శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరూ ఒకేచోట కొలువుదీరి భక్త జనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవక్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలసిన కార్తికేయుడు నిజంగా భక్తులపాలిట కొంగుబంగారమే. దీపావళి అనంతరం వచ్చే నాగులచవితిన ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్త జనులు తరలి వచ్చి ఇక్కడి పుట్టకి విశేషపూజలు నిర్వహిస్తారు.
కృష్ణాజిల్లాలో దివి సీమకు చెందిన ఒక మండలం మోపీదేవి. ఇది మచిలీపట్టణం నుండి 30కిమీల దూరంలో వుంది. దీనికి మోహినీపురమని, సర్పక్షేత్రమని పేరు. కాని కాలక్రమేణా మోపీదేవిగా మారింది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి లింగ రూపంలో వుండటం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి సుమారు 5సంల చరిత్ర వుంది. ఈ క్షేత్ర ప్రస్తావన స్కందపురాణంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలసాడని పురాణాలు చెబుతున్నాయి.
రాహుకేతు సర్పదోషాలను నివారించే ఇలవేల్పుగా ఇక్కడ స్వామి పూజలందుకుంటున్నాడు. తూర్పుదిశగా వున్న ఆలయ గర్భగుడిలో 6,7సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మస్వామిగా పూజలందుకుంటున్నాడు.
ఆలయ పురాణం :
ఆలయపురాణానికొస్తే ఇంద్రాదిదేవతల ప్రార్ధనలు మన్నించిన అగస్త్యమహర్షి లోపాముద్రసహితుడై కాశీపట్టణాన్ని వీడి దక్షిణభారతదేశంలో పర్యటించాడు. మార్గమధ్యంలో శిష్యులతో కలిసి కృష్ణానదితీరంలోని మోహినీపురంలో సేదతీరుతుండగా పాతవైర్యాన్ని మరచి పాము,ముంగిస, నెమలి ఆడుకుంటూ కనిపించాయి. ఆ పక్కనే దివ్యతేజస్సును విరజిమ్ముతున్న ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది. దగ్గరకు వెళ్లిచూడగా కార్తికేయుడు సర్పరూపంలో తపస్సుచేసుకుంటూ కనిపించాడు. దివ్యదృష్టితో కార్తికేయుడి రూపాన్ని వీక్షించిన అగస్త్యుడు పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆరాధించాడు. అది తెలుసుకొన్న దేవతలు కూడా ఇక్కడికి చేరి స్వామిని పూజించారు. పుట్టలో వున్న కార్తికేయుడు వీరారపుపర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలోకనిపించి తాను పుట్టలో వున్నానని తనను బయటకు తీసి ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడట.
నాగులచవితిరోజున పుట్ట దగ్గరికి వెళ్లి ఆయనను పూజిస్తే సంతానంలేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడి వారి నమ్మకం. పుట్టమట్టిని ప్రసాదంగా ధరించటంవల్ల వ్యాధులు దరిచేరవని ప్రతీతి. సర్పం జ్ఞానానికి నిదర్శనం. అందుకే ఆ రూపంలో వున్న స్వామిని ధ్యానించినవారికి మంచి, విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయని పురాణాలు తెలియచేస్తున్నాయి.