శివుడుగొప్పా ? అమ్మవారు గొప్పా ?
ఈ స్త్రోత్రం “శివః శక్త్యా” అనే పదాలతో , ఎంతో మంగళకరమైన ’శివ’ శబ్దముతో ప్రారంభమయ్యింది. శ్లోకమేమో “శక్తితో లేనినాడు, శివుడు స్పందించనూలేడు” అంటోంది. కానీ శ్లోకం ’శక్తి’ శబ్దంతో కాక ’శివ’ శబ్దంతో మొదలయ్యింది. మనం సాధారణంగా ’సతి-పతి’, ’శ్రీమతి-శ్రీ’ అంటూ ఉంటాము. ముందు భార్య, తరువాత భర్త. ఈ స్తోత్రం అంతా శక్తి వైభవం గురించినది. శక్తి లేకపోతే శివునికి గొప్పదనమే లేదంటుంది. కాలకూట విషం మింగినా జీవించేఉన్నాడంటే అమ్మవారి తాటంకముల (కర్ణాభరణములు) మహిమే అంటుంది. శక్తి వైభవాన్ని ఎంతో వర్ణించిన స్తోత్రం మాత్రం శివుని పేరుతో మొదలయ్యింది, తరువాతే దేవి పేరు (శక్తి).
ఎందుకలాగ ? ఆచార్యులు ప్రపంచానికి ధర్మశాస్త్ర నియమాలను గుర్తుచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఈ ప్రాపంచిక భార్యాభర్తలకంటే ఈశ్వరుడూ, అమ్మవారూ చాలావిధాలుగా విభిన్నం. ఆడువారిని అబల అనటం కద్దు. మగవాడు ఆమెకు రక్షణ. బల అన్నా శక్తి అన్న ఒకే అర్థం. ఈ దేవతా జంట -శివ శక్తులను – చూసినట్లయితే , భార్య పేరే శక్తి. ఆమె లేక శివుడేమీ చేయలేడు. తమిళంలో ఎవరికైనా “ఓ మూల మాట్లాడకుండా కూర్చో” అని చెప్పాలంటే “శివనేన కిడ” అంటాం. పురాణ ప్రవచకులు ఈ విషయమై హాస్యమాడటం గుర్తువస్తుంది. ఎవరైన పనికోసం ఉత్సాహంగా బయలుదేరితే “శక్తి” తో బయలుదేరుతున్నాడని అంటాం. “శక్తి లేక శివుడిలా ఏంచెయ్యకుండా కూర్చున్నాను” అంటాం. ఈ భాష మనకు సహజంగా అబ్బినది.
ఈ ప్రపంచంలో జీవనవిధానం చూపే ధర్మశాస్త్రాలు, భార్య భర్తపై ఆధారపడిఉన్నదని తెలిపాయి. మనం దేవతా జంట – ఈశ్వరుడు అమ్మవారు – చూసినట్లయితే అది ధర్మశాస్త్రాలకు వ్యతిరేకం. ఈశ్వరుడు నిర్గుణ నిశ్చల పరబ్రహ్మమయితే అమ్మవారు గొప్ప శక్తి (మాయాశక్తి అనీ పిలువబడుతుంది), ఈ జగత్తును నడుపుతోంది.
శివుడు శక్తిరహితంగానూ, అమ్మవారు శక్తివంతంగానూ ఉండటం, కేవలం భావన మాత్రమే కాదు. కవితా సంప్రదాయంలోకూడా ప్రేమ, శృంగార అభినయములలో నాయికకు నాయకుడికన్నా ఉన్నతస్థానం ఇవ్వబడుతుంది. ఇరువురి మధ్య స్పర్థల తరువాత శాంతి నెలకొన్నప్పుడు కూడా నాయకుడే నాయిక పాదాలచెంత వ్రాలతాడు. ఇదీ కవులు నాయికానాయకుల సంబంధం చూసే విధానం.
