కలియుగ భూకైలాస్
ఎత్తైన గుట్టలు, రమణీయ ప్రదేశాలు, వాటి మధ్య నుంచి పవిత్ర కృష్ణా, ముచికుంద (మూసీ)నదులు హొయలు ఒలకబోస్తూ, పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ వాడపల్లి వద్ద సంగమిస్తున్న సుందర దృశ్యం తనివితీరనిది. విశిష్ఠ పౌరాణిక ప్రాశస్త్యాన్ని గుర్తించిన అగస్త్యుడు ఈ్ర పాంతంలో శివకేశవుల ఆలయాలనునిర్మించాడు. కృతయుగంలో మునులు చేసిన తపోబలంతో ఈ ప్రాంతం మరింత మహిమను సంతరించుకుంది. తీరంలోని నదులను ఆధారంగా చేసుకొని అనేక రాజవంశీయులు ఈ్ర పాంతాన్ని ముఖ్యకేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు. వారి పాలనలకు నిదర్శనంగా నిర్మించుకున్న కట్టడాలు, భక్తిశ్రద్ధలకు పురాతన ఆలయమైన వాడపల్లి పుణ్యక్షేత్రం ఒక నిదర్శనం.
తెలంగాణ-ఆంధ్రా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న దామరచర్ల మండలంలోని వాడపల్లి హైదరాబాద్ నుంచి 170కిలోమీటర్లు, నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి 80కిలోమీటర్ల దూరంలో ఉంది. నార్కట్పల్లి-అద్దంకి ప్రధాన రహదారి వెంట ఉన్న వాడపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకోవాలంటే వయా మిర్యాలగూడ నుంచి వాడపల్లికి ప్రత్యేక బస్సులు ఉంటాయి. హైదరాబాద్ నుంచి నల్లగొండ, మిర్యాలగూడల మీదుగా గుంటూరు వైపు వెళ్లే బస్సులు ఇదే రూట్లో వెళ్తుంటాయి. ఇక రైలు ద్వారా సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే మార్గంలో మిర్యాలగూడలో దిగి అక్కడి నుంచి బస్సులో వెళ్లవచ్చు.
స్థలపురాణం..
పూర్వం ఆరువేల సంవత్సరాల క్రితం కృతయుగంలో శ్రీఅగస్త్య మహాముని దక్షిణ మండలంలో శివకేశవులను ప్రతిష్ఠించాలనే సంకల్పంతో అన్నపూర్ణకావడిలో దేవతామూర్తులను తీసుకొని వెళ్తున్న క్రమంలో ఈప్రాంతానికి రాగానే సంధ్యాసమయం కావడంతో కావడిని కింద పెట్టేందుకు మనసు అంగీకరించలేదు. దీంతో మేకలు కాసే పిల్లవాణ్ని పిలిచి నేను కృష్ణా, మూసీ నదుల సంగమం వద్ద స్నానమాచరించి, సంధ్య వార్చుకొని వచ్చేంతవరకు ఈ కావడిని కింద పెట్టకుండా పట్టుకోవాలని చెప్పి వెళ్లిపోయాడు. మునీశ్వరుడు చెప్పిన ప్రకారమే కావడిని భుజాన పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్లే సమయం అవుతుండటంతో పిల్లవాడు మూడుసార్లు పిలిచినా మునీశ్వరుడు రాకపోవడంతో కావడిని కిందపెట్టి ఇంటికి వెళ్లిపోయాడు. సంధ్యావందనం పూర్తిచేసుకొని అగస్త్యుడు వచ్చి చూడగా అన్నపూర్ణ కావడి కింద కనిపించింది. అగస్త్యుడు కొంత కలతచెంది కావడిని ఎత్తుకొనేందుకు ఎంత ప్రయత్నించినా లేవలేదు. ఏమిటి ఈమాయ అనుకొని దివ్యదృష్టితో పరికించాడు. ఇది పవిత్రమైన ప్రదేశం, మమ్మల్ని ఇక్కడే ప్రతిష్టించాలని ఆకాశవాణి తెలిపింది. పవిత్ర కృష్ణా, మూసీ నదుల సంగమం వద్ద శివకేశవులను ప్రతిష్ఠించి వెళ్లాడు. నాటి నుంచి నేటి వరకు ఆ శివకేశవులే శ్రీమీనాక్షి, అగస్తీశ్యరస్వామి, శ్రీ లక్ష్మీనర్సింహస్వామిగా అలరారుతున్నారు.
నర్సింహుడి చెంత జ్యోతుల వింత
ప్రసిద్ధిగాంచిన నర్సింహస్వామి పుణ్యక్షేత్రాలలో ఒకటైన వాడపల్లి ఆలయాన్ని దక్షిణ ముఖంగా నిర్మించారు. అగస్త్యుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో శ్రీలక్ష్మీనర్సింస్వామి, లక్ష్మీ అమ్మవారిని తన కుడి తొడపై ఆసీనం చేసుకొని ఉంటాడు. ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయని, ఇలాంటి ఆలయాల్లో స్వామివారు కోరిన కోర్కెలను నెరవేర్చుతాడనీ భక్తుల నమ్మకం. ఆలయంలో ఏర్పాటు చేసిన రెండు జ్యోతులు వింతను గొల్పుతున్నాయి. స్వామివారి ఎదుట రెండు జ్యోతులు నిత్యం వెలుగుతూ ఉంటాయి. అందులో స్వామివారి ముఖభాగం ఎదురుగా ఉన్న జ్యోతి కదులుతూ, కింద ఉన్న దీపం కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. ఇందుకు స్వామి వారి ఉఛ్వాస, నిశ్వాసల ప్రక్రియలో పైదీపం కదులుతూ ఉంటుందని, ఇది స్వామి వారి మహిమగా భక్తులు భావిస్తారు.
అలరారిన ఆలయాలు
అగస్త్యుడు ప్రతిష్ఠించిన కొన్ని ఏండ్లకు కాలక్రమేణా శివకేశవుల విగ్రహాలు మట్టిలో కూరుకుపోయాయి. ఈ ప్రాంతాన్ని తొండవ, చోళులు, రెడ్డిరాజులు, శాతవాహనులు, కాకతీయుల వంటి అనేక మంది రాజులు పరిపాలించారు. రెండు నదులు ఉండటంతో రెండు రాజ్యాలకు ఇది హద్దుగా ఉండేది. ఈప్రాంతం శత్రుదుర్భేద్యంగా ఉండేది. రెడ్డి రాజుల కాలంలో అనవేమారెడ్డి, బీమారెడ్డి రాజుల పాలనలో రెండువైపులా నీరు, మధ్యలో తోవ ఉండటంతో ఇక్కడ కట్టడాలు, ఇండ్లు, కోటలు నిర్మిస్తే సురక్షితంగా ఉంటాయని భావించి నిర్మాణాలు చేస్తుండగా మట్టిలో కూరుకొనిపోయిన స్వామివార్లు బయటపడ్డారు. వెంటనే రెడ్డిరాజులు ఆలయాలను నిర్మించారు. నాటినుంచి వారి కాలంలో ఆలయాలు నిత్యకల్యాణం.. పచ్చతోరణాలుగా విలసిల్లాయి. నాటి కాకతీయులు, రెడ్డిరాజుల కాలం నుంచి నేటి వరకు వాడపల్లి పుణ్యక్షేత్రం కలియుగ భూకైలాస్గా విరాజిల్లుతున్నది.