వివాహ వేడుకలో ఏడడుగులు నడిపిస్తారు ఎందువల్ల… ?
ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ వివాహ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకూ ప్రత్యేకమైన అర్థం పరమార్థం ఉన్నాయి. కన్యాదానం పూర్తయిన తర్వాత వివాహ ముహూర్తానికి జీలకర్ర-బెల్లం తలపై పెట్టించి, ఆ తర్వాత మాంగల్యధారణ చేయిస్తారు వేదపండితులు. ఈ క్రతువు పూర్తయిన తర్వాత వధూవరులకు కొంగుముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికెన వేలును వరుడు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్ని ‘సప్తపది’ అంటారు. దీనికి విశేష నిర్వచనం ఉంది. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి, పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. అందుకే పెద్దలు వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అంటారు. ఇందులో వేసే ప్రతీ అడుగుకీ ఒక్కో అర్థం ఉంది.
మొదటి అడుగు :
‘‘ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు’’
విష్ణువు మనిద్దరినీ ఒక్కటి చేయుగాక!
రెండో అడుగు :
‘‘ద్వే వూర్జే విష్ణుః త్వా అన్వేతు’’
మనిద్దరికీ శక్తి లభించేలా చేయుగాక!
మూడో అడుగు :
‘‘త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు’’
వివాహ వ్రతసిద్ధికోసం విష్ణువు అనుగ్రహించుగాక!
నాలుగో అడుగు :
‘‘చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు’’
మనకు ఆనందమును విష్ణువు కల్గించుగాక!
అయిదో అడుగు :
‘‘పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు’’
మనకు పశుసంపదను విష్ణువు కల్గించుగాక!
ఆరో అడుగు :
‘‘షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు’’
ఆరు రుతువులు మనకు సుఖమిచ్చుగాక!
ఏడో అడుగు :
‘‘ సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు’’
గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక!
‘‘ఓ అర్ధాంగీ ఏడడుగులతో నువ్వు నా ప్రాణసఖివి అయ్యావు. నువ్వు నా స్నేహమును విడవద్దు. ప్రేమగా ఉందాం. మంచి మనసుతో జీవిద్దాం.మనం ఇద్దరం సమానమైన ఆలోచనలతో మెలగుదాం’ అంటాడు వరుడు.
అప్పుడు పెళ్లికూతురు ఇలా అంటుంది..
‘‘ఓ ప్రాణమిత్రుడా! నువ్వెప్పుడూ పొరపాటు లేకుండా ఉండు. నేనూ ఏ పొరపాటు లేకుండా నీతో ఉంటాను. నువ్వు ఆకాశమైతే నేను భూమి. నువ్వు శుక్రమైతే నేను శోణితాన్ని. నువ్వు మనసైతే నేను మాటను. నేను సామవేదమైతే నువ్వు నన్ను అనుసరించే రుత్వికుడివి. మనిద్దరిలో వ్యత్యాసం లేదు. కష్ట సుఖాలలో ఒకరికొకరం తోడూ నీడగా కలిసి ఉందాం’’ అన్నాక వరుడు ఇలా బదులిస్తాడు.
ఓ గుణవతీ! మన వంశాభివృద్ధి కోసం, మనకు ఉత్తమస్థితి కలగటం కోసం, మంచి బలము, ధైర్యము, ప్రజ్ఞావంతులైన వంశ హితాన్ని రక్షించగల, న్యాయమార్గం అనుసరించే ఉత్తమ సంతానం ప్రసాదించు’’.