Chanakya |
మేధావి - కౌటిల్యుడు
విదేశీనీతి - పరిపాలన:
అర్థశాస్త్రంలో కౌటిల్యుడు "ఆరు" విధాలుగా పొరుగు రాజ్యాలతో వ్యవహరించే విధానం తెలిపాడు. అవి- 1. సంధి, 2. విగ్రహం, 3. ఆసనం, 4. యానం, 5. సంశ్రేయం, 6. ద్వైధీభావం. దీనినే షాడ్గుణ్యమ్ అని సంబోధించారు.
- 6. 2. 1 "ఒక దేశం యొక్క సురక్షత అది పాటించే విదేశీ విధానంపై ఆధారపడి ఉంటుంది.
- 7. 14. 18, 19 'బలహీనుడైన' రాజు ప్రజోపయోగ కార్యక్రమాల ద్వారా బలం పుంజుకోవాలి. ఆ బలం ఎక్కడ నుండి వస్తుందంటే జానపదులు నుంచీ లభిస్తుంది.
- 7. 15. 13-20, 12. 1. 1-9 'ఎవరూ బలహీనంగా శత్రువుకు లొంగిపోకూడదు, అలాగే మూర్ఖంగా, వీరోచితం అంటూ తనని తాను త్యాగం చేసుకోకూడదు. తాను బతికి ఉండి, సమయంచూసి శత్రువుపై దాడి చేయాలి.
- 7. 17. 1, 2 'సంధి చేసుకోవటం', 'శత్రు రాజ్య విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం', 'శాంతి కోసం బందీలను విడుదల చేయటం' వంటి ఈ మూడింటి ఉద్దేశం ఒక్కటే. అవి శత్రుదేశ పాలకులలో నమ్మకం కలిగించటానికి తీసుకొనే చర్యలు.
- 7. 9. 9-12 రెండు మిత్రపక్షాల మధ్య ఎన్నిక చేసుకోవాల్సి వచ్చినపుడు ఎవరైతే మనం నియంత్రించగల అవకాశం ఉంటుందో అట్టి వారితో స్నేహం చేయాలి. స్నేహం అసలు ఉద్దేశం సహాయం పొందటమే.
- 7. 9. 13-17 ఎవరివలనైతే మనకు సహాయం అందుతుందో ఆ సహాయం చిన్నదైనప్పటికీ, అటువంటి వారితో స్నేహం చేయటం మంచిది. తాత్కాలికమైన గొప్ప సహాయం పొందటం కన్నా చిన్నదైనా నిరంతరం సహాయం పొందటం మంచిది. ఈ దృష్టితోనే మిత్ర పక్షాన్ని ఎంచుకోవాలి.
- 7. 9. 18-21 ఎవరతే తన సైన్యాన్ని, వనరులనూ తొందరగా మోహరించగలరో వారినే మిత్ర పక్షంగా ఎంచుకోవాలి. వారికి అంత బలం లేకపోయినా పరవాలేదు, ఎందుకంటే అవకాశాన్ని జారవిడుచుకోకూడదు.
- 7. 9. 26-30 సైన్యాని కంటే ధనసహాయం చేసేవారినే తాను మిత్ర పక్షంగా ఎంచుకోవాలి. ఎందుకంటే సైన్యం అన్ని వేళలా పనికిరాదు. డబ్బు ఎక్కడైనా అక్కరకొస్తుంది.
- 7. 18 శత్రువుని జయించిన తరువాత, మిత్ర పక్షం శక్తివంతమై తన తోనే యుద్ధం చేసే అవకాశం ఉంది. అందువల్ల మొదటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకొని మిత్రపక్షం అణకువగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
కౌటిల్యుడు ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనే నిర్ణయానికి 8 కారణాలు చెబుతాడు. అవి:
1. బలం (ఈ బలం 3 రకాలు. 1. బుద్ధిబలం, 2. సైన్యబలం, 3. ఆత్మబలం)
2. ప్రదేశం
3. కాలం
4. సరైన బలగాలు
5. అంతర్గత తిరుగుబాటు
6. ఆశయం
7. లాభ, నష్టాలు
8. నమ్మకద్రోహం
ఇటువంటివన్నీ రాజు తన నమ్మకమైన మంత్రులతో చర్చించి, నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తరవాత వెంటనే దానిని అమలు చేయాలి. తనకంటే బలవంతునితో యుద్ధం చేయకూడదు. ఇలా రాజనీతి గురించి కౌటిల్యుడు తన అర్థశాస్త్ర గ్రంథంలో చాలా చక్కగా వివరించాడు.