మృత్యువు - మృత్యుంజయ హోమం
“మృత్యుంజయ హోమం ఏమి చెయ్యాల్సిన పనిలేదు. మృత్యువు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. ఇక నువ్వు వెళ్ళవచ్చు” మహాస్వామివారు నోటి నుండి వచ్చిన మాటలు. అవును ఖచ్చితంగా ఇంకో వందేళ్ళు బ్రతుకుతాడు అతను.
పరమాచార్య స్వామివారు నేరూర్ సదాశివ బ్రహ్మేంద్రుల అధిష్టానం దర్శనానికి వెళ్ళారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారంటే మహాస్వామి వారికి చాలా భక్తి, గౌరవం. కేవలం వారి పేరు వింటేనే చాలు స్వామివారు పొంగిపోయేవారు. వారి కళ్ళు ఆర్ద్రతతో నిండిపోయేవి.
మహాస్వామివారు అధిష్టానం ముందు కూర్చుని ధ్యానం చేస్తున్నారు. అక్కడ ఉన్నవారు, స్వామివారి సేవకులు మహాస్వామి వారికి కొద్ది దూరంలో నిలబడ్డారు. శ్రీమఠం సాంప్రదాయం ప్రకారం, స్వామివారు అధిష్టానం ముందు జపం చేసుకుంటుండగా ఎవరూ చూడరాదు. అది మహాస్వామి వారు మనవాతీతమైన విశ్వంలోని శక్తిని సర్వ మానవాళి క్షేమం కొరకు ధ్యానించే సమయం. అది కూడా మనలాంటి వారి మంచి కోసమే ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వంద వ్యాట్ల శక్తిని చూసే మన నేత్రాలు లక్ష వ్యాట్ల శక్తిని చూసి తట్టుకోగలవా?
అప్పుడే పరమాచార్య స్వామివారి భక్తుడు రంగస్వామి అక్కడకు వచ్చారు. “నేను వెంటనే పరమాచార్య స్వామివారిని దర్శించుకొని, ప్రసాదం తీసుకోవాలి” అని అక్కడున్న సేవకులతో చెప్పారు. వారు వెంటనే, “స్వామీ, మహాస్వామి వారు అధిష్టానం లోపల కూర్చొని తలుపులు మూసి ఉండగా ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరూ స్వామివారిని దర్శించకూడదు. స్వామివారి ధ్యానం ముగిసిన తరువాత మొదట మిరే దర్శనం చేసుకుందురు గాని. ఇప్పుడు కాదు” అని నిలువరించారు.
రంగస్వామి మామూలుగా ఇలా చెప్తే వినేరకం కాదు. చాలా మొండి వాడు. కాని వారి సమాధాంనంతో కాస్త మెత్తపడినట్టే కనిపించాడు. ఇంతలో సేవకులందరూ మాటల్లో పడ్డారు. ఇదే అదనుగా భావించి, రంగస్వామి క్షణాల్లో అధిష్టానం లోపలికి వెళ్ళాడు. అక్కడున్న వారందరూ అతని చర్యకు కలవరపడ్డారు.
సరిగ్గా అప్పుడే అధిష్టానం నుండి ఎప్పుడూ వినని మహాస్వామివారి స్వరం వినబడింది. “మృత్యుంజయ జప హోమం ఏమి చెయ్యాల్సిన పనిలేదు. మృత్యువు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. ఇక నువ్వు వెళ్ళవచ్చు” అని.
రంగస్వామి వెంటనే అధిష్టానం బయటకు వచ్చేసాడు. శిష్యులందరూ అతణ్ణి చుట్టుముట్టారు. జరిగిన విషయం అంతా చెప్పాడు. “రంగస్వామి దగ్గరి బంధువులొకరికి ఎక్కువగా ఛాతినొప్పి రావడంతో నలభై ఎనిమిది గంటలు గడిచే దాకా ఏమి చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. వెంటనే మృత్యుంజయ హోమం చెయ్యాల్సిందిగా జ్యోతిష్కులు చెప్పారు.
రంగస్వామి మిత్రులొకరు వెంటనే పరమాచార్య స్వామీ వారిని దర్శించి ప్రసాదం తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. మరొక ముసలావిడ స్వామివారు నేరూర్ దగ్గర ఉన్నారని, తాము దర్శనం చేసుకుని వచ్చామని, స్వామివారు అన్నీ చూసుకుంటారని చెప్పడంతో, పరుగుపరుగున మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు రంగస్వామి”
అతని అదృష్టానికి స్వామివారే అతనితో స్వయంగా మాట్లాడి ఆశీర్వదించి పంపారు. రంగస్వామి ఇంటికి చేరగానే అతని బంధువు మంచంపై కూర్చొని చక్కగా నవ్వుతున్నాడు.
“అవును. అతను ఖచ్చితంగా ఇంకొక వందేళ్ళు బ్రతుకుతాడు”
--- రాయవరం శ్రీ బాలు, శ్రీమఠం. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్