అరటి |
ఆరోగ్యప్రదాయిని.. అరటి చెట్టి
దేవతలు కొలువుండే వృక్షాలలో అరటి చెట్టు కూడా ఒకటి. అందుకే భారతదేశంలో అరటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ శుభకార్యానికైనా అరటిపండ్లు, ఆకులు ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇక అరటిలో అనేక రకాల జాతులున్నాయి. అరటి చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యం మీ ఇంట ఉన్నట్టే.. ఈ అరటి చెట్టులోని ప్రతి భాగం ఔషధాల గని వంటిదే. అరటి చెట్టు, పండు, పువ్వులో కూడా అనేక ఔషధ గుణాలున్నాయి.
అరటి చెట్టును పూజించడం ద్వారా విశిష్ట ఫలాలు లభిస్తాయి. ఒక మంచిరోజు ఉదయాన్ని లేచి తలస్నానం చేసి పెరటిలో ఉన్న అరటి చెట్టు ముందు లేదా బయటి నుంచి తెచ్చి పెట్టుకున్న అరటి పిలకను గానీ పూజామందిరంలో ఉంచి పూజిస్తే సంతానం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. అరటి కాండాన్ని పసుపు కుంకుమలతో, పుష్పాలతో చక్కగా అలంకరించి దీపారాధన చేయాలి. అనంతరం పెసరపప్పు, బెల్లం, తులసీ దళాలను నైవేద్యంగా సమర్పించుకోవాలి. మధ్యాహ్నంపూట ఐదుగురు ముత్తయిదువులకు భోజనం పెట్టి.. వారికి దక్షిణ తాంబూలాదులు, ఐదేసి అరటి పండ్లను వాయనంగా ఇవ్వాలి. ఈ పూజ చేసేవారు సాయంత్రం చంద్రుని దర్శించుకున్న తర్వాతే భోజనం చేయాలి. ఈ పూజను చేసినవారికి సంతానం కలగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయట. ముఖ్యంగా అత్తింటి కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం.
అరటి చెట్టును గురువు ప్రతీకగా భావిస్తారు. దేవ గురువు బృహస్పతితో అరటి చెట్టు సమానం అంటారు. అలాగే విష్ణువుకు కూడా అరటి చెట్టు ప్రీతికరమని.. గురువారం పూట అరటిచెట్టును పూజించే వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా జ్యోతిష్య ప్రకారం అరటిచెట్టు మాంగల్య దోషాలను నివృత్తి చేస్తుంది. సంతానం కలగని దంపతులకు... అరటి పూజ ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుందని పండితులు చెప్తున్నారు. అరటి పండు సులభంగా జీర్ణమై, మలబద్ధకం రాకుండా కాపాడుతుంది. భోజనం తరువాత ఒక్క అరటి పండు తిన్నారంటే జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. రోజూ అరటి పండు తినడం వల్ల బరువు, ఊబకాయం, పేగు సంబంధిత రుగ్మతలు తగ్గుతాయి. అరటిపువ్వుతో వడియాలు కూడా చేస్తారు. ఇవి రుచిగా ఉండటమే కాదు మంచి ఆరోగ్యం కూడా. అరటి ఆకులో భోజనం చేయడం వలన జ్వరం, క్షయ, ఉబ్బసం మొదలయిన వ్యాధులను నివారించుకోవచ్చు. అంతేకాదు, అరటి ఆకులో భోజనం ఆయుషు పెంచుతుందంటారు.
రుతుక్రమంలో అధిక రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్న స్త్రీలు బాగా మగ్గిన అరటిపండుని దేశీయ ఆవునెయ్యితో కలిపి రోజుకి మూడుసార్లు తింటే రక్తస్రావం అదుపులోకి వస్తుంది. పచ్చి ఉసిరిరసంలో అరటిపండు, తేనె, పటికబెల్లం కలిపి ఈ మిశ్రమాన్ని రోజూ రెండుపూటలా తీసుకుంటే స్త్రీలలో వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది. కాలిన గాయాలపై బాగా పండిన అరటిపండు గుజ్జుని లేపనంగా రాస్తే.. త్వరగా నయమవుతుంది. తెల్ల బొల్లిమచ్చలతో ఇబ్బంది పడుతున్నవారు అరటి దూటనుంచి రసం తీసి తగినంత పసుపు కలిపి పైన లేపనంగా రాస్తుంటే తెల్ల బొల్లి మచ్చలు పోతాయి.
రోజు పరగడుపున ఒక చక్కరకేళి అరటిపండుని తగినంత గోమూత్రంలో కలిపి మెత్తగా పిసికి ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎంతటి ఉబ్బస రోగమైనా అదుపులోకి వస్తుంది.
....jagruti