సర్వేశ్వర |
: సర్వేశ్వర శతకము :
రచించినవారు - యథావాక్కుల అన్నమయ్య
శా. శ్రీకంఠుం బరమేశు నవ్యయు నిజశ్రీపాదదివ్యప్రభా-
నీకోత్సారితదేవతానిటలదుర్నీత్యక్షరధ్వాంతుఁ జి-
త్ప్రాకామ్యాంగు నపాంగమాత్రరచితబ్రహ్మాండసంఘాతు జం-
ద్రాకల్పుం బ్రణుతింతు నిన్ను మది నాహ్లాదింతు సర్వేశ్వరా! 1
మ. ఒకమా టీసకలంబు నీ మయముగా నూహించుచు న్వెండి యొ-
క్కొకమాటింతయు నీవు గావనుచు నేయుక్తిం బ్రశంసింపనే-
రక వేదంబులు చిక్కుపడ్డవనినం బ్రవ్యక్తమై యుండు భా-
వకుఁడై నీ నిజరూప మిట్టిదన నెవ్వండోపు సర్వేశ్వరా! 2
శా. జ్ఞానాతీతుఁడవైన నీ మహిమఁ బ్రజ్ఞం బూని తర్కించు ట-
జ్ఞానాంగంబగు నైననుం దమ యథాశక్తిం బ్రశంసించి ది-
వ్యానందస్థితిఁ బొందువారిఁ గని భక్త్యావృత్తి నిన్నెట్టివాఁ-
డైనం బ్రస్తుతి సేయుచుండుఁ దనచే నైనంత సర్వేశ్వరా! 3
మ. అమితాంభోజభవాండభాండనిలయంబైయుండు నీ యంతరం-
గము పట్టెంతయొ దానికింక బహిరంగం బెట్టిదో సూక్ష్మత-
త్త్వము దానంతకుమీఁద నేమివిధమో తానిట్టి నీ పెంపుమా-
ర్గము నీకైన నచింత్య మెట్లొరుఁ డెఱుంగం జాలు సర్వేశ్వరా! 4
మ. ఇన విఘ్నేశ్వర మాతృకాద్రుహిణ బ్రాహ్మీ స్కంద దుర్గా రమా
వనితాధీశ్వర భైరవుల్ బలిసి భాస్వద్భక్తిసంయుక్తి నీ-
కనిశంబుం బరివారభృత్యనికరంబైరన్న నిన్నింకం గొ-
ల్వనివారెవ్వ రజాండభాండములలో వర్ణింప సర్వేశ్వరా! 5
శా. ఏపారంగ నజాండభాండనికరం బేరూపులో బుట్టి యు-
ద్దీపించు న్మఱి రూపులెల్ల సమసుప్తిం బొంది యేరూపులో
లోపించుం గలయంగ నంతటికిఁ దా లోనై విజృంభించి యే
రూపం బవ్యయమై వెలుంగు నది నీ రూపంబు సర్వేశ్వరా! 6
మ. జలజాతప్రభవాండబుద్బుదము లశ్రాంతంబునుం బుట్టుచుం
గలయం గ్రాఁగుచునుండు నీ పృథులలింగస్ఫారగర్భాబ్ధిలో-
పలఁ దద్బుద్బుదగర్భవాసులు హరిబ్రహ్మాది దేవాళియుం
గలదే వారికి నీ మహత్త్వ మెఱుఁగంగా శక్తి సర్వేశ్వరా! 7
మ. భవదున్మేషవిజృంభణంబు పరికింపంగా సరోజాతసం-
భవు జన్మంబు భవన్నిమేష మమితబ్రహ్మాండకల్పాంత భై-
రవసంక్షోభిత మన్నఁ దక్కిన భవత్ప్రారంభభూరిక్రియా-
నివహం బెవ్వరు నేర్తు రిట్టిదని వర్ణింపంగ సర్వేశ్వరా! 8
మ. పవనుండై హిమధాముఁడై యనలుఁడై పానీయమై యాత్మయై
రవియై యంబరమై మహీవలయమై రమ్యాష్టమూర్తిక్రియన్
భువనాండంబులు లక్షణాంగములుగాఁ బుట్టించు నత్యద్భుతో-
త్సవలీలావిభవంబుతోడ భవదాజ్ఞాశక్తి సర్వేశ్వరా! 9
మ. జలజాతప్రభవాండభాండములు దుశ్చారిత్రులం బాత్రులం
జెలువై యుండ యథాప్రమాణములుగా శిక్షింప రక్షింప ని-
శ్చలలీలం బ్రభవించు రాజు భవదాజ్ఞాశక్తిఁ గాకింత వ-
ట్టెలమిం జేకొని నిర్వహింప మఱి రాజెవ్వండు సర్వేశ్వరా! 10
శా. జ్ఞానజ్యోతి విజృంభమాణముగ నోజన్ విష్ణువిధ్యాది దే-
వానీకాత్మదశావళిం దవిలి నీవారంగ వారిం గళా-
జ్ఞానప్రౌఢులఁ జేయుటన్ వెలయఁగా సర్వజ్ఞశబ్దంబు దా
నీ నామాంకముగా విధించు నిగమానీకంబు సర్వేశ్వరా! 11
మ. సురల న్మర్త్యసమూహిగా మనుజులన్ శోభిల్లు బృందారకో-
త్కరముంగా ఘను నల్పు నల్పుని ఘనుంగాఁ బుణ్యపాపాలిచేఁ
దిరుగ న్వైచుచు నీ మహామహిమ ప్రీతిం బద్మజుండంబునం
దరయన్ జీవుల నింద్రజాలములుగా నాడించు సర్వేశ్వరా! 12
మ. ఘనుఁడై యేచి దశాననుండు బలిమిం గైలాసశైలేంద్ర మె-
త్తినఁ దద్దానవనాథుఁ ద్రొక్క నతఁ డర్థి న్మ్రొక్కినం గాచి ప్రా-
క్తనశౌర్యాధికుఁ జేసె దుష్టు నణఁపంగా శిష్టు రక్షింప రం-
జనతో నెప్పుడు వేచియుండు భవదాజ్ఞాశక్తి సర్వేశ్వరా! 13
మ. తమకం బెత్తిన నాత్మజం గడు మదాంధవ్యాప్తి నేకాంతప-
క్షమునం దెవ్వరుఁ గానకుండఁ గవయంగాఁ బోయి నీ బాణఘా-
తమునం బద్మభవుండు ద్రెళ్లెననినం దాఁ దప్ప వర్తించి లో-
కమునం దెవ్వరికింక నిన్ను నెఱుఁగంగా వచ్చు సర్వేశ్వరా! 14
మ. పలుజన్మంబులఁ గూడఁబడ్డ భవశుంభద్ఘోరదుష్కర్మరా-
సులు పైఁ గూలి సమస్తజీవులు వెసన్ శోషించుచు న్బెద్దదు-
ర్బలురై చిక్కిన దద్భవాపహరణార్థం బొప్పఁ బద్మోద్భవ-
ప్రళయం బొక్కొకమాటు సేయుదు తుదిన్ భావింప సర్వేశ్వరా! 15
మ. సుమహత్పద్మభవాండపంక్తుల లయక్షోభప్రతాపంబుతో
నిమిషార్థంబునఁ గ్రాఁచి పెంపెసఁగు నీ నేత్రానలజ్యోతి య-
య్యమమీనాంకజలంధరత్రిపురదైత్యాలి న్విజృంభించి భ-
స్మముగాఁ జేయుట నిశ్చయింప నిది దా శౌర్యంబె సర్వేశ్వరా! 16
మ. అతిదక్షుండగు దక్షుఁ డీజగములో యాగంబు సల్లక్షణ-
స్థితిగాఁ జేయుచునుండి మిము మది నుద్దేశింపమిం జేసి తా
హతుఁడయ్యెం దుది నట్టికార్యములుఁ బొందై యుండునే కర్తస-
మ్మతితో జేయని దుర్మదుండు మనునే భావింప సర్వేశ్వరా! 17
మ. జగతీచక్రము పాదఘట్టనసదృశ్యంబై ప్రవర్తింపఁగా
గగనంబంతయు బాహుమండలసమగ్రవ్యాప్తులం దద్భుతం-
బుగ ఘూర్ణిల్ల నజాంత్యవేళల సముద్భూతాంగహారావళుల్
నిగుడం బొంగి నటింతు తాండవమహానృత్యంబు సర్వేశ్వరా! 18
మ. అమరేంద్రాబ్జభవాళి కెన్నఁ దుది నీ వాదిం బ్రసాదింప న-
ర్థము సిద్ధించుచునుండుఁగాని సురమాత్రుం గోరిన న్వీరి కా-
ర్యము సిద్ధింప దనేకమార్గములఁ బ్రారంభించిరే నిశ్చయా-
ర్థముగా నీవ సమస్తకర్త వగుటం దర్కింప సర్వేశ్వరా! 19
మ. అమరంగా స్ఫుటభక్తినాటకము భాషాంగక్రియాంగాభిర-
మ్యముగాఁ జూపిన మెచ్చి మీరిల బలే యన్నంతకున్ యోనిగే-
హములన్ రూపులు వన్నుకొంచును నటుండై వచ్చి సంసారరం-
గములోనం బహురూపమాడు వెలయంగా జీవి సర్వేశ్వరా! 20
శా. శ్రీవత్సాంకు రమావిశేషతయు వాక్ఛ్రీనాథు చాతుర్యమున్
దేవాధీశ్వరు వైభవోన్నతియు నా తిగ్మాంశు తేజంబు శ్రీ-
దేవీనందను రూపవిభ్రమము చింతింపంగ నీ భక్తిస-
ద్భావాత్ముండగు పుణ్యమూర్తికి దృణప్రాయంబు సర్వేశ్వరా! 21
మ. ఇల సద్భక్తుల పాదధూళిపటలం బేమర్త్యుఫాలంబునం
జిలుకు న్వాఁ డపవర్గనాథుఁ డనినన్ సిద్ధంబుగా వారి ని-
ర్మలహస్తార్పితభూతిఁ బ్రీతి నొసలారం బూయు విశ్వాసికిన్
ఫలమూహించి విధించి యెవ్వరికిఁ జెప్పన్వచ్చు సర్వేశ్వరా! 22
మ. పలుతీర్థంబులఁ గ్రుంకుకంటె మహిలో భక్తాంఘ్రిపానీయముల్
తలమీఁదం జిలికించుకొన్న శుచితీర్థం బాడ భారంబు త-
త్ఫల మత్యల్పము భక్తపాదయుగళాంభఃస్పర్శ నిర్భారమై
యలరున్ శాశ్వతభుక్తిముక్తిఫలదంబై యుండు సర్వేశ్వరా! 23
మ. రమణన్ భక్తసమగ్రదర్శనము తీర్థశ్రేణి తద్గోష్ఠి తీ-
ర్థము తద్దివ్యదయావలోకనము తీర్థంబెన్నఁగా నిట్టి జం-
గమతీర్థాంబుధి నోలలాడక వివేకభ్రష్టులై పోయి లో-
కములోఁ దీర్థములంచు నేఱులు సొజంగానేల సర్వేశ్వరా! 24
మ. కమనీయంబగు సర్వతీర్థములు లింగంబున్నచో మూర్తిమం-
తములై యొప్పుచునుండు లింగమును దాత్పర్యంబుతో భక్తగా-
త్రములం దెప్పుడు నుండుఁ గాన మహిలోఁ దత్త్వార్థ మూహింపఁ దీ-
ర్థములందెల్లను దివ్యతీర్థము భవద్భక్తుండు సర్వేశ్వరా! 25
మ. ధరణిం దీర్థములాడుకంటె నతిమోదం బొప్ప యజ్ఞంబులం
బరగం జేయుటకంటె సువ్రతములొప్ప వేదశాస్త్రార్థత-
త్పరుఁడై యాదటఁ జల్పుకంటె మది నుత్సాహించి నీ భక్తిమ-
త్పురుషశ్రేష్ఠులఁ బూజసేయుట మహాపుణ్యంబు సర్వేశ్వరా! 26
మ. భవదీయామలతత్త్వనిర్ణయకళాప్రఖ్యాతసద్భక్తపుం-
గవగోష్ఠీసుఖవార్ధిలోనఁ గడువేడ్కం దేలినం గాక యీ
భువిలోఁ దీర్థజలంబులం గడగినం బోనేర్చునే ఘోరదు-
ర్భవసంఘాకలితాత్మతామసమహాపంకంబు సర్వేశ్వరా! 27
మ. ధరణిం బ్రాక్తనభక్తనిర్మితమహాస్థానంబులై యొప్పు శ్రీ-
గిరిముఖ్యంబగు దివ్యతీర్థములు భక్తిం జూచిరే వారి దు-
స్తరదోషంబులు వాయునన్న మఱి సాక్షాద్భక్తులం జూచినం
బరమార్థంబుగఁ బాయదే నరుల పాపంబెల్ల సర్వేశ్వరా! 28
మ. కని సద్భక్తుల కంత నంతఁ గడువేడ్కన్ హృత్ప్రణామంబు సే-
సినమాత్రం జెడు సర్వదోషములు తచ్ఛ్రీపాదము ల్ముట్టి మ్రొ-
క్కిన సర్వాంగసమగ్రశుద్ధియగు భక్తిన్ వారికిం బ్రీతిచే-
సినఁ ద్వద్దివ్యదయావలోకనఘనశ్రీ లొందు సర్వేశ్వరా! 29
మ. జలజాతప్రభవాచ్యుతాదులు మదిం జర్చించి చర్చించి నీ
కల రూపారయలేక చిక్కులఁ బడంగా నిన్ను హస్తార్పితా-
మలకవ్యాప్తికిఁ దెచ్చి యేర్పఱచి సంబంధించి చేకొన్న భ-
క్తుల శౌర్యం బుపమింప నెవ్వఁడు సమర్థుం డింక సర్వేశ్వరా! 30
మ. అమరన్ భక్తగణాత్మమధ్యమము లింగావాస మీ లింగ మ-
ధ్యమముం బద్మభవాండభాండనిలయంబై యుండుట భక్తతృ-
ప్తిమహాలింగము తృప్తియై మహిమ నుద్దీపించుఁ దల్లింగతృ-
ప్తిమహత్త్వంబున నీ సమస్తమును దృప్తిం బొందు సర్వేశ్వరా! 31
మ. అనురాగంబున నిన్నుఁ జూచుఁ దలపోయన్ జొక్కుఁ గాంక్షించు వ-
ర్ణన సేయం దమకించు సిగ్గు విరియన్ బ్రార్థించు శోషించు నం-
త నెదన్ ధ్యానము దాల్చుఁ దన్ను మఱచుం దానీ దశావస్థలం
దనరంగా మది నిన్ను డక్కఁ గొను సద్భక్తుండు సర్వేశ్వరా! 32
మ. ఎలమిన్ భక్తుఁడు వక్రుఁడై నడిచెనే నేపారఁగా దానికిం
గలుషింపం గలహింపఁ గింకిరిపడం గాదెట్టిచోనైన ని-
ర్మలగంగాపృథులప్రవాహ మరయం బ్రస్ఫూర్తిఁ దానెన్ని వం-
కలుగాఁ బాఱిన దాని నొండు వలుకంగాఁ జన్నె సర్వేశ్వరా! 33
మ. సికతాధామము నీకుఁ జేసి మదిలోఁ జెన్నొంది క్రీడించు బా-
లకు లింద్రాధికులన్న నీ గుడు లతిశ్లాఘ్యేష్టకాష్ఠాదులన్
సుకుమారంబుగ నెత్తి భూతలములో శోభిల్లు వంశప్రదీ-
పకు సౌభాగ్యము మాన మెవ్వరికిఁ జెప్పన్వచ్చు సర్వేశ్వరా! 34
మ. భవదభ్యర్చనవేళలన్ భవుల సంపద్భ్రాంతులన్ దీనమా-
నవులన్ విద్విషులన్ భవాతురుల సన్మానించుటల్ సౌఖ్యము-
ఖ్యవిహారేచ్ఛలు నీ మహత్త్వములు నిత్యానంద మూహించుచో
భువి నీ భక్తుల కాత్మలో విరసము ల్వుట్టించు సర్వేశ్వరా! 35
మ. కరుణం జేకొనిరేని రౌరవపదగ్రస్తాత్తు దేవేంద్రుఁగాఁ
బరగం జేయుదు రాత్మలో నలిగిరేఁ బర్జన్యు నా రౌరవో-
త్కరపంకప్రవిలీనకీటకముఁగాఁ గల్పింతు రన్నట్టిచో
నరయన్ భక్తుల శక్తి యెట్లు గుఱిసేయ న్వచ్చు సర్వేశ్వరా! 36
మ. రమణీయక్షితిపాలుఁ డింద్రుని చతుర్మాసక్రమాయుష్యుఁ డా
యమరేంద్రుం డజునాడికాద్వయమువాఁ డా బ్రహ్మ యుష్మన్నిమే-
షమువాఁ డంచును వీరినెల్ల నగు నీ సాలోక్యసామీప్యస-
త్తమరాజ్యస్థితిపట్టభద్రుఁ డగు సద్భక్తుండు సర్వేశ్వరా! 37
మ. ప్రకటింపంగ సమస్తపాతకములం బాపంగ నీ పూజయం-
దొక పుష్పాంశము చాలునన్న మహిలో నూహింపఁగా నీ పదా-
ర్చకు లేమార్గమునందు శుద్ధులు మదిం జర్చింపఁ దద్దుర్గుణ-
ప్రకరం బెన్నెడివాఁడు లోకములలోఁ బాపిష్ఠి సర్వేశ్వరా! 38
మ. తమ తేజంబుఁ దృణీకరించుచు సముద్యత్తేజులై మీఁదిలో-
కములందున్ జరియించు నీ యచలభక్తశ్రేష్ఠులం జూచి నె-
య్యమునం దారును దద్విధంబునను నిన్నర్చింప నూహించి మ-
ర్త్యమునం బుట్టఁగ వాంఛసేయుదు రమర్త్యశ్రేణి సర్వేశ్వరా! 39
మ. అమరన్ భక్తులకెల్ల నీవ హృదయంబై యుండుట న్వారి సౌ-
ఖ్యము నీ సౌఖ్యము వారి కూర్మియు సమగ్రంబైన నీ కూర్మిత-
త్త్వము భావింపఁగ వారి కోపము భవత్ప్రఖ్యాతరౌద్రప్రభా-
వము దా వారల వాక్యనిర్ణయము నీ వాక్యంబు సర్వేశ్వరా! 40
మ. అవనిం బెన్నిధి భాగ్యహీనునకుఁ బ్రత్యక్షంబు గాకప్పు డొం-
డవ భాండాకృతిఁ దాల్చి మాఁటువడి మాయావృత్తి నున్నట్లు దా
భవదీయప్రతిబింబమూర్తియగు సద్భక్తుండు సంసారదు-
ర్వ్యవయసాయాత్ముల కెల్లఁ గేవలనరుండై తోఁచు సర్వేశ్వరా! 41
మ. క్షితిపై శ్వేతమునీంద్రుఁ జంప నలుకం గీనాశుఁ డేతెంచి నీ
యతికోపోజ్జ్వలనాహుతి న్మడిసెఁ దథ్యం బేకనిష్ఠాసమ-
న్వితులం జేకొని భక్తవత్సలుఁడవై నీవెప్పుడు న్గావఁగాఁ
బ్రతిపక్షావలి కెట్లు వారి దెసఁ జేరన్వచ్చు సర్వేశ్వరా! 42
శా. కింకం దన్ను నదల్చి చక్రమునఁ దాఁ గృష్ణుండని న్వైచినం
బొంకంబొప్పఁగ దానిఁ దుత్తుఱుముగాఁ బోఁదట్టి యుప్పొంగె ని-
శ్శంకాత్ముండు దధీచి శాశ్వతులు నీ సద్భక్తు లూహింపఁగా
సంకల్పప్రభవప్రతాపవనభాస్వద్దావ సర్వేశ్వరా! 43
మ. ఘటదుగ్ధంబులు పేరుఁగాక వెలయంగా నెంత తోడంటి న-
న్నట దుర్గాంబుధి పేరునే జగములో నల్పుండు దుస్సంగతిం
జటులాత్ముండగుఁ గాక యెయ్యెడల నీ సద్భక్తుఁ డేకార్య ము-
త్కటమై తాఁకిన నన్యచిత్తుఁడగునే తర్కింప సర్వేశ్వరా! 44
మ. సతి వేడ్కం దన ప్రాణవల్లభునితో సంయోగ మర్థించుఁ గా-
కతనిం బ్రార్థనసేసి సొమ్ముగొనిపో నఱ్ఱాడునే భక్తుఁ డీ-
క్షితి నీ భక్తియ వేఁడుఁ గాక మఱి నీ శ్రీపాదము ల్గొల్చి కు-
త్సితకామ్యార్థము లొండు వేఁడుకొనునే చింతింప సర్వేశ్వరా! 45
మ. భ్రమరధ్యానము దాల్చి కీటకము సద్భావాదిసంయుక్తిఁ దా
భ్రమరంబై ఖగవీథి నాడునని నన్బాటించి నిన్నాత్మ నె-
య్యముతో ధ్యానము సేయు మర్త్యుఁడును నీయట్లే పరవ్యో-
మతత్త్వమునం దవ్యయలీల నుండు టరుదే భావింప సర్వేశ్వరా! 46
మ. అమరశ్రేణులకు న్సుధామయకళౌఘాత్మీయసారంబు ర-
గ్యముగాఁ గ్రోలఁగ నిచ్చి తానొక కళామాత్రాంగుఁడై యున్న చం-
ద్రమునిం జూచి జగమ్ము మ్రొక్కుగతినారన్ భక్తపూజానిధి-
క్రమభారాకృశుఁ జూచి మ్రొక్కుదురు లోకంబెల్ల సర్వేశ్వరా! 47
మ. చెదరం బాఱు దశప్రభంజనములన్ శిక్షన్ సుషుమ్నంబునం
గుదియం బట్టి చలింపకుండ శశినర్కుం గట్టి భాస్వన్మన-
స్సదనస్థానమునందు నిన్నెలమి సంస్థాప్యంబుగాఁ జేసి తా
హృదయానందరసాబ్ధిఁ దేలు శివయోగీంద్రుండు సర్వేశ్వరా! 48
మ. వెలి వీక్షించిన నీ స్వరూపమె మహావిస్పష్టమై యాత్మలో-
పల భావించిన నీ స్వరూపమె మహాప్రవ్యక్తమై దృష్టులం
దలఁపం జేకొని యున్న నీ యచలితధ్యానంబునం జేసి తాఁ
గలనైన న్శివయోగి తన్ను జగముం గానండు సర్వేశ్వరా! 49
మ. భవదాకారమె కాంచు నీ స్తవకదంబశ్రేష్ఠసద్వాక్యముల్
చెవులార న్విను నిన్నె చెప్పు మది దుశ్శీలేంద్రియాటోపదు-
ర్వ్యవసాయాత్ములఁ గాంచుచో వినెడిచో వర్ణించుచోఁ జీఁకునుం
జెవిటి న్మూగయునై చరించు మహి నీ శీలుండు సర్వేశ్వరా! 50
మ. అతిలాలిత్యముగా నహర్నిశము నిన్నర్చింపగా వచ్చు సు-
వ్రతుఁడై యుండఁగవచ్చు నెల్లకళలం బ్రౌఢుఁడు గావచ్చు వా-
క్పతి గానైనను వచ్చుఁ గాని మఱి నీ భక్తుండు గారాదు సు-
స్థితిగా నీ దయ లేని మానవునకుం జింతింప సర్వేశ్వరా! 51
మ. భవికిన్ భక్తి మహత్త్వ మంకురితమై పాటిల్‌ల భక్తుండు బాం-
ధవమాత్రుండగు భక్తి పుష్పితముగాఁ దద్భక్తుఁ డాత్మేశుఁడై
సవిశేషస్థితిఁ దోఁచు భక్తి సఫలోత్సాహంబునుం బొందఁగా
నవికల్పస్థితి నంత భక్తుఁడును నీవై యుండు సర్వేశ్వరా! 52
మ. సుముఖుండై శివయోగి మోదము మదిన్ శోభిల్లఁ జేకొన్న భి-
క్షము విప్రోత్తమకోటిభోజనసదృక్షంబన్న సౌభాగ్యయో-
గమునం దారయ నమ్మహామహుఁడు వేడ్కం గోరి యారోగిణం-
బమరం జేసిన పుణ్యమెట్లు గుఱిసేయ న్వచ్చు సర్వేశ్వరా! 53
శా. ఎచ్చో నీ పదభక్తుఁ డుండు మది నింపెక్కం బ్రయత్నంబుతో
నచ్చో నీ వనిశంబు నుండుదు త్వదీయధ్యానచిన్మూర్తులై
యచ్చో సన్మునులెల్ల నుండుదురు మంత్రాంగాక్షరాయుక్తులై
యచ్చోఁ దీర్థములెల్ల నుండు నిది వేదార్థంబు సర్వేశ్వరా! 54
శా. సత్యం బెప్పుడుఁ దప్పఁడేనియు దురాచారుండు గాఁడేని యౌ-
చిత్యం బేమఱఁడేని దుర్జనుల గోష్ఠిం బొందఁడే భక్తసాం-
గత్యం బాదటఁ బాయఁడేని మదనగ్రస్తుండు గాఁడేని నీ
భృత్యుం డాతఁడు మూఁడులోకములలోఁ బెంపొందు సర్వేశ్వరా! 55
శా. పెంపన్ దల్లి యగున్ రుజాపటలదుష్పీడావిధి క్షోభ వా-
రింపన్ వైద్యుఁ డగుం గుమార్గవిధులం గ్రీడింపఁబోకుండ శి-
క్షింపన్ బల్లిదుఁడైన తండ్రి యగుచున్ శ్రీమంతుఁగా నెంతయున్
సంపద్వృద్ధి యొనర్ప దాతయగు నీ సద్భక్తి సర్వేశ్వరా! 56
మ. ఉరుసంసారగజేంద్రదర్పదళన వ్యూఢప్రతాపోగ్రకే-
సరి దుష్ప్రాపశరీధబంధవిపులక్ష్మాజవ్రజచ్ఛేదవి-
స్ఫురితక్రూర కుఠారధార దురితప్రోద్భూతజీమూతదు-
స్తరసంఘాతవిఘాత మారుతము నీ సద్భక్తి సర్వేశ్వరా! 57
మ. అరివీరప్రకరంబు భీకరతరంబై తాఁకుచో సింహసిం-
ధురశార్దూలమృగోరగాది భయము ల్దోతెంచుచో ఘోరదు-
స్తరసంసారవికారవేదనలు మీఁదం బర్వుచో వజ్రపం-
జరమై చేకొని తన్ను నెత్తుకొను నీ సద్భక్తి సర్వేశ్వరా! 58
మ. కమలాప్తుం డుదయింపఁగా ననలనక్షత్రక్షపాధీశతే-
జములెల్లం బెడఁబాసిపోవు గతి నీ సద్భక్తిభావంబు చి-
త్తములోనం బ్రభవింపఁగా నితరమంత్రధ్యాన తద్దేవతా-
క్రమమాయాపటలంబు లన్నియును వీఁకం గ్రాఁగు సర్వేశ్వరా! 59
మ. చటులప్రాయగుణేంద్రియాత్ములకు వాంఛావృత్తి నీ భక్తి సం-
స్ఫుటమై యుండదు భక్తితత్పరులకుం బొల్పొందఁగాఁ జిత్త ము-
త్కటదుష్టేంద్రియవర్గతామసపరిగ్రస్తంబు గాదెట్లు చీ-
కటికిం దిగ్మమరీచికిం గలదె సాంగత్యంబు సర్వేశ్వరా! 60
మ. బలవంతుండును దుర్బలుండును మహాప్రౌఢుండు మూఢుండునుం
గులజుండుం గులహీనజాతుఁడు ఘనక్రూరుండు శాంతాతిని-
శ్చలచిత్తుండును నొక్కరూప మది నీ సద్భక్తి చిత్తంబులో-
పల వర్ధిల్లిన మీఁద నేవిధమునన్ భావింప సర్వేశ్వరా! 61
శా. కామోద్రేకవిజృంభణంబును సమగ్రక్రోధమున్ లోభమున్
వ్యామోహంబు మదంబు మచ్చరము దీవ్రంబైన పంచేంద్రియో-
ద్దామాటోపము గ్రాఁచి పెంపెసఁగు తత్త్వజ్ఞానికిం గాక తా
సామాన్యాత్ముల కేల నూలుకొను నీ సద్భక్తి సర్వేశ్వరా! 62
మ. ఉరుపక్షంబులు వచ్చునంతకు నిరుద్యోగంబున న్వృక్షకో-
టరమధ్యంబుననుండు పక్షిగతి నిష్ఠం గోరి నీ భక్తి వి-
స్తర మాత్మం బ్రభవించు నంతకును నీ సంసారకారాగృహాం-
తరగేహంబున నుండి జీవుఁ డతివంతన్ బొందు సర్వేశ్వరా! 63
శా. లింగారాధన జంగమార్చనము లోలిన్ భక్తి కంగంబు ప్రా-
ణాంగవ్యాప్తియునై స్ఫురించు నిది తత్త్వార్థంబగుం గాన నా
యంగాభ్యర్చన జంగమాహితకరుండై చేసినం దా శవ-
శృంగారంబగు వాని భక్తి మదిఁ జర్చింపంగ సర్వేశ్వరా! 64
మ. అరయన్ గర్మవిధావధానవిధివద్ధ్యానోత్తమజ్ఞానముల్
వరుసన్ బేర్కొన నాల్గుయోగములు తత్త్వంబెందు నీ భక్తి వి-
స్తరబాహ్యక్రియలెల్లఁ బొల్లులగుటం దద్భక్తియోగంబు తాఁ
బరగం దక్కిన మూఁడుయోగములకుం బ్రాణంబు సర్వేశ్వరా! 65
మ. అమరంగా ధనమిచ్చి కాతురు మహీయఃప్రీతిఁ బ్రాణంబుఁ బ్రా-
ణము నర్థంబును నిచ్చి కాతు రభిమానంబు న్విశేషించి మా-
నము బ్రాణంబు ధనంబునిచ్చి కడుసన్మానంబుగా నుత్తమో-
త్తమచారిత్రులు భక్తిఁ గాతురు ప్రమోదంబంది సర్వేశ్వరా! 66
మ. అనుబంధేంద్రియభూతవర్గము యమాద్యష్టాంగమంత్రోరుసా-
ధన నుచ్చాటన సేసి పాపి గురుసద్వాక్యప్రకాశోత్తమాం-
జనదృష్టిం బరికించి యేర్పఱిచి వాంఛం గోరి సాధించి చే-
కొను చిన్మూర్తికి గాని భక్తివిధి గీల్కోదెందు సర్వేశ్వరా! 67
మ. కనకంబందు ఘనీభవించిన కళంకంబెల్ల సువ్యక్తిగా
ననలాస్యంబునఁ దెఁగిపోవు గతి జీవాత్మం బ్రవేశించి చే-
కొని వర్తించిన దుర్మలత్రయపరిక్షోభంబు నీ భక్తిచే-
తను బాపంబడుఁ గాని యొండొకటి చేతం బోదు సర్వేశ్వరా! 68
మ. అమరంగా గురుమంత్రకార్ముకమునం దాత్మాస్త్రమష్టాంగయో-
గమహాముష్టి వివేకి యేయుటయుఁ దత్కాండం బజాండాది త-
త్త్వములెల్ల న్వడి నుచ్చిపాఱి భవదుద్యత్సూక్ష్మకైవల్యల-
క్ష్యమునం దద్భుతశక్తితోడఁ గమియంగా నాఁటు సర్వేశ్వరా! 69
మ. తనరం గాయవహిత్రమందు హృదయస్తంభాభిసంస్థానమై
చను నీ ధ్యానపటంబు నూల్కొలిపి భాస్వద్భక్తివాతాహతి-
న్వినుతజ్ఞానపథంబు చేకొని సముద్వేగంబుమై జీవుఁ డీ
ఘనసంసారమహార్ణవంబుఁ గడుపంగాఁ బాఱు సర్వేశ్వరా! 70
మ. అకలంకస్థిరభక్తి మున్సొగయ నిన్నశ్రాంతముం జూచి పా-
యక పూజించు మహామహుండు భవదభ్యర్చ్యుం డగుంగాక దా
సకలేచ్ఛావిషయంబులం బొగయుచుం జాపల్యతం జేయు నా
బకవేషార్చనలేల నిన్ను సొగయింపం జాలు సర్వేశ్వరా! 71
మ. సమదోత్సాహసుఖాభిలాషలును నీ సంసారమాయావినో-
దములు న్స్వర్గఫలాపవర్గఫలచిత్తభ్రాంతులుం బూజ్యరా-
జ్యమహాకాంక్షలు నెన్ని చూడ నివి నీ సద్భక్తి కత్యంతరా-
యములై మాటికిమాటి కడ్డుపడుఁ గార్యశ్రేణి సర్వేశ్వరా! 72
శా. మోహధ్వాంతములో మునింగిన మహామూఢుం డతిభ్రష్టుఁడై
సోహంబంచుఁ దొడంగి నీకుఁ గడు దూరాత్ముం డగుంగాని దు-
ష్టాహంకారగుణంబు మాని మది సొంపారంగ సద్భక్తి దా-
సోహంబన్న భవత్పదార్చకుఁడు నీవై యుండు సర్వేశ్వరా! 73
శా. చావంబుట్టుచుఁ బుట్టఁజచ్చుచు మహాచండాలసంసారపా-
