Anjaneya |
ఆంజనేయుడు హనుమ ఎలా అయ్యాడు!
ఆంజనేయుడు పెరిగి పెద్ద వాడవుతున్నాడు. ఒక రోజు ఆకలి గా వుందని అమ్మను అడిగాడు ఏమైనా పెట్టమని. ఆమె పండిన పళ్ళు చెట్టుకు వుంటాయి కోసుకొని తినమన్నది. అప్పుడే సూర్యోదయం అవుతోంది అరుణ కాంతితో సుర్యుడు ఉ౦డటం వల్ల పండు గా భావించి ఆకాశానికి యెగిరి సూర్యున్నిపట్టు కొన్నాడు . .ఆరోజు సూర్య గ్రహణం రాహువు సూర్యుని కబళి౦చాలి .తాను చేయాల్సిన పని ఇతను చేయటం చూసి కోపం వచ్చింది. నేరేడు పండు లాగా నల్ల గా వున్న రాహువుని చూసి పండు అనుకోని పట్టుకో బోయాడు. అతను పారిపోయి ఇంద్రుడికి చెప్పాడు .తెల్లని ఐరావతం ఎక్కి ఆయన వచ్చాడు. దాన్ని కబళించాలని మీదకు దూకాడు. ఇంద్రునికి, ఆశ్చర్యము , కోపమూ వచ్చి వజ్రాయుధాన్ని ముందుగా తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు .నోటిలో సూర్య బింబాన్ని వుంచుకొనే ఆంజనేయుడు ఆ రెండిటినీ రెండు వెంట్రుకలతో ఎదుర్కొని వాటిని పనికి రాకుండా చేశాడు. దేవతలంతా వచ్చి సూర్యుడు లేక పొతే ప్రపంచానికి చాల నష్టమని ,యజ్ఞాది క్రతువులు చేయటం కుదరదని అతనికి నచ్చ చెప్పారు .వాళ్ల మాట విని తాను నోటితో మింగిన సూర్యున్ని వదిలేశాడు.
ఇంద్రునికి కలిగిన పరాభవం మర్చి పోలేక , ఆన్జనేయుడు ఏమరు పాటులో వుండగా మళ్ళీ వజ్రాయుధం విసిరాడు. అది అతని దవుడ కు తగిలి నెత్తురు గడ్డ కట్టి స్పృహ కోల్పోయాడు .వాయువుకు ఈ విషయం తెలిసి వీచటం మానేశాడు. ప్రపంచం గాలి లేక స్తంభించి పోయింది .మళ్ళీ దేవతలందరూ వచ్చారు బ్రహ్మ తన కమండలం లోని నీళ్ళను బాలుని పై చల్లి మూర్చనుంచి మరల్చాడు .దేవతలందరినీ అన్జనేయునికి వరాలు ఇవ్వమని బ్రహ్మ ఆదేశించాడు .దీర్ఘాయువు ,బలం ,పరాక్రమం , ఆరోగ్యం తేజస్సు, గుణం ,బుద్ధి ,విద్య ,విచక్షణ , ప్రసన్నత , చతురత , వైరాగ్యం , విష్ణు భక్తి , దయ పర స్త్రీ విముఖత ఏ అస్త్రము ఏమీ చేయలేని శక్తిని దేవతలందరూ ఆన్జనేయునికి వరం గా అనుగ్రహించారు .వజ్రాయుధం చేత మరణం ఉండదని ,బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయలేదని అయితె దానికి కొద్ది సేపు లొంగి పోవాల్సిన పరిస్థితి వస్తుందనిఅన్నారు. వజ్రాయుధం తగిలినా ఊడి పోకుండా అతని దవడ ఆంటే హనుమ వుంది కనుక అప్పటినుంచి ఆన్జనేయునికి హనుమ అనే పేరు సార్ధకం అవుతుందని చెప్పారు .
విష్ణు మూర్తి లాగ దేవతలను వుద్దరిస్తాడని , రామ కార్యం నేరవేరుస్తాడని ,శివునిలా దుష్ట సంహారం చేస్తాడని ,లంక లోని రాక్షసులను వదిస్తాడని ,త్రిమూర్తుల అవతారం కనుక త్రిమూర్త్యాత్మకుడనే పేరు తో పిలువ బడ తాడని ,,దుష్ట గ్రహాలను పారదోల టానికి ప్రతి గ్రామం లో ఆంజనేయ దేవాలయాలు నెలకొల్పుతారని బ్రహ్మ అనుగ్రహించి అంతర్ధానమయాడు. వాయువు మళ్ళీ వీచి సకల ప్రాణి కోటికి ప్రాణ వాయువును అందించాడు. ఇలా ఆంజనేయుడు హనుమ గా మారాడు .
