Let's conquer diabetes |
మధుమేహం (షుగర్ వ్యాధి)ని జయిద్దాం!
- డా. చిరుమామిళ్ల మురళి మనోహర్ ఎం.డి (ఆయుర్వేద)
మధుమేహం సర్వసాధారణంగా కనిపించే వ్యాధి. ఇంటర్నేషనల్ దయాబెటిస్ ఫెడరేషన్ 2021లో నిర్వహించిన గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అధికసంఖ్యలో మధుమేహ వ్యాధిగ్రస్థులు కలిగిన దేశాల్లో మన దేశం ముందుంది. భారతదేశంలో 43 8 మిలియన్లు, చైనాలో 53.8 మిలియన్లు, అమెరికాలో 22 మిలియన్లు, రష్యాలో 12.7 మిలియన్లు, జపాన్లో 9.7 మిలియన్ల మంది ప్రజలు మధుమేహం కలిగి ఉన్నారని అంచనా. ఈ సంఖ్య రోజు రోజకీ అనూహ్యమైన రీతిలో పెరిగిపోతుండటం మరింత ఆందోళనను కలిగించే పరిణామం. మన దేశం విషయానికి వస్తే క్రమంగా మారుతున్న వాతావరణపు పరిస్థితులు, పారిశ్రామికీకరణ, నగరీకరణ, జీవన విధానాలలో మార్పులు ఇవన్నీ మధుమేహ వ్యాధికి దోహదపడుతున్నాయి. మధుమేహంతో బాధపడే వారు రోజు రోజుకు ఎక్కువైపోతున్నారు.
ఆసియాఖండంలో ఈ వ్యాధి సంవత్సరానికి 20 శాతం చొప్పున పెరుగుతోందని ఒక అంచనా. అలాగే, అంధత్వానికి, కిద్నీ వ్యాధులకు, నరాల సంబంధమైన జబ్బులకు మధుమేహం ఒక ప్రధానమైన కారణంగా ఉంటోంది. మధుమేహం ఉన్న వారిలో గుండె జబ్బులు గానీ పక్షవాతం గానీ వచ్చే అవకాశం మామూలు వ్యక్తులలోకంటే నాలుగు రెట్లు ఎక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు సగం మందికి అసలు తమకు మధుమేహం ఉన్నట్లే తెలియదు. ఇదీ నిజమైన మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు సగం మందికి అసలు తమకు మధుమేహం ఉన్నట్లే తెలియదు. ఇదీ నిజమైన విషాదం.
నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారిలో ఎవరికైనా మధుమేహం వచ్చే రిస్కు వుంది. వయసు పెరుగుతున్న కొద్దీ రిస్కు పెరుగుతుంది. స్థూలకాయుల్లోను, స్థబ్దమైన జీవితం గడిపేవారిలోను రిస్కు మరీ ఎక్కువ. మహిళల్లో, గర్భధారణ సమయంలో మధుమేహం బైట పడి ప్రసవానంతరం తగ్గి పోయినప్పటికీ, ముందు ముందు వారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక వేళ గర్భధారణ సమయంలో మధుమేహం లేక పోయినప్పటికీ, పుట్టిన శిశువు కనుక 4 కిలోల బరువు వుంటే, అటువంటి తల్లులకు భవిష్యత్తులో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. రక్తంలో హెచ్.డి.ఎల్ అనే హితకరకొలెస్టరాల్ 35 కన్నా తక్కువ ఉన్న వారికి, టై గ్రిజరైద్స్ అనే కొవ్వుపదార్ధాలు 250కి మించి ఉన్న వారికి, రక్తపోటు 180/90 కి మించి ఉన్న వారికి భవిష్యత్తు కాలంలో మధుమేహం వచ్చే రిస్కు వుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగే మరణాలకు మధుమేహం ఒక ప్రధాన కారణం. వ్యాధి నైజం, ప్రాదుర్భావం, నియంత్రణా మార్గాల మీద అవగాహన లేకపోవటం దీనికి కారణం.
- డా. చిరుమామిళ్ల మురళి మనోహర్ ఎం.డి (ఆయుర్వేద)
ఫోన్ - (040) 23742146, 9246575510.