శ్లోకము - 53
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధానచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ||
శృతి - వేదాలలో చెప్పబడిన ; విప్రతిపన్నా - సకామకర్మలచే ప్రభావితము కాకుండ; తీ - నీ యొక్క; యదా - ఎప్పుడైతే; స్థాస్యతి - ఉంటుందో; నిశ్చలా - స్థిరంగా; సమాధా - దివ్య చైతన్యంలో లేదా కృష్ణభక్తిభావనలో; అచలా - సుస్థిరంగా; బుద్ధిః - బుద్ధి; తదా - అప్పుడు; యోగం - ఆత్మానుభూతిని; అవాప్స్యసి - నీవు పొందుతావు
ఎప్పుడు నీ మనస్సు వేదాల అలంకృత వాక్కులచే ఇక ఏమాత్రము కలతచెందదో, ఎప్పుడు అది సమాధి స్థితిలో స్థిరపడుతుందో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందినవాడవౌతావు.
భాష్యము : మనిషిసమాధిలో ఉన్నాడంటే అతడు కృష్ణభక్తిభావనను పూర్తిగా అనుభూతం. చేసికొన్నాడని అనడం అవుతుంది. అంటే పూర్ణసమాధిలో ఉన్నవాడు బ్రహ్మమును పరమాత్మను, భగవానుని అనుభూతం చేసికొని ఉంటాడు. మనిషి శ్రీకృష్ణుని నిత్యదాసుడని, కృష్ణభక్తిభావనలో విధులను నిర్వర్తించడమే అతని ఏకైక కార్యమని అర్థం చేసికోవడమే మహోన్నతమైన ఆత్మానుభూతి పూర్ణత్వము. కృష్ణభక్తిభావనలో ఉన్నవాడు, అంటే భగవానుని అనన్య భక్తుడు వేదాల అలంకృత వాక్కులచే కలతచెందకూడదు, స్వర్గలోకప్రాప్తికి కామ్యకర్మలలో నెలకొనకూడదు. కృష్ణభక్తిభావనలో మనిషి నేరుగా శ్రీకృష్ణునితో అన్యోన్య సంబంధాన్ని పొందుతాడు. ఆ విధంగా శ్రీకృష్ణుని సకల ఆదేశాలు అట్టి దివ్యస్థితిలో అర్థమౌతుంది. అటువంటి కలాపాల ద్వారా అతడు తప్పకుండ ఫలితాలను సాధించి చరమ జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అతడు కేవలము శ్రీకృష్ణుని ఆదేశాలను లేదా ఆతని ప్రతినిధియైన గురుదేవుని ఆదేశాలను పాటించవలసి ఉంటుంది.
శ్లోకము - 54
అర్జున ఉవాచ
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ |
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత ప్రజేత కిం ||
అర్జునః ఉవాచ - అర్జునుడు పలికాడు; స్థితప్రజ్ఞస్య - సుస్థిరమైన కృష్ణభక్తిభావనలో నెలకొన్నవాని; కా - ఏమిటి; భాషా - భాష: సమాధిస్థస్య - సమాధిలో ఉన్నవాని; కేశవ - ఓ కృష్ణా; స్థిత ధీః - కృష్ణభక్తిభావనలో స్థిరుడైనవాడు; కిం - ఏమిటి; ప్రభాషేత - మాట్లాడుతాడు; కిం - ఎట్లా; ఆసీత - కూర్పుంటాడు; ప్రజేత - నడుస్తాడు; కిం - ఎట్లా.
అర్జునుడు పలికాడు : ఓ కృష్ణా ఆ విధంగా సమాధిమగ్నమైన చైతన్యము కలవాని లక్షణాలేవి? అతడు ఏ విధంగా మాట్లాడతాడు, అతని భాష ఏమిటి? అతడు ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా సడుస్తాడు?
భాష్యము : ప్రతీ మనిషికి తన ప్రత్యేక స్థితిని బట్టి లక్షణాలు ఉన్నట్లుగానే కృష్ణభక్తిభావనలో ఉన్నవాడు మాట, నడక, ఆలోచన, భావనాదులలో ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంటాడు. ధనికుడు ధనికునిగా తెలియబడడానికి తన లక్షణాలను కలిగి ఉన్నట్లుగా, రోగి రోగిగా తెలియబడడానికి తన లక్షణాలను కలిగి ఉన్నట్లుగా లేదా ఒక పండితుడు తన లక్షణాలను కలిగి ఉన్నట్లుగా శ్రీకృష్ణుని దివ్యభావనలో ఉన్న వ్యక్తి నానారకాల వ్యవహారాలలో విశేషమైన లక్షణాలను కలిగి ఉంటాడు.
