బొమ్మల కొలువు, గొబ్బెమ్మలు, భోగిపండ్లు:
సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి. ఇంటిలో ఒక ప్రక్కగా ఇసుక పోసి పార్కులాగా తయారు చేయాలి. రాగులు, మెంతులు, లేక ఆవాలు ఏవైనా ఒక ఆకారముగా ఇసుకలో చల్లాలి. అవి మొక్కలు వస్తాయి. 10 రోజుల ముందుగానే ఇలా చేయాలి. వాటికి మధ్య మధ్యలో చిన్న పెద్ద బొమ్మలతో అలంకరించాలి. మనసుకు నచ్చిన ఆలోచనలతో చేసుకొనవచ్చును. కృష్ణుణ్ని కూడా పెట్టి, ఆ కృష్ణునికీ భోగిపండ్లు పోయాలి. మెట్లు ఆకారములో చేసి ఒక గుడ్డపరచి వాని మీద కూడ బొమ్మలు పేర్చి అలంకరింపవచ్చును.
గొబ్బెమ్మలు:
ఆవుపేడతో 5 ముద్దలు చేసి ఒక పీట మీద 4 వైపులా మధ్యలో పెట్టవలెను. వీనికన్న చిన్నవి 5 ముద్దలు చేసి పెద్ద వాని పైన పెట్టవలెను. అన్ని 11 గొబ్బెమ్మలు అవుతాయి. వాటి మీద బియ్యంపిండితోను, పసుపు, కుంకుమతో గీతలు గీసి పూలతో అలంకరించాలి. ఆ పీటను మెల్లాలో మధ్యగా పెట్టి పిల్లలను 4 వైపులా కూర్చొన పెట్టాలి. లక్ష్మి అష్టోత్తరముతో పూజచేయించాలి. కొబ్బరికాయ కొట్టి, పండ్లు, నైవేద్యము పెట్టాలి. తరువాత పిల్లలు పీట చుట్టూ భజన చేయుచూ, కోలాటము చేయుచూ, తిరుగుతారు. కృష్ణుని మీద పాటలు, గొబ్బెమ్మల పాటలు పాడతారు.
పసుపు, కుంకుమ, అక్షింతలు, అగరుబత్తీలు, పండ్లు, టెంకాయ, కర్పూరము, గంట, హారతి, అరివేణి, ఉద్ధరిణ, పంచపాత్ర, కూర్చొనుటకు టవల్సు అన్ని రెడీ చేసుకోవాలి.భోగిపండ్లు:
పిల్లలను కుర్చీలో కూర్చో పెట్టి హారతి పట్టవలెను. ముందుగా కృష్ణునికి హారతి అద్ది తరువాత పిల్లలకు అద్దవలెను. కృష్ణునికి భోగిపండ్లు పోసి, తరువాత పిల్లలకు 3 సార్లు కొద్దికొద్దిగా పోయవలెను. అందరు పోయవచ్చును.
భోగిపండ్లు - రేగిపండ్లు, నానిన శనగలు, బంతిపూల రేకులు, చిల్లర నాణేలు అన్ని కలుపుకొనవలెను.
సంక్రాంతి పండుగ రోజున పోసిన పండుగ పండ్లు అందురు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి