గంగావతరణం
సగరుడు ఆందోళన చెందాడు. యజ్ఞాశ్వం కోసం వెళ్ళిన కుమారులు తిరిగి రాలేదు. అశ్వాన్ని తీసుకురాలేదు. ఏమై ఉంటారు? అంతా ఎక్కడ ఉన్నారు?… మనమడు అంశుమంతుణ్ణి పిలిచాడు. పినతండ్రులసహా అశ్వాన్ని వెతికే తీసుకు వచ్చే బాధ్యతను అప్పగించాడు. ‘సజ్జనులను గౌరవించాలి దుర్జనులను హతమార్చాలి.
యాగాశ్వాన్ని సాధించుకు రావాలి’ అన్నాడు. సరేనని, తాత మాట మేరకు బయల్దేరాడు అంశుమంతుడు. పినతండ్రుల మార్గాన ప్రయాణిస్తూ పాతాళానికి ప్రవేశించాడు. దిగ్గజాల ఆశీస్సులందుకున్నాడు. కపిలాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ తమ గుర్రాన్ని చూసి, అది దొరికినందుకు ఆనందించాడు అంశుమంతుడు. అంతలోనే బూడిద రాశులుగా పడి ఉన్న పినతండ్రులను చూసి బాధపడ్డాడు. ఏడ్చాడు. వారికి తర్పణాలు వదిలేందుకు ప్రయత్నించాడు. జలాలకోసం వెదకసాగాడు. కనిపించలేదు. కనిపించని జలాల కోసం కన్నీరు పెట్టుకుంటున్న అంశుమంతుణ్ణి చూసి జాలి చెందిన గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడు.
“నాయనా! నీ పినతండ్రులు తమ మూర్ఖత్వం కారణంగానే బూడిద రాశులయ్యారు. ఇలాంటి శాపగ్రస్తులకు నీరస జలాలతో తర్పణాలు విడచిపెట్టడం యుక్తం కాదు. వారికి ఉత్తమలోకాలు సిద్ధించాలంటే ఆకాశగంగను సాధించాలి. ఆ గంగ ఈ బూడిదరాశులపై ప్రవహిస్తేనే వారికి ఉత్తమలోకాలు సిద్ధిస్తాయి” అన్నాడు గరుత్మంతుడు. ఆకాశ గంగను సాధించే ఆలోచనలో పడ్డాడు అంశుమంతుడు. అది గ్రహించాడు గరుత్మంతుడు.
“ఆకాశగంగను గురించి తర్వాత ఆలోచించు. ముందు ఓ పని చెయ్యి. కపిలమహర్షి ఆశీస్సులతో అశ్వాన్ని తీసుకుని వెళ్ళి, తాతగారి యజ్ఞాన్ని పూర్తి చెయ్యి” అన్నాడు గరుత్మంతుడు. అంశుమంతుడు అశ్వాన్ని తీసుకుని వచ్చి, తాతగారి యజ్ఞం ముందు పూర్తి చేశాడు. తర్వాత పినతండ్రుల గురించి వివరించాడు. బూడిదరాశులయిన బిడ్డలను తలచుకుంటూ, వారి సద్గతుల గురించి ఆలోచిస్తూ ఆకాశగంగను భూమికి తేలేని తన నిస్సహాయతకు చింతిస్తూ సగరుడు ముప్పయి వేల ఏళ్ళు రాజ్యం చేశాడు. ఆ చింతతోనే సగరుడు మరణించాడు. తర్వాత ప్రజాభీష్టం మేరకు అంశుమంతుడు రాజయ్యాడు. కానీ పినతండ్రుల సద్గతికోసం హిమాలయాలకు చేరుకోవాలని తన కొడుకు దిలీపుడిని రాజుని చేసి, హిమాలయాల్లో రెండు వేల ఏళ్ళు తపస్సు చేశాడు. అయినా గంగను సాధించలేక చనిపోయాడు.
తర్వాత దిలీపుడు కూడా పితృదేవతలకు సద్గతులు కల్పించేందుకు చాలా కష్టపడ్డాడు. యజ్ఞయాగాలు ఎన్నో చేశాడు. ముప్పయి వేల ఏళ్ళు కష్టపడ్డాడు. అయినా ఫలితం లేక పోయింది. అతను కూడా మరణించాడు.
దిలీపుడి తర్వాత అతడి కుమారుడు భగీరథుడు పట్టాభిషిక్తుడయ్యాడు. అయిన వెంటనే పితృదేవతలకు సద్గతులను కల్పించేందుకు నడుము బిగించాడు. అతడికి సంతానం లేని కారణంగా రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి, సంతానం కోసం, గంగ కోసం తీవ్ర తపస్సు చేయసాగాడు భగీరథుడు. గోకర్ణక్షేత్రంలో, పంచాగ్ని మధ్యంలో చేతులు పైకెత్తి, ఎండనక, వాననక బ్రహ్మను గూర్చి వెయ్యేళ్ళు కఠోర తపస్సు చేశాడు. అతడి తపస్సు ఫలించింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు.
“భగీరథా! నీ తపస్సుకు మెచ్చాను. నీ రెండు కోర్కెలూ ఫలిస్తాయి. అయితే దేవ లోకం నుండి భూమికి ఉరుకుతూ వచ్చే గంగను భరించగలిగే శక్తి ఆ పరమేశ్వరుడు ఒక్కడికే వుంది. ఆయన అంగీకారం కోసం తపస్సు చెయ్యి” అన్నాడు బ్రహ్మ. వెంటనంటి ఉన్న గంగను చూశాడు.‘కిందికి వెళ్ళు’ అని ఆజ్ఞాపించాడామెను. సరేనన్నదామె. భగీరథుడు బొటన వేళ్ళ మీద నిలబడి, చేతులు పైకెత్తి, వాయువును ఆహారంగా తీసుకుంటూ పరమేశ్వరుడి గురించి ఒక సంవత్సరం తపస్సు చేశాడు. భక్తవ శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. “భగీరథా! నీ కోరిక నెరవేరుస్తాను. దేవగంగను నా శిరస్సున ధరిస్తాను” అని అభయమిచ్చి…
పైన ఉన్న గంగను ‘దిగు’ అన్నట్టుగా చూశాడు. శరవేగంతో భూమికి దిగేందుకు ఉపక్రమించింది గంగ. ‘తన ప్రవాహవేగాన్ని పరమేశ్వరుడు తట్టుకోలేడనీ, తనతో పాటుగా పాతాళంలోనికి లాక్కుపోగలను’ అనుకున్న గంగ, గర్వంగా శివుడి జటాఝూటంలోకి దూకింది.
గంగ పొగరుబోతు తనాన్ని గ్రహించి నవ్వుకున్నాడు శివుడు. జటలు విప్పి, చుక్క కూడా కింద పడకుండా గంగను బంధించాడు. అక్కడికక్కడే సుడులు తిరుగుతూ కిందికి రాలేక ప్రవహించలేక వెర్రెత్తిపోయింది గంగ. అది భగీరథుడు గుర్తించి బాధగా శివుణ్ణి చూశాడు. చేతులు జోడించి నమస్కరించాడు. “స్వామీ ! దయచేసి, గంగను విడిచిపెట్టు” అని ప్రార్థించాడు.
కరుణించాడు శంకరుడు. జటలను వదులు చేసి బిందుసరోవరం ప్రాంతంలో గంగను వదిలాడు. గంగ అక్కడి నుంచి ఏడు పాయలుగా చీలింది. మూడుపాయలు తూర్పు ముఖంగా, మరి మూడు పాయలు పడమర ముఖంగా ప్రవహిస్తూ నడుమపాయ భగీరథుణ్ణి అనుసరించింది.
గంగ పరవళ్ళు తొక్కుతూ, తెల్లగా నురగలు కక్కుతూ, సుడులు తిరుగుతూ ప్రవహించసాగింది. తరలి వస్తున్న గంగను ఆరాధనగా చూస్తూ, పితృదేవతలకు సద్గతులు సాధించినట్టే అను కున్నాడు భగీరథుడు. దేవతలు గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు, ఋషులు...అందరూ గంగను కీర్తించారు.
యజ్ఞం చేయాలనే సంకల్పంతో మహర్షి జహ్నుడు సంభారాలు సమకూర్చుకుని వేదికను ఏర్పాటు చేశాడు. గంగ పరవళ్లు తొక్కుతూ వాటి మీదుగా ప్రవహించింది. అన్ని కొట్టుకుపోసాగాయి. జహ్నుడు అది చూసి ఆగ్రహోదగ్రు డయ్యాడు. గంగను దోసిటపట్టి తాగేశాడు. నీటిబొట్టు అన్నదే లేకుండా చేశాడు.
గంగ వెనుకగా తరలి వస్తున్న దేవతలు, సిద్ధులు, ఋషులు చూశారు. చేతులెత్తి నమస్కరించి, జహ్నువును ప్రార్థించారు. భగీరథుని కృషీ, లోకహితాన్నీ దృష్టిలో పెట్టుకోమన్నారు. గంగను వదలిపెట్టమన్నారు. “మీరు వదలిన గంగను ఇక మీదట మీ కుమార్తెగానే వ్యవహరిస్తాం” అన్నారు.
సమాధాన పడ్డాడు మహర్షి. గంగను తన చెవుల నుండి వదిలాడు. నాటి నుండి గంగను ‘జహ్ను తనయ’ గా ‘జాహ్నవి’ అయింది. మహోత్సాహంగా ముందుకు ఉరికింది గంగ. చాలా దూరం ప్రయాణించింది. సాగరద్వారం ద్వారా పాతాళం లోనికి ప్రవేశించింది. సగర కుమారుల భస్మరాశుల్ని ముంచెత్తింది. పాపవిముక్తులయ్యారు సగరులు. సద్గుతులు పొందారు. భగీరథుడు ఆనందించాడు.