సౌమ్య, రౌద్ర రూపాల సమన్వయాకారమే " కాళీ "
జగన్మాత సకలశాస్త్ర స్వరూపిణి. ప్రాశాబద్ధుడై స్వార్థంతో సత్యాన్ని విస్మరించిన మనిషిలోని మనః, చిత్త, బుద్ధులను ప్రక్షాళన చేసి, తాను ఉన్నానని గుర్తు చేసి మోక్షమార్గాన్ని అందజేస్తోంది.
వేదాలు, ఉపనిషత్తులలో జగన్మాత శక్తిని అద్భుతంగా వర్ణించారు. దేవ్యుపనిషత్తు శక్తి ఉపనిషత్తులలో ముఖమైంది. త్రిపురతాపిన్యుపనిషత్తు కూడా ముఖ్యమైందే. ఇందులో శక్తి ఉపాసనా విధులు. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రనిర్మాణం. అందులోని రహస్యాలు, ఇంకా ఎన్నో విధి విధానాలు వివరించారు. అద్భుతమైన శక్తి రూపాలలో ముఖ్యమైనది కాళీ, దుర్గ, పార్వతి, లలితా, సరస్వతి. ఇవి నిత్య పూజలందుకునే శక్తిరూపాలు. వాటిలో వైష్ణవశక్తి అయిన మహామాయే మహాకాళి. సర్వభూతాలకు లయకారకుడైన మహాకాలుని లయమోనర్చే శక్తి కాళి. కాలాన్ని లయింపజేసేది కాళి. సృష్టికి పూర్వమున్న అంధకారరూపమే కాళీస్వరూపం. దుర్గాదేవి మరో అవతారమే కాళీమాతగా అభివర్ణించారు.
ఋగ్వేదంలో కాళి ఆవిర్భావం వివరించారు. మార్కండేయ పురాణంలో దేవీ మహత్మ్యంలోనూ పరాశక్తి గురించి పేర్కొన్నారు. దేవమాత అదితికి ఆదిత్యులు జన్మించారు. అందుకే సూర్యోదయ, అస్తమయాలు రెండూ అదితికి అన్వయింపబడ్డాయి. కానీ, అదితి ఉదయత్వాన్ని తాను ఉంచుకొని, అస్తమయాన్ని దితికి అన్వయించింది. ఈ ఇద్దరూ చీకటివెలుగులు, సృష్టిలయలు, జనన మరణాలు, జ్ఞానాజ్ఞానాలకు అధి దేవతలు. ఈ ఇద్దరితత్వాలు ఏకమై కాళీమాత అనే సంయుక్త రూపం ఏర్పడిందని ప్రశస్తి.కాళీ స్వరూపం బాహ్యానికి భయంకరం. సదాశివుని ఆసనంగా చేసుకుని, ఆయన గుండెల మీద ఒక కాలును ఉంచి దిగంబరంగా నిలబడి ఉంటుంది.
నల్లని రంగు, మెడలో 54 కపాలలతో కూర్చిన దండ, ఒక చేతిలో రక్తసిక్తమైన శిరస్సు, రెండో చేతిలో కత్తి. మరో కుడిచేయి అభయముద్రలో ఉండి, ఎడమ చేయి అభయ ప్రదానం చేస్తున్నట్టు ఉంటుంది. నుదుట మూడో కన్ను ప్రజ్వలిస్తుంటే, నాలుక రక్తసిక్తమై వేలాడుతుంటుంది. ఆమె దిగంబరి. కానీ, దిక్కులనే వస్త్రాలుగా ధరించిన దేవత. తెల్లనిఛాయా శివుడు శుద్ధచిద్రూపుడై శవాకృతిగా ఉండగా, క్రియారూపిణి అయిన కాళికాశక్తి ఆయనపై ఆధారపడి ఉంది. సౌమ్య, రౌద్ర రూపాల సమన్వయాకారమే కాళీస్వరూపం. తాత్విక దృష్టితో కాళీ స్వరూపాన్ని పరిశీలిస్తే ఆమె తత్వమయి. సృష్టికి అవసరమైన ఇచ్ఛాశక్తి. అమ్మ ధరించిన కపాలాలు 54 సంస్కృత అక్షరాల సంపుటి. ఆ కపాలాలు ఆయా అక్షరాలను ఉచ్ఛరిస్తే, ఆ శబ్దాలు ఏకస్వరమై అ, ఉ, మ స్వరూపమై ‘ఓం’కారమైంది. చండముండులను వధించి చాముండేశ్వరిగా ప్రసిద్ధి చెందింది.