రావారంబునఁ గూలి తాఁ జెడుటకుం బ్రవ్యక్తిగా నాత్మలో-
నేవం బొందక యేను నీవనుట తా నేజ్ఞానమో శ్రీమహా-
దేవా యిట్టి కుతర్కముం గలదే చింతింపంగ సర్వేశ్వరా! 74
మ. రసికుండై భవదంఘ్రిపద్మయుగ మారాధించుచో దుర్మద-
వ్యసనాటోపము చిక్కులం బొరలుచు న్వర్తించుచున్నట్టి పా-
లసు పూజావిభవం బదొప్పునె భువిన్ లక్షింప నారంభముం
గసవుం బెంచిన చేనుఁ బోలుఁ దలఁపంగా మీఁద సర్వేశ్వరా! 75
మ. అమితోత్సాహమునంది నీకుఁ దన సర్వార్థంబులుం గూర్చి నే-
మముతో నిచ్చుటకంటె శౌర్యగుణసామర్థ్యంబునం జేసి ప్రా-
ణము నీ కిచ్చుటకంటె దుస్తరభవోన్మాదంబు మర్దించి చి-
త్తము నీ కిచ్చుట పెక్కుభంగుల మహౌదార్యంబు సర్వేశ్వరా! 76
మ. ఘనవైరిప్రకరంబు ధాటి ననిలో ఖండించు కంటెన్ మృగేం-
ద్రుని జేపట్టుటకంటె వారినిధిలోఁ దోగాడుకంటెన్ మహా-
శనిఁ దా వ్రేయుటకంటె ఘోరభవదుశ్చారిత్ర వారించి రం-
జనతోఁ జిత్తము శిక్షసేయుట మహాశౌర్యంబు సర్వేశ్వరా! 77
మ. అమితామోదనవప్రసూనముల నిన్నర్చించుచో గద్యప-
ద్యము లూహించి నుతించుచో వివిధగీతవ్రాతము ల్పాడుచో
నమృతాహారము లిచ్చుచో నిపుణుఁడై యాటాడుచో నందుఁ జి-
త్తము సద్భక్తియె నీవు చేకొను పదార్థంబెల్ల సర్వేశ్వరా! 78
మ. కడుఁ జిత్రంబుగఁ జేయఁగా నొఱ సురంగంబయ్యెనే ఖడ్గమం-
దిడకున్నం జెడురూపదేమి గొఱ? దానిం బెక్కు పాటింపఁగా
నొడ లెబ్భంగుల నోపునే నియతితో నూహించి నిన్నాత్మలో
నిడకున్నం జనురూపు నేమికొఱ తా నీక్షింప సర్వేశ్వరా! 79
మ. జ్వరసంతాపవిశోషితాంగుఁడు సుధాసంకాశదివ్యాన్నపా-
నరసశ్రేణి భుజింప రోయుగతి నున్మాదేంద్రియధ్వాంతదు-
స్తరసంసారమదప్రమత్తుఁడు మహాసౌఖ్యోత్సవంబైన మీ
చరణారాధనయందు బుద్ధిఁ జొనుపం జాలండు సర్వేశ్వరా! 80
మ. కలయం గాష్ఠయుగంబుఁ గూర్చి తరువంగా బుట్టి తత్సాధనం-
బుల రెంటిన్ దహియించు వహ్నిగతిఁ దాఁ బొల్పొందఁ గాయంబు సం-
ధిల సత్కర్మముతో మథింపఁగ భవచ్చిద్భక్తి సద్వహ్ని యు-
జ్జ్వలమై కాయముఁ గర్మముం జెఱుచుఁ దత్త్వంబెన్న సర్వేశ్వరా! 81
మ. స్థిరబుద్ధిం దన సొమ్ము భక్తవరసుక్షేత్రంబులన్ బీజమై
పరగంగా వెదపెట్టి మీఁద నతిసంపన్నుండగుం గాక దా-
నరిషడ్వర్గము పాలుసేసి భవమాయాగ్రస్తుఁడై యిచ్చ నె-
వ్వరి వేఁడం జనువాఁడొకో విషయదుర్వ్యాపారి సర్వేశ్వరా! 82
శా. కాయంబన్నది వారిబుద్బుదసదృక్షం బందు రూపింప లేఁ-
బ్రాయంబన్నది శారదాంబుదతటిత్ప్రఖ్యంబగుం దత్సుఖ-
శ్రేయంబన్నది మాయ యిట్లెఱిఁగియు శీఘ్రంబ నీ ధ్యానసం-
స్థాయీభావనఁ బొందఁ డేమిటి కయో సంసారి సర్వేశ్వరా! 83
మ. భవదీయస్థిరభక్తి లబ్ధియు భవద్భక్తైకగోష్ఠీమహో-
త్సవలీలావిభవంబు నీ యనుదినధ్యానానుమోదంబులౌ-
నివి నిత్యస్థితు లారయంగ విధిదేవేంద్రాది భూతాఖిలో-
త్సవభోగస్థితులెల్ల మిథ్యలవి తత్త్వంబెన్న సర్వేశ్వరా! 84
మ. తన యుక్తి న్భవదంఘ్రిసేవగల సద్భక్తుండు పాపంబు చే-
సినఁ బుణ్యంబగు భక్తిహీనుఁడు శ్రుతు ల్చేపట్టి పుణ్యంబు చే-
సినఁ బాపంబగు దీనికంతటికిఁ జర్చింపంగఁ జండేశ్వరుం
డును దక్షుండును సాక్షులెన్న నగరాట్కోదండ సర్వేశ్వరా! 85
శా. ప్రారంభించి చకోరపోతము మహీయజ్యోత్స్నయం దుత్సవ-
శ్రీ రంజిల్లుచు వేడ్కనుండు గతి నా చిత్తంబు నీ దివ్యశృం-
గారధ్యానమునం దహర్నిశముఁ జొక్కంజేయవే దేవ శ్రీ-
గౌరీలోచననర్తకీనటనరంగస్థాన సర్వేశ్వరా! 86
మ. తరులం బువ్వులు పిందెలై యొదవి తత్తజ్జాతితోఁ బండ్లగున్
హర మీ పాదపయోజపూజితములై యత్యద్భుతం బవ్విరుల్
కరులౌ నశ్వములౌ ననర్హమణులౌఁ గర్పూరమౌ హారమౌఁ
దరుణీరత్నములౌఁ బటీరతరులౌఁ దథ్యంబు సర్వేశ్వరా! 87
మ. ఒకపుష్పంబు భవత్పదద్వయముపై నొప్పంగ సద్భక్తిరం-
జకుఁడై పెట్టిన పుణ్యమూర్తికిఁ బునర్జన్మంబు లేదన్నఁ బా-
యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచో బెద్దనై-
ష్ఠికుఁడై యుండెడువాఁడు నీవగుట దాఁ జిత్రంబె సర్వేశ్వరా! 88
శా. ఆనందంబును బొందునప్పుడును నత్యాశ్చర్యకార్యార్థభా-
వానీకంబులు దోఁచునప్పుడును రోగాపాయదుఃఖాతుర-
గ్లానిం బొంది చరించునప్పుడును సత్కార్యంబున న్నీవు నా
ధ్యానంబం దుదయింపుమయ్య దివిజేంద్రస్తుత్య సర్వేశ్వరా! 89
శా. నానాశాస్త్రసముచ్చయాగమపురాణప్రౌఢులై తత్త్వవి-
జ్ఞానధ్యానసమాధివిద్య లతివిస్పష్టంబుగా నేర్చి రే
దాన న్నేర్పరులెల్ల నేరరు భవత్సద్భక్తివిద్యాసమా-
ధానప్రస్ఫుటశక్తి నీ కరుణచేతం గాని సర్వేశ్వరా! 90
మ. ప్రకటింపంగ మదీయచిత్త మది దాఁ బంచేంద్రియోద్వృత్తమై
ప్రకటప్రాప్తిని సోలుఁగాని మఱి నీ పాదాబ్జసంసేవనం-
బొకవేళ భజియింప నొల్లదు నిజం బూహింపఁగా నట్ల యీఁ-
గకు దుర్గంధము గాక సహ్యమగునే కస్తూరి సర్వేశ్వరా! 91
మ. మలినాంగుం డగుటేమి కష్టము మనోమార్గంబు నీ భక్తిని-
ర్మలసౌభాగ్యనిధానదీపశిఖయై రంజిల్లదే భూషణో-
జ్జ్వలదేహుం డగుటేమి తేజము మనోవ్యావృత్తి దుర్మోహసం-
