కవి పరిచయము: ఇది "మయూర మహాకవి" సంస్కృత మూలమునకు తెలుగు అనువాదము.
శ్రీ రస్తు
శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః
: శ్రీ సూర్య శతకము :
|| అవతారిక ||
ఉ. శ్రీపతి శాంకరీపతి శచీపతి వాక్పతి నాకలోక సే
నాపతి సుస్వధాపతి వనాటపతి ప్రతికూలకార్య వా
ర్తాపతి గూఢపాత్పతి పతంగపతి ప్రముఖాఖిలైక ర
క్షాపతుల న్మదిం గని త్విషాంపతిఁ బ్రస్తుతి సేయఁ బూనితిన్. 1
చ. కలుగు తెలుంగుకబ్బములు కట్టడిమందలు మంద లిన్ని వం
దలను గణింప శక్య మగునా? యిక నందుల కేమి యందులో
లలితపదార్థవిస్ఫురణలం దనియించు పరోపకార మా
న్యులు పదివేల కొక్కఁడుగ నుండును పాత్రులు వారు ప్రస్తుతిన్. 2
శా. ఔరా! నోరు రసంబు లూరు పద మాహా! కోటికిన్ తీరు మ
జ్జారే! రచ్చలఁ జేరుఁ జేరనుచు నిచ్చ ల్పామరు ల్మెచ్చఁగాఁ
దా రింతేనియు సిగ్గులేక గణికాతండంబులం బోలె పల్
దారుల్ ద్రొక్కి పదార్థముల్ గొను కవుల్ పాత్రుల్ గదా నిందకున్. 3
చ. విలసిత సాహితీవిమలవృక్షముకొమ్మ మయూరనామ సం
కులసరఘాళి శుద్ధపదగుంభ సుమాసవ మేఱ్చు చేర్చినన్
కలయఁగఁ గట్టు సూర్యశతకం బను కండెను దాసు రాముఁడన్
తెలుఁగునఁ గొట్టి కమ్మనగు తేనియఁ దీసితి దీనిఁ గ్రోలుఁడీ! 4
చ. మును భువి నెంద ఱెందఱు కవుల్ విపులార్థము లెన్ని యెన్ని క
ల్వనములు నాఁట నాఁట నిరపాయమతిన్ రచియించి మించి ర
య్యనుపమ పాండితీచతురులం దొకసాటికిఁ బేటి కంచుఁ గా
కనియెద నే నిహార్థము పరార్థము భాస్వదనుగ్రహార్థమున్. 5
సూర్యశతకము
|| కిరణ వర్ణనము ||
శా. జేజేరాయని కుంభికుంభగతమౌ సిందూరముల్ తాల్చియో
యోజం జేగురువాగు లయ్యుదయశైలోపాంతమం దంటి యో
రాజీవప్రభ లేకకాలమునఁ బ్రారంభించియో యెఱ్ఱనై
తేజుల్ చిమ్ము నవార్కభాను లిడు నెంతే మీకు నైశ్వర్యముల్. 1
ఉ. తామరమొగ్గ పెన్గొఱఁడుఁ దప్పని లక్ష్మిని భక్తకోటికిన్
బ్రేమ నొసంగు లాగఁ దలపెట్టియొ తద్వని ముట్టడించుచున్
భీమతమంబునం దగిలి భీతిలు లోకముఁ బ్రోవ జాణలౌ
కోమల పల్లవాభ రవిగోనిచయంబులు మీకు మేలిడున్. 2
ఉ. కోమల పద్మగర్భములఁ గొండల శాతశిఖాళి నొక్క మై
మై మును ప్రొద్దుజోల మునుమాపుల వ్రాలి యొకించుకేని వి
శ్రామము లేక ముజ్జగము శాల నటించి సదా పథశ్రమో
ద్దామత నా, మహోష్ణిమము దాల్చు రవిప్రభ లేలు మిమ్ములన్. 3
చ. తమ మను పైదుకూలములు తప్పి యనావృతమైన జంతు బృం
దము గని భాస్కరుండు గరతంతుల సాచినఁ దత్క్షణంబ ద
ట్టమయి క్రమక్రమంబున స్ఫుటంబయి దిగ్దశకంబు పేరి మ
గ్గములను నిండు క్రొమ్మడుఁ గకల్మష మీవుత మీకు భద్రముల్. 4
చ. పతిరుచి దూలిన న్బొగిలి వాడిన యోషధి పిండు దెప్పున
ట్లతులిత సూర్యకాంతశిఖి, యాది నెదుర్కొన లేచినట్లు ప్రాక్
క్షితి భృతు ఱాళ్లు పక్షవినికృంతన నెత్రులుగాఱఁ జూపు న
ట్లతనుత నెక్కు నర్కునరుణాంశులు మీకును గీడు వాపుతన్. 5
ఉ. ముక్కిఁడి గుంటు మొండి వ్రణి మూలుఁగు వానిని దోషకారి నే
యొక్కఁడు సక్కసేయుఁ దెవులోఱిచి తక్కక యట్టి సద్దయా
దృక్కలితార్కు సిద్ధగణ దృష్టమహార్ఘ్యములైన యంశువుల్
గ్రక్కున మీ దొసంగులు విఘాతములై చనఁజేయుఁ గావుతన్. 6
చ. తొలుతను గుజ్జులై పిదప దొడ్లయి మీదట భూనభోంతరా
కలితములై యనంతరము గ్రక్కున దిగ్దశకంబు ముట్టి య
బ్బలిదనుజేంద్రు నంటి యల ధ్వాంతము విశ్వమునుండి వాపి శ్రీ
చెలువుని దెప్పు నర్యముని చేతులు మీ దొసఁగుల్ హరించుతన్. 7
చ. అరుణుని కెంపుచాయల మహారుణిమన్ బహుళంబు చేసి య
య్యరదపు గుఱ్ఱముల్ మొగము లల్లన నెత్తిన నోళ్ల గళ్ళెపుం
గఱపుల రక్తరోచులయి గట్లకుఁ గూటము లంటనెక్కి శే
ఖరతను గాంచి రేపు దివిఁ గ్రాలు నినప్రభ మీకు మేలిడున్. 8
