రచించినవారు ' పరమానంద యతీంద్ర '
క. శ్రీమానినీమనోహర!
సోమార్కవిశాలనేత్ర! సురనుతగాత్రా!
దామోదర నీలమణీ
శ్యామా! ననుఁ బ్రోవు మన్న సంపఁగిమన్నా! 1
క. పరమానందయతీంద్రుఁడఁ
బరిపూర్ణుఁడ వైననీదుభక్తుఁడ నెలమిన్
విరచించెద నొకశతకము
శరణాగతసుప్రసన్న! సంపఁగిమన్నా! 2
క. నినుఁజెప్పనేర నైనను
ఘన మగునుతి గనుక కూరగాయకవిత్వం
బనక కృపామతిఁ గైకొను
సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! 3
క. జిలిబిలిమాటలఁ బలికెడి
యలశిశువును దండ్రి ముద్దులాడెడుపగిదిన్
బలికెద నను మన్నింపుము
సలలితకాంతిప్రసన్న! సంపఁగిమన్నా! 4
క. తత్త్వజ్ఞానానంద మ
హత్త్వము రచియింతు నీదయన్భువిఁ గృతకృ
త్యత్త్వము నిత్యత్వముగా
సాత్త్వికపరయోగు లెన్న సంపఁగిమన్నా! 5
క. తత్త్వము దా రెఱుఁగక బ్ర
హ్మత్వ ముపచరించువారిమాటలు ధృతకో
శత్వములను నిలిచియు ని
స్సత్త్వము లగుఁ గన్న విన్న సంపఁగిమన్నా! 6
క. వినవలె సద్గురువులచేఁ
గనవలె నరచేతియుసిరికాయయుఁబలెఁ దా
మనవలె బ్రహ్మము దానై
సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! 7
క. తాటాకులలో వ్రాసిన
మాటలనా ముక్తి పాడిమర్మముఁ దెలియున్?
సూటి యగురాజమార్గము
సాటి యగునె యెచట నున్న! సంపఁగిమన్నా! 8
క. సన్న్యాసుల మని శాస్త్రో
పన్యాసముసేయ నందు ఫలమేమి? మన
స్సన్న్యాసము దొరకని
యాసన్న్యాసము కూటికన్న సంపఁగిమన్నా! 9
క. గామువలె సంచరించినఁ
బామువలెన్ గుహల నున్న బంధము తెగునా?
దీ మెఱిఁగి పరునిఁ గలసెడి
సామర్థ్యము గూడకున్న సంపఁగిమన్నా! 10
క. వాటమగురీతి ముక్తిక
వాటము భేదింప నెట్లు వశపడుఁ దనలో
నాటుకొనుమాయఁ దగ ను
చ్చాటన మొగిఁ జేయకున్న సంపఁగిమన్నా! 11
క. ఎక్కటిచదువులు బోధలు
మక్కువ ననుభవములేనిమాటలు వినఁగాఁ
బుక్కిటిపురాణములకై
జక్కులసంతోష మెన్న సంపఁగిమన్నా! 12
క. వాలాయము గురుకృపచే
శ్రీలీలల రాజయోగ సిద్ధుఁడు గాఁగా
నేలా సంసారమునకు
జాలింబడ సుప్రసన్న! సంపఁగిమన్నా! 13
క. శ్రీరాజయోగవిద్యా
పారీణున కబ్బుఁ గాక పరమసుఖం బీ
ధారణి హఠలయమంత్రవి
చారుల కది దొరక దన్న! సంపఁగిమన్నా! 14
క. మాయాయోగతపంబుల
నాయాసముతోడఁ జేయ నబ్బును దత్త్వం
బాయెన్ని కేలపెట్టన్
జాయలనా సుప్రసన్న! సంపఁగిమన్నా! 15
క. ఒండొరులఁ గూడి గొణఁగుచు
దండము లిడికొనుచు బోడితలలుం దామున్
నిండిరి మహి తత్త్వము నహి
చండితనం బధిక మన్న సంపఁగిమన్నా! 16