దేవతలిచ్చిన వరాలతో హనుమ విజ్రుమ్భించి సహజ మైన కోతి చేష్టలు చేస్తూ ,అందర్నీ బాధిస్తుందే వాడు .అతను భవిష్యత్ లో చేయ బోయే గొప్ప కార్యక్రమాల గురించి తెలిసిన మునులు ఏమీ అనకుండా వుండే వారు. వాళ్ల గోచీలు లాగటం, మడి బట్టలు చిమ్పేయటం చూసి ఒక శక్తి సంపన్నుడైన మహర్షి ”నీ సహజ శక్తిని మర్చిపోతావు ”అని శపించాడు తర్వాత జాలిపడి ఎవరైనా గుర్తు చేస్తే మళ్ళీ శక్తి సంపన్నుదవుతాడని అనుగ్రహించాడు.
క్రమంగా అల్లరి తగ్గి మంచి బాలుడనిపించుకున్నాడు .విద్య నేర్చే వయసు వచ్చింది .తల్లి అంజన సూర్యుని అనుగ్రహం పొంది విద్యలు నేర్చుకోమని పంపింది .ఆయన దగ్గరకు వెళ్లి విద్య నేర్పని అడిగాడు .తాను అనుక్షణం తిరుగుతూంటాను కనుక విద్య నేర్పలేను అన్నాడు .తాను కూడా సూర్యుని తో పాటు కదిలి పోతూ ,విద్యలు నేర్చాడుఒక కాలు ఉదయపర్వతం మీద ,రెండోది పశ్చిమ పర్వతం మీద వుంచి శ్రద్ధ తో విద్య నేర్చాడు .అయిదు వ్యాకరణాలు నేర్పాడు .మిగిలిన నాలుగు నేర్పటానికి వివాహం జరగాలి కనుక తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకో మన్నాడు .చేసుకుంటాను కాని నేను బ్రహ్మ చారి గానే వుంటాను దా౦పత్య సుఖం వుండదు .దానికి మీ అమ్మాయి అంగీకరిస్తే నేను సిద్ధం అన్నాడు .ఆమె అంగీకారం తో వివాహం జరిపి మిగిలిన నాలుగు వ్యాకరణాలు నేర్పి నవ వ్యాకరణ పండితుణ్ణి చేశాడు .వీరి కన్యాదానం జ్యేష్ట శుద్ధ దశమి నాడు జరిగింది .సువర్చల తపోనిష్ట తో గడుపు తోంది. గంధ మాదన పర్వతం మీద .హనుమ తల్లి దగ్గరకు వెళ్లి విషయం అంతా చెప్పాడు .ఆమె సంతోషించి ”నాయనా !నాకు వాలి ,సుగ్రీవుడు అనే సోదరులున్నారు .నీకు వాళ్ళు మేన మామలు .వారిద్దరికీ బద్ధ వైరం .అందులో సుగ్రీవుడు ధర్మ స్వరూపుడు నువ్వు సుగ్రీవుని చేరి అతనికి రక్షకుడు గా వుండు .నీ పెద్ద మేన మామ వాలితో విరోధం మాత్రం పెట్టుకోకు .నీకు శుభం జరుగుతుంది ”అనిదీవించి పంపింది.
తల్లి మాట విని హనుమ పంపానదీ తీరం లో వున్న చేరి మంత్రి అయాడు .తర్వాత రామ సుగ్రీవులకు సఖ్యత కూర్చిసీతాన్వేషణ కోసం సముద్రం దాటి సీతా , జాడను లంకలో తెలుసు కోని ,రాముని ముద్రికను ఆమెకిచ్చి ,ఆమె ఇచ్చిన శిరోమణి తీసుకున్నాడు అక్షుడు మొదలైన రాక్షసులను చంపి ఇ౦ద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రానికి బంధితుడై రావణుడి దర్బార్ కు వెళ్లి హిత వచనాలు చెపాడు .వినక తోకకు నిప్పంటిస్తే దానితో లంకా దహనం చేసి ,మళ్ళీసీతా దేవిని దర్శించి, సముద్రం దాటి రామసుగ్రీవులను విషయం చెప్పాడు .రాముడిసైన్యం సముద్రుని పై వారధి నిర్మించి లంకను చేరింది. రామ రావణ యుద్ధం లో చాల మంది రాక్షసులను చంపాడు హనుమ .రావణున్ని రాముడు సంహరించాడు .సంజీవి పర్వతం తెచ్చి లక్ష్మణ మూర్చను తొలగించాడు .మైరావణ సంహారం చేసి శ్రీ రామ పట్టాభిషేకం జరిపించి ,సేవా తత్పరుడై ,రామ కార్య దురంధరుడై ,త్రేతా యుగం తర్వాత గంధ మాదన పర్వతం చేరి తారక నామం జపిస్తూ ,దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ,భక్తుల మనో భీస్టాన్ని నెర వేరుస్తూ రామ భక్త హనుమాన్ గా ప్రజల హృదయం లో చిరస్థాయి గా వున్నాడు భక్త వరదుడైన శ్రీ హనుమ.