చలదుష్పంకముఁ బొంది పీడఁ బడఁగాఁ జర్చింప సర్వేశ్వరా! 92
మ. ఇల నా చిత్తము యోగసాధనలయం దీదాడఁగాఁ గొంతని-
శ్చలతం జేరఁగవచ్చు లేక తన వాంఛావృత్తిఁ బోనిచ్చినం
బొలుపై నీ దెసఁ జేర దట్టి దకటా భావించినం గాక కే-
వలసంబోధననేల నిల్చు ఋజువై వర్తింప సర్వేశ్వరా! 93
మ. ఉదకం బింకిన లావు మాలి కడుమై యష్ణింపఁగా రొంపిలోఁ
గదలం జాలని మీను వాన గురియం గ్రమ్మెక్కి పెన్నీటిలోఁ
బొదలం గన్న విధంబునన్ భవముతోఁ బోరాడు మర్త్యుండు దా
హృదయాబ్జంబున నిన్నుఁ గొల్వఁగనునే యింపొంద సర్వేశ్వరా! 94
మ. భవదీయార్చన సేయుచోఁ బ్రథమపుష్పంబెన్న సత్యంబు రెం-
డవ పుష్పంబు దయాగుణంబును విశిష్టం బేకనిష్ఠాసమో-
త్సవసంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తిసంయుక్తియో-
గవిధానం బవిలేని పూజలు మదిం గైకోవు సర్వేశ్వరా! 95
మ. అమరేంద్రాద్రి శరాసనంబు హరి దివ్యాస్త్రంబు భూమండలం-
బమరంగా రథ మర్కచంద్రులు తదీయాంగంబులై యొప్పుఁ జి-
త్రము నీకుం బురలక్ష్య మేయునెడ నుద్యద్భాతి నత్యల్పకా-
ర్యములందైనను దా మహాఘనము నీ యత్నంబు సర్వేశ్వరా! 96
మ. దివిజేంద్రత్వముఁ బద్మజత్వము జగత్సేవ్యస్థిరానర్గళో-
త్సవరూపంబగు కేశవత్వమును నీ సద్భక్తి సంవృద్ధిలో
లవమాత్రస్థితు లెన్న భక్తిజనితోల్లాసావనోద్యత్సుఖా-
ర్జవసౌభాగ్యము మాన మెవ్వరికిఁ జెప్ప న్వచ్చు సర్వేశ్వరా! 97
మ. పరమార్థంబుగ నా మనంబున భవద్భక్తిప్రభావంబు వి-
స్తరమై పుట్టదు పుట్టినం బ్రబల దంతం గొంత వర్ధిల్లెనే
విరసంబై యటమీఁదఁ జిక్కువడుఁ భావింపంగ నెట్లన్న న-
స్థిరుఁడం గాన జడుండఁ గాన బకవేషిం గాన సర్వేశ్వరా! 98
శా. శ్రీకంఠాయ నమోనమో నతసురజ్యేష్ఠాయ రుద్రాయ లిం-
గాకారాయ నమోనమో విగతసంసారాయ శాంతాయ చం-
ద్రాకల్పాయ నమోనమో దురితసంహారాయ తే యంచు ని-
న్నాకాంక్షం బ్రణుతించు మానవుఁడు నీవై యుండు సర్వేశ్వరా! 99
మ. భువనోత్పత్తి విధించుచో భవుఁడవై పొల్పొందఁగా దాని ను-
త్సవలీలం బ్రభవించుచో మృడుఁడవై సర్వంబుఁ గల్పాంతభై-
రవసంక్షోభ నటించుచో హరుఁడవై త్రైగుణ్యశక్తిం దుదిన్
శివనామాంకముఁ దాల్చు నీ మహిమ దాఁ జిత్రంబు సర్వేశ్వరా! 100
మ. కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కూలంబునం గూలినం
జలజాతప్రియశీతభానులు యథాసంచారము ల్దప్పినం
జలధు ల్మేరల నాక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్
దలఁకం డుబ్బఁడు చొప్పుఁ దప్పఁడు భవద్భక్తుండు సర్వేశ్వరా! 101
శా. శూలస్థాపితుఁడైన మానవునకున్ శూలంబు దుర్వారవా-
త్యాలిం గంపము నొందకుండుట సుఖంబై తోఁచు మాడ్కిన్ భవా-
భీలజ్వాలలఁ గ్రాఁగు మానవునకున్ బింబాధరల్ హారవ-
స్త్రాలంకారము లించుకించుక సుఖంబై తోఁచు సర్వేశ్వరా! 102
శా. ఆకాశానలచంద్రసూర్యపవమానాత్మాంబువిశ్వంభరా-
ప్రాకామ్యాంచితమూర్తి భేదముల నీ బ్రహ్మాండనానాఘటా-
నీకప్రాకట జీవభావవిలసన్నిర్మాణకర్మాద్భుతా-
స్తోకశ్రీకరమూర్తియై వెలుఁగు నీ స్థూలంబు సర్వేశ్వరా! 103
మ. అతివాగ్జాలమునై యజాండనిలయంబై యాదిమధ్యాంతవ-
ర్జితమై నిర్గుణనిష్కలంకపదమై సిద్ధాంతమధ్యాత్మసం-
యుతమై కోటిరవిప్రకాశయుతమై యోంకారమంత్రాదిసం-
స్తుతమై యెంచ నచింత్యమై వెలుఁగు నీ సూక్ష్మంబు సర్వేశ్వరా! 104
మ. అజుఁడై సృష్టి యొనర్చు రాజసముచే నందంబుగాఁ దా నధో-
క్షజుఁడై వర్ధిలఁజేయు సాత్త్వికము సంప్రవ్యక్తిగా గోపతి-
ధ్వజుఁడై సంహృతిసేయుఁ దామసమునం దత్సర్వముం గూడఁగా
నిజవిస్ఫూర్తి వెలుంగుఁ దుర్యమగుచున్ నీ యాజ్ఞ సర్వేశ్వరా! 105
మ. సకలాధీశ్వరపట్టభద్రుఁడవు భిక్షాగామి వత్యంతశాం-
తకళాత్ముండవు రౌద్రమూర్తి వతిసౌందర్యాంబికాసంగమా-
ధికలోలుండవు దివ్యయోగివి మదిం దెల్లంబుగా నెట్టివా-
రికిఁ దా శక్యమే నీ నిజం బరసి వర్ణింపంగ సర్వేశ్వరా! 106
మ. భవదుఃఖార్ణవయానపాత్రము పరబ్రహ్మంబు యోగీంద్రహృ-
ద్భవనప్రస్ఫురితప్రదీపము నఘధ్వాంతార్కబింబం బతి-
శ్రవణానందకరంబు సన్మునిగణస్వాధ్యాయపాఠంబు మీ
శివనామాంకము భక్తపుంగవ సదా సేవ్యంబు సర్వేశ్వరా! 107
మ. అణిమాద్యష్టగుణప్రసిద్ధులు త్రిలోకారాధ్యు లుద్యద్వచో-
మణికోటిప్రతిమప్రభాపటలు లున్మాదేంద్రియధ్వాంతభీ-
షణదైత్యేంద్రవినాశకారణమహాశౌర్యోన్నతు ల్లోకర-
క్షణదక్తుల్ వినుతింప నీ ప్రమథసంఘాతంబు సర్వేశ్వరా! 108
మ. సకలాధీశ్వరులై గణాధిపతులై సర్వజ్ఞులై నిత్యులై
యకలంకాత్మకులై మహామహిములై యంభోజగర్భాండర-
క్షకులై యుండుదు రెల్లవారును భవత్సద్భక్తి నానాగణా-
ధికలీలావిధి నంతరంగముల వర్తింపంగ సర్వేశ్వరా! 109
మ. అమరేంద్రాబ్జభవాచ్యుతాదులకు నీ యాజ్ఞాప్రభావం బలం-
ఘ్యము నీకు భవదీయభక్తమహదాజ్ఞాపంబు నుద్యత్ప్రభా-
వము లోకంబులలో నలంఘ్యమగుట న్వర్ణింపఁగా నీ మహ-
త్త్వముకంటెం గడుఁ జెల్లు భక్తుల మహత్త్వంబెన్న సర్వేశ్వరా! 110
మ. శివసాహిత్యుల సత్కరస్థలము కాశీక్షేత్రమా హస్తదే-