క. వానలు పస పైరుల కభి
మానము పస వనితలకును మఱి యోగులకున్
ధ్యానము పస యామీఁదట
జ్ఞానము పస సుప్రసన్న సంపఁగిమన్నా! 17
క. మాయ యనఁగ వే ఱై యొక
తోయము లే దయ్య తన్నుఁ దోఁపనిచోటే
మాయ! తా రోసినను జూ
చాయం జెడిపోవు నన్న! సంపఁగిమన్నా! 18
క. తామరసాక్షున కైనన్
శ్రీమించినసురల కైన సిద్ధుల కైన\న్
నీమాయఁ దెలియవశమా
సామాన్యమె! కఠిన మెన్న సంపఁగిమన్నా! 19
క. నిండికొను నిట్టిమాయ ప్ర
చండగతిం గప్పుకొన్న సజ్జనుల బుధుల్
ఖండింప నేల మదపా
షండులవాక్యములు విన్న సంపఁగిమన్నా! 20
క. మండితపూర్ణసుధాకర
మండలశతకోటికాంతిమహనీయుండై
నిండి తనలోన యోగి ప్ర
చండగతి న్వెలుఁగు నన్న సంపఁగిమన్నా! 21
క. పేరుకొనుమంత్రవాదము
భారం బది కుక్కనోటిపాఁతై రోఁతై
పోరై యారై దూఱై
జాఱఁగవలె సుప్రసన్న! సంపఁగిమన్నా! 22
క. బూటకములు వేషంబులు
నాటకములు మంత్రతంత్రనటనలు మిథ్యా
పేటిక లవి యోగికి జం
జాటము లివి యేటి కన్న! సంపఁగిమన్నా! 23
క. చలపట్టియు హఠయోగముఁ
దలపెట్టిన వట్టిగొడ్డుతాఁకట్టింతే
యలసిద్ధి దొరక దడియా
సలుగా కిందేమియున్నె! సంపఁగిమన్నా! 24
క. సంతతయోగానందా
నంతసుఖాంభోధి నలరు నాతనిభాగ్యం
బింతింతనఁ దరమా ఘన
సంతోషము జగతి నెన్న సంపఁగిమన్నా! 25
క. నావయగు\న్ భవజలధికిఁ
ద్రోవయగు\న్ ముక్తికాంతతోఁ గూడుటకు\న్
కేవలనిజదేశిక ర
క్షావహ మగుయోగ మెన్న సంపఁగిమన్నా! 26
క. అభ్యుదయంబుగ నీయో
గాభ్యాసము సేయవలయు నతులితలీలన్
లభ్యుఁ డగుం బరమాత్ముఁడు
సభ్యుల కది మార్గ మన్న! సంపఁగిమన్నా! 27
క. వ్యక్తావ్యక్తపదం బఁట
ముక్తఁట గురుసేవ తనకు మును లేదఁట యే
యుక్తిని గనుఁగొనవచ్చు న
శక్తులకును సుప్రసన్న! సంపఁగిమన్నా! 28
క. భావమునం గననేరని
జీవుల కిది బీరకాయ చి క్కగుఁ దెలియం
గావశమే సద్గురు దీ
క్షావిధి యొనఁగూడకున్న సంపఁగిమన్నా! 29
క. బోధింపఁదగినగురువుల
శోధించి తదంఘ్రిఁ జేరి సుస్థిరమతి యై
యాధేయము నాధారము
సాధించిన ముక్తుఁడౌను సంపఁగిమన్నా! 30
క. సాధింపఁగ నిరతులకున్
బోధింపఁగ నేర్పు గల్గుపుణ్యాత్ముల యా
యీధరఁ గల రొకకొందఱు
సాధారణవిబుధు లెన్న సంపఁగిమన్నా! 31
క. అనుభవము లేనిగురుచే
వినునతనికి సంశయంబు వీడునె చిత్రా
ర్కునివలనఁ దమము వాయునె
సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! 32
క. బరువఁట యెవరికి గురువో
హరిహరి తనుఁ దెలియలేనియాతఁడు గురువా?