ఉ. కాలమునం బయస్సులనుఁ గాంచి యొసంగి ప్రజాసుఖంబిడన్
జాలఁ జరించు ప్రొద్దుట నిశ న్విరమించును దీర్ఘదుఃఖ జం
బాల భవాబ్ధి కోడలు సుమీ రవిగోవులు భవ్యపావన
త్వాలము లవ్వి మీకుఁ బరమాధిక తుష్టిని, బుష్టి నిచ్చుతన్. 9
ఉ. చేతులు మోడ్చి యౌదలలఁ జేర్చి త్రిసంధ్యల మ్రొక్కువారి క
త్యాతత బంధమోక్షకరణాధిక బోధము నంబుజాతఁ బ్ర
ఖ్యాతము సేయు నాఁ బరగు కల్మషభేదులు సూర్యు నంశువుల్
ప్రీతిని నిర్వికల్పముగ మీ మది కోరికలిచ్చు గావుతన్. 10
ఉ. లేవడిఁ బైఁడి సోనలు, లలిం బతనంబునఁ జేతికఱ్ఱ లా
త్మావగమంబు దివ్వె సురధామము బోవను బెద్దదార్లు మో
క్షావసనార్థికిం దనువు ద్వారము సొన్పెడి మంచి బెత్తముల్
ప్రోవును ప్రాతరర్కసుఖరోచులు దుర్వ్యధనుండి మిమ్ములన్. 11
చ. మునుమును తూర్పుకొండఁ దుద ముద్దుల కల్కితురాయి మానికం
బనఁగ దిశాసతీమణుల కందపు పూఁతకు రోచనాంబు చ
ర్చన లన నొప్పి మక్కువల జక్కవ లార్చెడి వాఁడిచూపు ట
ర్చనలను గాంచు బాలరవిరశ్ములు మీకిఁడు జింతితార్థముల్. 12
చ. వెలుఁ గొకడే కనుంగవయి, పేర్చు జగత్త్రయి, నల్వనాల్గుమో
ముల నుతికెక్కి పంచమసుభూతమునాఁ దగి యాఱుకార్ల ని
చ్చలు పలురీతుల న్నెగడి సప్తమునిస్తుతి నష్టదిగ్రతిన్
బొలయు నవార్కదీధితులు నూఱుపదుల్ శుభశోభ మీ కిడున్. 13
చ. బడిబడి విశ్వముం దిరుగఁ బల్ శ్రమ దట్టిన యట్లు స్వోష్మచేఁ
బడలిన యట్లు గ్రీష్మదవవహ్నిని వేగిన యట్లు మాటికిన్
బుడమి జలంబు ద్రావి జడి పూటలు జల్బులుగొట్టి తోయముల్
వెడలి హిమార్తమౌ రవి యభీశుచయం బిడు మీకు భద్రముల్. 14
చ. కలయ దిశావధూటులకుఁ గన్నులపండువుగాఁగ నస్ఫుటో
త్కలనను నూగునూగు టెఱ దాళువు సొంపుల నింప నుల్లస
న్నళినవిలోచనం బగు దినంబు మొగంబున మొల్చినట్టి మీ
సల నునురేకఁ బోలు దివసప్రభునంశులు మీకు మేలిడున్. 15
చ. తల నెలబాలుఁ డాలుకొనఁ దక్కు నితం డని శూలి నూతనా
కలిత సరోజగహ్వరసుఖస్థితికిన్ విధి చిమ్మచీఁకటుల్
వలె నలుపైన మేనికగు బాధకు భీతిలి కృష్ణదేవుఁడున్
గొలుచు దినేశ సద్రుచుల క్రొమ్మొలకల్ మిముఁ బ్రోచు గావుతన్. 16
ఉ. కొండకు విర్వియున్ దెసలకు న్నిడివంబులు వేలవేఱుగా
నుండుట వార్ధికిం గలుగ నుర్వినిఁ జెట్టులు వీండ్లు గట్టులున్
మెండుగఁ దోపఁ జీఁకటిని నెట్టి జగన్నళినీప్రబోధమున్
నిండుగ సల్పు బాలతరణిప్రభ మీకును గీడు వాపుతన్. 17
శా. అస్తవ్యస్తుఁడు గాక నైజరుచియై యానంత్యముం గల్గి సం
గ్రస్త ధ్వాంతత విశ్వధామమున నేకత్రస్థ దీపంబు నా
నస్తోకంబుగ ముజ్జగాన దిగ నేహాపేక్ష నిత్య క్రియా
శస్తిం గ్రుమ్మఱు ప్రాఙ్నవార్కకిరణోచ్చైఃకాంతి మేల్మీకగున్. 18
ఉ. వాడును దూఁడువంటి యహివర్గ మయో యని నాగలోకమున్
గూడక చక్రవాళమునకుం గల యాఖ్యకు నంచుఁ బ్రక్కలన్
వేఁడిమి యీకజాండమునఁ బెంకులు ప్రేలు నటంచు మింటిపై
నాడక స్వేచ్ఛఁ బోవ బయలైన యినప్రభ లేలు మిమ్ములన్. 19
ఉ. కాలమొకండె కాదట జగంబును నీలిమఁ బాయఁ జీకటుల్
వ్రీలఁగ మంచుకొండవలె రేవెలుఁగు న్విలయంబు నొంద సి
ద్ధాళికిఁ గేలు మోడ్పులటు లక్కుముదప్రకరంబు బద్ధతన్
గ్రాల నొనర్చు ప్రాతరరుణప్రభ మీకునుఁ గోర్కెలిచ్చుతన్. 20
ఉ. తామరపూలడా ల్గొనక తద్దయుఁ బెంచును తారకాళి నెం
తేమటుమాయఁ గప్పు వెస నెప్డు దినంబు నిమేషమాఱ్పఁగా
నేమియుఁ జాల దట్టి విపరీత జగత్త్రితయైకచక్షువౌ
గాములఱేనితేజ మనఘత్వము మీకు ఘటించుఁ గావుతన్. 21
చ. ఇగమున చల్లనౌ స్థలుల కెక్కెఁడు వేఁడుకనో వసుంధరన్
దిగిభ కరాగ్రపుష్కరతతిన్ విరియింపనొ దిక్కదంబమున్
మొగి హరిపాదముం గడచి ప్రొద్దుట సత్కృపనో సుదూరమున్
దగఁ ద్రుటిలో నలర్చు రవిధామము వాపును మీకు దుర్దశల్. 22
