మనం చేసే సమస్త కర్మలను బుద్ధిని ఉపయోగించి మంచివో చెడ్డవో తెలుసుకొని చేయాలి. తరువాత వాటి ఫలములను అవి మంచి ఫలితములైనా చెడ్డ ఫలితములైనా పరమాత్మకు అర్పించాలి. మనకంటూ ఏమీ ఉంచుకోకూడదు. తరువాత పరమాత్మను నిరంతరం ఏకాగ మైన మనస్సుతో స్మరించాలి. ధ్యానించాలి. పూజించాలి. అర్చించాలి. ఏ పని చేస్తున్నా మనసులో పరమాత్మ ను స్మరించుకుంటూ ఉండాలి. దానికి ఒక కాలము, స్థలము అంటూ లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా మనసులో రామనామ స్మరణ, ఓం నమశ్శివాయ, ఓం నమోభగవతే వాసుదేవాయ, ఓం నమో వేంకటేశాయ అలా మీ ఇష్టం వచ్చిన నామం స్మరించికుంటూ ఉండాలి. ఏదీ పలకలేని వాళ్లు ఓం కారం అనుకున్నా చాలు. ఇదంతా వినడానికి చాలా సులభంగా ఉన్నా ఆచరణలో పెట్టడానికి మన మనసుఒప్పదు. అభ్యాసం చేస్తే ఇది సాధ్యమే.
ఈ విధానాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాము. చేతసా అంటే చిత్తము నిర్మలంగా ఉండాలి. చేయబోయే పని మంచిదా చెడ్డదా అని ఆలోచించాలి. చక్కని నిర్ణయం తీసుకోవాలి. దానికి బుద్ధియోగం కావాలి. అంటే ఆత్మను గురించి తెలుసుకోవడం. నేను ఆత్మస్వరూపుడను. నేను ఈ శరీరం కాదు. ఈ పనులు నేను చేయడం లేదు అనే విషయం తెలుసుకోవాలి. అప్పుడు చేసే పనుల మీద అమితమైన ఆసక్తి ఉండదు. ఆ కర్మల ఫలముల మీదా ఆసక్తి ఉండదు. సన్వస్య అంటే నాకే అర్పించాలి. కర్మఫలములను పరమాత్మకు అర్పించాలి. అప్పుడు మనకంటూ ఏమీ ఉండదు. వాటి గురించి చింత ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మనం లౌకికమైన ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు, చేసుకుంటూ ఎల్లప్పుడూ పరమాత్మను స్మరించుకోవడం సాధ్యమా! ఉదాహరణకు ఇంటి పనులు చేసుకునే తల్లి, బిడ్డను ఉయ్యాలలో పడుకోబెడుతుంది. ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. బిడ్డ అటు ఇటు కదిలినా ఏమాత్రం అలికిడి అయినా వెంటనే ఉయ్యాల దగ్గరకు వెళు తుంది. అంటే తల్లి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉన్నా, తన మనసు మాత్రం బిడ్డ మీదనే లగ్నం చేస్తుంది. అలాగే మనం కూడా ఈ ప్రాపంచిక విషయాలలో తిరుగుతున్నా, పరమాత్మను మాత్రం నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి. ఈ పని చేయడానికి మనకు అంటూ ఒక లక్ష్యం ఉండాలి. మతర అంటే నీ లక్ష్యం పరమాత్మలో ఐక్యం కావడమే. అదే మానవుని అంతిమ లక్ష్యము అయి ఉండాలి. అప్పుడే ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి కలుగుతుంది. మోక్షప్రాప్తి కలుగుతుంది.