నూటాఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో ఒకటి శ్రీవిల్లిపుత్తూర్. శ్రీగోదాదేవి అమ్మవారు జన్మించిన దివ్యప్రదేశం ఇది. ఈ క్షేత్రంలో అమ్మవారు వటపత్రశాయి కొలువై ఉన్నారు. ఈ ఆలయం మనోహర ప్రకృతి సోయగాల నడుమ కృతనీలానదీ తీరాన నెలకొని ఉంది. ఒకప్పుడు అడవిగా ఉండే ఈ ప్రాంతంలో విల్లి అనే కిరాతరాజు పాలించేవాడు.
అతని సోదరుడు పుత్తర్. ఒకనాడు విల్లి వేటకై వెళ్లి అలసి ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో విశ్రమించాడు. శ్రీమహా విష్ణువు కలలో అతనికి కనిపించి ఈ ప్రదేశంలో గల సంపంగి వృక్షం క్రింద ఉన్నానని వెలికి తీసి అర్చించమని ఆదేశించాడు. విల్లి తన సోదరునితో కలిసి సంపంగి వృక్షం కింద తవ్వగా వటపత్ర సాయి విగ్రహం కనిపించింది. సోదరులు ఇక్కడే ఆలయం, చిన్న ఊరు కూడా ఏర్పాటు చేశారు. అందుకే ఈ ప్రాంతానికి ఆ సోదరుల పేరుమీద విల్లి పుత్తూర్ అని పేరు వచ్చింది. శ్రీగోదాదేవి జన్మించిన ప్రాంతం కనుక శ్రీవిల్లి పుత్తూర్గా పేరు ఏర్పడింది.
అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని పాండ్య, చోళ, విజయనగర మధురనాయక రాజులు పునరుద్ధరణ పరిపోషణకై భక్తిశ్రద్ధలతో విరాళాలు సమర్పించారు. అమ్మవారి ఆలయ గోపురానికి తిరుప్పావై గోపురం అనిపేరు. అమ్మవారు రచించిన 30 పాశురాలలోని కథలు ఈ ఆలయ గోపురాలపై హృద్యంగా చిత్రించారు. అనేక పురాణ గాధల విశేష శిల్పాలతో సుందర విశాలమండపాలతో ఆద్యంతం భక్తుల్ని కట్టిపడేసే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. దేశంలోనే మొట్టమొదటి ఆండాళ్ అమ్మవారి ఆలయంగా ఈ ప్రదేశం ఖ్యాతిగాంచింది. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయానికై అనేక మాన్యాలు సమర్పించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శ్రీకృష్ణభగవానునికి ధరింపచేసే పూలమాలల్ని తాను ధరించటం వలన ఆముక్తమాల్యదగా శ్రీగోదాదేవికి పేరు వచ్చింది.
గో అంటే జ్ఞానం. ద అంటే ఇచ్చునది. గోదా అంటే జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి. శ్రీకృష్ణదేవరాయలు తిరుప్పావై పాశురాల్ని ఆముక్తమాల్యద అనే పేరుతో తెలుగులో గ్రంథస్తం చేశారు. శ్రీగోదాదేవి రంగనాథ ఆలయంలోని అద్దాల మండపంలో గోదాదేవి రంగమన్నార్ కొలువైఉన్నాడు. గర్భాలయంలో రంగమన్నార్ అమ్మవారిని దర్శిస్తారు. గర్భాలయం ముందు ప్రాంగణంలో ఆండాళ్ పూజామండపం, సేనై ముదల్వర్ (అమ్మవారికి కాపలాగా) ఆలయం ఉంది.
స్వామివారికి సమర్పించే పూలమాలల్ని తాను ధరించి తన ప్రతిబింబాన్ని ఆలయ సమీపంలోని నూతిలో చూసుకునేది. ఆ నూతిని చూడవచ్చు. ఆలయ సమీపంలో తులసివనంలో విష్ణుచిత్తులకు అమ్మవారు దొరికిన ప్రదేశం ఉంది. ఇక్కడ తులసికోట , చిన్న గోదాదేవి మూర్తిని మనం చూడవచ్చు. తమిళనాడు లోని విరుధునగర్ జిల్లాలో మదురైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. మదురై వరకు రైలులో వెళ్లి, ఆలయానికి బస్సులు వెళ్లవచ్చు. 12 అంతస్తులతో, 192 అడుగుల ఎత్తు కలిగి గంభీరంగా ఉండే ఆలయగోపురం మనకు కనువిందు చేస్తుంది. తమిళమార్గళి (డిసెంబర్ – జనవరి) మాసంలో ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి.