జగద్గురువులుగా ఆచార్యులు, ధర్మశాస్త్రములో చెప్పబడిన ప్రవర్తనానియమావళి ప్రపంచానికి బోధించటం తమ తొలి కర్తవ్యంగా భావించారు. తరువాత మనుష్యుల పరిణతిని బట్టి (వివిధ దేవతలకు తమ స్తోత్రాలద్వారా) భక్తిని, తరువాత తత్వ, జ్ఞాన బోధ (తరువాతి కర్తవ్యాలని భావించారు). అయినాసరే ఈ స్త్రోత్ర రచన సమయంలో, అమ్మవారి స్పూర్థితో, శాక్త సంప్రదాయాన్నీ, మన కవితా సంప్రదాయాన్నీ దృష్టిలో ఉంచుకున్నారు. కాబట్టి మనం ఆచార్యులు అమ్మవారికి తమ భర్త పరమశివుని కన్నా ఉన్నతస్థానమునివ్వటం చూస్తాము. వారు కవితా సంప్రదాయములో నాయికకు నాయకుడికన్నా ఉన్నతస్థానం ఇచ్చినట్లే ఇక్కడా ఇచ్చారు. కానీ ఆచార్యులు ఈ విధంగా అనుకుని ఉంటారు – ” అన్ని ధర్మశాస్త్రాలూ భార్య భర్తను అనుగమించాలని ఘోషిస్తున్నాయి. రాతితో వివాహమైనా రాతిని భర్తగా గౌరవించాలి. ఈ స్తోత్రంలో అమ్మవారు అందుకు భిన్నంగా, శివునికన్నా ఉన్నతంగా చూపబడింది. ఒక ధర్మస్థానంలో కూర్చుని ఉన్నవాడిగా (ఆచార్యస్థానంలో ఉంటూ), ఆడువారందరూ అమ్మవారినే ఉదాహరణగా తీసుకుంటే ఏమవుతుందో ఆలోచించాలి. ” ఈ ఆలోచనతో (అమ్మవారికి ఉన్నతస్థానము ఇచ్చినందుకు బదులుగా) ఆచార్యులు ఈ స్త్రోత్రప్రారంభములోనే “శక్తి” కి ముందే “శివు”ని ఉంచారు. శ్లోకంలో వెంటనే “శివుని గొప్పదనము శక్తితో కలిసినప్పుడే” అని చెప్పినా, శ్లోకాన్ని “శివ” శబ్దముతో ప్రారంభముచేస్తూ ఆడువారికి “అమ్మవారి గొప్పదనము శివుని పేరుకు ఉన్నతినివ్వటంలోనూ, అమ్మవారు శివుని అనుగమించుటలోనూ ఉన్నదని” ఉపదేశిస్తున్నారు.
స్తోత్రంలోని తరువాతి శ్లోకాలు చాలా స్పష్టంగా అమ్మవారు పతివ్రతలలో శ్రేష్ఠమైనదనీ, అమ్మవారి ప్రవర్తన ధర్మశాస్త్రాలకు పూర్తిగాలోబడి ఉన్నదనీ తెలుపుతున్నాయి. 29వ శ్లోకంలో అమ్మవారు సింహాసనారూఢయై రాజవైభోగంతో రాజరాజేశ్వరిగా ఉన్నట్లు వర్ణన ఉన్నది. దేవతలందరూ ఆ మహారాజ్ఞికి సాష్టాంగం చేస్తున్నారు. కానీ సభలో ఈశ్వరుడు ప్రవేశించగానే అమ్మవారు ఉత్సాహభరితయై పతియందు గౌరవాభిమానములతో ఎదురేగి స్వాగతం పలుకుతుంది. సాష్టాంగం చేస్తున్న దేవతల కిరీటాల వలన కాలు తూలగలదని పరిచారికలు హెచ్చరిస్తుంటారు. అలాగే మరో (64వ) శ్లోకంలో నిరంతరమూ అలుపులేకుండా అమ్మవారు తన పతి యొక్క గుణగణాల వర్ణన చేయుట చేత అమ్మవారి నాలుక ఎరుపెక్కి మందారపుష్ప వర్ణములోకి మారిందని ఆచార్యులు అంటారు. పరమేశ్వరుని లీలావిశేషాలను రాగయుక్తంగా సరస్వతీదేవి తన వీణపై పలికిస్తుంది (66వ శ్లోకం). అమ్మవారు ఆ వీణా వాదన తో సంతోషతరంగితయై మళ్ళీ మళ్ళీ వింటుంది. మరో శ్లోకంలో (82వ శ్లోకం) తన పతికి మరల మరల సాష్టాంగ ప్రణామములు చేయుటచేత అమ్మవారి మోకాళ్ళు బిగదీసుకుపోయాయి అని ఆచార్యులు అంటారు. చివరిశ్లోకాలలో ఒకదానిలో (96వ శ్లోకం) ఆచార్యులు “సతీనాం అచరమే” అంటూ అమ్మవారిని పతివ్రతలలో మొట్టమొదటది అంటూ శ్లాఘిస్తారు.
