హిందూ వివాహాల్లో మనకు ఒక చిత్రమైన సంప్రదాయం కనిపిస్తుంది. వివాహం జరిపిస్తున్న పురోహితులు వధూవరులకు ఆకాశంలోని అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. ఇలా నూతన వధూవరులకు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించడానికి కారణం ఆ సాధ్వీలలామ అరుంధతి యొక్క గొప్పదనమే! పాతివ్రత్యం సౌశీల్యాల వల్లే అరుంధతి అంత ఉన్నత స్థాయికి ఎదిగి, తారగా ఇప్పటికీ నిలిచివుంది.
సప్తర్షులలో ఒకరైన వసిష్ఠ మహర్షి భార్య అరుంధతి. ఆ ఆదర్శ దంపతులు తమ జీవితాలను తపశ్చర్యలకు, సేవకు అంకితం చేశారు. వారికి ఏడుగురు కుమారులు జన్మించారు. వారు ఏడుగురూ గొప్ప మహర్షులయ్యారు. హిమాలయాల్లో ఒకప్పుడు వరుసగా పన్నెండేళ్ళ పాటు వర్షాలు కురవలేదు. ఏడుగురు మహర్షులూ అక్కడ తీవ్రమైన తవస్సులో మునిగి ఉన్నారు. అయితే, వారికి తినడానికి పండ్లు కాదు కదా, చివరకు కంద మూలాదులు కూడా లేవు దాంతో ఎలాగైనా సరే హిమాలయాల్లో వానలు కురిసేలా చేయాలని అరుంధతి సంకల్పించింది. అదే లక్ష్యంగా ఆమె ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టింది. అలా కొన్నేళ్ళ పాటు ఆమె తపస్సు కొనసాగింది. చివరకు ఆమె దృఢ సంకల్పానికి మెచ్చి పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె ఆ దేవదేవుణ్ణి వానలు కురిపించాల్సిందిగా ప్రార్థించింది. ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు అలాగేనని వరమిచ్చాడు. దాంతో విస్తారంగా వర్షాలు కురిసాయి. ఫలితంగా, మహర్షులే కాక, సమస్త ప్రాణికోటీ సంతోషించింది.
తరువాత పవిత్ర సరస్వతీ తీర్థం వద్ద వసిష్ఠ మహర్షి అరుంధతి దంపతులు తీవ్రంగా తపస్సు చేశారు. చివరకు గగనతలంలో ప్రవేశించి, నక్షత్రాలు అయ్యారు. ఆకాశంలో సప్తర్షి మండలంగా పేరుగాంచిన నక్షత్ర మండలంలో ఒక తారగా వసిష్టుణ్ణి చూడవచ్చు. వసిష్ఠ నక్షత్రాన్ని సదా వెన్నంటి ఉంటుంది అరుంధతీ నక్షత్రం. పతివ్రతా ధర్మానికి మారుపేరైన అరుంధతి అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ సమస్త స్క్రీ జాతికి ఆదర్శప్రాయురాలు