సూర్యకిరణాలు ఎవరి మీద పడతాయి, ఎవరి మీద పడవు? పై ప్రశ్నకు ఇది సరైన సమాధానం. వీరని, వారని, ధనవంతులని, బీదలని, భారతీయులని, విదేశీయులని, మంచివారని, చెడ్డవారని, పిల్లలని, పెద్దలని, ఆడవారని, మగవారని ఇలాంటి భేదభావాలు వాస్తుకు లేవు. ఇది నిరూపించ బడిన ఒక శాస్త్రం. అందుకే విశ్వజననీయమైనది. ఎందరికో ప్రీతికరమైనది. ఎక్కువ జనులచే పాటింపబడుచున్నది. వేనవేల రెట్లుగా కీర్తింపబడుచున్నది. వాస్తుకు ఎవరిపై పనిచేయాలి, ఎవరిపై పని చేయకూడదు అనే జ్ఞానం లేదు. నీడ ఎలా అయితే మనిషిని అంటిపెట్టుకొని ఉంటుందో అలాగే వాస్తు కూడా నిర్మాణాలను అంటిపెట్టుకొని ఉంటుంది.
అయితే ఇక్కడ ఒక విషయం కాస్త ఆలోచించవలసి ఉంటుంది. అదియే సమయము. కొన్ని ప్రదేశాలలో త్వరగా ప్రభావం చూపిస్తుంది. కొన్ని ప్రాంతాలలో కాస్త ఆలస్యంగా ప్రభావం చూపిస్తుంది. ఇది పరిసర వాస్తుపై ఆధారపడి ఉంటుంది. పరిసరాల వాస్తు అంటే ఏమిటి? ఈ విషయం గురించి ముందు పేజీలలో తెలుసుకుందాం. వాస్తు అనేది మనిషి కాదు. మనస్సు అనేది అసలుకు లేదు. ఇది కంటికి కనిపించదు, గాలిలాగా. కంటికి కనిపించని గాలి లేదు అని అంటే, వాస్తు కూడా లేనట్లే. కనిపించ నంత మాత్రాన లేదు అనుకోవడం సరైన విధానం కాదు. వాస్తు ప్రభావం ప్రతి నిర్మాణం మీద అందులో నివశించువారి మీద తప్పకుండా ఉంటుంది. మనిషి రోగానికి వైద్యుడెలాగో స్థల రోగానికి వాస్తు అలాగ.