Parimitithone aanandam |
- శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి
ఆధునికుల కాలమంతా ధనార్జనతోనే గడచిపోతూంది. సంపాదించిన ఆ ధనాన్ని కూడా సక్రమంగా ఖర్చు పెడుతున్నారా అంటే, అదీ సందేహమే! మనం ఏ వస్తువునూ అవసరానికి మించి కోరకూడదు. ఒక వస్తువును కొనేటప్పుడు, మనం బేరం చేసి ఎంత తక్కువ ధరలో కొనవచ్చో అంత తక్కువ ధరలో కొంటాం. కానీ ఆ వస్తువు మనకు అవసరమో, కాదో ఆలోచిస్తున్నామా? వస్తు సముదాయాన్ని వృథా చేసుకుంటూ పోవడం వల్ల మనకు సుఖం అధిక మవుతుందని అనుకోవడం ఒక భ్రమ. జీవితం సుఖంగా గడవాలంటే కొన్ని ముఖ్యమైన వస్తువులుంటే చాలు. దానికి కావాల్సిన ధనం మాత్రం ఆర్టిస్తే చాలు. ఈ విషయం మనం గుర్తించగలిగితే మన ఆచారాలు, అనుష్టానాలు వదులుకొని దెశాంతరాలకు పోయి మరి విస్తార ధనార్జన చేయవలసిన అవసరం ఏర్పడదు. ఆత్మవిచారానికీ, ఈశ్వరధ్యానానికీ, పరోపకారానికీ మనకు కావలసినంత సమయం కావాలంటే అవసరాలకు మించి వస్తువులను సముపార్దించే లౌల్యాన్ని వదిలిపెట్టాలి.
అంతటా ఆడంబరమే!: మనం రెండు విధాలుగా కాలాన్ని వ్యయం చేస్తున్నాం. ఒకటి ధనార్జన కోసం, రెండవది ఆ ధనార్దనతో సంపాదించిన వస్తువుల రక్షణ కోసం! ఈ రెండింటి నుంచి కాస్త మనస్సును మళ్ళించ గలిగితే, ఆత్మ తుష్టికరములైన సాధనలు చేసి జీవితాన్ని శాంతంగానూ, సుఖంగానూ, ఆనందంగానూ, తృప్తి గానూ గడపవచ్చు.
ఈ పొదుపు వస్తువుల విషయంలోనే కాదు సంభాషణల్లోనూ అలవరచుకోవాలి. పదిమాటల్లో చెప్పవలసిన విషయాన్ని ఒక్కమాటలో చెప్పగల సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పుడు మనకు ఈ విధమైన వాచా సంయమనం కలుగుతుందో, అప్పుడు బుద్ధిలో తీక్టమూ, వాక్కులో ప్రకాశమూ మనం చూడగలం. మన వాక్కులు వ్యర్థం కాకూడదు. 'మౌనేన కలహం నాస్తి; మౌనం వల్ల కలహాలు పొడసూపే అవకాశమే ఉండదు కదా! మితభాషణ వలన మనశ్శాంతి, ఆత్మశ్రేయస్సూ వృద్ధి చెందుతాయి. కానీ ఈ కాలంలో మనం చూస్తున్నదంతా వాగాడంబరమే! పొదుపు ఒక్క చేతల్లోనే కాకుండా మాటల్లో కూడా ఉండాలి. భాషణలో కూడా పరిమితిని పాటిస్తే ప్రశాంతంగా ఉండగలం.
దాతృత్వంతోనే లక్ష్మీకటాక్షం: నిజానికి అన్ని కోరికలూ సంకల్పం వల్లనే ఉద్భవిస్తున్నాయి. కొత్త, కొత్త సంకల్పాలు ఉదయించకుండా చూసుకుంటే కోరికలూ క్రమక్రమంగా క్షీణిస్తాయి. కోరికలు క్షీణించే కొద్దీ మన కార్యక్రమాలు, ధనార్జన, వస్తు సంపాదన తగ్గుతూ వస్తాయి. సంకల్పాలు క్షీణించాలంటే సద్వస్తువులపై దృష్టి నిలపాలి. అప్పుడు చిత్తవృత్తులు సమసిపోయి, ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రతకు అపరిగ్రహం అత్యవసరం. మనం సంపాదించే ధనమంతా స్వార్థం కోసమే కాక దానధర్మాలకు కూడా వెచ్చించాలి. మన సమాజంలోనే సత్కార్యాల కోసం దానధర్మాలు చేసే సుకృతులు ఎంతో మంది ఉన్నారు.
లోకంలో ఎంతోమంది దుఃఖితులూ, దరిద్రులూ ఉంటే, వారు కష్టపడుతూ ఉంటే, మనం వృథాగా ధనాన్ని ఖర్చుపెట్టడం పాపం. మన ధనంతో దీనుల దుఃఖా శ్రువులను తొలగించగలిగితే అంతకన్నా పుణ్యకార్యం వేరే ఉండదు. సంపద ఉండగానే సరిపోదు! దాన్ని సద్విని యోగం చేస్తున్నామా? పరోపకారానికి అది ఉపయోగ పడుతుందా? దీనజనోద్ధరణకు సహాయపడుతుందా\ అని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇలా సంపద సద్విని యోగమయ్యే కొద్దీ మనకు లక్ష్మీకటాక్షం కూడా సమృద్ధిగా లభిస్తుంది.