కోటప్ప కొండ చరిత్ర
కాకులు దూరని కారడవి అనే పదం మీరు వినే ఉంటారు. కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు. అవును.. ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి. కానీ గుంటూరు జిల్లా నరసరావు పేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు. కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా మనకు కనిపించదు. ఇప్పటి వరకూ ఈ కొండపై కాకులు వాలిన దాఖలాలు లేవు. అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి.
కోటప్ప కొండ చరిత్ర:
దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞాన బోధ చేయమని కోరుతాడు. అందుకు పరమశివుడు బదులిస్తూ త్రికుటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్లి అక్కడ జ్ఞానం పొందుతాడు. ఆ ప్రదేశమే పాత కోటప్ప కొండగా పిలవబడుతుంది.
కోటప్ప కొండను ఎటువైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా, ఇక్కడ కొలువైన స్వామి వారిని త్రికుటాచలేశ్వరునిగా, త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు. త్రికుటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావూరులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందిరితో కలిసి జీవించేవాడు. ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికుటేశ్వరున్ని దర్శించి సేవిస్తాడు. ఆ తరువాత సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు గొల్లభామ అని పేరు పెడతారు. ఆమె జన్మించిన తరువాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది.
అయితే గొల్లభామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది. ఆమె రోజూ రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్ధనలు చేసేది. ఆమె భక్తిని పరీక్షించ దలచిన శివుడు కన్య అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. ఆమె గర్భంతో ఉన్నా పరమేశ్వరున్ని కొలిచేందుకు పాత కోటప్ప కొండకు రావడం మానేది కాదు. ఎప్పటిలానే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్ల కుండలో పెరుగును తీసుకుని వస్తూ ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది. ఈలోగా ఓ కాకి ఆ కుండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది.
తీవ్ర విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు. అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలడం లేదని పురాణ కధనం. ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులు వాలకపోవడాన్ని గమనించవచ్చు.
గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ ఓ రోజు పరమేశ్వరున్ని ఓ కోరిక కోరుతుంది. తాను కొండ ఎక్కలేకపోతున్నాని, నీవే కిందికి రావాలని కోరడంతో పరమ శివుడు సరే అంటాడు. కానీ నీవు వెళ్లే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు. కొంత దూరం వెళ్లిన తరువాత భీకరమైన శబ్ధాలు వినిపించడంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూడడంతో శివుడు అక్కడే జంగందేవరకొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు.
ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుని లీలా మహత్యం తెలుసుకున్న గొల్లభామ కూడా దేవునిలో ఐక్యమవుతుంది. గొల్లభామ ఆలయం కొండ కింది భాగంలో చూడవచ్చు.
కోటప్ప కొండ విశేషాలు:
Kottappa Konda Temple |
మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. పరమ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే. ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు. గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి. అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్ప కొండ వెళ్లి త్రికుటేశ్వరున్ని సేవించాలని అంటారు. ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా, ప్రకృతి అందాలు టూరిస్టులకు ఎంతో రమణీయంగా అనిపిస్తాయి.
ఎలా చేరుకోవాలి:
కోటప్ప కొండ గుంటూరుకు 60 కిలోమీటర్ల దూరంలో, నరసరావు పేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి కారు, బస్సు మార్గాల ద్వారా పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు. దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు గుంటూరు రైల్వే స్టేషన్ లో దిగి రోడ్డు మార్గం ద్వారా కోటప్ప కొండకు వెళ్లవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ప్రదేశాల్లో కోటప్ప కొండ ఒకటిగా నిలుస్తుంది.