విభక్తులు
దశరథుడు అయోధ్య నగరాన్ని పాలించిన సూర్యవంశపు రాజు. ఆయనకు ఒక దిగులు పుట్టింది. అతనికి సంతానము లేదు. చివరకి ఆయన పుత్రకామేష్ఠి యాగం చేయగా, ఆ యాగ ఫలం చేత, రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు పుట్టారు. వారి యందు రాముడు పెద్దవాడు. సంతానం కొఱకు తపించిన దశరథుడు తన పిల్లలను చూసుకొని ఆనందించేవాడు. పుత్రుల వలన వంశం నిలుస్తుంది. పుత్రుని కలిగినవాడి కంటె అదృష్టవంతులు లేరు అని ఆ కాలంలో అనుకునేవారు.
పై వాక్యాలలో రంగు మారిన పదాలను గమనించండి. వాక్య నిర్మాణంలో వాటికెంతో ప్రాధాన్యత ఉంది. వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు. ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. ఈ విభక్తులు ఎనిమిది. అవి:
ప్రత్యయాలు | విభక్తి పేరు |
డు, ము, వు, లు | ప్రథమా విభక్తి |
నిన్, నున్, లన్, గూర్చి, గురించి | ద్వితీయా విభక్తి |
చేతన్, చేన్, తోడన్, తోన్ | తృతీయా విభక్తి |
కొఱకున్ (కొరకు), కై | చతుర్ధీ విభక్తి |
వలనన్, కంటెన్, పట్టి | పంచమీ విభక్తి |
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ | షష్ఠి విభక్తి |
అందున్, నన్ | సప్తమీ విభక్తి |
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ | సంబోధనా ప్రథమా విభక్తి |