తంజావూరులోని బృహదీశ్వర ఆలయం - Brihadeeswara Temple in Thanjavur
భారతదేశంలో నిర్మాణపరంగా అత్యద్బుతం అనిపించే ఆలయాలలో తంజావూరులోని బృహదీశ్వర ఆలయం ప్రముఖంగా నిలుస్తుంది. ఈ ఆలయాన్ని చోళరాజులలో ప్రముఖుడైన రాజరాజచోళుడు నిర్మించాడు.
ఈ ఆలయం నిర్మాణ నైపుణ్యపరంగా, శిల్పకళా వైభవపరంగా చాల ప్రసిద్ది చెందిన ఆలయం. పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తు ఉంటుంది. దాదాపు 80 టన్నుల బరువున్న గ్రానెట్ శిలతో ఈ ఆలయ శిఖారాగ్రాన్ని నిర్మించారు. అంత బరువున్న ఆ ఏకశిలను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఇప్పటికీ ఎవ్వరికి అర్థం కాని ఓ విషయం.
అంత ఎక్కువ బరువు గల రాయిని ఏ విధమైన సిమ్మెంట్, ఉక్కూ సహాయం లేకుండానే 13 అంతస్తులుగా మలిచి ఏరకమైన ఏటవాలూ లేకుండా నిర్మింపబడడం అనేది నిజంగా ఇప్పటికీ అంతుపట్టని ఓ విశేషమనే చెప్పుకోవాలి. మిట్టమధ్యాహ్నమైనా ఈ గోపురం యొక్క నీడ ఎక్కడా మనకి కనిపించకపోవడం మరో విశేషం. ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ల దూరం నుండి ఏటవాలుగా ఒక రాతి వంతెనను కట్టి దాని పైనుంది ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని ఇక్కడ గైడ్ వివరించారు. ఈ ఆలయాన్నీ క్రీ.శ 1004లో ప్రారంభించి 1009 లో పూర్తి చేశారు. కేవలం ఐదు సంవత్సరాలలో ఇంతపెద్ద ఆలయాన్ని నిర్మించడం అప్పటి రాజుల నిర్మాణకౌశల్యతకు నిదర్శనం.
బృహదీశ్వరాలయం అన్నా తమిళంలో పెరియకోయిల్ అన్నా పెద్దగుడి అని అర్థం. ఆ పేరుకి తగ్గట్లే నిజంగా చాలా పెద్దగానే ఉంటుంది ఈ ఆలయం.
ఈ ఆలయంలో గర్బగుడిలోని శివలింగం 13 అడుగుల ఏకశిలా నిర్మితం.ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు. ఈ ఆలయంలో శివునికి ఎదురుగా కనిపించే నంది విగ్రహం కూడా చాలా పెద్దగానే ఉంటుంది. సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో ఈ నందీశ్వరుని విగ్రహాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2.6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం దాదాపు పర్లాంగు దూరం ఉంటుంది. మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని అప్పటి శిల్పులు , వేద శాస్త్రజ్ఞులూ నిర్మించారు
ఈ గుడి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఉంది. శైవ, వైష్ణవ, శాక్తేయ సంప్రదాయాలు కనిపించే ఈ ఆలయం మన ప్రాచీన భారతీయ సంఘ వైభవానికి, అప్పటి ప్రజల కళాత్మక జీవనవిధానానికీ ఓ మచ్చుతునక. కనుక తమిళనాడు వెళ్ళేవారు తప్పకుండా ఈ ఆలయాన్ని చూడటం మాత్రం మరవకండి
___ఇట్లు మీ కోట సత్య సూర్యనారాయణ శాస్త్రి