శ్లోకము - 7
యస్త్విన్ద్రియాణి మనసా నియమ్యారభతేకార్జున |
కర్మేనియైః కర్మయోగమసక్తః స విశిష్యతే ||
యః - ఎవ్వడు; తు - కాని; ఇంద్రియాణి - ఇంద్రియాలను; మనసా - మనస్సుచే;
నియమ్య - నిగ్రహించి; ఆరభతే - ప్రారంభిస్తాడో; అర్జున – ఓ అర్జునా; కర్మేన్ద్రియైః -
కర్మేంద్రియాలచే; కర్మయోగం - భక్తిని; అసక్తః - అనాసక్తుడై; సః - అతడు; విశిష్యతే
- అత్యుత్తముడు.
ఇంకొకప్రక్క శ్రద్ధావంతుడైనవాడు మనస్సుచే కర్మేంద్రియాలను నిగ్రహించి సంగత్వము లేకుండ (కృష్ణ భక్తి భావనలో) కర్మయోగమును ప్రారంభిస్తే అత్యుత్తముడౌతాడు.
భాష్యము : విచ్చలవిడి జీవితం, ఇంద్రియభోగం కొరకు కపటయోగిగా అవడానికి బదులుగా స్వంతవృత్తిలో ఉండి జీవిత ప్రయోజనాన్ని నెరవేర్చడం చాలా ఉత్తమం. భవబంధ విముక్తిని పొంది భగవరాజ్యములో ప్రవేశించడమే జీవిత ఉద్దేశము. ప్రధాన స్వార్థగతి, అంటే స్వలాభ లక్ష్యం విష్ణువును చేరడమే. ఈ జీవిత లక్ష్యాన్ని పొందడంలో మనకు తోడ్పడడానికే సమస్తమైన వర్ణాశ్రమ విధానము తయారు చేయబడింది. గృహస్థుడు కూడ కృష్ణభక్తి భావనలో నియమిత సేవ ద్వారా ఈ గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. ఆత్మానుభూతికై మనిషి శాస్త్రాలలో నిర్దేశించినట్లుగా నియమిత జీవితాన్ని గడుపుతూ, సంగత్వము లేకుండ తన వృత్తిని కొనసాగిస్తూ ప్రగతిని సాధించగలుగుతాడు. ఈ పద్ధతిని అనుసరించే శ్రద్ధావంతుడు అమాయక జనులను మోసగించడానికి ప్రదర్శనమాత్రమైన ఆధ్యాత్మికతను చేపట్టే కపటి కన్నా ఉత్తమస్థితిలో ఉన్నవాడు. కేవలము జీవికను సంపాదించడానికి ధ్యానం చేసే కపటధ్యానపరుని కంటే శ్రద్ధగా వీధిలో ఊడ్చేవాడు అత్యుత్తముడు.
శ్లోకము - 8
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |
శరీరయాత్రాపి చ తే స ప్రసిద్ధ్యేదకర్మణః ||
నియతం - ఆజ్ఞాపించబడిన; కురు - చేయవలసింది; కర్మ - కర్మలు; త్వం - నీవు; కర్మ - కర్మ; జ్యాయః - ఉత్తమమైనది; హి - నిక్కముగా; అకర్మణః - కర్మ చేయకపోవడం కంటే; శరీర - దేహపరమైన; యాత్రా - పోషణ; అపి - అయినా; చ - కూడ; తే - నీకు; న ప్రసిద్ధ్యేత్ - జరుగదు; అకర్మణః - కర్మ లేకుండ.
నీకు చెప్పబడిన కర్మను చేయవలసింది, ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది. కర్మ లేకుండ మనిషి తన దేహాన్నైనా పోషించుకోలేడు.
