Bhagavad Gita ( Telugu) |
మీరు ఈ బుక్ నీ కొనాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి www.harekrishnabooks.com లో అందుబాటులో ఉంది.
భగవద్గీతను ఎందుకు పఠించాలి?
బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అంటారు. నిజమే! తలరాతను ఎవరూ మార్చుకోలేకపోవచ్చు. కానీ, గీతను చదివితే మాత్రం జీవనరేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోను, మనిషి జీవితంలోను గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే…భగవద్గీత అనగా….భగవంతునిచే గానం చేయబదినదని అర్థం. అంటే భగవంతుని చేత చెప్పబడింది.
ప్రపంచ సాహిత్యంలోనే భగవద్గీతను మించిన గ్రంథం లేదు. భగవత్ తత్వము, భగవంతుడిని చేరే మార్గాలు, మనిషి పరమపదాన్ని పొందడానికి ఆచరించే మార్గాలు తదితర విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. గీతలోని 18 అధ్యాయాలు మోక్ష సౌధానికి చేర్చే 18 సోపానాలని వేదాంత కోవిదులు చెబుతారు. ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత ఈ మూడింటినీ కలిసి ‘ప్రస్థాన త్రయం’ అంటారు. ప్రాస్థానం అనగా ప్రయాణం. మనిషి పరమపద ప్రయాణానికి కావలిసిన సాధన సంపత్తుల గురించి, నేర్చుకోవాల్సిన జ్ఞానం గురించివీటిలో పుష్కలంగా ఉంది.
నేటి మానసిక నిపుణులు వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని అంటున్నారు.
లోకంలో ఉన్న సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనివి బయట మరెక్కడా లేవు. ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగామ్. ఇవి 108 వరకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షిచే క్రోడీకరింపబడి 555 సూత్రాలుగా రూపొందించబడ్డాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములలో నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని ‘మోక్ష సప్తసతి’ అని కూడా అంటారు. ఉపనిషత్తులను చదవాలి. బ్రహ్మసూత్రాలను మననం చేయాలి. భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించాలి. భగవద్గీత వేదాంత విషయాలు, వేదాంత రహస్యాలు, పరమ పదాన్ని చేరే ఉపాయాలు ఉన్నాయి కాబట్టి సన్యాసం స్వీకరించిన మోక్షగాములకు, వయసు మళ్ళినవారికి ఉపయోగపడే గ్రంథమనే అభిప్రాయం చాలమందిలో పాతుకుపోయింది. కానీ, ఇది నిజం కాదు. గీత ప్రపంచంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది. ఇది స్పృశించని అంశమంటూ లేదు. అందుకే ఇది ప్రపంచంలోనే మకుటాయమానమైన సాహిత్య ఉద్గ్రంథం. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భగవద్గీతను ఆధారం చేసుకునే నేటి యువతకు శిక్షణ ఇస్తున్నారు.
గీతలో దైనందిన జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి? సన్మార్గాన ఎలా నడవాలి? సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది, లోక కల్యాణానికి ఎలా పాటుపడాలి అనే పలు విషయాలు పొందుపరచబడ్డాయి. అందుకే భగవద్గీత కేవలం ‘పారాయణ గ్రంథం’ కాదు, ‘అనుష్టాన గ్రంథం’ (అంటే నిత్యం చదివి అందులోని అంశాలను ఆచరించదగ్గది). భగవద్గీత కేవలం వేదాంత గ్రంథం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యశాస్త్రం, ఆహారవిజ్ఞానశాస్త్రం, నైతికధార్మిక శాస్త్రం. ఇవన్నీ కలిపి మనిషి నిత్య జీవన శాస్త్రం. మనిషి జీవితానికి సంబంధించి అన్ని విషయాలను ఇది చర్చించింది.
అందువల్లే భగవద్గీతను ‘మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం’ అని అన్నారు. గీతలోని ఉపదేశాలను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. భగవద్గీతలో ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై ఉన్న ప్రకృతి గుణాలైన సత్వ, రాజ, స్తమములను నిత్య జీవితంలో జయించడం, ద్వంద్వాములను నిగ్రహించడం, సదాచారం, సమబుద్ధి, సత్ప్రవర్తన పెంపొందించుకోవడం, సత్వగుణాలను అలవర్చుకోవడం, నిష్కామ కర్మానుష్టానం ద్వారా ఉత్తమ స్థితికి చేరుకోవడం, సాత్విక ఆహార నియమాలను పాటించడం, రాజసిక, తామసిక పదార్థాలను విసర్జించడం, ధ్యాన యోగ సాధన ద్వారా నిరంతర దైవచింతన, జ్ఞానాన్ని పొందగోరువారు పాటించాల్సిన నియమాలు, ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూడగలగడం….ఇంకా ఎన్నో విషయాలు విపులీకరించి ఉన్నాయి. వాటిని తెలుసుకుని ఆచరించిన మనిషి మహనీయుడు అవుతాడు.ప్రస్తుత మానవ జీవితమ పూర్తిగా భౌతిక దృక్పథానికే పరిమితమైంది. స్వార్థమే పరమావధిగా తలుస్తూ, మనశ్శాంతి లేక కాలం గడుపుతున్నాడు.
ఈ దృక్పథం మారాలంటే, మనసులో గూడు కట్టుకున్న స్వార్థం పోవాలంటే, నిత్య జీవితంలో మనశ్శాంతితో బతకాలంటే ఆధ్యాత్మిక చింతన కావాలి. అటువంటి మార్పు కోరుకునేవారు తమ దైనందిన వ్యవహారాల్లో ‘గీత’కూ చోటు కల్పించాలి. అప్పుడు స్వీయాభివృద్ధితో పాటు సమాజభివృద్ధి ఎలా సాధ్యామవుతుందో ప్రతి ఒక్కరూ అనుభవం మీద తెలుసుకోవచ్చు.
తన్మేమనశ్శివ సంకల్పమస్తు