జూలై -ఆగస్టు మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. జూలై – ఆగస్ట్ మాసంలో శ్రీఆండాళ్ జయంతి రోజున రథోత్సవాన్ని నిర్వహిస్తారు. మార్గళి మాసంలో ఇక్కడ విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించింది మొదలు తిరిగి మకరరాశిలో ప్రవేశించే వరకు నెలరోజులను ధనుర్మాసం లేదా మార్గళి మాసం అని అంటారు.
ఈ పవిత్ర మాసంలో ఉషఃకాలంలో లేచి స్నాన సంధ్యాదుల అనంతరం పెరుమాళ్ ఆరాధన, ఆరగింపు, మంగళాశాసనం చేసిన తరువాత ప్రతినిత్యం ఒకటి చొప్పున నెలరోజులు తిరుప్పావై పాశురాలను విన్నవించి హారతినిచ్చి నమస్కరించి తీర్ధప్రసాదాలు తీసుకోవటం పరంపరగా కొనసాగుతున్నది. తిరుప్పావైలో తిరు అనగా పవిత్రమైన లేదా శ్రేష్టమైన వ్రతం అని అర్ధం. తిరుప్పావైలో ప్రతి పాశురం చివర 'ఎంబావా§్ు అనే మకుటం ఉంటుంది. కనుక దీనికి తిరుప్పావై అని పేరు వచ్చింది. పెళ్లికావలసిన కన్యలు ఈ మాసం వ్రత విధానం ప్రకారం వ్రతం ఆచరించి శ్రీరంగనాథుని ఆరాధిస్తే శీఘ్రంగా వివాహాలు జరుగుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వారులు పరమ వైష్ణవ భక్త శిఖామణులు. ఆళ్వారులు 12 మంది. వీరిలో ఏకైక స్త్రీ మూర్తి గోదాదేవి. ఆళ్వారులు అంటే భక్తి ప్రవాహంలో మునిగినవారని అర్ధం.
భగవంతుని దివ్య సౌందర్యాన్ని ఆస్వాదించి తరించిన వీరు వర్ణాశ్రమ ధర్మాలకు అతీతంగా భగవత్జ్ఞానాన్ని సర్వమానవాళికి అందించారు. విశిష్టాద్వైత విశ్వాసాన్ని బహుళవ్యాప్తి చేసిన ఆళ్వారులు పరమాత్ముని దూతలని ప్రసిద్ధి.
ఆళ్వారుల్లో ఒకరైన ఆండాళ్ పెరియాళ్వారుకు తులసివనంలో దొరికిన అయోనిజ. తల్లిదండ్రులు పెట్టిన పేరు కోదా. తెలుగులో ఈ శబ్దం గోదాదేవిగా మారింది. పూలమాలల్ని మొదట తాను ధరించి భగవంతునికి నివేదించటం చేత శూడికొడుత్తనాచ్చియార్ (ఆముక్తమాల్యద) అనే పేరు వచ్చింది. నాలుగువేల పాశురాలు కలిగిన నాలాయిర దివ్య ప్రబంధం ద్రావిడవేదంగా పేరుగాంచింది. గోదాదేవి శ్రీకృష్ణుని స్తుతించిన పాశురాలకు నాలాయిరంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇవి 30 పాశురాలు. వీటికి తిరుప్పావై అని పేరు. ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ దేవాలయంలో ఉదయాత్పూర్వం భక్తులు ఈ తిరుప్పావైని గానం చేస్తారు.
ఈ పాశురాలు మధురమంజులశైలిలో ఉండటం వలన భక్తుల హృదయాన్ని పరవశింపచేస్తాయి. శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి చేసే వ్రతాన్ని ఆచరించటానికి గోపికల్ని నిదురలేపుతూ స్వామిని ప్రస్తుతించడం దీని ప్రధానాంశం. తిరుప్పావై అంటే ఉత్తమ వ్రతం అని శ్రీవ్రతం అని అర్ధం. వ్రతాచరణం వలన భక్తునికి భగవంతునితో నిత్యసాన్నిధ్యం ఏర్పడుతుంది. శ్రీరంగనాధుని భర్తగా వలచిన ఆండాళ్ రోజుకో పాశురాన్ని రచించి దాన్ని కృష్ణునికి సమర్పించి తరించింది. భగవంతుని ప్రేమించేవారు కొందరైతే భగవంతునిచే ప్రేమింపబడే భక్తులు కొందరుంటారు.
