రామాయణము |
రామాయణము ప్రాముఖ్యము
భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉన్నది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణము నృత్య నాటకము బాగా ప్రసిద్ధము.
24,000 శ్లోకము లతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మము ల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది.
రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.
వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్వములు అంతర్గతముగా నున్న పురాణములు, కథలు, కావ్యములు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నవి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్ధన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.
కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత: ||
రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరితము . ఆంజనేయ భక్తి భరితము. వీరిని గూర్చిన ప్రార్ధనలు ఎన్నో ప్రచారములో నున్నవి....
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్
గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్
రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||
రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మిక. "రామ" నామము లో పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'రా' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తు(స్తు)ల్యమ్ రామనామ వరాననే ||