భాష్యము : ఉన్నత వంశానికి చెందినవారమని తప్పుగా చెప్పుకునే కపట ధ్యానపరులు, ఆధ్యాత్మిక జీవన పురోగతికై సమస్తాన్నీ త్యాగం చేసామని మిథ్యగా ప్రదర్శించుకునే వ్యాపారధోరణి గలవారు చాలామంది ఉన్నారు. అర్జునుడు మిథ్యాచారి కావాలని శ్రీకృష్ణ భగవానుడు కోరుకోలేదు. పైగా క్షత్రియులకు చెప్పబడిన విధులను అతడు చేయాలని దేవదేవుడు కోరుకున్నాడు. అర్జునుడు గృహస్థుడు, సేనానాయకుడు. అందుకే అతడు అలాగే ఉండి గృహస్థుడైన క్షత్రియునికి చెప్పబడిన ధర్మాలను నిర్వహించడము మంచిది. అటువంటి కలాపాలు లౌకికుని హృదయాన్ని క్రమంగా శుద్ధిపరిచి, లౌకికకల్మషము నుండి అతనిని విడుదల చేస్తాయి. పోషణ నిమిత్తమై ఉండే నామమాత్ర సన్న్యాసము భగవంతునిచే గాని, ఏ శాస్త్రముచే గాని ఆమోదించబడలేదు. నిజానికి మనిషి ఏదో ఒక పని ద్వారా దేహపోషణ చేసికోవలసి ఉంటుంది. లౌకిక భావనల నుండి శుద్ధిపడకుండానే కర్మను ఏనాడూ చపలత్వంతో విడిచిపెట్టకూడదు. భౌతికజగత్తులో ఉన్న ఎవ్వడైనా ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించే కల్మష భావాన్ని, అంటే ఇంద్రియభోగవాంఛను తప్పక కలిగి ఉంటాడు. అటువంటి కలుషిత భావాలను తప్పక శుద్ధిపరచాలి. విధ్యుక్త కర్మల ద్వారా ఆ విధంగా చేయకుండానే మనిషి కర్మను విడిచిపెట్టి, ఇతరుల మీద ఆధారపడి జీవించే నామమాత్ర యోగిగా అవడానికి ఏనాడూ ప్రయత్నించకూడదు.
శ్లోకము - 9
యజ్ఞార్థాత్ కర్మణోఃన్యత్ర లోకోఃయం కర్మబన్దనః |
తదర్థం కర్మ కౌన్తేయ ముక్తసంగః సమాచర ||
యజ్ఞార్థాత్ - యజ్ఞుని లేదా విష్ణువు కొరకు మాత్రమే చేయబడే; కర్మణః - కర్మ కంటే: అన్యత్ర - అన్యమైనది; లోకః - లోకంలో; అయం - ఈ; కర్మబన్దనః - కర్మ ద్వారా బంధము; తత్ - ఆతని; అర్థం – కొరకే; కర్మ - పని; కౌన్తేయ - ఓ కుంతీపుత్రా: ముక్తసంగః - సంగత్వము నుండి విడివడి; సమాచర - చక్కగా చేయవలసింది.
విష్ణువు కొరకు యజ్ఞరూపంలో చేసే కర్మను చేయాలి. లేకపోతే ఈ భౌతికజగత్తులో కర్మ బంధకారకమౌతుంది. అందుకే ఓ కుంతీపుత్రా! ఆతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధవిముక్తుడవై ఉంటావు.
భాష్యము : సామాన్యమైన దేహపోషణకైనా మనిషి కర్మ చేయవలసి ఉంటుంది కనుక ఆ ఉద్దేశము నెరవేరే విధంగానే ప్రత్యేకమైన వర్ణానికి, గుణానికి విధ్యుక్తధర్మాలు తయారు చేయబడ్డాయి. యజ్ఞమంటే విష్ణుభగవానుడు లేదా యాగకర్మలు. సమస్త యజ్ఞాలు విష్ణుభగవానుని ప్రీతి కొరకే ఉద్దేశించబడినాయి. “యజ్ఞో వై విష్ణుః" అని వేదాలు ఆదేశిస్తున్నాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే మనిషి విధ్యుక్త యజ్ఞాలు చేసినా లేదా ప్రత్యక్షంగా విష్ణుభగవానుని సేవించినా ఒకే ఉద్దేశము నెరవేరుతుంది. కనుక కృష్ణభక్తి భావన అనేది ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా యజ్ఞమును నిర్వహించడమే అవుతుంది. వర్ణాశ్రమ పద్ధతి కూడా విష్ణుభగవానుని ప్రీతిని లక్ష్యించి ఉంటుంది. “వర్ణాశ్రమాచారవతా పురుషేణ వరః పుమాన్ / విష్ణురారాధ్యతే" (విష్ణుపురాణము 3.8.8).
