: లావణ్య(సీమ)శతకము :
రచించినవాడు - పోలిపెద్ది వేంకటరాయకవి
సీ. శ్రీమదఖండలక్ష్మీప్రసన్నుడు మాక- । రాట్కులాంబోధికైరవహితుండు
సరసుడౌ వేంకటపెరుమాళ్ల రాజేంద్రు- । డొకనాడు కొలువు కూర్చుండి నన్ను
గని పోలిపెద్దివేంకటరాయసుకవీంద్ర । రమ్మని ప్రేమమీరంగ పురుష-
విరహంబు శ్రీహరిస్మరణశృంగారంబు- । గను చమత్కృతిశతకం బొనర్పు-
తే. మనిన శారద నేకదంతుని నుతించి । నే రచించెద పద్యముల్ నేర్చినటుల
నీదు కృపలేక కృతి సేయ నెవరికైన । వశమె శ్రీరామరామ లావణ్యసీమ. 1
సీ. ముందు సత్కవిబృందములలోకి వాల్మీకి । నఖిలపౌరాణికాఖ్యాసు వ్యాసు-
నతిమూఢజనుల కద్భుతనీతి భవభూతి । మహనియ్యకావ్యనిర్మాణు బాణు-
నసమానశబ్దశాస్త్రసముద్రు శివభద్రు । కవిరాజితవిలాసు కాళిదాసు
భవఘోరతిమిరప్రభారవి భారవి । సురుచిరసద్గుణస్తోము భీము-
తే. ననుదినంబును భక్తితో నభినుతించి । సకలజనములు విని సంతసమున జెలగ
సీసశతకం బొనర్చెద చిత్తగింప । వలయు శ్రీరామరామ లావణ్యసీమ. 2
సీ. జనకాత్మజాసుహృద్వనజాతసారంగ । సారంగధరకంఠసన్నిభాంగ
యంగజానేకసమంచితసుకుమార । సుకుమారజననిసంస్తుతపదాబ్జ
యబ్జబాంధవసత్కులాబ్ధిసంభవచంద్ర । చంద్రశోభితదివ్యచారుగంధ
గంధసింధురదశకంఠకంఠీరవ । రవగుణశ్రుతభయక్రాంతకాండ
తే. కాండవాసిష్ఠశుకశౌనకాదివినుత । వినతసుతవాహనారూఢవిమలకరుణ
కరుణ నీ కృతినాథు దీర్ఘాయు జేయ- । వలయు శ్రీరామరామ లావణ్యసీమ. 3
సీ. పాకంబునకు తగు ఫణితి గానక కిరీ- । టము బెట్టినట్లు నీమములు లేక
తెనుగు పొయ్యెటి జాడ తెలియజాలక పెక్కు । శృంగారరీతులు చేతగాక
గ్రామ్యదేశ్యమ్ముల క్రమములెరుంగక । జాతీయములు గూర్చు సరణి రాక
పెళుచుమాటల దొంతి బేర్చుచు సాధార- । ణములౌ యతిప్రయోగములు లేక
తే. నొకరి కయితను గని హేళనోక్తులాడు । కుకవిశుంఠల మూతిపై గొట్టినటుల
నేనొనర్చెద పద్యముల్ నీదు కరుణ । వచ్చునటుల రామరామ లావణ్యసీమ. 4
సీ. శ్రీకరంబుగ ప్రేమచే నాదు మనసు రా । నడుచుకొన్నట్టి నీ నాగరికము
వినయవివేకభావనలొప్ప కందువ । మాటలాడెడు నెరనీటుతనము
దర్పకశాస్త్రపద్ధతి మీరి కళలంటి । సొక్కించునట్టి నీ సోయగము
సరసత్వమున బంధసరణి గుర్తెరిగి నన్ । రతుల తేలించు నీ రసికతయును
తే. మదిని తలపోసి యితరరామలను రోసి । నేర్పు వెడజేసి కంటికి నిదురబాసి
మమత నిను డాసియుండక మరుని గాసి । వశమటే రామరామ లావణ్యసీమ. 5
సీ. ఇసుకదిన్నెలను నీరెండ గాసినయటు- । వలె పిరుందులనంటి వల్వ దనర
దంతపుభరిణమూతల రంగు బూసిన । కరణి గుబ్బల కంచుకంబు వెలుగ
కొనచెవి పచ్చడాల్ గోడల బీరాకు । పసరు చల్లిన రీతి పరిఢవిల్ల
రాజబింబము నపరంజితీగెను గొల్చి । చూచిన గతి తిరుచూర్ణరేఖ
తే. ముద్దుమొగమున నత్యంతముదము దోప । తొలుత నేస్తంబునకు నన్ను బిలిచినట్టి
కులుకుబెళుకును తలపోసి వలపు నిలుప । వశమటే రామరామ లావణ్యసీమ. 6
సీ. తరళాక్షి నీ మేనితావి ఘమ్మన నాదు । మనసు ఝుమ్మని రేగి మరులు జెందు
చెలి నీదు గిల్కుటందెలు ఘల్లుమని మ్రోయ । తనువు ఝల్లని యేమొ తత్తరించు
మగువ నీ సొగసు కల్మా ధళుక్కనినంత । కళ చళుక్కని లోన కలకబారు
నొకవేళ కోపగించుక గిరుక్కన మరుం । డట చురుక్కన పూవుటమ్ము వేయు
తే. వెలది కడుసోలి బతిమాలి వెతల చాలి । భావమటు తూలి తమిదేలి పాలుమాలి
యెడతెగని బాళి నీ జోలికింత జాలి । వశమటే రామరామ లావణ్యసీమ. 7
సీ. చనువిచ్చి నను మచ్చికను వచ్చి నెనరిచ్చి । మనసిచ్చి పైకొను మధురవాణి
వలపింపులను యింపుగలిగింపు బలుసొంపు । పలుగెంపు లొనరింపు భ్రమరవేణి
యల జంటి రయికంటినటువంటి మొనచంటి । నెదనాని కళలంటు మిందువదన