శాస్త్ర సంప్రదాయాలకు విరుద్ధమైన ఒక ఆదర్శమును జనులముందు ఉంచరాదని ఆచార్యుల నిశ్చిత అభిప్రాయము. అందుచేతనే తాము అమ్మవారి స్తోత్రంచేస్తూ , ఆస్తోత్రాన్ని అమ్మవారి పతి నామముతో ప్రారంభించారు. తల్లితండ్రులు. వేదాలలో మెదట “మాతృదేవోభవ” తరువాతే “పితృదేవోభవ” ఉన్నది. అయినా సరే, ఆచార్యులు (ఈస్తోత్రంలో) తరచుగా అమ్మవారికి శివునికంటే ఉన్నతస్థానం ఇవ్వటంచేత, అందుకు పరిహారార్థమా అన్నట్లు, ఈ స్తోత్ర ప్రారంభంలోనే శక్తి నామముకంటే ముందు శివుని నామముంచారు. శివుని గొప్పదనం శక్తీసమేతుడైనప్పుడే అని ఈ తొలిశ్లోకం యొక్క సారాంశం. కానీ శ్లోకంలోని పదప్రయోగంచేత అమ్మవారి గొప్పదనంకూడా శివసమేతురాలై ఉండుటపై ఆధారపడి ఉన్నదని చెప్పవచ్చు. కాబట్టి మొదట శివుడు, తరువాత శక్తి.
ఆదిదంపతులు ఒండొరులను స్తుతించుకుంటారు. ఆమె ఆయననూ, ఆయన ఆమెనూ స్తుతిస్తారు. నిజానికి వీరిలో ఒకరు ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు. ఇద్దరూ సరి సమానులే. “అన్యోన్య సదృశం” – వైభవంలో ఈశ్వరుడూ, అమ్మవారూ సమానులు.
మనం “సమయం” అనే పదాన్ని ’మత’ మనే వ్యవహారంలో వాడుతాం. ఉదాహరణకు ’హిందూ సమయం’, ’శ్రమణ సమయం’ మొదలైనవి. ఈ పదం సామాన్య వ్యవహారంలో ఉన్నదంటే, అది “శివ-శక్తులు సమానమ”ను సిద్ధాంతముతో సంబంధమున్నది అయిఉండాలి. శాక్త, శైవ సంప్రదాయాలు రెంటిలోనూ ఒక పూజావిధానానికి “సమయాచారము” అను పేరు ఉన్నది. అది బాహ్యపూజ ఏమీ లేకుండా ఉన్నత స్థాయిలో మానసికంగా రమించడం. దేవత హృదయగతుడైనట్లు భావిస్తూ ధ్యానం చేయటం. దానికి “సమయం” అనే పేరెందుకు ? ఇందులో, ఈశ్వరుడూ అమ్మవారూ ఐదు విధములుగా సమానమని భావన చేస్తూ ధ్యానిస్తారు.
ఈ విధమైన పూజకు “పంచ సమయం” అనిపేరు.
- మొదట శివశక్తులిరువురూ తమ తమ నామములలో సమానులు. ఆయన శివుడైతే ఆమె శివా. ఆయన హంస అయితే ఆమె హంసి. ఆయన భైరవుడైతే ఆమె భైరవి. ఆయనకు సమయ అనే పేరే ఉంటే ఆమె సమయి.
- రెండు – వారిరువురూ రూపములో సమానులు. కామేశ్వరీ కామేశ్వరులుగా ఇరువురూ ఎరుపురంగులో ఉంటారు. ఇరువురికీ నాలుగు చేతులూ, మూడు కళ్ళూ, జుట్టులో చంద్రవంకానూ. ఇద్దరికీ చేతులలోని ఆయుధాలు ఒక్కటే – ధనుస్సు, బాణము, పాశము, అంకుశమూనూ.