కనుక మనిషి విష్ణుప్రీత్యర్థమే కర్మ చేయాలి. ఈ భౌతికజగత్తులో ఇతర ఏ కర్మయైనా బంధకారణమే అవుతుంది. ఎందుకంటే మంచి చెడు కర్మలు రెండు కూడ ఫలాలను కలిగియుండి ఏ కర్మఫలమైనా కర్తను బంధిస్తుంది. అందుకే మనిషి శ్రీకృష్ణుని (లేదా విష్ణువు) ప్రీత్యర్థము కృష్ణభక్తి భావనలో కర్మ చేయాలి. అటువంటి కర్మలు చేస్తున్నప్పుడు అతడు ముక్త స్థితిలో ఉంటాడు. ఇది కర్మ చేయడంలో గొప్ప నేర్పరితనము. ఆరంభములో ఈ పద్ధతికి గొప్ప ప్రవీణుని నిర్దేశము అవసరమౌతుంది. అందుకే కృష్ణ భక్తుని నిపుణత కలిగిన నిర్దేశంలో గాని, (ఎవరి క్రిందైతే అర్జునునికి కర్మ చేసే అవకాశం వచ్చిందో అటువంటి) శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశంలో గాని అతిశ్రద్ధగా పనిచేయాలి. దేనినీ ఇంద్రియ భోగం కొరకు చేయకుండా, ప్రతీదీ కృష్ణ ప్రీత్యర్థమే చేయాలి. ఈ అభ్యాసము మనిషిని కర్మఫలం నుండి రక్షించడం మాత్రమే గాక క్రమంగా అతనిని భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవాస్థాయికి చేరుస్తుంది. కేవలము అదే అతనిని భగవద్రాజ్యానికి ఉద్ధరిస్తుంది.
శ్లోకము - 10
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |
అనేన ప్రసవిష్యధ్వమేష వోఃస్త్విష్టకామధుక్ ||
సహ - పాటుగా; యజ్ఞః - యజ్ఞాలతో; ప్రజాః - ప్రజలను; సృష్ట్వా - సృష్టించి; పురా - పూర్వకాలంలో; ఉవాచ - పలికాడు; ప్రజాపతిః - జీవులకు ప్రభువైనవాడు; అనేన - దీనిచే; ప్రసవిష్యధ్వం - మరింతగా అభివృద్ధి చెందండి; ఏషః - ఇది; వః - మీకు; అస్తు - అగుగాక; ఇష్ట - కోరినవన్నింటిని; కామధుక్ - ఇచ్చేది.
సృష్ట్యారంభములో సర్వజీవులకు ప్రభువైనవాడు మానవులను, దేవతలను విష్ణుపరమైన యజ్ఞములతో సహా సృష్టించి “ఈ యజ్ఞముచే మీరు సుఖభాగులు కండి. ఎందుకంటే దీని ఆచరణ మీ సుఖమయ జీవనానికి, మోక్షప్రాప్తికి కావలసిన సమస్తమును ప్రసాదిస్తుంది" అని పలికి ఆశీర్వదించాడు.