తమిదీర భ్రమమీర తనివార కొనగోర । తొడల కొక్కెసమించు తోయజాక్షి
తే. యెపుడు నే గందు నీ వుసురెవరి జెందు । నెటుల మతిబొందు నీ తమికేది మందు
జాలినెటునొందు దెవతె నీ సరి పసందు । వచ్చునటె రామరామ లావణ్యసీమ. 8
సీ. అత్తరురవ మెరుంగాని దువ్విన జారు । కొప్పుతో పైట మేల్కప్పుతోడ
నల జక్కువలను హాస్యము సేయు కుచకుంభ- । యుగముతో చిరునవ్వుమొగముతోడ
సౌగంధికముల రచ్చకు దీయు డాల్గన్న । మోవితో కపురంపు తావితోడ
మేల్కడాని హొరంగు మించిన నెమ్మేని- । కాంతితో మదనవిభ్రాంతితోడ
తే. నరనిదుర జెంది పవళించినట్టివేళ । వచ్చి మెల్లనె సైగగా నెచ్చరించి
పైకొని యొనర్చునటువంటి పనులు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 9
సీ. వంకెవంకెల గాజు వైఖరి పొడగన్న । తలపౌను నీదు ముంగురుల ఘనము
దాడింబపండ్లు చేదగిలిన తరిని జ్ఞా- । పకమౌను నీదు గుబ్బల పసందు
చీమలబారు చూచినవేళ మది కళు- । క్కని గప్తి తగులు నూగారు తీరు
జలపూత గల కెడముల డాలు గాంచిన । తోచు నీ నునుపిరుందుల మిజాదు
తే. తగని మరులాయ మానసోద్భవుని మాయ । గెలువరాదాయ మనసేమొ నిలువదాయ
క్షణము యుగమాయ నిపుడింత చలముసేయ- । వలెనటే రామరామ లావణ్యసీమ. 10
సీ. అల కుందముల యందముల నిందసేయు నీ । రదనాళి దలుప నెమ్మది చలించు
జలజాతముల ఖ్యాతముల రాత నదలించు । చూపులెంచిన మోహమేపు మించు
పగడాల జిగిడాల జగడాల గెల్చు కె- । మ్మోవి జూచిన బాళి ముమ్మరించు
మగరాల వగతూలన గజాలునగు లీల । దలప నెమ్మేనేమొ పులుకరించు
తే. వింత నీ చెంతలేని నివ్వెరగు కొంత । వేసటొక్కింత తమి యింత వెగటు కొంత
యీదినము నంతకంత నీమీది చింత । వశమటే రామరామ లావణ్యసీమ. 11
సీ. సుదతి నీ జిల్గుపయ్యెద జారనియ్యవే । బటుచనుంగవ గానబడును గాని
హరిమధ్య నిలచి మాటాడవే యొకసారి । వీనులపండువై విందు గాని
మృగనేత్రి ముద్దునెమ్మొగ మెత్తిచూడవే । మది చింత లొకకొంత మాను గాని
వలరాజునగరి ముందలనైన నుంచవే । జీతమొల్లని కొల్వు సేతు గాని
తే. దైవఘటనేమొ గాని నిన్ దలచినపుడు । ఝల్లుమని గుండెలదరె నీ జాలి మాని
మరుడు నన్నేచ నీమీద మరులు దాచ । వశమటే రామరామ లావణ్యసీమ. 12
సీ. ఘనమైన రవలచెక్కటపు పాపట చేర్చు । బిందీలపైన నందంది పొదల
చెలువొంద బాజుబందులక్రింద పికిలి చెం- । డ్లానుగా దుమికి యుయ్యాలలూగ
రాగిడి నెలవంక రతనంపు బిళ్లల । జడ పిరుందులతో సరసమాడ
సొగసైన లేగౌను బిగిసి యొడ్డాణంపు । ఘంటలొక్కొకసారి ఘల్లురనగ
మేలైన చెంపఖల్లీలు గుబ్బల మధ్య । చంద్రహారములతో జత బెనంగ
తే. తమిని కళలూర నొసట కెంజెమట జార । కదలవలదని యెదనెద నదిమి గదిమి
యుపరతి యొనర్చునాటి నీ హొయలు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 13
సీ. పసుపునిగ్గుల చల్వపావడతో కుసుం- । బా కలాబతు జారుపైటతోడ
మొనబంటి కసికాటులను కందు మోవితో । విరులు వాడిన వేణిభరముతోడ
నెలవంక గోటిపోటుల చన్నుదోయితో । సొక్కిన నెమ్మోముసొగసుతోడ
కొద్దిగా చెదరు కుంకుమతో కరంగిన । కాటుక కనుసోగ నీటుతోడ
తే. ముడి వదలినట్టి నీవి నిమ్ముగ బిగించి । సురతమున మైచెమర్చిన సురటి బూని
విసరుకొనుచున్నవేళ నీ వితమునెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. 14
సీ. సమబంధమొనరించు సమయమందున కర- । మ్ములు మధ్యమునకు లంకెలు దనర్చి
గుదికాళ్లు పిరుదుల నదిమి వాతెరల నొం- । డొండ పల్మొనలతొ నొరయుకొనుచు
రెక్కలన్ గూర్చి కన్రెప్పలల్లార్పుచు । కడుపక్కళించి వెన్కలకు దిరిగి
తను చివుక్కునను పైకొను వితంబిది గాదు । డింకిసేయుదము లెండి యని లేచి
తే. వెనక జిక్కితిరో యని వెన్ను జరచి । నొసటి చెమ్మట పయ్యెదనొత్తికొనుచు