- మూడు – వారిరువురూ ఒకే ప్రదేశంలో ఉంటారు – మేరు శిఖరంపైన, మణిద్వీప మధ్యంలో, అమృత సముద్రంలో, శ్రీచక్ర బిందువులో.
- నాలుగు – ఇద్దరూ పంచకృత్యమనే ఒకే పని చేస్తారు.
- ఐదు – జగత్తు వీరినుండి అందుకునే ఆశీస్సులూ సమానమే.
శివశక్తులిరువురూ సమానమనే భావన మన మనస్సులలో ప్రగాఢంగా నాటుకుపోవాలి. జగత్తులో అన్ని జీవాలనూ ఒక్కటిగా చూడమంటున్నప్పుడు కొందరు దేవతలు మరికొందరు దేవతలకంటే ఎక్కువ , తక్కువ అని మాట్లాడవచ్చునా ? ముఖ్యంగా భార్యాభర్తలై మన తల్లితండ్రులైనవారి పట్ల భేదభావం చూపటం దోషమే అవుతుంది. కాబట్టి వీరిరువురూ నిజానికి ఒక్కరే అన్న విషయం మనం ఎల్లప్పుడూ గుర్తెరిగి ఉండాలి. ఎప్పుడైనా ఒకరిని రెండవ వారికంటే ఎక్కువ చేయవలసిన సందర్భం, కారణం రావచ్చు. బిడ్డడు తల్లి దగ్గరకు ప్రాకుతూ వెళ్ళి ముద్దుమాటలు చెప్పేటప్పుడు, బిడ్డడికి తల్లి అందరికన్నా గొప్పది. మరో సందర్భంలో అదే బిడ్డడు తండ్రినీ అలాగే భావించవచ్చు. అలాంటి సందర్భాలలో – తల్లిగానీ తండ్రికానీ – బిడ్డడి పూర్తి ధ్యాస ఒకరిమీదే ఉంటుంది. బిడ్డడు ఒకరు రెండవవారికంటే ఎక్కువ అనుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. అలాంటి తదేకధ్యాసతోనే ప్రేమ హృదయంపెల్లుబికి వస్తుంది. అలాంటి సందర్భాలలో బిడ్డడి ప్రవర్తనను తల్లితండ్రులు తప్పుగా అర్థం చేసుకోరు. ఒక సందర్భంలో బిడ్డడు తండ్రి కంటే తల్లినే ఎక్కువ ఇష్టపడితే, తండ్రికి తల్లికన్నా “తక్కువ” గా కనిపించటానికి అభ్యంతరం ఉండదు. అలాగే తల్లికి కూడానూ.
కవితాదృష్టితో చూసినట్లయితే ఆదిదంపతులు తమ “బిడ్డడు అయిన కవి” కి తల్లిపై ప్రేమ తండ్రి పై ప్రేమ కంటే ఎక్కువగా (లేదా తండ్రి పై ప్రేమ తల్లిపై ప్రేమ కంటే ఎక్కువగా) ఉండేలా తమ లీలను సాగిస్తారు. తత్వాన్వేషణ చేస్తున్న బిడ్డడి ఆలోచన ప్రకారం జగన్మాత పితరులులో తల్లి, తండ్రికన్నా ఉన్నతంగా ఉండవచ్చు. లేదా తండ్రి, తల్లికన్నా ఉన్నతంగా ఉండవచ్చు.
సౌందర్యలహరి, ఎంత శాక్త సాంప్రదాయగ్రంథమో, అంతే భక్తి ప్రధానమైన గ్రంథము. మొత్తంమీద ఇది అమ్మవారి వైభవవర్ణన. భార్యాభర్తల సంబంధములలో (ఈ గ్రంథము) ధర్మశాస్త్ర సంప్రదాయములకు విరుద్ధంగా ఉండరాదనే ఆతృతతో మన జగదాచార్యులు (ఆది శంకరులు) కొన్నిచోట్ల (గ్రంథములో) ఈశ్వరునికి అమ్మవారికంటే ఉన్నతస్థానమునిచ్చి సరిదిద్దారు. అందుకే ఈ స్తోత్ర ప్రారంభములో ముందుగా శివనామము నుంచి, తరువాత శక్తినుంచారు.