బాలల కథ: "చిరకారి" |
చిరకారి
ఒక ఆశ్రమంలో మేధాతిథి అనే ముని ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడు ఏ పని చేసినా ఎంతో ఆలోచించి చేసేవాడు, తొందరపదేవాడు కాదు. అందుచేత అందరూ అతణ్ణి “చిరకారి' అని పిలిచేవారు. ఒకరోజున ఆ మునికి భార్యమీద విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే చిరకారిని పిలిచి, “మీ తల్లి తల నరికివెయ్యి!” అని ఆజ్ఞాపించి బయటికి
వెళ్ళిపోయాడు.
చిరకారి ప్రతి విషయాన్ని ఎంతో ఆలోచించిగానీ చెయ్యడు కదా! తండ్రి ఆజ్ఞను గురించి ఆలోచిస్తూ, “తండ్రియే గురువు, దైవం! అందుచేత తండ్రి ఆజ్ఞను జవదాటకూడదు. దాన్ని పాటించడమే పరమధర్మం!” అనుకున్నాడు. మరొకవైపు తాను చంపవలసిన తల్లిని తలుచుకుని, “శాస్త్రాలు, “మాతృదేవో భవి అంటే 'తల్లియే దైవం” అని చెబుతున్నాయి కదా. తల్లి ఎన్నో బాధలు అనుభవించి, నవమాసాలు మోసి బిడ్డను కంటుంది. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యే వరకూ ఎన్నో కష్టాలు పడుతుంది. తల్లి లేని వాడు అందరికీ అలుసు. తల్లి ఉంటే సమస్తమూ ఉన్నట్లు తోస్తుంది. తల్లి నిజంగా దైవం. అటువంటి తల్లిని చంపడం మహాపాపం కదా” అనుకుంటూ లోతుగా ఆలోచిస్తున్నాడు. ఇలా ఒకసారి తండ్రిని గురించి, తండ్రి ఆజ్ఞను గురించి, మరొకసారి తల్లిని గురించి, తల్లి గొప్పతనాన్ని గురించి ఆలోచిస్తున్నాడు.
కొద్దిదూరం నడిచాడో లేదో మునికి కోపం తగ్గిపోయింది. తాను తొందరపడ్డానని గ్రహించాడు. “స్తిని, అందులోనూ భార్యను చంపమన్నానే!” అని తన తప్పుకు విచారిస్తూ ఇంటికి పరుగుపరుగున చేరుకున్నాడు. “నా మాట ప్రకారం బాలుడు తొందరపడి తల్లిని చంపకుండా ఉంటే బాగుండును. ఏమైనా వాడు '*చిరకారి కదా! తొందరపడి అటువంటి పని చెయ్యడులే!” అనుకుంటూ ఇల్లు చేరాడు.
తండ్రిని చూడగానే చిరకారి చేతనున్న కత్తిని జారవిడిచి విచారంతో ఆయన కాళ్ళమీద పడ్డాడు. భార్య కూడా అదే విధంగా పశ్చాత్తాపంతో ఆ ముని కాళ్ళమీద పడింది. ఆయన ఆ ఇద్దరినీ లేవనెత్తి ప్రేమతో, ఆదరంతో కౌగిలించి దీవించాడు. చిరకారిలాగా తల్లిదండ్రుల మీద భక్తిని కలిగి, ఏ పనినైనా తొందరపడక బాగా ఆలోచించి చేసేవాడు ఎల్లప్పుడూ సుఖాన్నే పొందుతాడు.
రచన : స్వామీ రంగనాధం