నిలిచి నను జూచి పలికిన నీటు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 15
సీ. చూపుమార్పులను హెచ్చుగ నాస గల్పించి । చేమార్పులను చాల ప్రేమ నించి
కౌగిటిమార్పుల కడుమోదమున మించి । మోవిమార్పుల మెచ్చి ముద్దునిచ్చి
తమలంపుమార్పుల క్రమముగా దనియించి । తొడసందిమార్పుల దుడుకు గాంచి
ప్రక్కమార్పుల ప్రౌఢిపని గాదని మదించి । పడకమార్పుల హాయిబడ రమించి
తే. బడలికను లేచి నెమ్మోము పారజూచి । మదినొకటి దోచిన నవ్వి యామాట దాచి
చేతచెయ్యూచి పలుకు నీ చెలువమెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. 16
సీ. పికిలిపిట్టల రీతి పెదవికాటందుచు । కూర్చుండెదుర్కొని కొంతసేపు
చిలుకల గతి ముద్దుపలుకులొప్పుగను పై- । కొని రతి హాయిగా కొంతసేపు
కన్నెపావురమన గళమున మణితంబు । గులికించి హొయలుగా కొంతసేపు
కళలుప్పతిల్ల ప్రక్కలు గోట జెణకుచు । కోకిలరవముచే కొంతసేపు
తే. వింతగొరువంకపోరుల గొంతసేపు । గునుపుతో ప్రక్కమార్పుల కొంతసేపు
క్రీడ సల్పిననాటి నీ రీతినెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. 17
సీ. తొడనిగ్గు పైకి గన్పడు కీనుఖాబు పా- । వడతో జరీబుటా వల్వతోడ
రహిమించు వహిగాంచు రవికెతో ఝల్లని । కౌనుల్కి చెమరించు కళలతోడ
సొగసు మించిన చాదుచుక్కతో పిరుదుల । నంటి మెలంగు కీల్గంటుతోడ
మొనలు పైపైలకగ్గిన కుచద్వయముతో । మిసిమి జెలంగు నెమ్మేనితోడ
తే. కులికి దిగ్గున లేచి లోకొంగు జూచి । చెరగు మాసె నటంచును సిగ్గుదోచి
పాత్ర గైకొన్న హొయలెంచి బాళి నిలుప । వశమటే రామరామ లావణ్యసీమ. 18
సీ. కరమొప్ప మేల్కీనుఖాబు పావడమీద । సిరిమించు మహతాబి చీర గుల్క
సరిగె కంగోరు భస్మావన్నె రవికెపై । పిగిలి కుచ్చెల ధాటు పిక్కటిల్ల
పోచీలు కంకణమ్ములు సరుల్పాటిలు । కరము జూపగ ధళుక్కని వెలుంగ
గొలుసులు పావడంబులు చిరుగజ్జె లం- । దెలు పదమ్మున ఝళంఝళలు సేయ
వలరాయునింట చిల్చిలమంచు కళ కుసుం- । బాపువ్వురసము కైవడిని గురియ
తే. బోటి మార్నీటిరేయి నీతోటి నెనయు- । నాటి వేడుకలింక నేనాటికైన
కోటి యిచ్చిన కల్గ దాపాటి దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 19
సీ. మైతావి నీవి కమ్మని మోవి గను ఠీవి । దలపోసి పెదవులు దడిపి దడిపి
తొడతళ్కు నడుమల్కు నడగుల్కు పొడగాంచి । గొనబైన జాలిచే గుంది గుంది
జడబారు నుడితీరు మడిచారు మడిసౌరు । నెంచి చాలగ తమి హెచ్చి హెచ్చి
వలపింపు కటిపెంపు వదనంపు జిగిసొంపు । లనుదినంబును గొనియాడి యాడి
తే. యజుని దూషించి ప్రాకృత మనుసరించి । బాళి కడుమించి యొంటిగా బవ్వళించి
మనసు నిర్జించి దినము లీమాడ్కి జరుప । వశమటే రామరామ లావణ్యసీమ. 20
సీ. హాయిగా విన విన ఠాయిగా నీచేత । నెలనాగ వీణె నేనెపుడు విందు
సొంపుగా మై జులాయింపుగా నీనోట । రమణి నేనెపుడు పద్యములు విందు
కుల్కుగా తేనియ జిల్కగా నెపుడు నే । లలన నీ ముద్దుపల్కులను విందు
మెల్లగా నెమ్మది చల్లగా నెపుడు నే । కాంత నీ గాత్రరాగంబు విందు-
తే. ననుచు నేనుందు నేటికి యబ్బె సందు । కనికరము జెందు మనసుకీ కపటమెందు
కొరకు నీ పొందులేనిదే కొదువ యెందు । వశమటే రామరామ లావణ్యసీమ. 21
సీ. తొలకరిమెఱప నా వెలలేని జీవర- । త్నమ జున్నుగిన్నె బిత్తరులమేటి
రామచిల్క యొయారిరాయంచ ఖండచ- । క్కెరరాశి మేల్మిబంగరుసలాక
మదనమంజరి తియ్యమామిడి కుం- । కుమబొమ్మ కల్కికుల్కులకొఠారు
కట్టాణిముత్యము కస్తూరివీణె ము- । ద్దులగని సింగారములబిడారు
తే. నెనరుమాటలదీవి పన్నీటిచెలమ । కన్నె వేడిమిఠారి యంగజునిసొక్కు
