cracked heels |
1. కాళ్ళ పగుళ్ళు పోవాలంటే
కాళ్ళు అందంగా ఉండాలనే అందరికీ ఉన్నా, కొందరికే అది సాధ్యపడుతున్నది. కాళ్ళు నున్నగా అందంగా రావడానికి, ఎన్నో పూతలను టీవీలు చూసి పూస్తున్నారు. శరీరంలో అన్నింటికంటే పాదాలు చివరగా నుండడం వలన రక్త ప్రసరణ సరిగా అందక, ఆ పాదాల చర్మం బిరుసుగా మారి ఉంటుంది. లావున్నవారికి, రక్త ప్రసరణ సరిగా లేనివారికి ఈ సమస్య చలికాలం మరీ ఎక్కువ అవుతుంది. పాదాలను సరిగా తోముకోనందువల్ల పగుళ్ళు ముఖ్యముగా వస్తాయి. పగుళ్ళ మధ్య మట్టి పేరుకుపోయి, ఆ భాగంలో క్రొత్త చర్మం పుట్టక, ఉన్న చర్మం బిరుసెక్కి పగిలిపోతూ ఉంటుంది. కాళ్ళను, 10, 15 రోజులలో చాలా అందంగా చేసుకోవచ్చు.
చిట్కాలు:
పాదాలకు కొబ్బరినూనె గాని, ఆముదం గాని రాసి వాటిని వేడినీటిలో పెట్టి అలా 20, 25 నిమిషాలు ఉంచండి. ఈ లోపు వేడి నీటిలో ఆ మట్టి కరిగి మొద్దు బారిన చర్మం మెత్తబడుతుంది. పాదాలను తీసి బట్టలు ఉతికే బ్రష్ పెట్టి పగిలిన భాగంపై రుద్దండి. నానిన చర్మం శుభ్రంగా ఊడి తేలిగ్గా వచ్చేస్తుంది. ఇలా ఆ చర్మాన్ని మనం తీయడం వల్ల అక్కడ కొత్త చర్మాన్ని శరీరం తయారు చేస్తుంది. పాదాలను శుభ్రంగా తుడిచివేయండి. వాటికి కొబ్బరి నూనె మరలా కొంచెం రాయండి. ఇలా రాయడం వల్ల ఆ చర్మం మెత్తగా, రోజంతా బిరుసెక్కకుండా ఉండడానికి మంచిది.
అవకాశమున్నవారు బూట్లు రోజూ వాడగలిగితే కాళ్ళు మెత్తగా ఉండి పగుళ్ళు రాకుండా ఉంటాయి.
పగుళ్ళు లేనివారు పగుళ్ళు రాకుండా ఉండాలంటే వారానికి రెండుసార్లు స్నానానికి వెళ్ళేముందు కొబ్బరినూనె రాసుకుని వెళ్ళి, నీళ్ళు పోసుకునేటప్పుడు పాదాలను బ్రష్ పెట్టి రుద్దితే ఆ భాగంలో మట్టిపోయి శుభ్రంగా ఉంటాయి. స్నానం అయ్యాక కొంచెం కొబ్బరి నూనె తేలిగ్గా అక్కడ పూస్తే మెత్తగా ఉంటాయి.