cute girl |
ప్రసాద్ బొద్దుగా, తెల్లగా పుట్టాడు. పెళ్లయిన ఆరేళ్ళకు పుట్టిన బాబును దైవప్రసాదంగా భావించి ఆ పేరు పెట్టుకున్నారు. ఆలస్యమైనా రంగు, రూపు బాగున్నందున తెగ మురిసిపోయారు. అయితే అది మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది. బాబు వయస్సుకు తగినట్టుగా ప్రవర్తించడంలేదు. బోర్లా పడటం, లేచి నిలబడటం, మాటలు, నడక అన్నింటిలోను వెనుకబడుతున్నాడు. చూడటానికి చక్కగా వున్నప్పటికీ అతని ఎదుగుదలలో ఆలస్యం, మాటలు, చూపుల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు.
పిల్లల ఎదుగుదల, భావ వ్యక్తీకరణలో లోపాలు తలెత్తడాన్ని ‘ఆటిజమ్’ అంటారు. ఈ రుగ్మత గల పిల్లలు అన్నింటా వెనుకబడుతుంటారు. నడవటం, మాట్లాడటం బాగా ఆలస్యమవుతుంది. నడిచేటప్పుడు సక్రమంగా, నేరుగా నడవలేరు. మాట్లాడేటపుడు ఎదుటివ్యక్తి కళ్ళు, ముఖం వైపు స్పష్టంగా చూడలేరు. భావవ్యక్తీకరణ, ఉద్వేగ ప్రదర్శన, స్వీకరణ, అర్థం చేసుకోవడం లాంటి సహజ లక్షణాలు సరిగా ప్రదర్శించలేరు. మొత్తంమీద ఆటిజం పిల్లల ప్రవర్తన కొంత తేడాగాను, మరికొంత విచిత్రంగాను వుంటుంది.
ప్రతిదీ ఆటిజం కాదు
పిల్లల ఎదుగుదలలో ఏర్పడే ప్రతి సమస్యను ఆటిజంగా భావించలేము. కొందరిలో వినికిడి సమస్యవల్ల వినడం, మాట్లాడటంలో తేడాలు కనిపిస్తాయి. అలాగే అతి బరువున్న పిల్లలు నడక నేర్చుకోవడంలో ఆలస్యం జరుగవచ్చు. అంతమాత్రాన వీరికి ఆటిజం ఆపాదించడం తగదు. కేవలం పిల్లల పైపై లక్షణాలను బట్టి ఆటిజం నిర్థారణ చేయకూడదు. డాక్టర్లు, వైద్య నిపుణులు పరీక్షలుచేసిన తరువాతనే కచ్చితంగా ఆటిజం సమస్య వున్నదీ లేనిదీ తెలుస్తుంది.
ఎందుకంటే ఆటిజమ్ ఉన్న పిల్లలు, ఆరోగ్యంగా వున్న పిల్లల మధ్య తేడాను కనిపెట్టడం అంత సులభం కాదు. ఆటిజం లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో ఈ లక్షణాలు నిర్దిష్టంగా, స్పష్టంగా వుంటాయి. ఈ లక్షణాలు వారి వ్యవహార శైలిపై ప్రతికూల ప్రభావం కలిగి వుంటాయి. ఇలా వుండటాన్ని ‘క్లాసికల్ ఆటిజం’ అంటారు. ఇంకొందరిలో ఈ సమస్య తీవ్రత తక్కువగా ఉంటుంది. ఇది వారి జీవనంపై ఎలాంటి దుష్ప్రభావం చూపించదు. ఈ లక్షణాలను మైల్డ్ ఆటిజం (ఒక మోస్తరు) ఆస్పర్జర్ సిండ్రోమ్ అంటారు.
ఆటిజం లక్షణాలు
ఆటిజం తీవ్రత ఎలా వున్నప్పటికీ కొన్ని సారూప్యలక్షణాలు అందరిలో కనిపిస్తాయి.
- ఆరోగ్యవంతమైన పిల్లలతో పోలిస్తే శారీరక, మానసిక ఎదుగుదలలో ఆలస్యం జరుగుతుంది.
- చూడటం, ఏకాగ్రత, మాట్లాడటం, భావాల వ్యక్తీకరణలో ఇబ్బంది పడుతుంటారు.
- ఆటిజం వున్నవారిలో 40 శాతం మందికి మాటలు రాకపోయే అవకాశాలున్నాయి.
- ఈడు పిల్లలతో కలవడం, ఆడుకోవడం, స్నేహంగా మెలగడం చేయలేరు.
- ఎదుటివారిని అర్థం చేసుకోలేకపోవడం, తమ బాధల్ని చెప్పుకోలేకపోవడం జరుగుతుంది.
- కాళ్ళు చేతులు విచిత్రంగా ఆడించడం, కదిలించడం, తికమకగా వ్యవహరించడం చేస్తుంటారు.