చ. ప్రళయమునన్ మలల్ విఱచు ఱాడతిగాలికి నాఱిపోవ దు
జ్జ్వల మహనీయ కాంతిమయి పట్టపగల్ వెలుఁగొందు వీత క
జ్జలము పతంగసంభవ మజస్ర మఖండము వత్తి యేడు దీ
వుల వెలిఁగించు దీపము మిమున్ రవిదీప్తి సుఖింపఁ జేయుతన్. 23
చ. మొనయుచు నాశలెల్లఁ దుదముట్టెడి శ్లాఘ్యగుణాళి గౌరవం
బును నుదయాద్యహోగమ సమున్నతిఁ బర్యవసాన వర్జితం
బును గలదై క్షణంబునుఁ దమోనిచయంబునుఁ జేరఁబోక మే
ల్గనురుచివంటి భానురుచి జ్ఞాన దయాదుల మీకు నిచ్చుతన్. 24
చ. ప్రశమిత తారకోర్జితబలం బగు శక్తినిఁ దాల్చి చంద్రకాం
త శిఖి నడంచి యయ్యతను దర్ప తమోహర విస్ఫుర న్మహో
తిశయిని యైన వీక్షణరతిం దగి రెండవ క్రౌంచభేది నాఁ
గుశలతఁ గాంచు భానురుచికుఱ్ఱ యొసంగుత మీకు లక్ష్ములన్. 25
చ. తెలతెలఁ బాఱు వెన్నెలద్యుతిన్ రవచీఁకటి నల్లనల్లఁగాఁ
బలుచని తమ్మిపుప్పొడినిఁ బచ్చదనంబుల ప్రొద్దుపొడ్పునం
గలననుఁ గెంపుచాయల జగం బను జిత్తరు వ్రాసినట్టి మే
ల్కల మగు భానుదీప్తి యతులప్రమదం బిడు మీఁదు చూడ్కికిన్. 26
ఉ. మేరునగంబుమార్గమున మించిన కెంపులధూళి లేచెనో
తేరునఁ దీర్చు పొంకముగ దిద్దిన యెఱ్ఱని వైజయంతియో
స్వారిగుఱాలు మేల్తొగరుచాయల జూ ల్కదలించునో యటం
చారయ నొప్పు బాలతపనాంశులు దోలుత మీకుఁ బాపముల్. 27
ఉ. చీఁకటిఁ బుచ్చు వేడిమినిఁ జేయదు వెల్తురు నిచ్చు బెద్ద రూ
పై కనరాదు రే నడచునంతఁ బగ ల్వెలిగింపఁ బోదు ప్రా
భాకర మైన బాలరుచిపాళియ పూర్ణము దిఙ్నభోవకా
శాకలితంబె మీకు సకలార్థములన్ ఘటియించుఁ గావుతన్. 28
చ. చుఱకయి శాంతిదంబు నలుసు న్విపులంబయి కానరాక యొ
క్కరికిని కానవచ్చియు జగంబున నిందున నుండి యందునున్
వఱలును నశ్వరం బయి యనశ్వరమౌ మునివేద్య మెల్లవా
రెఱిఁగియు నట్టి లోవెలుఁగు రెంటి యినప్రభ మిమ్ము నేలుతన్. 29
ఉ. సొమ్ములు గాగ రత్నములు జొప్పడు గూర్చును గాఱుచి చ్చర
ణ్యమ్ములు గాల్పఁ జందురుఁడు "హా యిని" దేల్పఁగ జేసి మూఁడు లో
కమ్ముల భూష యై వెస నఘమ్ములు దోలుచు వాన నిచ్చి సౌ
ఖ్య మ్మిడి పెక్కు కర్జముల కర్త్రి యినప్రభ మీమ్ముఁ బ్రోవుతన్. 30
మ. కను వ్రాలన్ శ్రుతి మ్రాన్పడన్ రసన నాకంబోక ముక్కెద్దియు
న్గన కాత్వక్కు స్పృశింప కుల్లము నడంగన్ శ్వాస యొక్కండు ద
క్కను వేఱొక్కటిలేక తూలిపడు నక్కాలాహి సందష్టమౌ
జనమున్ లేపెడి వెజ్జు బాలరవితేజం బార్చు మీ యాపదల్. 31
శా. కన్నీ ర్వంటి హిమంబునెల్ల వెసఁ దగ్గంజేసి యింతింతగాఁ
గన్నిండౌ నెఱుపున్ హరించి బలు జోకం బేర్చు నిర్దోషతన్
విన్నాణంబుగఁ జూడఁజేసి భువనప్రేక్షం ద్వదాపత్తి వి
చ్ఛిన్నంబు న్సలుపు న్నవార్కరుచులు న్సిద్ధాంజన ప్రక్రియన్. 32
ఉ. ప్రొద్దుదయించు దిక్కుననుఁ బుట్టి నేలం గడుఁ దూల్చి యెఱ్ఱఁగా
దిద్దినయట్లు తోచి గడిదేఱు నవాబ్జము నట్టె లేపుచున్
దద్దయు ముజ్జగంబులకు దా రొక సొమ్ములుగాఁ దలిర్చుచున్
ముద్దులుగుల్కు భానుకరముల్ విభవంబులు మీకుఁ జేయుతన్. 33
చ. పొలుపుగ ముజ్జగంబు లను పూవులతోఁటను బెంచు రాత్రి యన్
గులుకుమిటారి చంద్రుఁ డను కుండను బ్రాఙ్నగచక్రవాళ మన్
చెలువపుబోది యన్ బగటిచెట్లకుఁ దా నమృతంబు వోయ ని
మ్ముల మొలకెత్తు లేఁజిగురు ప్రొద్దుటియెండ ముదంబు మీ కిడున్. 34
చ. అరుణుని యెఱ్ఱచాయ లెనయ న్బగడంబుల డంబు లొక్కటన్
మెరమెరఁ దారకాచ్ఛవి భ్రమింపఁగ ముత్యపుఁజాయ లొక్కట
న్సిరి గన నల్లనల్ల నగు చీఁకటిసంద్రము ద్రావునట్టి పూ
ర్వరవి నిభాత్యపూర్వబడబాజ్వలనం బిడు మీకుఁ బుణ్యముల్. 35
ఉ. మద్దెల దిద్దిమల్ సరిగమా యను గీతలు గద్దెపద్దెముల్
గ్రద్దన దిద్దు వేలుపుల గాణలు తొల్లిటి సుద్దు లొద్దికన్
విద్దెలమారి వేల్పురుసి పెద్దలు సద్దిడ ముజ్జగానకుం
