శ్లోకము - 56
దు:ఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ||
దు:ఖేషు - త్రివిధ తాపాలలో; అనుద్విగ్న మనాః - మనస్సులో కలత చెందకుండ; సుఖేషు - సుఖములో; విగత స్పృహః: - ఇష్టము లేకుండ; వీత - విడివడినవాడు; రాగ - ఆసక్తి; భయ - భయము; క్రోధః - కోపము; స్థితరధీః - స్థిరమైన మనస్సు కలిగిన; మునిః - ముని; ఉచ్యతే - అని చెప్పబడతాడు.
త్రివిధతాపాలలోను మనస్సు కలత చెందనివాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, రాగము భయము క్రోధముల నుండి విడిపడినవాడు స్థిరమైన మనస్సు కలిగిన ముని అని చెప్పబడతాడు.
భాష్యము : యథార్థమైన నిర్ణయానికి రాకుండ నానారకాలుగా మానసికకల్పనలలో మనస్సును మధించగలిగేవాడని "ముని" అనే పదానికి అర్థము. ప్రతీ మునికి ఒక భిన్నమైన దృష్టికోణము ఉంటుందని చెప్పబడింది. ఒక ముని ఇతర మునులతో విభేదించనిదే కచ్చితంగా చెప్పాలంటే 'ముని' అని పిలువబడడు.
"నాసావృషిర్యస్యమతం న భిన్నం" (మహాభారతము, వనపర్వము, 313.117) కాని భగవానునిచే ఇక్కడ పేర్కొనబడినట్లు "స్థితధీర్యమని" సాధారణ మునికి భిన్నుడు స్థితధీర్ముని సమస్తమైన కల్పనా కార్యాలను సమాప్తము చేసి ఉండే కారణంగా సర్వదా కృష్ణభక్తిభావనలోనే ఉంటాడు. అతడు "ప్రశాంత నిశ్శేష, మనోరథాంతరుడు" (స్తోత్ర రత్నము 43) లేదా మానసిక కల్పనాస్టితిని అధిగమించి శ్రీకృష్ణుడే, అంటే వాసుదేవుడే సర్వస్వమనే (వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్గభః) నిర్ణయానికి వచ్చినవాడని పిలువబడతాడు. అతడే స్థిరమైన మనస్సు కలిగిన ముని యని చెప్పబడతాడు. అట్టి సంపూర్ణ కృష్ణవరాయణుడైన వ్యక్తి త్రివిధ తాపాల దాడికి ఏమాత్రము కలతచెందడు. ఎందుకంటే అతడు తన గత పాపకర్మలకు ఇంకా ఎక్కువ కష్టం కలుగవలసి ఉన్నదని తలుస్తూ సమస్త క్లేశాలను భగవత్కరుణగా స్వీకరిస్తాడు. భగవత్కరుణచే తన కష్టాలన్నీ
అతి స్వల్పంగా అయిపోయినట్లు అతడు చూస్తాడు. అదే విధంగా తనకు సుఖం కలిగినప్పుడు తాను సుఖానికి అయోగ్యుడనని తలుస్తూ అతడు తన కీర్తిని భగవంతునికి ఆపాదిస్తాడు. కేవలము భగవంతుని కృప చేతనే తాను అటువంటి సుఖకరమైన స్థితిలో ఉండి ఆ దేవదేవునికి ఉత్తమమైన సేవ చేయగలుగుతున్నానని అతడు అనుభూతం చేసికొంటాడు. భగవత్పేవ కొరకు అతడు సర్వదా తెగువతోను, చురుకుగాను ఉంటాడు; రాగద్వేషాలచే అతడు ప్రభావితుడు కాడు. స్వీయేంద్రియభోగానికి వేటినెనా స్వీకరించడం రాగము అనే పదానికి అర్థము; కాగా అటువంటి ఇంద్రియాసక్తి లేకపోవడం అనాసక్తి, కాని కృష్ణభక్తిభావనలో స్థిరుడైనవాడు తన జీవితము భగవత్పేవకే అంకితమైన కారణంగా ఆసక్తిని గాని, అనాసక్తిని గాని కలిగి ఉండడు. తత్పలితంగా అతనికి తన ప్రయత్నాలు విఫలమైనప్పుడు కూడ ఏమాత్రము కోపం రాదు. జయమైనా అపజయమైనా కృష్ణభక్తిభావనలో ఉన్నవాడు సర్వదా స్థిరనిశ్చయుడై ఉంటాడు.
శ్లోకము - 57
యః సర్వత్రానభిస్నేహస్తత్ప్రాస్య శుభాశుభం |
నాభినన్థతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||
యః - ఎవ్వడైతే; సర్వత్ర - ఎల్లెడల; అనభిస్నేహః - రాగము లేనివాడై; తత్ - దానిని;
తత్ - దానిని; ప్రాప్య - పొంది; శుభం - మంచిని; అశుభం- చెడును; న అభినన్తతి - మెచ్చుకోడు; న ద్వేష్టి - ద్వేషించడు; తస్య - అతని; ప్రజ్ఞా - పరిపూర్ణ జ్ఞానము; ప్రతిష్ఠితా - స్థిరమైనది.
ఈ భౌతికజగత్తులో తనకు కలిగే మంచిని లేదా చెడును మెచ్చుకోవడం గాని తృణీకరించడం గాని చేయక దానిచే ప్రభావితుడు కానివాడు పరిపూర్ణజ్ఞానంలో స్థిరముగా నిలిచినట్టివాడు.
భాష్యము : ఈ భౌతికజగత్తులో ఏదో మంచి లేదా చెడు ఎల్లప్పుడు కలుగుతూ ఉంటుంది. అటువంటి లౌకిక ఒడిదుడుకులచే కలత చెందనివాడు, మంచిచెడులచే ప్రభావితుడు కానివాడు కృష్ణభక్తిభావనలో స్థిరునిగా తెలియబడతాడు. ఈ ప్రపంచము ద్వంద్వపూర్ణమైనది కనుక మనిషి ఈ భౌతికజగత్తులో ఉన్నంతవరకు సర్వదా మంచిచెడులు కలుగుతూనే ఉంటాయి. కాని కృష్ణభక్తిభావనలో సుస్థిరుడైనవాడు సర్వమంగళకరుడైన శ్రీకృష్ణభగవానునితోనే సంబంధము కలిగి ఉన్నందున మంచి చెడులచే ప్రభావితుడు కాడు. శ్రీకృష్ణుని యందు అటువంటి భావన మనిషిని పరిపూర్ణ దివ్యస్థితిలో, అంటే సమాధిలో నిలుపుతుంది.