శ్లోకము - 61
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః |
వశే హి యస్యీన్ద్రియాణి తస్య ప్రజా ప్రతిష్ఠితా ||
తాని - ఆ ఇంద్రియాలను; సర్వాణి - అన్నింటిని; సంయమ్య - అదుపులో ఉంచుకొని; యుక్తః - నియోగించి; ఆసీత - నెలకొనాలి; మత్పరః - నా సంబంధములో; వశే - పూర్తిగా వశము చేసికొని; హి - నికముగా; యస్య - ఎవ్వని; ఇన్ద్రియాణి - ఇంద్రియాలు; తస్య - అతని; ప్రజ్ఞా - చైతన్యము; ప్రతిష్ఠితా - స్థిరమైనది.
ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని, వాటిని నియంత్రించి తన చైతన్యమును నా యందు నిలిపేవాడు స్థిరమైన బుద్ధి కలిగిన మనిషిగా తెలియబడతాడు.
భాష్యము : మహోన్నతమైన యోగపరిపూర్ణత కృష్ణ భక్తి భావనమేనని ఈ శ్లోకంలో స్పష్టంగా వివరించబడింది. మనిషి కృష్ణ భక్తి భావన కలవాడు కానిదే ఇంద్రియ నిగ్రహము ఏమాత్రము సాధ్యపడదు. ఇంతకు ముందే తెలిపినట్లు దుర్వాసముని అంబరీష మహారాజుతో కయ్యానికి దిగాడు. అతడు గర్వంతో అనవసరంగా కోపం తెచ్చుకున్నాడు కనుక తన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయాడు. ఇంకొక ప్రక్క రాజు ముని యంతటి శక్తి సంపన్నుడైన యోగి కాకపోయినా భగవద్భక్తునిగా ఆ ముని చేసిన అన్యాయాలన్నింటినీ మౌనంగా సహించి చివరకు విజయాన్ని సాధించాడు.
శ్రీమద్భాగవతములో (9.4.18–20) తెలుపబడినట్టి ఈ క్రింది యోగ్యతల కారణంగా రాజు తన ఇంద్రియాలను నియంత్రించగలిగాడు :
సవై మనః కృష్ణపదారవిన్దయోః
వచాంసి వైకుంఠగుణానువర్ణనే |
కరౌ హరేర్మన్దిరమార్జనాదిషు
శ్రుతిం చకారాచ్యుత సత్కథోదయే ||
ముకున్దలింగాలయ దర్శనే దృశా
తద్భృత్యగాత్ర స్పర్శేఃమ్ గ సంగమం |
ఘ్రాణం చ తత్పాదసరోజసౌరభే
శ్రీమత్తులస్యా రసనాం తదర్పితే ||
పాదౌ హరేః క్షేత్రపదానుసర్పణే
శిరో హృషీకేశపదాభివన్దనే |
కామం చ దాస్యే న తు కామకామ్యయా
యథోత్తమశ్లోకజనాశ్రయా రతిః ||
"అంబరీష మహారాజు తన మనస్సును శ్రీకృష్ణ భగవానుని పాదపద్మాల చెంత స్థిరంగా నిలిపాడు. అతడు తన వాక్కులను భగవద్ధామాన్ని వర్ణించడంలో, తన చేతులను భగవన్మందిరాన్ని శుభ్రం చేయడంలో, తన చెవులను భగవల్లీలలను వినడంలో, తన కళ్ళను భగవద్రూపాన్ని చూడడంలో, తన దేహాన్ని భక్తుని దేహాన్ని తాకడంలో, తన నాసికను భగవంతుని పాదపద్మాలకు సమర్పించిన పుష్పసుగంధాన్ని ఆఘ్రాణించడంలో, తన నాలుకను ఆ దేవదేవునికి సమర్పించిన తులసీదళాలను రుచి చూడడంలో, తన పాదాలను భగవన్మందిరము ఉన్నట్టి తీర్థస్థానానికి వెళ్ళడంలో, తన శిరమును భగవానునికి నమస్కరించడంలో, తన కోరికలను భగవంతుని కోరికలను తీర్చడంలోను నియోగించాడు.” ఈ యోగ్యతలన్నీ అతనిని భగవానుని “మత్పర” భక్తునిగా అయ్యేందుకు యోగ్యునిగా చేసాయి.
ఈ “మత్పర" అనే పదము ఈ సందర్భములో అత్యంత ప్రధానమైనది. మనిషి ఏ విధంగా మత్పర భక్తుడు కాగలడో అంబరీష మహారాజు జీవితంలో వర్ణించబడింది. గొప్ప విద్వాంసుడు, మత్సర పరంపరలో ఆచార్యుడు అయినట్టి శ్రీల బలదేవవిద్యాభూషణులు “మద్భక్తి ప్రభావేన సర్వేంద్రియ విజయ పూర్వికాస్వాత్మ దృష్టిః సులభేతి భావః - కేవలము కృష్ణ భక్తిబలము మీదనే ఇంద్రియాలు పూర్తిగా నియంత్రించబడతాయి” అని వ్యాఖ్యానించారు.