దద్దయు జవ్వనం బొసగు నవ్యరవిప్రభ మీకు మే లిడున్. 36
ఉ. రిక్కలు పల్చనై తమము వ్రీలఁగ నిందు శిలాళి పాఱుటల్
తక్కఁగఁ జంద్రుఁడు న్మెఱుఁగు దప్పుట నోషధు లుక్కువీడ నా
చక్కని ప్రొద్దు ప్రాఙ్నగము చక్కిన కొంచెము నిల్చియుండ ద
వ్వెక్కియు నెక్కకున్న దివనేశునితేజము మిమ్ము బ్రోచుతన్. 37
చ. నవనవ యౌవనంబుల వనంబుల రక్తదడంబు డంబులన్
గవకవఁ జూపి చెంతలను గ్రంతలఁ గుంతల దాఁటి సాటి నా
కెవ రెవ రంచు దోడుపడు నీడకు చేడియతమ్మి దుమ్మురా
రవరవ నిక్క నెక్కు దినరాట్ ఛవి మీ కగుఁ బాపశాంతికిన్. 38
చ. మురిసిన తమ్మిపూవు జలముం గులికించునెకాని యావిరిన్
నెరపవు చూడ్కులన్ వెలుగు నింపునెకాని యొకింతయేనియున్
చుఱచుఱ నీవు ప్రాఙ్నగము చోటను మున్నటుపై దివంబునన్
వరుపదికల్ నటించు శుభభాను నవాంశులు మీ కొలార్చుతన్. 39
చ. అమరవిభుండు గొల్చెడి బృహస్పతి కే పెదవాడ దిందు కే
మమరుల జ్యేష్ఠుఁడయ్యుఁ జతురాననుఁ డైన విరించికేని నో
రు మెదల దర్చవేళ బెదరుం దడబా టగునట్టి సచ్చరి
త్రము గల సూర్యదేవుని స్ఫురన్నవరోచి సుశాంతి మీ కిడున్. 40
చ. మలలకు మీఁది జేగురులు, మ్రాఁకులయందుఁ జివుళ్లు వార్ధిచా
యలఁ బగడంబులున్ దెసల హత్తుల నెత్తులఁ జెందిరంపుఁ బూఁ
తలు దివి మేరుశైలభువిఁ దప్త సువర్ణములైన సూర్యర
శ్ము లుదయకాల శోణములు సొంపుల నింపుల మీకు నింపుతన్. 41
చ. నెల తమిమీఱ నస్త శివునెత్తిన యుండ వెసం దమోహలా
హలము నిపీతమైన నరుణాఖ్య కిసాలయ మొప్పు ప్రత్యుష
స్సలలిత కల్పకం బొదవఁ జక్కనికెం బసపంచు కోకతో
వెలయు సరోజలక్ష్మి యనఁ బేర్చు రవిప్రభ మీకు మేలిడున్. 42
ఉ. పుట్టదు సంద్రమం దచటఁ బుట్టిన కౌస్తుభ ముఖ్యవస్తువుల్
చుట్టలు గావు పద్మమును జూడము చేతను, విష్ణువక్షమున్
ముట్టదు లాఁతి లేవెలుఁగు ముజ్జగమందు వ్యవస్థ లేర్పడన్
బుట్టెడు మండలాగ్రమునఁ బూషున కా సిరి మీకు మేలిడున్. 43
|| అశ్వ వర్ణనము ||
ఉ. మేరువుమీఁద నున్ననగు మేల్మిశిలల్ నలఁగంగనీక సా
మీర జవంబునం దుముకఁ బెట్టిన గుర్తులు వేఱె లేమిచే
చారుతరార్క కాంతమణిజం బగు వహ్నియ దారి తెల్పఁగా
మీరిన సూర్యుగుఱ్ఱములు మేలుగ ముజ్జగ మేలు గావుతన్. 44
ఉ. దగ్గఱ బగ్గునం గిరణతాపము వీపులవేఁప డప్పిమైఁ
దగ్గక యొక్కనాఁట దివిదారి వడారము దాఁటి వేసటన్
సగ్గుచు గంగ నీర్మెడలు సాచి శిరంబులు వంచి త్రావుచో
జగ్గిడు సప్తసప్తి ఘనసప్తులు మీకు హితంబు సేయుతన్. 45
చ. పటికపు మానికాల చలపం దమనీడలు వేఱె వాజులం
చటు నిటు బోవుఁ బ్రొద్దుతిరుఁ గాఱినఁ గెంపులఁ జూచి సంజ యం
చటమట మెల్లనం జను నొయారపు పచ్చలపట్ల గానరా
కిటుల ననూరు మేరుశిఖ నేఁచు నినాశ్వము లేలు మిమ్ములన్. 46
చ. అహిరిపు నన్న లాగిన నొయారముగం జలియించి పాఱుచున్
గుహజననీ సమీపమున గొప్పరథంబు గతిం జవంబుతో
డ హరితకాంతితో మఱుఁగు దబ్బలతో నపరార్క నందినీ
మహిమ వహించు నర్యముని వార్వపుబంతి శుభంబు మీకిడున్. 47
ఉ. దారికి నావ లీవల సుధాంధులు స్వర్గిరి వంగుచు న్నమ
స్కారము సేయఁ గిన్నరుల కన్యలు సిగ్గున మోము ల గ్గుహా
ద్వారములం దిడంగ నరుణాఖ్యుఁ డదల్చినఁ గాని యించుకం
తోర మెడం దినేద్ధయము లూఁదెడి హేషలు దోలు మీ కొలల్. 48
ఉ. తమ రుచిచేతఁ బచ్చనగు తట్లమొగుళ్లను ఱెక్కలొప్పఁ గ
ళ్ళెములను లాగ నెత్తురులులేచిన నోళ్ళను ముక్కులొప్ప వ్యో
మముననుఁ దుఱ్ఱుమంచు వడిఁబాఱు సుమేరుశిఖాగచారి కీ
రము లన నొప్పు సూర్యునిగుఱాలు వరాల సరాలు మీకిడున్. 49
|| అనూరు వర్ణనము ||
చ. పొడుపుడుగొండ రంగమునఁ బొంకపు రేతెఱచొత్త లక్ష్మి క
న్పడ నుడుపంక్తి పేరిటి నవం బగు పూవుల దోయిలింత జొ