గురువనఁగా సిగ్గుగదే
శరణాగతసుప్రసన్న! సంపఁగిమన్నా! 33
క. నేరనిగురుబోధలు సం
సారము లై కూనలమ్మసంకీర్తన లై
దూరము లై ముక్తికి ని
స్సారములై పోవు నన్న! సంపఁగిమన్నా! 34
క. బూటకపుయోగి నెఱుఁగక
పాటింతురు డబ్బుఁ జూచి పస లేకున్న\న్
దాటో టని జగ మెల్లను
జాటింతురు లోకు లెన్న సంపఁగిమన్నా! 35
క. కల్ల యగుజ్ఞాన మేలా
చెల్లనికా సెచట నైనఁ జెల్లనికాసే
తెల్లమిగఁ దెలుపునాతఁడు
సల్లలితజ్ఞాని యెన్న సంపఁగిమన్నా! 36
క. గాడిదవలె బూడిదఁ బొ
ర్లాడుచుఁ గొక్కెరయుఁ బోలె ధ్యానము సే సే
బేడిదపుఁ గపటయోగుల
జాడలు ఘను లెంచరన్న సంపఁగిమన్నా! 37
క. కీడొసఁగెడు గురు డేలా
గాడిదవాలంబుఁ బట్టి ఘననదు లీఁద\న్
గూడునె గుండెలు పగులఁగ
జాడింపదె ఱొమ్ముఁ దన్ని సంపఁగిమన్నా! 38
క. అంగం బెఱుఁగరు ముక్తి తె
ఱంగెఱుఁగరు కపటధూర్తరావణవేషుల్
దొంగలగురువులవారల
సంగతి దుర్బోధ లెన్న సంపఁగిమన్నా! 39
క. చేతోగతిఁ దము నెఱిఁగిన
యాతద్జ్ఞులు భువిని జనుల నందఱ సరిగాఁ
జూతురు సమరసభావనఁ
జాతుర్యధురీణు లెన్న సంపఁగిమన్నా! 40
క. వచ్చినవాసనవెంబడి
విచ్చలవిడి యోగివరుఁడు విహరించినవాఁ
డెచ్చట నేక్రియఁ జేసిన
సచ్చిన్మయు నంట దన్న సంపఁగిమన్నా! 41
క. విత్తమదమత్తు లాయత
చిత్తభ్రమ లెఱుఁగలేరు చిత్పురుషుని దా
నుత్తముఁడితఁడని సన్ముని
సత్తముఁడై యెఱుఁగు నన్న! సంపఁగిమన్నా! 42
క. తనవాసనయెట్లుండిన
ఘనయోగికి బంధవృత్తి గానేరదు వాఁ
డనుభవముకతన నిర్వా
సనుఁ డై మరి పుట్టఁ డన్న సంపఁగిమన్నా! 43
క. క్రమమున సుఖదుఃఖంబులు
కమలిన నుతినింద లాదిగాఁ గలయవియా
యమివర్యుఁ డన్నిక్రియలం
సముఁడై వర్తించు నన్న సంపఁగిమన్నా! 44
క. తలకొని దుఃఖము రానీ
వలనొప్పఁగ నిత్యసుఖము వచ్చిన రానీ
నలఁకువను బడనిమనుజుఁడు
చలియింపఁడు బోధ గన్న సంపఁగిమన్నా! 45
క. చాలా లోకులు నగనీ
వాలాయము కీడు మేలు వచ్చిన రానీ
యేలా గైనను బురుషుఁడు
జాలిం బడఁ డాత్మఁ గన్న సంపఁగిమన్నా! 46
క. బాలుఁడుగానీ భోగ
స్త్రీలోలుఁడుగాని విషయశీలుఁడు గానీ
మేలైనబోధ గలిగినఁ
జాలదె ముక్తిని గనంగ సంపఁగిమన్నా! 47
క. విత్తపరాయణుఁ డయినన్
మత్తచకోరాక్షులందు మగ్నుండైన\న్
