శుభాకాంక్ష కూడా ఈ సప్తపది లో ఉంది.
- లాజహోమం: లాజ అంటే వరిపేలాలు. ఇది వధువు చేసే ఒక యజ్ఞం వంటిది. భర్త శాశ్వత ఆయువుతో విలసిల్లడానికి తాను దీర్ఘసుమంగళిగా ఉండడానికి లాజహోమం చేస్తుంది. వధువు లాజల్ని హోమం చేస్తుంది కూడా. దీనివల్ల అగ్నిహోత్రుడి అనుగ్రహం కూడా కలుగుతుందని విశ్వాసం.
- యోక్త్రం యోచనా: వధువుకు ముందే కట్టబడిన తాడును మంత్రం చదువుతూ విప్పేయడం ఈ క్రియగా కలిగినది.
- ఉయ్యాలబొమ్మను అప్పజెప్పడం: బొట్టు పెట్టబడిన ఆడపడుచు ఉయ్యాల్లో ఓ బొమ్మను పెట్టి జోల పాడుతుంది, వూపుతుంది. వసంతాన్ని ఆ బొమ్మపై పోస్తే అది దంపతులిద్దరి పై పడుతుంది. ఆడపడుచు వధువుతో పాడి ఆవు నిస్తావా పడుచు నిస్తావా అని అడిగితే పడుచునే ఇస్తానని బొమ్మను ఆడపడుచు చేతికిస్తుంది. ఇది భవిష్యసంతాన ఆకాంక్ష చిహ్నం.
- మిధున విడియములు: పాత దంపతులకి కొత్త దంపతులు తాంబూలాలిచ్చి వారి ఆశీస్సులు తీసుకొంటారు.
- అప్పగింతలు: కని, పెంచి, లాలించి ఇంతకాలం పోషించి ప్రేమను చూపిన కన్నకుమార్తె ఒకరికి కొత్తవారికి ఆ కుటుంబానికి అప్పజెప్పడం ఒక చిత్ర భావానుభూతి. అది ఎవరికి వారే అర్థం చేసుకునేది. ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని కాలంలో ఫోను సౌకర్యాలు అవీ లేని ఆ కాలంలో బిడ్డ గురించి, సోదరి గురించి కుటుంబీకుల ప్రేమాభిమానాలు, కొత్తచోటికి వెడుతోందన్న బరువు భావనలు ఈ అప్పగింతల్లో తెలుస్తాయి. ఈ కార్యక్రమంలో కొత్తబట్టలు పెట్టడం ఉంటుంది.
- అరుంధతీ నక్షత్ర దర్శనం: రాత్రి కొత్తజంటను బయటికి తీసుకువచ్చి ఆకాశంలో కనబడే ఉత్తరధృవ నక్షత్రాన్ని అదే అరుంధతీ నక్షత్రాన్ని చూపుతారు. ఓ నక్షత్రమా నీలాగే నేనూ శాశ్వతంగా కుటుంబంలో అన్ని సంపదలతో విలసిల్లాలి, నీవు నాశనం లేక ఎలా వెలుగుతావో అలాగే నేనూ నా కుటుంబంలో వెలగాలని కోరుకుం టుంది వధువు ఆ నక్షత్రాన్ని.
- గర్భాదానం: ‘సమావేశంచవధ్వా సహమైధునార్థం శయనమ్’ ఇద్దరూ కలిశారు. మీరు ఇంక కలిసి సుఖాలు పంచుకోవచ్చు. శయ్యాసౌఖ్యాలు పొందవచ్చు అని విప్పి చెప్పేది గర్భాదాన కార్యక్రమం. ఇది ప్రథమరాత్రి. వధూవరుల శారీరక సౌఖ్యాల ఆనందడోలికలు అలా సాగుతూనే ఉంటాయి.
మన హిందూ వివాహ పద్ధతుల్లో కార్యక్రమాల్లో, తతంగాల్లో ఒక్కొక్క అంశాన్నీ ఒక చిన్న గ్రంథంగా శ్లోకార్థాలతో వివరించి విశేషించి చెప్పుకోదగ్గ విషయం. తతంగానికీ తతంగానికీ మధ్య పూజలు, రకరకాల ఆలోచనలు రేకెత్తించే ఒకనాటి చరిత్ర చెప్పే విశేషాలమయం వివాహాలంటే.
కానీ సమాంతర సంస్కృతిలో ఉండే బహుకులాల ప్రజల వివాహాల వేడుకల గూర్చి జరగవలసినంత పరిశోధనలు జరగలేదు. అవి జరిగితే దాచేస్తే దాగని సామాజిక చరిత్రాంశాలను మరిన్ని మనం భద్రపరచుకోవచ్చు. ఇందుకు పరిశోధకులు పూనుకోవాలి.