పరిసరాల వాస్తు - Parisarala Vaastu |
..సురేష్
వాస్తులో పరిసరాల వాస్తుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక్కోసారి గృహము వాస్తురీత్యా నిర్మించుకున్నను, పరిసరాల వాస్తు సరైనదిగా లేనట్లయితే ఆ గృహమునందలి నివసించువారు ఉత్తమ ఫలితాలు పొందడం కష్టము. ఈ పరిసరాలవాస్తు ఎంతో అనుభవజ్ఞుడైన వాస్తు సిద్ధాంతి మాత్రం చక్కగా తెలుపగలడు. నా అనుభవములో పరిసరాల వాస్తు సరిగా లేకుండా గృహము మాత్రము వాస్తురీత్యా నిర్మించుకున్న గృహముల యందలి యజమానులు దెబ్బతినడం గమనించడమైనది.
పరిసరాల వాస్తు అంటే ఏమిటి ? మన ఇంటి ప్రహారీ తరువాత బయట స్థలముపై ఉన్న శుభ, అశుభ వాస్తు ప్రభావములను పరిసరాల వాస్తు అంటారు. ఒక్క మాటగా చెప్పాలంటే ప్రతి స్థలముపై వాస్తు ప్రభావము ఉంటుంది. దానిని ఆనుకున్న గృహాలపై ఆ ప్రభావము తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ పరిసరాల వాస్తు అశుభకరంగా ఉన్నప్పుడు మన గృహముయందలి వాస్తు సరిగా లేకపోయినట్లయితే పది సంవత్సరాలలో ఏర్పడే నష్టము ఒక్క సంవత్సరములోనే ఏర్పడుతుంది. అదే పరిసరాల వాస్తు సరిగా లేకుండా మన గృహము మాత్రము వాస్తురీత్యా నిర్మించు కున్నట్లయితే జరుగబోయే నష్టాన్ని ఎంతో ఎక్కువ కాలంపాటు ఆపేశక్తి ఉంటుంది. ఒకవేళ మన గృహమునకు మంచి వాస్తు పట్టు ఉన్నట్లయితే పరిసరాల వాస్తు సరిగా లేకపోయినా నష్టాలను ఆపుతూ లాభాల దిశగా మన గృహము ముందుకు సాగే అవకాశం చాలా ఎక్కువ.
ఈ విషయంగా ఇంకా విపులంగా సంపూర్ణంగా సంభాషించుకుందాము. పరిసరాల వాస్తు గురించి తెలుసుకొనే ముందుగా పంచభూతాల గురించి తెలుసుకోవలసి ఉంటుంది. ఈ పంచ భూతాల సమపాళ్ళ సాన్నిహిత్య రూపమే వాస్తు మరియు పరిసర వాస్తు. అంతటి గొప్ప ప్రాధాన్యతను పంచభూతాలు వాస్తు విషయంలో ఆక్రమించాయి. పంచభూతాల సమపాళ్ళ నిర్మాణం లేనిదే వాస్తు, పరిసరవాస్తు లేదు. అనుభవజ్ఞుడైన వాస్తు శాస్త్రవేత్త ఒక గృహమును మరియు గృహ పరిసరాలను గమనించగానే ఆ ఇంటివారి జాతకాన్ని చెప్పే పరిజ్ఞానాన్ని కలిగిఉంటాడు. భవిష్యత్తులో ఆ ఇంటి వారికి జరుగబోయే పరిణామాలను కూడా చెప్పగలిగే పరిజ్ఞానాన్ని కలిగిఉంటాడు. పరిసర వాస్తు సరిగా ఉండి గృహ వాస్తు కూడా సరిగా ఉంటే వారికి పట్టిందల్లా బంగారమే. గృహస్తులు ఈ విషయంగా ఒకసారి బాగా ఆలోచించుకుని మంచి పరిజ్ఞానము కలిగిన వాస్తు సిద్ధాంతిద్వారా మీ గృహమును పరిశీలింప జేయించుకుంటే అన్ని విధాలా గృహస్తులు సంతోషంగానూ, మంచి అభివృద్ధిని, ఆనందాన్ని పొందగలరు. వీరి పిల్లలు మంచి అభివృద్ధిలోకి రాగలరు. అందుకే మంచి పరిజ్ఞానము గల వాస్తు సిద్ధాంతి ముందుగా గృహమునకు వచ్చినప్పుడు తన పరిశీలనలలో ముఖ్య భాగంగా పరిసర వాస్తును గమనించడం జరుగుతుంది. చాలామంది వాస్తు శాస్త్రజ్ఞులు గృహ పరిసర వాస్తును గమనించకనే ఇంటి వాస్తును చెప్పడం జరుగుతున్నది. ఇది పూర్తిగా తప్పు. అందువల్లనే రాత్రిళ్ళు వాస్తు చూడకూడదని పెద్దల ఉవాచ. రాత్రిళ్ళు పరిసరాలు వెలుగులేని కారణంగా సరిగా కనిపించవు. కావున ఎన్నో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్లనే రాత్రిళ్ళు వాస్తు చూడరాదని కట్టడి చేశారు. ఈ మాట చెప్పితే వినరని, ఓ నమ్మకము మరియు మూఢనమ్మకము కింద రాత్రిళ్ళు వాస్తు చూడరాదనే నిబంధనను ఏర్పరచారు. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అంటారు.