సూత్తమపురుషుఁడె గాదా
సత్తామాత్రంబు గనును సంపఁగిమన్నా! 48
క. పంచావస్థలఁ దగిలియుఁ
బంచావస్థలను గడచు ప్రాజ్ఞుండు జగ
ద్వంచకుఁ డై లోకులవలె
సంచారము సేయు నన్న సంపఁగిమన్నా! 49
క. పిప్పలర నాత్మసుఖముల
తెప్పం దేలేటియోగిఁ దెలియక తమలో
నప్పురుషుం గని కర్ములు
చప్పనఁగాఁ జూతు రన్న సంపఁగిమన్నా! 50
క. నిత్యానిత్యము లెఱుఁగక
నిత్యముఁ జేపట్టుబుధుల నిందించిన నా
మృత్యువుపా లౌ మర్తుఁడు
సత్యం బిది వినగదన్న సంపఁగిమన్నా! 51
క. వేసాలెల్లయు భువిలో
గ్రాసాలకెకాక ముక్తికాంక్షకు నేలా
వాసిగలుగుయోగి యథే
చ్ఛాసంచారుఁడుగదన్న ఘనసంపన్నా! 52
క. ఊరెఱిఁగిన బాపనికి
వారక జన్నిదముఁ జూపవలెనా తద్జ్ఞుం
డేరీతి నున్న నిస్సం
సారిని ఘను లెంతు రన్న సంపఁగిమన్నా! 53
క. అద్వైతభావ మెఱుఁగక
విద్వాంసుల మనుచు నాత్మవేత్తలవలెనే
యద్వాతత్వము లాడుచు
సద్వర్తన మెంచరన్న సంపఁగిమన్నా! 54
క. వదలరు విషయము లెచటను
మెదలరు సజ్జనులకడను మిధ్యాజ్ఞానుల్
చదివితి మని యజ్ఞులతోఁ
జదువులుపచరింతు రన్న సంపఁగిమన్నా! 55
క. జడివాన కురిసినట్టులు
విడువక వాదింతు రాత్మవేత్తల మనుచున్
గుడియెడ మెఱుఁగనిమాటల
జడమతు లిలఁ గొంద ఱన్న సంపఁగిమన్నా! 56
క. మన సనఁగా నెఱుఁగక దా
మనసునకును సాక్షి యనఁగ మఱి బేలనఁగా
ఘనతర శూన్యం బనఁగా
జనులకు నిది వాద మన్న! సంపఁగిమన్నా! 57
క. కొందఱు యోగం బనఁగాఁ
గొందఱు జ్ఞానం బనంగఁ గొంద ఱఖండా
నందం బనంగ నందలి
సందేహము లెట్లు తీరు సంపఁగిమన్నా! 58
క. తుద మొద లెఱుగక బ్రహ్మం
బిది యని యెఱుఁగంగ లేక యేర్పడ సభలన్
వదఱుచుఁ దిరిగెడియయ్యల
చదువులపస లెన్న సున్న సంపఁగిమన్నా! 59
క. చేతావాతాగొట్టెడి
ఘాతుకు లవివేకు లనుచుఁ గని వారలతోఁ
నీతిపరు లడ్డ మాడరు
చాతుర్యధురీణు లెన్న సంపఁగిమన్నా! 60
క. తనలో నెప్పుడు నుండెడు
తనుఁ దెలియఁగలేడు నిన్ను దరమా తెలియం
దనుఁ దెలియుట నినుఁ దెలియుటె
సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! 61
క. దేహమె తా నై యున్నెడ
దేహముతోఁగూడఁ గాలితేనే నిజమౌ
దేహాత్మవాదిమాటలు
సాహసములు బొంకులన్న సంపఁగిమన్నా! 62
క. దండకమండలులు శిరో
ముండనము ధరించి నంత మోక్షముగలదా?