ప్పడ నిడి సూత్రధారత దివంబున నాలుగు జాల యంకముల్
నడపెడి లోకనాటిక ననం జను న య్యరుణుండు మీ కగున్. 50
చ. హరులకు నగ్రుఁడన్, హరిన యాతఁడు మోచుఁ బశుక్రియం జరా
చర సమభావకర్మతతి సాక్షిని యాతఁడు పక్షపాత సం
చరణుఁ డటంచు నీడునను సామ్యము నొందియు దృక్ఛ్రుతిద్విషున్
దరిమెడి స్థేమ ధామములధామ మనూరుఁడు వాపు మీ కొలల్. 51
మ. వఱువాతన్ హిమముల్ స్రవించు శశిశోభల్ ద్రావ జబ్బెక్కి ముం
దఱఁ గాష్ఠోజ్జ్వలదీపనంబు వెనుకన్ భానుం డటంచు న్నతా
దరత న్సిద్ధులు సాధ్యు లంబరమునన్ దత్తార్ఘ్యులై చూడ భా
స్కరసారథ్యము సేయు వేల్పు మిము రక్షాదక్షుఁ డై యేలుతన్. 52
మ. వఱువాత న్విడ రశ్ములం దుదిపగల్ మానన్ స్వతంత్రుండుగాఁ
బరిషత్ స్తోత్రవిలాసుఁగా హరిపదవ్యాపారుఁగా నా ద్విజే
శ్వరునందున్ సమయప్రకర్ష లఘుతం జాటంగ సేవేచ్ఛమై
నరుణుండుం దనపాటి సేయు నరుణుం డశ్రాంత మేలు న్మిమున్. 53
ఉ. రే యను తీగకుం బరశురీతిఁ దమోఽటవి కర్చిభాతిఁ బ్రా
క్తోయజనేత్ర కల్వలనుఁ గోయు కరాగ్రగతిం జగ త్సుబో
ధాయతి ధాతపద్ధతి వియద్భువు లేర్పడఁ దొల్చునట్టి మేల్
ఱాయిస్థితిన్ దలిర్చెడు ద్యురత్నముసారథి మీ కొలార్చుతన్. 54
ఉ. వానకుఁ దూర్పుగాలివలెఁ బావకకీలకు ధూమమట్లు లో
కానకు నాదిసృష్టిగతిగా శ్రుతిరాశికి నోంకృతి స్థితిన్
భానుని గ్రుంకునందు నటనం బిడు శూలికి నంది నాందిలా
గై నళినాప్తు తేర్నడపు న వ్వినతాత్మజుఁ డేలు మిమ్ములన్. 55
ఉ. మేలిమిబండలం గలసి మించిన సూర్యుగుఱాల చాలునుం
బోలెడు పచ్చలం గొలికిపూసకు మే ల్కురువిందమై స్వకీ
యాలఘుదీప్తి మేరుకుభృదాభరణం బొనరించు న మ్మహా
వ్యాళ విరోధి యన్న దవులం దిడి మీ యఘపంక్తి నెట్టుతన్. 56
చ. చిఱుతెనఁగోల బెత్తమును చేతను బట్టి గుఱాలపేరి స
ప్తరుచిర కక్ష్యలం గడపి ధ్వాంతపదావళి ఱొప్పి తేరి ముం
దిఱవుగ నుండి నేర్పున ధరేశులఁ జూపు జగత్సభా మనో
హర దినరాజు పెద్దప్రతిహారి సదా మిముఁ బ్రోచుఁ గావుతన్. 57
ఉ. పగ్గము లౌ నటం చరుణ వారుణపాశము లంటఁ బోకుమా
యెగ్గిడి యేకచక్రమని కృష్ణునిచక్రము ముట్టఁబోకుమా
దిగ్గున నెన్మిదౌ తగును దేవహయం బనఁబోకుమా యటం
చగ్గముగాఁ బరోపకృతి కర్కుఁడు దిద్దినవాఁడు మీ కగున్. 58
మ. పురుహూతా! కనుదమ్ము లొప్పె శిఖి! దీప్తుల్లేవె యిచ్చోటఁ గా
సరము న్నిల్పుము తాతపాదనతికై సౌరీ సరే నిరృతీ!
వరుణా! చూడుము, మారుతాఝడితి తెల్పంబడ్డదో శ్రీద యీ
శ్వరమీళే యని వైపుఱేండ్ల నను భాస్వత్సూతుఁ డేలున్ మిమున్. 59
చ. బడలఁడు డప్పి లే దలఁత బట్టదు మైమఱువండు పాంథుఁడై
మిడిమిడి యెండ బగ్గుమని మీఁదఁబడం జగమెల్లఁ గ్రుమ్మఱన్
సడలఁడు పచ్చగుఱ్ఱముల చాలను రమ్యవనంబు పట్టి యీ
తఁడు రవిసూతుఁ డీప్సిత పదార్థములం గృప మీకు నిచ్చుతన్. 60
ఉ. తీరిన గంగలో నిసుకతిన్నెల దూరిన డెక్కెలాడ క
మ్మేరువుకందరంబు లను మెట్టుల మ్రొగ్గినఁ గాళ్లు తొట్రిలన్
మీరిన పచ్చరాగరిక మేయఁగ సూర్యుగుఱాలు నిల్వ సొం
పూనఁ జలో చలో జలిది హుమ్మను నగ్రగుఁ డేలు మిమ్ములన్. 61
|| రథ వర్ణనము ||
ఉ. ఠీకుగఁ బ్రాగ్గిరి న్వెనుక డెక్కలయంచుల నిల్వ ఱొమ్ములన్
జౌకుమొయిళ్లు మేనులను సాచక యెత్తిన శబ్దహీనమై
ప్రాకెడి చక్రముం గలిగి పాఱ ననూరుఁడు లేచి మ్రొక్కినన్
వీకున నంతరిక్షమున వే జను సూర్యునితేరు మీకగున్. 62
ఉ. అంతటి చిమ్మచీఁకటుల నార్చు కరంబులు వేయి గల్గు భా
స్వంతుని మోయలేక శ్రమబట్టు మరుత్తుల నక్కడక్కడన్
వింతగ మెత్త లార్తురని వేఱుఁగ వేఱుఁగ నేర్పరించు న
త్యంత పటుప్రభావ జగదక్షరథంబు శుభంబు మీ కిడున్. 63
మ. మరతాళ్ళైన మహాహులం బొడువ నాఁ బ్రక్కి ల్విడంబ్రాఁకి వా