అతని విశేషమైన లక్షణాలను మనిషి భగవద్గీత నుండి తెలిసికోగలుగుతాడు. మాటలనేవి ఏ వ్యక్తికైనా అత్యంత ప్రధానమైన గుణము కాబట్టి కృష్భక్తిభావనలో ఉన్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడనేది అత్యంత ముఖ్యమైన విషయం. మాట్లాడనంత వరకే మూర్ఖుడు బయటపడకుండ ఉంటాడని చెప్పబడింది. చక్కని వస్త్రధారణ చేసిన మూర్ఖుడు మాట్లాడకపోతే బయటపడడు, కాని మాట్లాడగానే తన సంగతి వెల్లడి చేసికొంటాడు. కృష్ణభక్తిభావనలో ఉన్న వ్యక్తి ప్రదర్శించే లక్షణమేమిటంటే అతడు కేవలము శ్రీకృష్ణుని గురించి, శ్రీకృష్ణునికి సంబంధించిన విషయాల గురించే మాట్లాడతాడు. క్రింద పేర్కొనబడినట్లు ఇతర లక్షణాలు తరువాత అప్రయత్నంగా అనుసరిస్తాయి.
శ్లోకము - 55
శ్రీభగవానువాచ
ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ |
ఉవ ఆత్మన్యేవారాతమనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ||
శ్రీభగవాన్ ఉవాచ - శ్రీభగవాసుడు పలికాడు; ప్రజాహాతి - విడిచిపెడతాడో; యదా - ఎప్పుడైతే; కామాన్ - ఇంద్రియభోగ కోరికలను; సర్వాన్ - అన్నిరకాలైన; పార్థ = ఓ వృథాకుమారా; మనోగతాన్ - మానసిక కల్పనకు చెందిన; ఆత్మని - విశుద్ద ఆత్మస్థితిలో; ఏవ - నిక్కముగా; ఆత్మనా - విశుద్ధ మనస్సుచే; తుష్టః - సంతుష్ఠుడై; స్థితప్రజ్ఞ - దివ్యస్థితిలో నెలకొన్నవాడు; తదా - అవ్పుడు; ఉచ్యతే - చెప్పబడతాడు.
శ్రీభగవానుడు పలికాడు : ఓ పార్థా! మనిషి మానసిక కల్పనల నుండి ఉత్పన్నమయ్యే అన్నిరకాలైన ఇంద్రియభోగవాంఛలను విడిచిపెట్టినప్పుడు, ఆ విధంగా శుద్ధిపడిన అతని మనస్సు కేవలము ఆత్మ యందు సంతృప్తి చెందినప్పుడు విశుద్ధ దివ్య చైతన్యములో ఉన్నవానిగా చెప్పబడతాడు.
భాష్యము : పూర్తిగా కృష్ణభక్తిభావనలో, అంటే భగవానుని భక్తియుతసేవలో ఉన్న ఏ వ్యక్తియైనా మహర్షుల సమస్త సద్గుణాలను కలిగి ఉంటాడని, కాగా దివ్యస్థితిలో నెలకొననివాడు తన మానసికకల్పనలనే తప్పక ఆశ్రయించే కారణంగా ఎటువంటి సద్గుణాలను కలిగి ఉండడని భాగవతము ధ్రువపరచింది. అందుకే మానసికకల్పనల ద్వారా తయారైన అన్నిరకాలైన భోగవాంఛలను మనిషి విడిచిపెట్టాలని ఇక్కడ సరిగ్గా చెప్పబడింది. కృత్రిమంగా అటువంటి భోగవాంఛలు అణగవు, కాని మనిషి కృష్ణభక్తిభావనలో నెలకొంటే అప్పుడు భోగవాంఛలు బాహ్యయత్నము లేకుండానే అణిగిపోతాయి. కనుక అతడు ఎటువంటి సంకోచము లేకుండ కృష్ణభక్తిభావనలో నెలకొనాలి. ఎందుకంటే ఈ భక్తియుతసేవ లక్షణమే దివ్య చైతన్యస్థాయికి చేర్చడంలో అతనికి తోడ్పడుతుంది. మహాత్ముడు తనను భగవానుని నిత్యదాసునిగా గుర్తించి సర్వదా తన యందే సంతుష్టుడై ఉంటాడు. అట్టి దివ్యస్థితుడైన వ్యక్తికి తుచ్ఛమైన లౌకికత్వము నుండి కలిగే భోగవాంఛలు ఉండవు. పైగా దేవదేవుని నిత్యసీవ యనే తన సహజస్థితిలో అతడు సర్వదా ఆనందంగా ఉంటాడు.