మందుపొడిడబ్బి జాణ నిన్మది దలంప । వశమటే రామరామ లావణ్యసీమ. 22
సీ. మైసూరి కుతినీ తమాను వేసుక జరీ- । పాగా తురాయి గన్పడగ జుట్టి
భారి శాలువ వల్లెవాటుగా నమరించి । బేషైన రవల సర్పోషు నించి
వాణిగా జిగి బర్దవాని తేగా వర- । పై మొఖమల్ గలీబా వదల్చి
చిలక విప్పి చాయలు తళుక్కున దూసి । జిగి గల చిల్కతేజీపఠాణి
తే. యిచ్చటికి చెచ్చెరను బలుమచ్చరమున । చిచ్చు కైవడి విడివడి వచ్చువాని
విచ్చుకత్తికి నెద నెదురిచ్చి నిలువ । వశమటే రామరామ లావణ్యసీమ. 23
సీ. పదినూరుకన్నులపాదుషా కొల్వులో- । పలనెత్తు ధవళాతపత్రమనగ
హరుని నేత్రాగ్నిచే కరిగి నీరైన పూ- । విలుకాని సతి మోముచెలువనంగ
వలరాజు వేటాడి వచ్చిన రతి దృష్టి- । పట్టిన రతనాలపళ్లెమనగ
ప్రాగ్దిశాంగన కొప్పుపై తళతళమంచు । రహిగాంచు వజ్రాలరాకిడి యన
తే. విరహు లదరంగ తమ్ములవేడ్క గ్రుంగ । కలువలుప్పొంగ నింగి రిక్కలు చెలంగ
క్రౌర్యము వెలుంగ మింట జక్కువలగొంగ । వచ్చె గదె రామరామ లావణ్యసీమ. 24
సీ. శయనించియున్న హెచ్చరికకై సకలాతి । తెర తొంగిచూచి యందెలు గదల్చు-
నది వినబడక నే నిదురింపుచుండిన । విరుల పంఖా బూని విసరజొచ్చు-
నపుడు మేల్కాంచి మాటాడకుండిన యూరు- । లెత్తించి పదముల నొత్తనెంచు-
నంతట నేను గిల్గింతలొనర్చుచో । కిలకిల నవ్వి కెంగేలు పట్టి
తే. చాలు పొమ్మన్న వదన భావాలనెంచు- । నట్టి సద్గుణవతిని నా యాత్మ దలచి
వలసి కలయక మరుని కాకలకు తాళ- । వశమటే రామరామ లావణ్యసీమ. 25
సీ. తరుణి చన్మొనల నూదారంగుగానున్న- । దేమన మీకేమి దెలుసునందు-
వవునంచు మరునిల్లు నివిరిదేమన నిటు- । లడుగవల్దని చిన్నియాన బెట్టు-
దలరి ప్రక్కలు చెణ్క గిలిగింత లికనవ్వ- । లేనంచు రివ్వున లేవబోదు-
వెనయ కుచ్చిళ్లలోగిన నీవి వదల ని- । గ్గమరి దివ్వెకు చేతులడ్డమిడుదు-
తే. వపుడు చేబట్టి లాగిన హరి యటంచు । కండ్లు మూతువు చిరునవ్వు గడలుకొనగ-
నది దలంచిన మదిని మోహము నడంప । వశమటే రామరామ లావణ్యసీమ. 26
సీ. నూతనకేళి నేనొనరింపబూనిన । చిడిముడిలోజంకు సిగ్గువెరగు
వేగుటవేసట వెల్లవాటునుజాలి । మడిమవిదల్పు పెందొడవడంకు
బొమముడికనుమూత మోవియార్చుట లల । మైచెమర్చుట తడంబడుట సొలపు
పలుమొన బిగియించు పటిమ నధైర్యంబు । కసరు తొందర బాళి గడలుకొనగ
తే. పొలతి నన్నెంచనపుడు నే బుజ్జగించ । కౌను యసియాడ మన్మథకళలు వీడ
రతమొనర్చిననాటి నీ వితమునెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. 27
సీ. కలకంఠి యీడునెచ్చెలులెల్ల శృంగార- । వనికి బోదాము రమ్మనుచు బిలువ
కడుమోదమున రైక తొడగలేదను గప్తి । మరచి వారలతోడ నరుగుదెంచి
పున్నాగసుమగుచ్ఛములకు చెయ్యెత్తిన । కోరకగతి గబ్బిగుబ్బ యుబ్బ-
నపుడేను కొనగోట నదిమిన నను గాంచి । సిగ్గుచేతను పైటచెరగు గప్పి
తే. తీవ్రగతినేగి చెలులతో తేటి యిచట । కొరికెనో గాక చెయ్యెత్తగూడదనుచు
చెప్పుకొనునాటి యణుకువ చెలువ దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 28
సీ. అభ్యంగనస్నానమైన పిమ్మట శికా- । కుళము సెల్లా నొంటికొంగు గట్టి
పైటచెరుంగు గుబ్బలచుట్టు తెర యిచ్చి । సాంబ్రాణిధూపవాసనలు నించి
నీరెండపొడల పెన్నెరుల చిక్కెడలించు- । చును యామరిక హవుసుగను నిలిచి
తడి యార్చుచున్న నప్పుడు వెన్కగాను ద- । గ్గరవచ్చి చెణకిన తిరిగి చూచి
తే. యౌర బాగాయ నిదియేటి యాగడంబు- । లనుచు కోపించి వెంటనే నెనరు గాంచి
స్త్రీల నిటుజూడరాదన్న చెలిమి దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 29
సీ. తాళి గట్టని చిన్నితనమున నొకనాడు । చేడియలను గూడి యాడుచుండి
