పూర్ణాదివారముల నోము కథ !
ఒకానొక రాజకూతురు గర్భముతో దుఃఖించుచుండెను. ఆమెకు ఏడుగురు పిల్లలు పుట్టిరి. వారందరూ పుట్టిన వెంటనే చనిపోయిరి. ఆ దుఃఖమును భరించలేక ఆమె ఘోరారణ్య మధ్యమునకేగి పార్వతీ పరమేశ్వరులను ప్రార్ధించుచుండెను. అంత నొకనాడు పార్వతీపరమేశ్వరులు ఆమెకు ప్రత్యక్షమై “ కుమారీ నీ వెందుల కిట్లు దుఃఖించుచున్నావు?” అని అడిగిరి. అందుకామె “ స్వామీ! పుట్టి చచ్చిపోతున్న బిడ్డలతో పడలేక ఏడ్చుచున్నాను,” అని బదులు చెప్పెను. ఆ సంగతివిని వారు జాలిబడి “ అమ్మాయీ ! నీవు క్రిందటి జన్మలో పూర్ణాదివారముల నోము నోచి దానిని ఉల్లంఘన చేసితివి. అందుచే నీకీ జన్మలో ఇట్టి దుఃఖము సంప్రాప్తమయ్యెను. ఇప్పటికైనా నీ వానోము సక్రమముగా నోచి, కథ చెప్పుకొని అక్షతలు శిరస్సుపై వేసుకొనినయడల నీకీ దుఃఖము కలుగదు” అని వెడలిపోయిరి. వారి మాట ప్రకారము రాజకుమార్తె యింటికి వెళ్ళి పూర్ణాదివారముల నోమునోచి యధావిధిగా దానిని నిర్వర్తించెను. అప్పటినుండి ఆమెకు గర్భశోకము లేకుండెను.దీనికి ఉద్యాపనము: ప్రతీ ఆదివారమూ పై కథ చెప్పుకొని అక్షతలు శిరస్సుపై వేసుకొని, ఒంటిపూట భోజనము చేయవలెను. మరియు నొక ముత్తయిదువునకు అభ్యంగన స్నానము చేయించి ఐదు మానికల బియ్యమును, పూర్ణపు ఉండ్రములను, దక్షిణ తాంబూలములతో వాయనమీయవలెను. కథలో లోపము వచ్చిననూ వ్రతములో లోపము రాకూడదు.
|| శ్రీ మాత్రే నమః ||