ర్ధరముల్ ఱిక్కలుగా ననూరుని వడిం బ్రప్రీతుఁ గావించి యా
హరి యేరీతి దలంచు నట్ల చని తార్క్ష్య ప్రక్రియం బోవు భా
స్కరుతే రెప్పుడు మిమ్ము బాపచయముల్ చక్కాడి రక్షించుతన్. 64
చ. నడ చుఱుకుందనాన నొకనాఁటను దీర్ఘ జగంబు చుట్టుచున్
గడు బరువై సుమేరువుశిఖన్ మణికోటుల నుగ్గు సేయుచున్
బుడమికి మీఁదఁ గొంతవడి భూర్యపరాద్రిని కొంతసేపు దా
నడుగున నుండు సూర్యరథ మాపద లెల్లెడ మీకుఁ బాపుతన్. 65
ఉ. దౌలకుఁ దూలుఁ గాంతిచెడి తారు గ్రహంబులు కేతనాంబరాం
దోళితుఁడై చనున్ శశి, విధుంతుదుఁడున్ గ్రసనేచ్ఛ వెంట రా
మూలుఁగు జక్రముల్ హరులు బుఱ్ఱన గాంగజలంబు వ్రీలు ని
ట్లోలి దలిర్చు భాస్కర రథోత్తమయానము లేలు మిమ్ములన్. 66
ఉ. కాడిని దార మక్షమునఁ గంకణథోరముఁ గట్టి కంబమం
దోడక ధూప మిచ్చి విరు లొయ్యనఁ గూబరమం దమర్చి మే
ల్జాడఁ బటీరగంధమునఁ జక్రము మెత్తుచు సిద్ధభామినుల్
వేడుక మింట మ్రొక్కెడి రవిప్రభుతే రఘభేది మీకగున్. 67
ఉ. ప్రక్కల నెక్కుడై తురగపద్ధతి లేచు పసిండిదుమ్ముతోఁ
జక్కఁగ నెప్పుడుం దిరుగు చక్రము నేములలోఁతు పాఱుచున్
నిక్కిన మేరువందుఁ దనవేఁడిమి నింకిన దిన్నెలౌ సుధా
భుక్కుల యేఱు నాఁ దగిన పూషునిరథ్య యొకండు మీ కగున్. 68
ఉ. మ్రొక్కఁగవచ్చు దేవగణముఖ్యుల చాలది త్రోవగాఁగ నా
చుక్కలు చక్రఘట్టనను జూర్ణముగా నది దుమ్ముగాఁగ బల్
నెక్కొను వాజిహేష దివి నిండిన నేమిరవంబుగాఁగ మి
న్న క్కుతలంబుఁ బోలఁగ నొనర్చిన యర్కు రథంబు మీ కగున్. 69
ఉ. జానగు దేవయానముల చాలున వచ్చి ద్యుషద్వితానముల్
పూని, నమో యన న్వడినిఁ బోవుచుఁ గానక సైకతంబులన్
మానగు గంగ మెల్ల జన మంథనమందిరమందుఁ బారిజా
తా నుపమానసూనముల నానిన భానురథంబు మీ కగున్. 70
చ. హరిహరులన్ సదృక్షపతి యక్షములన్ మఱి చక్రి చక్రమున్
సురలు సురంహ మల్ల యరుణు న్వరుణుండును స్థాణు స్థాణుఁడున్
విరివిగఁ గూబరంబునఁ గుబేరుఁడు గొల్వఁగ నిత్యయుక్తి మై
పరహితవృత్తి మెచ్చు ఖరభానునిస్యందన మేలు మిమ్ములన్. 71
మ. నయనాహీనుఁడు మూలమం దలరఁగా నాకౌకసుల్ పాదముల్
నియతిం గొల్వఁగ నెంతయున్ బలి హరుల్ శీఘ్రంబ లాగన్ మహా
వియదంభోనిధిలోన మంథరము నా వింతై కడుం బొల్చు న
వ్యయ రత్నంబు రథంబు తుల్యమగు భాగ్యం బిచ్చి మి మ్మేలుతన్. 72
|| మండల వర్ణనము ||
చ. పగటికి బీజమున్ తిమిరబాధక మక్షికి నంజనంబు ము
క్తిగవిని, ముజ్జగాలఁ దగు దీపము లొక్కటియైన ముద్ద వా
న గురియు హేతు వబ్ధి రశనారసపానము పెద్దచెంబు పే
ర్మి గలుగు సూర్యమండలము మీకునుఁ గోరిక లిచ్చుగావుతన్. 73
చ. చెలియలికట్ట మీఱి పడు సింధువునీటియలై సగంబు ము
న్నలమిన పెద్దచుక్కలకు ద్వారనభం బయి కొంచె కొంచెమై
పొలుచు వసంతుమోమునను బొట్టయి చీఁకటిగొట్టి ప్రాగ్గిరిన్
గలికితురాయి యైన దిననాథుని బింబము మీకు మేలిడున్. 74
ఉ. మేలిమికొండకుందనము మీఁదను జెక్కిన కెంపు నీలిమం
దేలిన నల్వకల్వలకు దిమ్మెకుఁ జుట్టును వ్రీలు జూలునుం
గాలము పేరి వ్యాళము ఫణామణియై, ఘనమై, సదా జగ
జ్జాలము మండనంబగు త్విషాంపతిమండల మేలు మిమ్ములన్. 75
ఉ. రేదొరరూపు సున్నయగు రిక్కల కేరును దిక్కులేరు దా
మోదర కౌస్తుభంబు చెడు నోటమిపాలగు నగ్గి కల్ల లం
బోదరుతండ్రి చూ పడఁగు నొప్పుగ దీనిప్రభల్ తమంబులన్
భేదిలఁ జేయునట్టి రవిబింబము సేయు మిముం బునీతులన్. 76
చ. తొలుతను తూర్పునం బొడిచి తూరుపుపే ర్దిశ కిచ్చు రెండు జా
ములతరి బగ్గనం దివసముం బొనరించుఁ గ్రమమ్ముగం జగ
మ్ములఁ దపియింపఁ జేయు మది ప్రోచును జీవన మౌచు పుట్టువున్
గలుగఁగఁజేయు నిట్టి దిననాథుని బింబము ముక్తి మీ కిడున్. 77
చ. గలగల యెండు నేలల యగుం జలధుల్ కులపర్వతంబులున్