నను జూచి బావ వచ్చెనటంచు బాజుబం- । దుల క్రిందిచెండ్లంది దుముకులాడ
పరగున నాదు పైబడి కౌగిలించిన । యెనలేని కడువేడ్కనెత్తి లేత-
మొలకమెరుంగుచన్నులు నాభి చెక్కులు । గళమును పచ్చవిల్కానినగరు
తే. ముద్దుబెట్టుక నవ్వుచు ముదిత నీవు । నెవరి పెండ్లాడెదవటంచు నేను బలుక
నిన్నె యని మీసములు మీటు నీటు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 30
సీ. సీమపన్నీరు పై జిలుకుచు హొయలుగా । భారీ బురాన్పురీ పాగ జుట్టి
తేటచెంగావి సుతీనా తమాను ధ- । రించి వేడుక జమాయించి యగరు
యత్తరు కొనవేళ్లనంటి సునాయించి । గీరి జోడైన యంగీలు దొడిగి
ఖుజు వహవా జల్దు ఘోడా యనుచు సఫె- । దారంగు తేజి మోదమున నెక్కి
తే. స్వారి వెడలంగ మహలెక్కి దారి జూచి । యతివచే నంపినట్టి కాకితములోని
మాటల పసందు తలచితే మనసు నిలుప । వశమటే రామరామ లావణ్యసీమ. 31
సీ. కలహంసలకు జీతముల లెక్కజూచి లో- । బాకి చెల్ల గని జాపాలొసంగి
జాతైన మంచిపచ్చలరంగు గల చిల్క- । పంజులెల్లను బరాబరులు జేసి
గండుకోకిలమూక కైజీతములవారి- । కందమౌ ననలతో విందొనర్చి
గొరువంక యెలగోలు నిరువంకలను గూడి । రమ్మంచు తేంట్లచే కమ్మలిచ్చి
తే. దండుకు సమీరణుని సరదారు జేసి । వేయుమని చెప్పి పూపొదవెలిగుడారు
దర్పకుండను పాదుషా దాడి వెడలి । వచ్చె గదె రామరామ లావణ్యసీమ. 32
సీ. జాతిజంగాలి బనాతి కనాతి స- । రాతిలోదటను సూరతువులందు
మొఖమల్ ఖురాళ మిమ్ముగ నఖాసీచుట్టు । తగుటుచీనీలి ముత్యముల చేర్లు
పగడంపు చేవ కంబాలు ముప్పిరిపట్టు । పగ్గముల్ సరిగెహొంబట్టు కుట్టు
నమరుషమేనాకృశములు కమానువా- । కిళ్లు నీలంపు మేకీలు కొణిగె
తే. తీరు నద్దాలబారు గుడారులోన । చదరు సేయంగ పదాలచాటునుండి
వేడ్క నను జూచునాటి నీ వితమునెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. 33
సీ. దండుకూచీ జేసి లెండని సరదార్ల । మదిలోన బల్కుషామతున జెంది
ఖూబైన బాసు జిలీబుతేజీలు హ- । రోలుతయారి కతారాలు దిర్చి
జల్తారు భారిపోషకు వేసి మందట । కటికెముల్ బహుపరాకనుచు బొగడ
కేళికాగృహమువాకిట నిల్చి వూరికి । బోయొత్తు మనిన తాంబూలమొసగి
తే. మొగము వంచుక నరతల్పు సగము మూసి । నిలిచి యేమందునని వ్రేల నేలగీరు-
కొనుచు నను బోయిరమ్మని నెనరు దలుప । వశమటే రామరామ లావణ్యసీమ. 34
సీ. జాఫల్ రసంబు గుర్షాపూలు ద్రాక్షలు । గంగులుఖందు చొక్కపు జవాజి
జాఫరాయగరు పచ్చాకూదుబత్తీలు । పునుగుపన్నీరు గంబురు గులాబి
యత్తరు సీమరాయంచలు తెల్లాకు- । మడుపుల్ వళాగ్రముల్ మల్లెపూలు
కురువేరు నరగ జాల్ కొత్తకైరావళ్లు । దవనంపు చెండ్లు దంతంపు గుండ్లు
తే. మా కచేరికి నజరు లీ మాడ్కి బనిచి । నమ్మినానని వ్రాసుకున్నట్టి జాబు
నకలు జూచిన మరుని గాసికి సహింప । వశమటే రామరామ లావణ్యసీమ. 35
సీ. ఆదికేళికను మై యలసియుండిన తీరు । గని నేస్తమగు జోడుగరితలెల్ల
సతి రేయు పతిసేయు రతివింతలేమన । నేలాగొ నదియు నేనెరుగ పాన్పు
చేరబోవగను కుచ్చిలిబట్టు తీసిన । వడిని నీవికముడి వదలెనపుడు
సిగ్గుచే పయ్యెదచెరగు దివ్వెకు తెర- । చాటు సేయగ హారచయమునందు
తే. గలుగు రతనాలు దివ్వెలుగా వెలుంగ । యతివ భయమున కనులు మూసితిని యవల-
నేమి గనుగొననని పల్కు ప్రేమ దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 36
సీ. అర్ధోదయంబగు నరుణబింబద్యుతి । యెరుపైన మంచిదామరపురేకు
పద్మరాగము పచ్చిపవడంపుతీగె ల- । త్తుక కోపు ముదిరిన దొండపండు
కుంకుమవర్ణంబు మంకెనపువుచాయ । సిందూరవన్నె చిగురుటాకు
దాడిమకుసుమకాంతి దాసానపుష్పంబు । లేబాకమగు నింగిలీకవరఖు-