మెండుకొనులోనిపగతుర
చండిమఁ దెగటార్పకున్న సంపఁగిమన్నా! 63
క. సన్న్యాసుల మని శాస్త్రో
పన్యాసముచేయు టెంతపాపము కాదా
యన్యోన్యాశ్రయ ముండిన
సన్న్యాసము కూడదన్న సంపఁగిమన్నా! 64
క. వాదుల నడఁచెడిపెద్దలఁ
గాదనఁ గా నేల వట్టికలహం బింతే
ఖేదం బని చాలించిన
సాదరమతి జాణఁ డన్న! సంపఁగిమన్నా! 65
క. వాదము ఖేదముకొఱకౌ
మేదినిఁ గలవిద్య లెల్ల మెతుకులకొఱకౌఁ
గా దది ముక్తిపథం బని
సాదరమతిఁ దెలియ రన్న! సంపఁగిమన్నా! 66
క. వాదము లనఁగా దాతృవి
వాదము మఱి యంత్రతంత్రవాదములును నీ
జూదము మేదిని మెత్తురె?
సాదరమతు లెన్నరన్న! సంపఁగిమన్నా! 67
క. ప్రేమమున నాత్మసుఖమం
దేమియుఁ బస లేక తత్త్వ మెఱుఁగుదు మనుచున్
నేమములు విడిచి తిరిగెడి
సాముల నేమందు మన్న! సంపఁగిమన్నా! 68
క. చేతోగతినెఱిఁగినవా
రేతీరున విధినిషేధ మెఱుఁగక యున్నన్
జూతురు సమరసభావనఁ
జాతుర్యధురీణు లెన్న సంపఁగిమన్నా! 69
క. ఎప్పుడు కర్మముఁ జేసెడి
యప్పురుషుఁడు తన్నుఁ గన్న నది చాలించున్
చప్పిడిగాదా నోటికిఁ
జప్పనియాపిప్పిఁ దిన్న సంపఁగిమన్నా! 70
క. మునిఁగితి మందురు
మునుఁగుట మనసో పంచేంద్రియములో మఱి జీవుండో
మునుఁగుట యెవరో తెలియదు
సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! 71
క. తానైనం బరిశుద్ధుఁడు
మేనైన న్మట్టి బొంకి మేనో తానో
పూనికఁ జేసెడితీర్థ
స్నానం బిఁక నెవరి కన్న సంపఁగిమన్నా! 72
క. సూతకము వచ్చె ననుచును
నాతలఁ బదినాళ్లు జరపినంతనె తెగునా?
సూతకమే కాదా తన
జాతకము నెఱింగికొన్న సంపఁగిమన్నా! 73
క. ముట్టున దొలఁగుదురేమో
ముట్టుననే తనువుగాఁక మునుఁగుదు రేమో
ముట్టుకు వెలియైతే యొక
చట్టా మఱిదేహ మెల్ల సంపఁగిమన్నా! 74
క. కలలో నొక్కఁడు పులిఁ గని
పులిచే నణఁగుటను దాను పులియుటబొంకా
కలవలెను జగమెల్లను
సలలితభక్తిప్రసన్న! సంపఁగిమన్నా! 75
క. భ్రమదృశ్యజాల మెల్లను
భ్రమ లోకములెల్ల మిగుల భ్రమ కర్మంబున్
భ్రమమూలమె యీసర్వము
సమరసమౌ దత్త్వ మెన్న సంపఁగిమన్నా! 76
క. వంశము తన కెక్కడిది చి
దంశము లౌఁ గాకయున్నఁ గద జీవులకున్
సంశుద్ధి దొరకనేరదు
సంశయములు విడువకున్న సంపఁగిమన్నా! 77
క. తనమనసే తా నాయెను