వారే ఆళ్వారులు. తులసి మొక్కకు ఆమూలాగ్రం పరిమళం వ్యాపించినట్లు ఆ ప్రేమతోనే ఆమె ఆయననే వివాహం చేసుకోవాలనుకుంది. అలా స్వామిని పొందగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని గోదాదేవి తండ్రిని అడుగగా వ్రేపల్లెలోని గోపికలు ఉన్నారని తండ్రి విష్ణుచిత్తుడు కుమార్తె గోదాదేవికి తెలిపాడు. తాను అలానే పొందాలని అనుకుంది. తాను విష్ణుచిత్తుల వారి పుత్రికనని మరచి గోపికా భావంతో పూర్తిగా వ్రేపల్లెలోని ఒక గోపికగా మారిపోయింది. తాముండే శ్రీవిల్లి పుత్తూరునే వ్రేపల్లెగా భావించింది. తాము నిత్యం సేవించే వటపత్రశాయి పెరుమాళ్ కోవెలని నందగోప భవనంగా భావించింది. ఆనాడు గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఏ విధంగా చేశారో అలా వారిని అనుసరిస్తూ నెలరోజులు రోజుకొక పాశురాన్ని పాడి 30 పాశురాలు, పాశురమాలికలను స్వామికి సమర్పించింది. ధనుర్మాసం (మార్గళి)లో ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించింది.
ఆండాళ్ అంటే భగవంతుని వశం చేసుకున్న స్త్రీ అని అర్ధం. ఆనాటి నుండి ప్రతి ధనుర్మాసంలో శ్రీరంగంలోనే కాక వైష్ణవాలయాలన్నింటిలో తిరుప్పావై పఠనం అనుచానంగా వస్తోంది. ఆండాళ్ పాడిన తిరుప్పావై సర్వవేదాల సారమని, ఆండాళ్ సాక్షాత్తూ లక్ష్మీదేవియని ఆమె చెప్పిన పాశురాలతో మనమంతా గోపికలమని భావించి పురుషోత్త ముడైన శ్రీకృష్ణుని కీర్తిస్తే సర్వశుభాలు కలుగు తాయని ప్రచారం చేసి నందు వలన శ్రీభగవద్రా మానుజులకు 'తిరుప్పావై జీయర్ అనే పేరు వచ్చింది. ధనుర్మాసంలో తిరుమల శ్రీవేంకటేశ్వ రుని శ్రీకృష్ణునిగా ఆయన వక్షస్థలంలోని శ్రీమహాలక్ష్మి అమ్మవారిని గోదాదేవిగా భావించి నెలంతా రోజుకొక్క పాశురంగా తిరుప్పావై వినిపిస్తారు.
సేవతో పాటు ధనుర్మాసంలోనే గోదానీరట్టోత్సవాన్ని సంక్రాంతి పండుగ మరునాడు కనుమరోజు శ్రీగోదా కళ్యాణాన్ని ఏర్పాటు చేసింది శ్రీరామానుజులే. ప్రతి సంవత్సరం శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవంలో గరుడోత్సవం నాటికి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవికి ధరింపచేసిన పూలమాలలను తెచ్చి తిరుమల స్వామివారికి ధరింపచేయటం సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. తిరుమలలో స్వామివారికి వైఖానస ఆగమం ప్రకారం పూజలు జరుగుతాయి.
ధనుర్మాసంలో శ్రీస్వామివారి వక్షస్థలంలోని లక్ష్మీదేవిని ఆండాళ్గా భావించి అలంకరిస్తారు. ఎర్రని రాళ్లు పొదిగిన బంగారు చిలుక బొమ్మను వక్షస్థలంలోని అమ్మవారికి అమరుస్తారు. అనంతరం స్వామికి తోమాలసేవ, అర్చన ఆరగింపు తరువాత ఆనాటి పాశురాన్ని రెండుసార్లు వినిపిస్తారు. అన్ని పూజా నివేదనలను శ్రీకృష్ణస్వామి విగ్రహానికి అర్పిస్తారు. ఈ నెలంతా కృష్ణస్వామి విగ్రహానికి వేడినీటితో అభిషేకం చేసి అలంకరించి ఏకాంత సేవ చేస్తారు. బెల్లపుదోసె, పొంగళి, చక్కెర పొంగళి మొదలైన ప్రసాదాలను నివేదిస్తారు. కన్యలు ధనుర్మాసంలో వ్రతవిధానం ద్వారా రోజుకొక్క పాశురాన్ని చదువ్ఞతూ వ్రతాన్ని ఆచరిస్తే వివాహం శీఘ్రంగా జరుగుతుంది.
' – మల్లాది రామలక్ష్మి