తే. లేవి జూచిన దాని కెమ్మోవిఠీవి । సాటియగు డాలుగాన ముజ్జగములోన
పరవశముతోన వలరాజుపనులు మాన । వశమటే రామరామ లావణ్యసీమ. 37
సీ. జుంటితేనియపాలు జున్ను శర్కర మంచి- । రసదాడియమృతంబు కుసుమరసము
ఖర్జూరములు పానకము ద్రాక్ష మాగిన । కమలాఫలము లిక్షుఖండములును
నారికేళజలంబు నవనీతమన్కగు??? । పరమాన్నమును వేరుపనసతొనలు
తియ్యమామిడిపండ్ల దీసిన సారంబు । నతిరసంబులు మనోహరచయంబు-
తే. లెన్ని జూచినగాని యా వన్నెలాడి । యధరబింబసమానమౌ మధురమొకటి
గాన నా చానపైని నా కరుణ మాన । వశమటే రామరామ లావణ్యసీమ. 38
సీ. నారాయణవనంబు చీరకుచ్చంచులు । మీగాళ్ల కెలమి కైలాగు లెసగ
సన్నగీరుల గులాల్ వన్నెరైక మెరుంగు । గుబ్బల పొగరానికుట్లు పిగల
కమ్మని దవనంపురెమ్మల జడ పైడి- । కుచ్చులు పిరుదుల గునిసియాడ
పొలుపొందు పావడంబులు మొల్కపాంజేలు । గిలగిలమని పదంబులను మొరయ
తే. నవ్వుకుంచును కార్వేటినగరమునను । వీధినెదురైన సిగ్గున వీపుగప్పి
త్రోవ దొలగిననాటి నీ భావమెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. 39
సీ. పసమించు నెమ్మేన పసమాని మెత్తని । పాదంబులకు జొత్తు పట్టెలుంచి
తళ్కుచెక్కిళ్ల చేతుల మంచిగంధమ్ము । బూసి కుంకుమ నడ్డబొట్టు వెట్టి
జాజిపువ్వుల మంచిజారుకొప్పమరించి । సొగసుకాటుక కనుసోగ దీర్చి
చెరగు మాసె నికేమి సేతు నంచని భర్త- । బొంకి నను ప్రేమతో నుపవని
తే. కలువకొలనికి పడమటిగట్టు పొన్న- । గున్నలకు తోడితెమ్మని గురుతుజెప్పి
కన్య నంపించునాటి సౌఖ్యంబు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 40
సీ. తమ్మిమొగ్గలు పెద్దతలుపు పెన్గుబ్బలు । గజనిమ్మపండ్లు బంగారుగుండ్లు
బరిణెకప్పులు పూలబంతులు మేల్రంగు । బూసిన బటువైన బొంగరాలు
కరికుంభములు వీణెకాయలు జక్కువ- । పిట్టలు మరుని చేపుట్టచెండ్లు
కొండలు యపరంజికుండలు రసగుండ్లు । కంచుగిన్నెలు భూమి గలుగునట్టి-
తే. వెన్ని చూచిన దాని పాలిండ్లతీరు । గాన త్రిజగాన చాన నీ యాన యెంత-
కైన నేమాయ నా మందయానపైన । వలపునిక రామరామ లావణ్యసీమ. 41
సీ. కారంజిలో నీతకాయల మోపాని । తేలెడు పచ్చని తెప్పపల్క
పైకెంపు రాకోళ్లపట్టెమంచము దోమ- । తెరచుట్టు దివ్వెకందీలబారు
తొడిమ తీసిన రెక్క విడిమల్లెపూపాన్పు । పచ్చాకుదిండ్లు కోపైన లోడు
దనరు కుంకుమపువ్వు తక్కెంబు కీలుబొ- । మ్మలు వేయు పంఖాల చలువగాడ్పు-
తే. లెగయ వేసవినెల బవ్వళించియున్న । వచ్చి చెయ్యాని తేనెక్కి వత్తుననుచు
బలికి నాతోడ కలసిన వగలనెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. 42
సీ. జాతివజ్రాల బేసరి బులాకీనత్తు । నాసాగ్రమున దుంకి నాట్యమాడ
జాజిబందులు నూగుపాటీలు కంకణ- । మ్ములు చేకటుల్ ఘలుఘలుమనంగ
జల్తారు పయ్యెద జారి దళుక్కని । బాహుమూలద్యుతుల్ పరిఢవిల్ల
తలయంట వక్షోజములు గోర నే జీర । యలగి నే జెల్ల బాగాయనౌర
తే. సమయమెరుగని పనులివి సరసమగునె । పరులు గనుగొన్న నగరె మీ పనులటంచు
కసరి నలుగుడునాటి చక్కన దలంప । వశమటే రామరామ లావణ్యసీమ. 43
సీ. సిగ దువ్వి సన్నసంపెగలు జుట్టెద తాళు- । డను నయోక్తుల నాదు వెనుకజేరి
కూర్చుండి వెన్నున గుబ్బచన్మొనలాన । తెలసి నెమ్మోము నే తిరిగి చూడ
నదియేమి యూరక యటుల జూచెదరన । యెరుకలేవనుకొంటివేమొ యనిన
కిలకిల నవ్వి చెక్కిలి దువ్వి మిము బోల । ననుమానపరులు లేరనుచు కురులు
తే. రవమెరుంగాని విరిసరుల్ సవరపరిచి । లెస్సనై యున్నదింక లేలెండనుచు
నపుడు బల్కిన సొగసునెంతనుచు నోర్వ । వశమటే రామరామ లావణ్యసీమ. 44