భాష్యము : జీవుల ప్రభువు (విష్ణువు) ద్వారా జరిగిన భౌతికసృష్టి భగవద్ధామానికి చేరుకోవడానికి బద్ధజీవులకు ఇచ్చినట్టి ఒక అవకాశము వంటిది. దేవదేవుడైన విష్ణువు లేదా శ్రీకృష్ణునితో తమకు ఉన్నట్టి సంబంధాన్ని మరచిపోయిన కారణంగానే భౌతికసృష్టిలోని జీవులందరు ప్రకృతిచే బద్దులై ఉంటారు. ఈ నిత్యసంబంధాన్ని అర్థం చేసికోవడానికి వేదాలు మనకు తోడ్పడతాయి. అందుకే భగవద్గీతలో “వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః" అని చెప్పబడింది. తనను తెలిసికోవడమే వేదాల ప్రయోజనమని భగవంతుడు చెప్పాడు. “పతిం విశ్వస్యాత్మేశ్వరం" అని వేదమంత్రాలలో చెప్పబడింది. అందుకే జీవుల ప్రభువు విష్ణుభగవానుడే. శ్రీమద్భాగవతములో (2.4.20) కూడ శ్రీల శుకదేవగోస్వామి పతిగా భగవంతుని పలురీతులలో వర్ణించాడు :
శ్రియః పతి ర్యజ్ఞపతిః ప్రజాపతిర్దియాం పతిర్లోకవతిర్ధరాపతిః |
పతిర్గతి శ్చాన్డకవృష్టిసాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః ||
"ప్రజాపతి విష్ణుభగవానుడు. ఆతడే సకలజీవులకు, సకల లోకాలకు, సకలసౌందర్యాలకు ప్రభువు. ఆతడే ప్రతియొక్కరి రక్షకుడు. విష్ణు ప్రీత్యర్థము యజ్ఞాలు నిర్వహించే పద్ధతిని బద్ధజీవులు నేర్చుకునేటట్లు చేయడానికే భగవంతుడు ఈ భౌతికజగత్తును సృష్టించాడు. ఆ రకంగా భౌతికజగత్తులో ఉన్నప్పుడు వారు ఎటువంటి చింతలు లేకుండ సుఖంగా జీవించి, ప్రస్తుత దేహము ముగిసిన తరువాత భగవద్రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. ఇదే బద్ధజీవుని కొరకు ఏర్పాటు చేయబడిన పూర్తి కార్యక్రమం. యజ్ఞనిర్వహణ ద్వారా బద్ధజీవులు క్రమంగా కృష్ణ భక్తిభావనాయుతులై అన్ని విధాలుగా దైవీ స్వభావము కలవారౌతారు. కలియుగంలో సంకీర్తన యజ్ఞమే (భగవన్నామ సంకీర్తనము) వేదాలలో ఉపదేశించబడింది. ఈ యుగజనుల ఉద్గారానికి ఈ దివ్యపద్ధతి శ్రీచైతన్య మహాప్రభువుచే ప్రవేశపెట్టబడింది. సంకీర్తన యజ్ఞము, కృష్ణభక్తిభావన రెండింటికి చక్కని పొత్తు కుదురుతుంది. సంకీర్తన యజ్ఞానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రస్తావనతో పాటుగా (శ్రీచైతన్యులుగా) భక్తుని రూపంలో శ్రీకృష్ణ భగవానుని గురించి శ్రీమద్భాగవతములో (11.5.32) ఈ విధంగా చెప్పబడింది :
కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం |
యజ్ఞై సంకీర్తనప్రాయైర్యజన్తి హి సుమేధసః ||
ఈ కలియుగంలో చక్కని మేధస్సు కలిగిన జనులు పారదులతో కూడి ఉండే భగవంతుని సంకీర్తన యజ్ఞంతో అర్చిస్తారు. వేదాలలో చెప్పబడిన ఇతర యజ్ఞాలను ఈ కలియుగంలో నిర్వహించడం సులభం కాదు. కాని సంకీర్తన యజ్ఞం అన్ని ప్రయోజనాలకు సులభము, ఉదాత్తము అయి ఉంటుంది. ఇది భగవద్గీతలో (9.14) కూడ ఉపదేశించబడింది.