శవిశాలోన్నతశాఖ లారయఁగఁ బంచక్రోశమా పాణిసం-
భవశోభాన్వితచిత్రరేఖలు మహాభాగీరథీతీర్థముల్
శివలింగం బల విశ్వనాథుఁ డరయన్ సిద్ధంబు సర్వేశ్వరా! 111
మ. వరుసం బైకొనివచ్చు కర్మములు మున్వారించి మాయామల-
జ్వరము ల్గూల్చి యపారఘోరతరసంసారాబ్ధి లంఘించి భీ-
కరసూక్ష్మాంగవిచిత్రకంచుకము వీఁకం బుచ్చి పోవైచి తాఁ
బరమవ్యోమము సొచ్చు నీ యచలసద్భక్తుండు సర్వేశ్వరా! 112
మ. పరమార్థంబగు తత్త్వమార్గమున నీ పాదాబబ్జసద్భక్తుఁ డొ-
క్కరుఁడుం దక్క సరోజజాద్యమరసంఘాతంబులోనెల్లఁ దా
నెరయం గాచికొనంగఁ జాలరు మహానిర్భీతుఁడున్ లేఁ డతి-
స్ఫురణం గాలుఁడు దన్ను వేచి వడిఁ గొంపోనుండ సర్వేశ్వరా! 113
మ. తన చారిత్రమె సన్నుతించు గురుభక్తశ్రేణి వర్ణింపఁగాఁ
దన చిత్తంబు భవత్పదస్మరణచేత న్నిన్ను మెప్పింపఁగా
ననుకూలస్ఫుటనిశ్చలత్వమున రా నభ్యంతరాంగస్థితి-
న్వినుతిం బొందిన తజ్ఞుఁ డీజగములో నీ మెచ్చు సర్వేశ్వరా! 114
మ. క్షితి నత్యుగ్రతపంబునందు జఠరాగ్నిం గాలఁగానేల మి-
మ్మతిభక్తిస్థితిఁ బూజసేయు మహనీయ త్వంబు తాఁ జాలదే
ప్రతిపక్షాలి నడంప రోగభయదుర్భారంబు వారింప న-
ద్భుతసౌఖ్యంబులుఁ బెంప దివ్యసుఖముం బొందింస సర్వేశ్వరా! 115
మ. శివవాక్యస్ఫురితాక్షరద్వయ సకృజ్జిహ్వాప్రదేశాత్ముఁడై
భవదుఃఖాంబుధి దాఁటజూచు తఱిఁ దత్పంచాక్షరీమంత్ర ము-
త్సవలీలం గడుశుద్ధుఁడై జపము వాంఛం జేయు భాస్వద్గుణా-
ర్ణవసౌభాగ్యము మానమెవ్వరికిఁ గాన న్వచ్చు సర్వేశ్వరా! 116
శా. ఏదేశంబున నేదిశాముఖమునం దేయూర నేవాడ మీ
పాదాభ్యర్చన సేయు నిర్మలుఁడు సద్భక్తుం డొకండుండె నా-
యాదేశంబును నాదిశాముఖమును న్నాయూరు నావాడ గం-
గాదిస్నాన నదీప్రవాహఫలదంబై యొప్పు సర్వేశ్వరా! 117
మ. ఒనరం జిత్తము శుద్ధిలేని నరుఁ డుద్యోగంబునం గోరి చే-
సిన పూజావిభవంబు సువ్రతములున్ శీలంబులు న్మంత్రసా-
ధనముల్ తీర్థంబులుం దపంబులును మీఁదం జెట్టవాఁ డభ్యసిం-
చిన శస్త్రాస్త్రకళానిభంబులగుఁ జర్చింపంగ సర్వేశ్వరా! 118
మ. క్రమసంయుక్తి మనంబు బుద్ధియు నహంకారంబుఁ జిత్తంబు నా
యమలాంతఃకరణంబు నక్షరచతుష్కావాప్తిఁ గావించి పం-
చమవర్ణంబుగ నాత్మఁ గూర్చి కడువాంఛన్ యోగి పంచాక్షరీ-
సుమహామంత్రముతోడ నైక్యపదవిన్ శోభిల్లు సర్వేశ్వరా! 119
మ. భవదీయాననపంచకంబువలనం బంచాక్షరీమంత్ర ము-
ద్భవమై తత్పదవర్ణపద్ధతుల శుంభత్పంచభూతంబు లు-
ద్భవనంబై యఖిలంబుఁ బుట్టెను లసత్పంచాక్షరీమంత్ర మీ
భువనాండంబులం దల్లియై సఫలతం బొందించు సర్వేశ్వరా! 120
మ. పటుశాస్త్రాగమదృష్టి నివ్విధమునన్ భావించి వీక్షించి యు-
ద్భటవృత్తిన్ భవదీయభక్తినికరబ్రహ్మాండకుండైన నా-
దట లోఁ గాచుకొనంగవచ్చు విదితోద్దండప్రతాపోత్కట-
స్ఫుటకోపానలమూర్తియై యముఁడు గొంపోకుండ సర్వేశ్వరా! 121
మ. కలవారై మతిమంతులై రసికులై గంభీరులై ధీరులై
లలనామన్మథులై సముజ్జ్వలవచోలాలిత్యులై నిత్యులై
బలవిభ్రాజితులై యశోభరితులై భాసిల్లు భాగ్యోదయుల్
తొలిజన్మంబుల మిముఁ గొల్చిన మహాత్ముల్ వారు సర్వేశ్వరా! 122
మ. ఖలులై యాచకులై విరుద్ధవికటాకారాంగులై పంగులై
బలహీనాతురులై రుజాపటలతాపచ్ఛన్నులై ఖిన్నులై
చలనాందోళితచిత్తులై మలినులై జాత్యంధులై మందులై
తొలిజన్మంబున మిమ్ముఁ గొల్వని దురాత్ముల్ వారు సర్వేశ్వరా! 123
శా. ఏయేవేళల నేవయస్సున నరుం డేభూమి నేయూరిలో
నేయేకర్మము నాచరించు నశుభంబేని న్శుభంబేని దా
నాయావేళల నావయస్సున నరుం డాభూమి నాయూరిలో
నాయాకర్మములెల్లఁ దాఁ గుడుచుఁ దథ్యంబింత సర్వేశ్వరా! 124
శా. ఆడంబోయినచోట బాలురు వినోదార్థంబు పాషాణముల్
గూడంబెట్టి శివాలయంబనుచుఁ బేర్కొన్నంతటం జేసి వా-
రాడంబోయి సురాంగనాకలితదివ్యారామచింతామణి
క్రీడాశైలవిహారులౌదురు మిముం గీర్తింప సర్వేశ్వరా! 125
మ. సమయోద్దిష్టసహస్రపంకరుహపూజాపూరణార్థంబు నే-
త్రము విష్ణుండు సుభక్తి యేర్పడ భవత్పాదంబు లర్చించి చ-
క్రముఁ దాఁ గైకొని దైత్యకోటి ననిలో ఖండించెఁ దా నీ పద-
క్షమతాసేవ సమస్తదేవతలకు న్సత్త్వంబు సర్వేశ్వరా! 126
మ. అమర న్వేదపురాణశాస్త్రములు మున్నాకాంక్షఁ దత్త్వప్రభే-
దము రూపింపఁగ నేరవన్న మఱి యా తత్త్వంబులెట్లన్న ను-
త్తమసంతోషమె కోరునన్న నరుఁ డుత్సాహించి నీ భక్తస-
త్తమపూజారతి నేర్చునే నతఁడు తత్త్వజ్ఞుండు సర్వేశ్వరా! 127
మ. అమితోద్యద్భవదీయతత్త్వము మహీయస్తోత్రవాణీవిలా-
సములై యొప్పు సమస్తవేదములు శాస్త్రశ్రేణియున్ దివ్యవి-
భ్రమనాదంబులు నెన్ని చూడ నివి నీ పంచాక్షరీమంత్రభా-
వములైయుండు సమస్తలక్షణముల న్వర్ణింప సర్వేశ్వరా! 128
శా. సంకీర్ణాకలితాక్షరత్రయము భాస్వన్నాదబిందుక్రమా-
లంకారద్వితయంబుతోఁ గలిసి లీలన్ దివ్యయోగీంద్రహృ-
త్పంకోద్భూతములందు రూఢమగుచుం బంచాక్షరీమంత్ర మ-
య్యోంకారాత్మకమౌ లసన్మునిగణం బూహింప సర్వేశ్వరా! 129
మ. అమలజ్ఞానవిభాసభాసురత నయ్యష్టాంగపూజావిధి
