భాషాభాగములు
నామవాచకం: ఒక వ్యక్తిని గాని, వస్తువుని గాని, జాతినిగాని, గుణముమును గాని తెల్పు పదములను నామవాచకము అని అందురు.
ఉదా: రాముడు, గీత, శంకర్...
రాముడు మంచి బాలుడు.
పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం.
సర్వనామం: నామవాచకములకు బదులుగా వాడబడు పదములను సర్వనామములు అని అందురు.
ఉదా: అతడు, ఆమె, అది, ఇది...
రాముడు మంచి బాలుడు. అతడు పెద్దల మాట వింటాడు.
ముందు చెప్పిన విధంగా పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం. రెండవ వాక్యంలో అతడు అనే మాటకు రాముడు అనే అర్ధం. అయితే రాముడుకు బదులుగా అతడు అనే పదం వాడ బడింది. అతడు అనేది సర్వనామం.
విశేషణం: నామవాచకముల యొక్క, సర్వనామముల యొక్క విశేషములను తెలుపు వానిని విశేషణము లందురు.
ఉదా: తెల్ల గోడ, చిన్న ఇల్లు, మంచి బాలుడు...
క్రియ: పనులను తెలుపు పదములను క్రియలందురు.
ఉదా: తినటం, తిరగటం, నవ్వటం...
అవ్యయము: లింగ, వచన, విభక్తి శూన్యములైన పదములను అవ్యయము లందురు.
అనగా స్త్రీ లింగము, పుంలింగము, నపుంసకలింగము వలన గాని, ఏకవచన, బహువచనముల వలన గాని, విభక్తుల వలనగాని ఏమార్పులను పొందని పదములను అవ్యయములని గుర్తించవలెను.
అవ్యవములు 2 రకములు
1. లాక్షణికములు
2. ప్రతి పదోక్తములు
లాక్షణికావ్యయములు
వ్యాకరణ కార్యముల వలన సాధింపబడిన అవ్యయములు లాక్షణికావ్యయములు.
ఉదా: చూచి - తిని, చూడక - తినక, చూచిన - తినిన...
ప్రతి పదోక్తావ్యయములు
పుట్టుకతోనే లింగవచన విభక్తులు లేనివియును, వాడుకలో అంగాదులను విడిచి వేరొక అర్ధములో ఉపయోగపడుచున్న శబ్దములను ప్రతి పదోక్తవ్యయములు అందురు.
ఉదా: కాని, అయినన్, కాబట్టి, కనుకన్, బాగు బాగు, నీకె, అయ్యో! అక్కటా!