సీ. కుటిలాత్మక నన్ను కౌగిట జేర్చవా యన । కుటిలత నీదు ముంగురుల గాదె
కఠినమానస నీదు కలిమెంతరా యన । కఠినత నీదు చన్గవల గాదె
చపలచిత్త యిదేటి నెపమురా యన చప- । లత నీదు వాల్చూపులందు గాదె
మందస్వభావ యేమందుర యిక నన । మందత నీ యానమందు గాదె
తే. యనుచు నాతోడ కందువ లాడుకొనుచు । నెన్నదగు శయ్య మనమున్న వితము
తలచి చూచిన నెమ్మది తాళియుండ । వశమటే రామరామ లావణ్యసీమ. 45
సీ. మేఘంబు చేజేత మెరయుచుండగ నిండు- । వృష్టి లేదని మిన్ను వెతుకనేల
నమృతప్రవాహంబు కధికారమిచ్చిన । నరుచికై తాంబూల మడుగనేల
పస గందమేదిన కసరితంచనువేళ । లోడీలు తెమ్మని వేడనేల
పైదుర్గముల ఠాను బందిచేసిన క్రింది- । సీమకోసము మన్వి సేయనేల
తే. యనుచు సతతము చతురత నెనసి కినిసి । పెనగి జెట్టీల లాగు సొంపొనర దనరు
సరణి దలచిన మనసు విస్మయము దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 46
సీ. మనసెరుంగగ రాదు మాటనిల్కడ లేదు । వావివర్తన నహి వలపు సున్న
కనువిచ్చి చూడరు చనువిచ్చి కూడరు । నేస్తంబు పూజ్యము నెనరు నాస్తి
మర్యాద లెంచరు మన్నన గాంచరు । గుణముచక్కన లిల్ల గుట్టు కల్ల
కపటంబు మానరు కడువేడ్క బూనరు । సత్యమన్నను వట్టు జాలి మట్టు
తే. సాహసము మెండు మిక్కిలి చలము నిండు । నంగిట విసంబు మున్నాల్కెనందు తియ్య-
దనము గదె చేడియల మంచితనమ్ము । వశమటే రామరామ లావణ్యసీమ. 47
సీ. మొగమోటమెంచరు నగుబాటు గాంచరు । తరుచు వినయము ధూర్తతలు మెండు
కలిమి వరింతురు చలము సాధింతురు । కంటికెంతటివారు గడన గారు
హాని నెన్నగ జూడ రపకీర్తి కోడరు । ప్రాణము తృణవత్తు భక్తి వేదు
వలపుల నొందింతు రలపు చెందింతురు । తాల్మి తక్కువ బేలతనము పెక్కు
తే. పాదములు ముట్టి గండదీపంబు తట్టి । చేత చెయి పెట్టి యాకున శిరము గొట్టి
బాస చేసిన స్త్రీల భావంబు నమ్మ । వచ్చునటె రామరామ లావణ్యసీమ. 48
సీ. కాలమృత్యువునైన కడకు ద్రోయగవచ్చు । పురవైరితోనైన బోరవచ్చు
గరళంబు మెక్కి నిగ్రహశక్తి గనవచ్చు । నల దవానలము చేనంటవచ్చు
మసకాడు తాచుల విసరి రాళ్లిడవచ్చు । కాలాంతకుని యాజ్ఞ గడవవచ్చు
తనువు గోయగ మది తాళి యుండగవచ్చు । పైమాట లొకలక్ష బలుకవచ్చు
తే. నబ్జభవునకునైన నయాన వారి । వలపు గొలిపెడి బెళుకుచూపులను వేడి
తూపులకు వాసి చిత్తంబుతో సహింప । వశమటే రామరామ లావణ్యసీమ. 49
సీ. మగవారి మాట బూరగపంటి తేటద్ద- । మున గానబడు పైడిమూట దూర-
మగు కొండనున్పు లేనుగదిన్న వెలగకా- । యలు మబ్బులో తళుక్కనెడి మెరుపు
మిద్దెపై పరుగులు మీసాలపై తేనె । పొగ ముల్లెగట్టిన పోల్కె తేట-
నీటిలో జాబిల్లినీడ లేగిన యెండ- । మావులు రతివేళ మరులు సతుల
తే. వద్దనున్నంతసేపె యావలనె బోతె- । నెంత కఠినంబు పురుషుల హితము నమ్మ-
వచ్చునా యని పల్కు నీ వగ దలంప । వశమటే రామరామ లావణ్యసీమ. 50
సీ. హరిహరి పగవారికైన నావలెను మి- । క్కటమైన మోహంబు గలుగరాదు
కలిగెబో బహుసలక్షణరూపవతులైన । చెలులతో నతిచెల్మి సేయరాదు
చేసెబో నొకవేళ చెంగట లేకున్న- । నందుమీదట జాళి జెందరాదు
జెందెబో మరుని గాసిక ధైర్యమున క్రింద- । బడి తాళలేనంచు బల్కరాదు
తే. బల్కినట్లైతె మగవారి పరువు గాదు । పరువు కని యూరకుండిన మరుపు రాదు
మరిచెదనటన్న యింక నీ మహిమలెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. 51
సీ. వనజాస్య నీదు పావడనైన గానైతి- । నరసి పెందొడలపై నొరయుచుందు
శుకవాణి నీదు కంచుకమైన గానైతి । నుదుట గుబ్బలమీద గదిసియుందు
రమణి నీ నత్తుముత్యమునైన గానైతి- । ననుదినంబును మోవి యానుచుందు
మదిరాక్షి నీకు పయ్యెదనైన గానైతి । కడువేడ్క మేనెల్ల గప్పియుందు