తనమనసే తన్నుఁ దెలియ దత్త్వం బయ్యెన్
మనసునకు సాక్షి మనసే
సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! 78
క. మనసే జీవుం డనగను
మనసే తనచేష్ట లుడిగి మఱితత్త్వమగున్
మనసుగలవాఁడె ముక్తుఁడు
సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! 79
క. పురుషునకుఁ బ్రకృతి వేఱా
సరిసమ మని తెలిసియుంట సహజము గాదా
పురుషవివర్తమె ప్రకృతియు
శరణాగతసుప్రసన్న! సంపఁగిమన్నా! 80
క. సత్తనఁ బరఁగును బురుషుఁడు
సత్తనఁగాఁ బ్రకృతి తోఁచి సమసెడు కతనన్
సత్తునకే నిత్యత్వ మ
సత్తున కదిగూడ దన్న సంపఁగిమన్నా! 81
క. సత్తును నెఱుఁగ దస త్తా
సత్తును నెఱుఁగంగలే దసత్తును నిఁక నీ
సత్తాసత్తలఁ దగ సద
సత్తైకను జీవుఁ డన్న సంపఁగిమన్నా! 82
క. కనరా దన్నను శూన్యము
కనవచ్చు నటన్న జడము గా దది వెలిగా
ననుభవవేద్యము బ్రహ్మము
సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! 83
క. లక్షణ మెఱుఁగనియోగవ
లక్షణ మను మతనిమాట లవి ప్రల్లదముల్
దక్షత నంతదృష్టి వి
చక్షణుఁడా కాఁడు సున్న సంపఁగిమన్నా! 84
క. నష్టపదార్థం బగునీ
సృష్టిని నుపసంహరించి చిన్మయ నంత
ర్దృష్టిని గనవలె జనులకు
స్రష్టతనం బేటి కన్న సంపఁగిమన్నా! 85
క. తోరంబై యోగీంద్రవిహా
రంబై విమలచిన్మయాకారం బై
ధీరంబై చిద్రూపము
సారంబై వెలుఁగు నన్న సంపఁగిమన్నా! 86
క. చింతించి యోగి మోక్షా
నంతసుఖం బొదువఁ జక్షురగ్రంబునఁ దా
నంతర్దృష్టిని గనవలె
సంతతమును నాత్మఁ గన్న సంపఁగిమన్నా! 87
క. తన కనుభవంబు చదువుల
వినుకులనే కలుగు ననెడివెఱ్ఱియుఁ గలఁడే
యనుభవవేద్యము బ్రహ్మము
సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! 88
క. కడుధీరుం డై యోగము
తొడిబడ, ద న్నెవ్వరైన దూషించినఁ దా
నొడలికి నేపో టొదవిన
జడియక సాధించు నన్న సంపఁగిమన్నా! 89
క. తెఱచియుఁ దెఱవనికన్నులు
మఱచియు మఱువనితలంపు మ్రాన్పడుమేనున్
పరమచిదాకాశస్థితిఁ
చరితార్థుఁడు నిలుతునన్న! సంపఁగిమన్నా! 90
క. నలుగురు నడచెడుత్రోవను
బలిమిని లోకంబు నడచుఁ బ్రాజ్ఞుం డైనన్
నలువు రెఱుంగనిత్రోవలఁ
జలియింపక నడచు నన్న! సంపఁగిమన్నా! 91
క. మనసెక్కడ మాయెక్కడ?