దిలతులనంబులై నలుగు దిట్టపుఁ గాఁక యుగావసానవే
ళల నని లోకరక్షణపరాయణత న్నిఖిల ప్రభావళుల్
మెలపక వెల్గుమాత్ర మిడు మిత్రునిబింబము మీ ముదంబిడున్. 78
చ. చెరువు వియత్తలం బడుసు చీకఁటి తృప్తికి వచ్చునట్టి బం
భరములపాళి రాహువునుఁ బత్రము పత్ర మితారుణాభలా
యరుణునిశోభ లిట్టి దగునట్టి సహస్రదళంబుగాదె భా
స్కరు ఘనమండలం బిది సుసంగతి మీకును మంగళం బిడున్. 79
చ. పురహరునేత్ర మయ్యు నెఱపు న్నిరవద్యతఁ గామపూర్తి సం
సరణ సముద్రనావ యయి జౌకదు గాలికి నెల్లవేళలం
దిరిగియు నభ్రమంబు జగతిం భ్రమనాశి విరుద్ధకార్యమై
సరసము సూర్యమండలము శాశ్వతసౌఖ్యము మీకు నిచ్చుతన్. 80
|| రవి వర్ణనము ||
చ. శ్రితవిధులై బుధుల్ శ్రుతుల సిద్ధుల గీతిని సౌరగాతలున్
జతురతఁ జాటు గర్భముగఁ జారణులు న్యతబుద్ధి యాతుధా
నతతి ముహుర్ముహుర్నతఘనాహులు సార్ఘ్యము సాధ్యులున్ మహా
వ్రతనియతిన్ ముముక్షువులు పక్షతఁ గొల్చు నవాద్రి మీకగున్. 81
ఉ. చెంగట నంగుగా వెలుఁగు చిచ్చులకొల్మినిఁ గాచి కాచి వె
ట్టం గతిమ త్తురంగ ఖురటంకముల న్వడిఁ గోసి కోసి ని
స్సంగ రథాంగసంభ్రమ లసన్నికషాప్తిని గీసి గీసి ము
బ్భంగుల మేరువుం దిరిగి వన్నియగట్టు నినుండు మీ కగున్. 82
ఉ. బంగరుతమ్మి గంగఁ బ్రతిభం గనువాడదు నందనంబునన్
దుంగు సుమాళిలక్ష్మి కడు దోడదు నెండదు మేరుశృంగముల్
రంగు లెసంగుగాని చెదరంగఁ గరంగవు సత్కృపాప్తి ని
బ్భంగిని మార్దవంబు గల భాగ్య మహమ్ము నినుండు మీకగున్. 83
ఉ. చీకటి నొక్కదానిన గ్రసింపదు కల్మష కిల్బిషంబులన్
నూకునుఁ దమ్మిమాత్రము వినోది నొనర్పదు భక్తబోధన
శ్రీకము కేవల మ్మహిమ చేయదు శ్రేయముగూర్చు నుద్యమం
బేకము పూనియుం బను లనేకము సేయు నినుండు మీ కగున్. 84
చ. పరవశవృత్తి చెయ్వుడిగి ప్రక్కలఁ బండి నిరాశ నూర్చి యే
దరిఁ గనఁ జీఁకటై నెగులు దాల్చినయట్లు జగంబు జేయుచున్
మఱియొక లోక మభ్యుదయమాన్యము సేయఁగఁబోవునట్టి భా
స్కరుఁడు శుభక్రియాకలన సంతతము న్మిముఁ బ్రోచుఁ గావుతన్. 85
చ. నిలుకడ లేదు లోకగతి నిల్చునుఁ దత్పరిపాలనంబునన్
వెలుఁగున లోకదృష్టి మిఱుమి ట్లగు లోపలిదృష్టి మే లగున్
బలితపు లోకతాపమగు మౌనుల నిర్వృతి కారణం బగున్
లలి నిటుఁ బ్రాగ్దిశాధికవిలాసుఁడు భానుఁడు మీకు మేలిడున్. 86
ఉ. కాలము దప్పవాఱయిన కాఱులు పండు సువృష్టిఁ జేలు దే
వాళి మఘంబులం దనియు నప్పవమానుఁడు వీఁచు జుక్కలున్
దూలవు, మోచు నద్రు లిలఁ దోయధిమేరను మీఱ దాశలున్
మేలగు నిట్లు ముజ్జగము నిల్పు దివాకరుఁ డేలు మిమ్ములన్. 87
ఉ. చక్కనిచుక్కఁ బ్రక్క నిడి శంభుఁడు గ్రుమ్మఱు వెండి కొండపై
న క్కడలి న్మురారి యహియందు సుఖంబుగ నిద్రబోవు దా
న క్కమలాసనుండు దినమంతయుఁ జిత్తనిరోధ మూనుఁ బెం
పెక్క నితండు ముజ్జగమునేలఁగ నీ రవి మిమ్ముఁ బ్రోచుతన్. 88
ఉ. బింబము ఋక్కులై, లసదభీశులు సామములై యణుస్థితిన్
బింబము నొందువాఁడు మహనీయ యజుశ్రుతియై త్రయీమయా
డంబరమూర్తి యంచు నెదుటంబడి వైదికులెల్ల మ్రొక్క స్వ
ర్గం బపవర్గ మిచ్చు గ్రహరా జొసగున్ సిరి మీకు నిత్యమున్. 89
శా. అయ్యల్ లోకహితప్రచారులు సురేంద్రాదుల్ సుతుల్ దైత్యులున్
వ్రయ్యల్ సేసిన జోదు లయ్యదితి కెవ్వారున్న మౌనివ్రజం
బయ్యాదిత్యపదంబు వీని కగుఁగా కంచు న్నుతుల్ సేయు గ
క్షయ్యప్రాభవుఁ డైన సూర్యుఁడు సమస్తశ్రీలు మీకిచ్చుతన్. 90
చ. వెలుఁగున మంటిమేలిమియు వృష్టిజలాకృతి సంస్కృతి న్మహా
నిల తనువుష్ణిమన్ జగతి నిప్పుమెయిన్ మదిఁ గోర్కెలిచ్చి యు
జ్జ్వలలితమూర్తి యున్కి మినుచాయయు దర్శనుఁ జంద్రురూపు ని
ట్లలరి స్వమూర్తితో నెనిమిదౌ శివలీలల ప్రొద్దు మీ కగున్. 91