- ఒకే పదాన్ని లేదా మాటను పదే పదే ఉచ్చరిస్తుంటారు.
- అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు.
- వయసుకు తగినంత పరిపక్వత చూపలేరు.
- ఒకే రకం ఆహారం, దుస్తులను ఇష్టపడుతుంటారు.
- శరీరంలో అనవసర ప్రతిస్పందనలు, కదలికలు చోటుచేసుకుంటాయి.
కారణాలు
ఆటిజం ప్రధానంగా మెదడు, నాడీ వ్యవస్థ ఎదుగుదలలో వచ్చే లోపంవల్ల తలెత్తుతుంది. దీనికి జన్యుపర లోపాలు కారణంగా చెప్పవచ్చు. పుట్టుకతో వచ్చే ఈ సమస్య ఒకోసారి మూడేళ్ల వయస్సు వచ్చేవరకు గుర్తించే వీలు లేకపోవచ్చు. మేనరిక వివాహాలవల్ల ఆటిజం వచ్చే అవకాశాలున్నాయని అంటారు. తల్లి గర్భవతిగా ఉన్న సమయంలో వచ్చే సైటోమెగాలో, రుబెల్లా లాంటి వైరస్ సోకడంవల్ల ఆటిజం రావచ్చు. గర్భందాల్చిన సమయంలో అధిక రక్తస్రావం, థైరాయిడ్, డయాబెటిస్, మాదకద్రవ్యాలు, మద్యం అలవాట్లు వుండటం మూలంగా మారవచ్చు. అలాగే గర్భస్తురాలైన తల్లి పడే మానసిక వేదన, ఆహార లేమి, తీవ్రమైన ఒత్తిళ్ళు ఇందుకు దారితీయవచ్చు. శైశవ దశలో వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, వాటికి వాడే మందులు ప్రభావం చూపవచ్చు.
బాల్యంలో తీవ్రమైన ఒత్తిళ్ళు, రుగ్మతలు, సంఘర్షణ ఎదుర్కోవడంవల్ల ఆటిజానికి గురికావచ్చు. పసితనంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం పొందలేని పిల్లల్లో ఎదుగుదల సక్రమంగా జరుగకపోవచ్చ. బాల్యంలో మెదడుకు బలమైన దెబ్బతగలడం, ఇతర నాడీ సమస్యలు ఆటిజానికి కారణాలుగా పరిణమించవచ్చు.
చికిత్స.. జాగ్రత్తలు
ఆటిజం ఉన్న పిల్లల్లో దాని తీవ్రతను ముందు గుర్తించాలి. దీనికి నిపుణుల సహాయం పొందాలి. సమస్య తీవ్రంగా వున్న పిల్లలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వుంటారు. వారు ఉన్నచోటనే వుంటూ పదే పదే ఒకే పనిని చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి చిన్న శబ్దాలకే అతిగా భయపడి రాద్ధాంతం చేస్తుంటారు. అయితే ఒక మోస్తరు సమస్యతో బాధపడేవారు కొన్ని అంశాలలో తెలివితేటలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. వీరికి నచ్చిన క్రీడలు, కళల్లో ప్రావీణ్యం చాటుకుంటుంటారు. అయితే వీరిలో భావ వ్యక్తీకరణలో కొంత లోపం కనిపిస్తుంది. రైట్ సిండ్రోమ్ అనే మరొక రకం ఆటిజం వున్న పిల్లలు బాగా చిక్కిపోయి, మానసిక వైకల్యానికి గురవుతారు. ఈ సమస్య ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
పిల్లల్లో కనిపించే లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ పిల్లలకు చికిత్స చేయడానికి ప్రత్యేక కేంద్రాలు ఉన్నాయి. పరిస్థితిని బట్టి వారి పనులు వారు చేసుకునేలా శిక్షణ ఇవ్వాలి. మాటల్లో వెనుకబడిన వారికి స్పీచ్ థెరిపీ, ప్రవర్తన నేర్పేందుకు బిహేవియర్ థెరపీ చేయాల్సి వుంటుంది. దీనికి ప్రత్యేక శిక్షణ పొందిన వారి సేవలు ఉపయోగించుకోవాలి. సాధారణ డాక్టర్లు, సైకాలజిస్టులవల్ల పెద్దగా ప్రయోజనం వుండదు. ఆటిజంలో అనుభవం వున్న వైద్యుల పర్యవేక్షణలో చికిత్స, మందులు వాడటంవల్ల సత్ఫలితాలు ఉంటాయి. ఈ సమస్యను చూసి కృంగిపోవటం కంటే సానుకూల దృక్పథంతో వ్యవహరించడం చాలా ప్రయోజనకరం.
డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి
18-4-111/2, రైల్వే కాలనీ,
తిరుఫతి - 517 501.