క్రమయోగంబుల నిన్ను నెల్లపుడు జోకం గొల్వగానేల ని-
క్కము నీ భక్తులగోష్ఠి చాలుఁ గడువీఁకన్ ఘోరసంసారదుః-
ఖములెల్లం బెడవాప నిన్ను వెలయంగాఁ జూప సర్వేశ్వరా! 130
మ. పరమార్థంబుగఁ దత్త్వము న్నెఱుఁగ నొప్పందీర్చి డెందంబు నీ
కరుణాస్థానముఁ జేర్పలేక తన వంకం బోవఁగానిచ్చిరే
నరకాబ్ధిం బడవైచుఁ దత్క్షణములోనం గానఁ దత్త్వక్షమం-
బరయం జిత్తము శూకలాశ్వము విభంబై యుండు సర్వేశ్వరా! 131
మ. భవదంఘ్రిద్వితయార్చనంబును బవత్ప్రఖ్యాతసద్భక్తపుం-
గవగోష్ఠీవిభవంబులు న్విమలసూక్ష్మధ్యానయోగంబు నా
నివి సంపూర్ణసుఖంబులెన్న మఱి దేవేంద్రాది భోగంబు లు-
త్సవసంబంధములెల్ల దుఃస్థితులు తథ్యంబెన్న సర్వేశ్వరా! 132
మ. తమ లింగార్చనకంటె జంగమము సౌందర్యంబుగాఁ గొల్చు టు-
త్తమభక్తిస్థితి లింగజంగమల సత్సామ్యంబుగాఁ జేఁత మ-
ధ్యమభక్తిస్థితి లింగపూజ నధికుండై జంగమోపాసనా-
క్షముఁడై యుండుట భక్తియం దది కనిష్ఠత్వంబు సర్వేశ్వరా! 133
మ. కరఢక్కారవవాద్య మింపొదవ గంగాతుంగరంగత్తరం-
గరవప్రస్ఫుటతాళసమ్మిళిత తత్కంజాతపుంజస్ఫుర-
ద్వరపుష్పంధయ మందరధ్వనులు గీతంబొప్ప తౌర్యత్రికం-
బిరవై యుండఁగ నీదు తాండవమహం బేపారు సర్వేశ్వరా! 134
మ. అజరుద్రాదులు మిమ్మెఱింగి నుతిసేయన్లేరు నేనెంతవాఁ-
డ జగద్రక్షణదక్ష నిన్నుఁ గొనియాడ న్నీస్వభావంబు దా-
సజనానుగ్రహనిశ్చితంబగుట నా జన్మంబు సాఫల్యమం-
ద జడుండంచు నిరాకరింపకఁ బ్రసన్నంబౌట సర్వేశ్వరా! 135
శా. బాలుం డాడెడు మాటలెల్ల నుపమింపం దండ్రికి బ్రౌఢభా-
వాలాపంబులకంటె మించుగతి నే నజ్ఞానభావంబునం-
దాలోచించి రచించినట్టి కృతి యింపారంగ నీకు న్మహా-
లాలిత్యస్తుతికంటెఁ గైకొనుఁగదా శ్లాఘ్యంబు సర్వేశ్వరా! 136
మ. అభిరమ్యంబుగ దూదికొండ మహనీయారాధ్య సోమేశ్వర-
ప్రభు కారుణ్యవసంతసంజనిత మద్వాక్యప్రసూనావళి-
న్విభవం బొప్పఁగఁ గూర్చి యెంతయు లసద్విఖ్యాతి సంపత్సుఖ-
ప్రభవంబైన భవత్పదద్వయము నారాధింతు సర్వేశ్వరా! 137
శా. ధాత్రి న్భక్తజనానురంజనముగాఁ దత్త్వప్రకాశంబుగాఁ
జిత్రార్థాంచితశబ్దబంధురముగా సేవ్యంబుగా సజ్జన-
శ్రోత్రానందముగా శుభాంచితముగా శోధించి సర్వేశ్వర-
స్తోత్రం బన్నయ చెప్పె నిజ్జగములో శోభిల్ల సర్వేశ్వరా! 138
శా. శాకాబ్దంబులు వార్ధిషట్కపురజిత్సంఖ్యం బ్రవర్తింప సు-
శ్లోకానందకరంబుగా మహిమతో శోభిల్ల సర్వేశ్వర-
ప్రాకామ్యస్తవ మొప్పఁ జెప్పె శుభకృత్ప్రవ్యక్తవర్షంబునన్
శ్రీకంఠార్పితమై వసుంధరపయిం జెన్నొంద సర్వేశ్వరా! 139
వావిళ్ల భక్తిరసశతకసంపుటము-3 లో అధికపద్యములు
మ. అరిషడ్వర్గబలంబులో మలసి మాయావృత్తి నాయం దతి-
స్ఫురణం జేసినవాఁడు మోహుఁ డతనిన్ బోఁద్రోచి నీ భక్తితో
బరగం గూర్చి వివేకిఁ జేసి నెరయం బాటించి నాయం దధీ-
శ్వరుఁడై యుండఁగదయ్య రౌప్యకుధరవ్యాపార సర్వేశ్వరా! 1
మ. అమలామ్నాయవిధిప్రబోధము లసంఖ్యాతంబులై యుండు నా-
గమమార్గోత్తమమంత్రతంత్రము లసంఖ్యాతంబులై యుండుఁ ద-
త్క్రమము ల్నాకవియేల నీవు మెఱయంగా నిన్ను సద్భక్తియో-
గమునం గొల్చి జయింపఁ జేయు మిదె మత్కామ్యంబు సర్వేశ్వరా! 2
శా. కానీ దారసమన్వితుండు మిగులం గానీఁడు కందర్పునిన్
గోనీ మానవకోటిలో మరులు పైకోనీఁడు మోహంబునున్
రానీ రాజితరాజ్యవైభవము పైరానీఁడు గర్వంబునున్
లో నీవైన మహాత్ముఁ డన్యమునకున్ బోనీఁడు సర్వేశ్వరా! 3
శా. ఏ నిన్నే శరణందు బాంధవులు గానీ యెల్లవారుం బగే
కానీ మృత్యువు తలక్రిందువడనీ కాలుండు గీవెట్టనీ
నానాకర్మచయంబు గింజుకొననీ నాకేమి నేరాజ నిం-
తే నీ చాటున దాఁగియున్నపుడు బీతే యింక సర్వేశ్వరా! 4
మ. జయశక్తిన్ రవిచంద్రతారకముగాఁ జల్పెన్ యథావాక్కులా-
న్వయసంజాతుఁడు నన్నమార్యుఁ డవని న్వర్ణించి నీ సత్కథా-
క్రియసంబోధన నీదు భక్తిని మహానిర్ణీతవిశ్రాంతిగా
భయవిభ్రాంతులు లేక యీ శతకముం బ్రఖ్యాతి సర్వేశ్వరా!
సర్వేశ్వరశతకము సంపూర్ణము.
కవిపరిచయము
- వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)
పీఠిక - నిడదవోలు వెంకటరావు
(శతకసంపుటము ప్రథమభాగము - ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీ, 1966)
: శతకములు :
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము | మాతృ శతకము | కఱివేల్పు శతకము | మదనగోపాల శతకము | చక్కట్లదండ శతకము | సుందరీమణి శతకము | కాంతాలలామ శతకము | తాడిమళ్ళరాజగోపాల శతకము | భక్తమందార శతకము | కుక్కుటేశ్వర శతకము | భర్గ శతకము | లావణ్య శతకము | వేణుగోపాల శతకము | విశ్వనాథ శతకము | ఒంటిమిట్ట రఘువీరశతకము | మృత్యుంజయం | చెన్నమల్లు సీసములు | సంపఁగిమన్న శతకము | కుమార శతకము | శ్రీ అలమేలుమంగా శతకము | సూర్య శతకము | నీతి శతకము | శృంగార శతకము | వైరాగ్య శతకము | మంచి మాట వినర మానవుండ | సదానందయోగి శతకము | శివముకుంద శతకము | మృత్యుంజయ శతకము |