తనువెక్కడ? ముప్పదాఱుతత్త్వము లెచటన్
ఘనరాజయోగ మెఱిఁగిన
జనునకు దాసప్రసన్న! సంపఁగిమన్నా! 92
క. వెలిచూపును లోచూపును
వెలిగాఁ దన్మధ్యమునను వెలిఁగెడితత్త్వం
బలవడఁ జూచినయతఁడే
సలలితుఁ డగుముక్తుఁ డన్న! సంపఁగిమన్నా! 93
క. ఇద్దఱు నొకటైనను గడ
మిద్దఱుఁ దా మేకమగుచు నేకాంతముగా
నిద్దఱు నిద్దఱు నొకటై
సద్దేమియు సేయ రన్న! సంపఁగిమన్నా! 94
క. మిక్కిలి సంసారయినను
నెక్కడియోగము రుచించు నెక్కుడుశైత్యం
బెక్కిననోటికిఁ జేఁదగు
జక్కెరపొడిఁ దిన్న నెన్న సంపఁగిమన్నా! 95
క. నాలుగుత్రోవలనడుమను
శ్రీలీలను వ్రేలుచున్న చిహ్నంబులఁ దా
నాలోచించినబుద్ధివి
శాలుండౌ ముక్తుఁడన్న! సంపఁగిమన్నా! 96
క. పందలగుచెనటిమనుజుల
కందంబుగ రాజయోగ మలవడు నేలా
పందలకును గాడిదలకుఁ
జందనగుణ మేటికన్న! సంపఁగిమన్నా! 97
క. ఇప్పదవు లందనేరని
మొప్పెలకుం దెలుప వశమె ముందఱగానే
తప్పులు పట్టుచు మఱి చేఁ
జప్ప ట్లిడి నగుదురన్న! సంపఁగిమన్నా! 98
క. కను జెదర మనసుఁ జెదరం
గను జెదరు న్సుఖము చెదరుఁ గాలియుఁ జెదరున్
గనుఁ జెదరక తనుఁ
గనవలె సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! 99
క. పాళ్ళును బంపును దొడవులు
నూళ్ళును మును చన్నవారు నూర్జితులై రా
యో ళ్ళరిగి రోళ్ళ వెంటనె
సాళ్ళని ఘను లెన్న రన్న! సంపఁగిమన్నా! 100
క. ముందు వెనుకెఱుఁగ కాటల
సందడిఁ బడి మోక్షసుఖము సాధింపనియా
పందలవ్రతుకులు నిఁక నే
చందంబో యెఱుఁగ మన్న! సంపఁగిమన్నా! 101
క. వెలిచూపును లోచూపును
గలయంగా నొక్కచూపుఁగా జూచిన యా
నిలుకడ గలయోగీంద్రుఁడె
సలలితసుజ్ఞాని యన్న!సంపఁగిమన్నా! 102
క. చిత్తమునం దమ్మెఱుఁగక
తెత్తురు తమచేటు నత్త తిత్తు న్మత్తున్
మొత్తముగ నూడిపోయిన
సత్తులవా? సుప్రసన్న!సంపఁగిమన్నా! 103
క. సంపద లెఱుఁగక తామే
సంపదగలవార మనుచు జడు లిలఁ దమలో
సంపదఁ గననేరక వెలి
సంపదలే చూతు రన్న! సంపఁగిమన్నా! 104
క. నేరనిజనులను బట్టుక
పోరాడఁగ నేల పల్కపోతారాటం
బేరీతిఁ దెల్ప గతికి వి
చారము మదిఁ బుట్టదన్న! సంపఁగిమన్నా! 105
క. శోధింపరు తత్త్వజ్ఞులు
నీధరఁ దమతోడిసరికి నీదుర్మనుజుల్
మేధావంతులు పెద్దలు
సాధువు లని యెంతు రన్న! సంపఁగిమన్నా! 106
క. పుత్రులు మిత్రులు బంధుక
ళత్రములనువారు ముక్తిలలనకు నరునిన్
బాత్రుని గానీయరు హిత
శత్రులుగా వార లెన్న! సంపఁగిమన్నా! 107
క. సంకల్ప ముడిఁగి తా ని
స్సంకల్పుం డైనఁ జాలు సద్గతి తడవా
సంకల్పమె బంధము ని
స్సంకల్పమె మోక్ష మెన్న సంపఁగిమన్నా! 108