అలాగే అగ్ని ఉపమానము కూడ ఒక్కొకప్పుడు ఇవ్వబడుతుంది : “మండుతున్న అగ్ని గదిలోని సమస్తాన్నీ భస్మం చేసినట్లుగా యోగి హృదయంలో ఉన్నట్టి విష్ణుభగవానుడు అన్ని రకాల కల్మషాలను భస్మము చేస్తాడు." యోగసూత్రము కూడ విష్ణుధ్యానాన్ని ఉపదేశిస్తున్నదే గాని శూన్యధ్యానాన్ని కాదు. విష్ణువుకు అన్యమైన దానిపై ధ్యానం చేసే నామమాత్ర యోగులు ఏదో మాయాజాలాన్ని అన్వేషిస్తూ కాలాన్ని వృథా చేసినవారే అవుతారు. మనము కృష్ణభక్తి భావనలో ఉన్నవారము, అంటే భగవద్భక్తులముకావాలి. అదే నిజమైన యోగలక్ష్యము.
శ్లోకము - 62
ధ్యాయతో విషయాన్ పుంసః సజ్జస్తేషూపజాయతే |
సఙ్గాత్సంజాయతే కామః కామాత్ క్రోధోఃభిజాయతే ||
ధ్యాయతః - ఆలోచిస్తున్నప్పుడు; విషయాన్ - ఇంద్రియ విషయాలను; పుంసః -మనిషికి; సఙ్గః - ఆసక్తి; తేషు - ఇంద్రియార్థాలలో; ఉపజాయతే - ఉత్పన్నమౌతుంది; సజ్జత్ - ఆసక్తి నుండి; సంజాయతే - కలుగుతుంది; కామః - కోరిక; కామాత్ - కోరిక నుండి; క్రోధః — కోపము; అభిజాయతే - ప్రకటమౌతుంది.
ఇంద్రియార్థాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమౌతుంది, కామము నుండి క్రోధము కలుగుతుంది.
భాష్యము : కృష్ణ భక్తి భావనలో లేనివాడు ఇంద్రియార్థాలను ఆలోచిస్తూ భౌతికవాంఛలకు లోనౌతాడు. ఇంద్రియాలకు నిజమైన వ్యాపకము అవసరము. వాటిని భగవానుని దివ్యసేవలో నెలకొల్పకపోతే నిక్కముగా లౌకికత్వ సేవనే కోరుకుంటాయి. శివుడు, బ్రహ్మతో పాటుగా (ఇక స్వర్గలోకాలలోని ఇతర దేవతల గురించి చెప్పేదేముంది) ఈ భౌతికజగత్తులోని ప్రతియొక్కడు ఇంద్రియ విషయాల ప్రభావానికి లోనౌతాడు. ఈ సంసార చిక్కు నుండి బయటపడడానికి కృష్ణ భక్తి భావనలో ఉండడమే ఏకైక పద్ధతి.
శివుడు తీవ్రమైన ధ్యానంలో నెలకొనినా పార్వతీదేవి ఇంద్రియ ప్రీతికి చలింపజేసినప్పుడు ఆమె కోరికను సమ్మతించాడు. తత్ఫలితంగా కార్తికేయుడు జన్మించాడు. భక్తుడైన హరిదాస ఠాకూరులు యువకునిగా ఉన్నప్పుడు మాయాదేవి అవతారము అదేవిధంగా మోహింపజేయడానికి యత్నించింది. కాని శ్రీకృష్ణుని యెడ తన అనన్యభక్తి కారణంగా ముందుహరిదాసుఠాకూరు ఆ పరీక్షలో సులభంగా నెగ్గారు. ఇంతకు ముందు పేర్కొనబడిన శ్రీయామునాచార్యుల శ్లోకంలో వివరించినట్లు శ్రద్ధావంతుడైన భగవద్భక్తుడు భగవానుని సాంగత్యంలో ఆధ్యాత్మికానందము పట్ల ఉన్నతమైన రుచి కారణంగా సమస్త భౌతికభోగాలను త్యజిస్తాడు. అదే విజయరహస్యం. కనుక కృష్ణ భక్తి భావనలో లేనివాడు కృత్రిమంగా అణచడము ద్వారా ఇంద్రియనిగ్రహంలో ఎంతటి శక్తిమంతుడైనా చివరకు విఫలము కావడం నిశ్చయం. ఎందుకంటే కించిత్తు ఇంద్రియ భోగ తలంపైనా కోరికలను తీర్చుకునేందుకు అతనిని ప్రేరేపితుని చేస్తుంది.
తరువాతి పేజీ కోసం ఇక్కడ నొక్కండి - Page 23 »