చ. లలిత నవప్రఫుల్ల కమలాకరభూషణ పాదశోభియై
దల మగు భక్తి మింట వినతాసుతుఁ డర్మిలి దారితోడుగా
నెలమిని యేడుగుఱ్ఱముల యెక్కుడు లోకముమీఁది దేవతల్
గొలువ మురారి పాటి నెసగుం గమలాప్తుఁడు మిమ్ముఁ బ్రోచుతన్. 92
చ. కమలము లుద్భవం బొసఁగు కారణమై యచలోదయప్రధా
న మయిన ముజ్జగంబుపయినం గల ధామము దుర్గమంబుగా
నమరఁ బ్రసన్నకాంతిఁ జతురాస్యత రెండవబ్రహ్మయో యనం
విమలతరాత్మభూతి గల వే వెలుఁ గిచ్చును మీకు సిద్ధులున్. 93
చ. మల లిలయుం దిశల్ జలధిపాళి బయల్ కనులన్ మెలంచి వే
ల్పుల నిలయంబునం దులనము ల్తలసూపని వేవెలుంగు ని
మ్ముల విలయంబునందె నలుమూళ్ళయొడళ్లఁ జెలంగి పాపబు
వ్వలు గల వేలుపన్న రథసాలునిఁ జేయు నినుండు మీ కగున్. 94
చ. కొలను నదంబు వాగు లలుగుల్ గల చెఱ్వులు తీర్థభావమున్
దొలఁగు పయోధినీటఁ బడఁద్రోచు నమంగళ మార్పలేదు వే
ల్పుల నది స్నాతులం బరమపుణ్యులఁ జేయదుగాదె యన్యలో
కుల నితఁ డేలఁబోవ సురకుంజరుఁ డిట్టి యినుండు మీకగున్. 95
చ. భువన మథోగతిఁం బుఱద మున్గినయట్లు తమంబు మూగుచో
నవగతి లేక జ్ఞానము వియత్సుమమై గుఱుతేది కూర్కు స
ర్గవిధికిఁ బూర్వమట్లు ప్రతి రాతిరి తన్నెడఁబాయు లోకమున్
దవిలి యొనర్చునట్టి శనితండ్రి సుఖంబులు మీకు నిచ్చుతన్. 96
ఉ. ఇక్కడి పశ్చిమాద్రి నిజ మెంచిన నక్కడి తూర్పుకొండ యౌ
నిక్కడ పండువెన్నెల పయిం బడ నక్కడ నెండ మెండగున్
జిక్కఁడు దేశకాలముల చేతికి వానిన లోఁగొనున్ సదా
యిక్కతనం ద్రిలోకహితుఁ డౌ నుతుఁ డా తపనుండు మీ కగున్. 97
ఉ. వ్యగ్రము లగ్ర్యసుగ్రహభహారిగురుల్ సముదగ్రలీలఁ బ్ర
త్యగ్రము లీషదుగ్రములు నౌ నురుగోవుల గోవు గౌరతా
భాగ్రతిఁ బ్రాగ్గిరి న్నిలచి ప్రాచి సరాగసురాగగా, దినం
బగ్రమునందుఁ జేసెడి గ్రహాగ్రణి మీ కగు నగ్రగస్థితిన్. 98
ఉ. వేదగురుండు పద్మజుఁడు విష్ణుఁ డజేయుఁడు శూలి శంభుఁడున్
శ్రీదుఁడు యక్షుఁ డయ్యముఁడు మృత్యువు పావకుఁ డగ్ని యంచు డి
ద్ధాదిపదంబు లట్లని సుధాంధులకుం బడెనంచు నామ మ
ర్యాదలు సార్థకంబుగఁ దనంత వహించిన ప్రొద్దు మీకగున్. 99
ఉ. చుట్టము పక్కముం గురువు చూపును గాపును జ్ఞాతి జ్యోతియున్
పట్టగు ప్రాణదాతయును భ్రాతయు తల్లియుఁ దండ్రియున్ సదా
పెట్టనికోటయై సకల పృథ్వికి నన్నము నీళ్ళు నిచ్చుచున్
దిట్టపు వెల్గులం దనరు దేవుఁడు మీకిడు వాంఛితంబులన్. 100
|| ఫలశ్రుతి ||
చ. నలుబదిమూఁట, నాఱిఁట గనం బదిరెంటనుఁ బద్నకొంట బెం
పలరఁగ నెన్మిదింట, నిరు పంక్తుల తేజము వాజులున్ హయ
మ్ముల నదలించువాని రథమున్ ఘనబింబము సూర్యదేవునిన్
దెలియగ నమ్మయూరుఁడు నుతించిన శ్లోకశతమ్ము మీకగున్. 101
చ. పొలుపుగఁ జేసె లోకహితబుద్ధి మయూరుఁడు నూఱుశ్లోకముల్
చెలువగు భక్తితోఁ బఠనచేసిన పుణ్యుఁడు ముక్తపాపుఁడై
బలధిషణాయువుల్ చదువు భాగ్యము సత్కవితార్థ పుత్రభా
క్కలన నరోగతామహిమఁ గాంచును సూర్యుననుగ్రహంబునన్. 102
దాసు శ్రీరామవిరచిత సూర్యశతకము సంపూర్ణము.
: శతకములు :
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము | మాతృ శతకము | కఱివేల్పు శతకము | మదనగోపాల శతకము | చక్కట్లదండ శతకము | సుందరీమణి శతకము | కాంతాలలామ శతకము | తాడిమళ్ళరాజగోపాల శతకము | భక్తమందార శతకము | కుక్కుటేశ్వర శతకము | భర్గ శతకము | లావణ్య శతకము | వేణుగోపాల శతకము | విశ్వనాథ శతకము | ఒంటిమిట్ట రఘువీరశతకము | మృత్యుంజయం | చెన్నమల్లు సీసములు | సంపఁగిమన్న శతకము | కుమార శతకము | శ్రీ అలమేలుమంగా శతకము | సూర్య శతకము | నీతి శతకము | శృంగార శతకము | వైరాగ్య శతకము | మంచి మాట వినర మానవుండ | సదానందయోగి శతకము | శివముకుంద శతకము | మృత్యుంజయ శతకము |