క. జనుఁడుం జిదమృతరసవార్
థిని చెట్టునఁ గ్రీడ సల్పి తెప్పలఁ దేలున్
విను తుచ్ఛసుఖము లేలా
సనకాది మునిప్రసన్న! సంపఁగిమన్నా! 109
క. కీలెఱిఁగి జీవపదముల
నోలిన్ సమరసము చేసి యోగానందుల్
బాలోన్మత్తపిశాచుల
చాలుగ వర్తింతు రన్న! సంపఁగిమన్నా! 110
క. సర్వావస్థల నడఁచియు
సర్వావస్థల నెఱింగి సర్వసముం డై
సర్వముఁ దా నని తెలిసిన
సర్వోత్తముఁ డాతఁ డన్న సంపఁగిమన్నా! 111
క. తనవారి నెదుటివారిని
దనవారిఁగఁ జూడనేర్చుధన్యులు చాలన్
ఘనకీర్తులచే మింతురు
సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! 112
క. నిత్యానిత్యవివేకము
సత్యనుపమశీలుఁ డెఱుఁగు నాతఁడు సుజన
స్తుత్యుఁడు జీవన్ముక్తుఁడు
సత్యం బిది వినఁగదన్న? సంపఁగిమన్నా! 113
క. కూడదు గతి సంసారికి
బూడిదలో గచ్చకాయ పొరలినభంగి\న్
వాఁడును వీఁడును దానై
జాడ యెఱిఁగి నడువ రన్న! సంపఁగిమన్నా! 114
క. పాపపువాసనవిషయము
కాపాడుచురాగ నరుఁడు గడఁవగఁగలఁడా?
యేపట్టున గుహ్యోదర
చాపల్యము మానకున్న సంపఁగిమన్నా! 115
క. సాధనచతుష్టయంబున
సాధారణలీలఁ దనరి సర్వేంద్రియముల్
శోధించి నిజసమాధిని
సాధించినముక్తుఁ డన్న సంపఁగిమన్నా! 116
క. ఉద్యోగంబునఁ బురుషుఁడు
సద్యోగముఁ జలుపవలయు సవిశేషముగా
విద్యానిధి యగునతఁడే
సద్యోముక్తుఁడు గదన్న సంపఁగిమన్నా! 117
క. బోధించినగురువులచే
సాధింపను నేర్పు గలిగి సన్నుతు లగుచున్
శ్రీధరుఁ గలియుదు రపుడే
సాధకమున బుధులు సుమ్ము సంపఁగిమన్నా! 118
క. ఆతురుఁ డై తను నడిగిన
యాతనికిం దెలుపవలయు నన్యులు వింటే
నా తలవంపులును సుహృ
జ్జాతులకే యోగ మెన్న సంపఁగిమన్నా! 119
క. మందేహామందౌషధ
మెందు న్సరిలేని దైవ మిలలో సత్యా
నందంబు జయమునందు త
మందఱము సుఖంబు లంది యలరుద మెలమిన్. 120
: శతకములు :
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము | మాతృ శతకము | కఱివేల్పు శతకము | మదనగోపాల శతకము | చక్కట్లదండ శతకము | సుందరీమణి శతకము | కాంతాలలామ శతకము | తాడిమళ్ళరాజగోపాల శతకము | భక్తమందార శతకము | కుక్కుటేశ్వర శతకము | భర్గ శతకము | లావణ్య శతకము | వేణుగోపాల శతకము | విశ్వనాథ శతకము | ఒంటిమిట్ట రఘువీరశతకము | మృత్యుంజయం | చెన్నమల్లు సీసములు | సంపఁగిమన్న శతకము | కుమార శతకము | శ్రీ అలమేలుమంగా శతకము | సూర్య శతకము | నీతి శతకము | శృంగార శతకము | వైరాగ్య శతకము | మంచి మాట వినర మానవుండ | సదానందయోగి శతకము | శివముకుంద శతకము | మృత్యుంజయ శతకము |