తే. పాతకుండగు ధాత యీ పగిది బురుష- । జన్మముగ జేసె వ్యర్థపు చలము బూని
వసుధ నిటువలె నే మొగవారికైన । వలదిటులు రామరామ లావణ్యసీమ. 52
సీ. కమలారి కృష్ణపాడ్యమిరేయి రాగ తూ- । ర్పున నాకసము బర్వు పోలికనగ
నమర వసంతకాలమునందు వికసించు । తీగెపన్నీరుపూదీప్తి యనగ
శుకవాహనునకు సేవకులు వేయు నుడాయి । పావడ చెంగావి భాతి యనగ
మదనుని రాణి సీమంతవీధిని నంటి । వగగాంచు సిందూరవర్ణమనగ
తే. కుందనపుపళ్లెమున తోటకూరవిత్తు- । లెండ నెరపిన పై పిల్లలేడి పదము-
నిడిన గతి దోచు నీ మరునిల్లు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 53
సీ. ధనువు చేబూని చివ్వున వంచి లాగి ప- । ట్టిన దోచు మొగ్గ వాలిన విధంబు
దండెంబులకు రొమ్ముతట్టి మ్రొగ్గగ దోచు । ధేనుకాబంధంబు పూను కరణి
బిరుదుజెట్టీలతో పెనగొను తరి దోచు । నురగబంధము సేయుచున్న పగిది
మేలౌ కడాని లోడీలు ద్రిప్పగ దోచు । పడతి నీ యుదుటు పెందొడల సొగసు
తే. కలికి నీ తీరు కన్నుల గట్టినట్టు । గానబడుచుండు వలరాజుగరడి కెనయ
నున్ను మించిన వనిత నేనెందు గందు । వసుధనిక రామరామ లావణ్యసీమ. 54
సీ. సన్నపు వల్వతో జతనున్న మరునింట । నికటంబు పొడగన్న నీటుదోచు
భుజియించి యమ్మెతాంబూలంబు సేయుచో । నరచూలుగానున్న హౌసు దోచు
రతిరాజశాస్త్రసమ్మతి మీర నెనయుచో । నల రంభ యెక్కువేమనుచు దోచు
నొకవేళ కోపగించుక నత్తు నటుదీయు- । చో నెలబాలింత సొగసు దోచు
తే. బోటి శతకోటిలోన నీ సాటియగు వ- । ధూటి యే మేటి వెతుక ముమ్మాటికైన
నేటి మోహంబు నొక్కరితోటి దెలుప । వశమటే రామరామ లావణ్యసీమ. 55
సీ. పూవిల్తుడొక పచ్చిబోయవానికి తోడు । మలయానిలుడు పరమాతతాయి
తొగరేడనే గురుద్రోహి వెన్నెలగాయ । గండుకోవిల చెట్టునుండి కూయ
చేజేత నెత్తిపెంచిన చిల్క పగదాయె । గ్రుక్కద్రిప్పదె దాని గొంతుకోయ
మొదటనే కొదమతుమ్మెద వేరువిత్తాయె । గోర్వంక కాపురాల్ గుత్తసేయ
తే. నేరుపడె బ్రహ్మ తగినట్టులేర్పరించి । వసుధ నిర్మించె నావంటివానికొరకు
నిన్ను జూడక నాకిక నిమిషమోర్వ । వశమటే రామరామ లావణ్యసీమ. 56
సీ. పొలయల్కచే నొత్తిగిలి పవ్వళించిన । చెయిదీసి కుచముల జేర్చుకొందు-
వదిసైచకను ప్రక్క కదలి హూహూ యన । కదిసి పైకొన బిగ్గ గౌగిలింతు-
వవల పోపోవె పొమ్మని రెమ్మి కసరిన । నవ్వు చేసుక మోవి నానవత్తు-
వా తీరు జూచి యేమనకూరకుండిన । పూమొగ్గతో బిగ్గపోటులిడుదు-
తే. వంతకు చలింపకున్న గిల్గింత సేతు- । వపుడు నే నవ్వ వెండి ప్రొద్ద్దయెనందు-
వా దినమురేయిసొగసెన్న నజునకైన । వశమటే రామరామ లావణ్యసీమ. 57
సీ. కడనున్నతరి నెరుంగక చేరవచ్చిన । దూరదూరమటంచు తొలగుచొందు-
వాయెడ హేలి నేడాడితో యన సిగ్గు- । నవునంచు చిరునవ్వు నవ్వుచుందు-
వదియేమి నొసలిచుక్కన నాల్గుదినములు । చాదు స్త్రీలకునుంచ సహజమందు-
వతిమోహమున చమత్కృతి బల్క తెలుసుక । కొదువపనుల దీక్షకూడదందు-
తే. వెంతనిర్మోహివని నెరవంతమనసు । సహనపరుచుడి పిమ్మట సౌఖ్యమందు-
వట్టు జిగిబిగి వగ నగవభినుతింప । వశమటే రామరామ లావణ్యసీమ. 58
సీ. ఒకవేళ కోపగించుక పవ్వళించుచో । వచ్చి పై ముసుకెత్తి యెచ్చరించు-
నా తరి చూచి మాటాడకుండిన నొద్ద । వీణె హాయిగ మీటి వినికిసేయు-
నవలిమోమై యున్న నది నిల్పి చందన ।కలపంబు నెమ్మేన నలదవచ్చు-
నిది పర్వదినము నేడిటు గూడదన నవ్వి । మదనశాస్త్రము జూడుమనుచు దెచ్చు-
తే. నేల పొమ్మన్న పురుషులకేల కఠిన- । మెందు గాననటంచు కన్నీరు నించి
నతివ నను దూలపలుకు నా హౌసు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 59
సీ. చూచెనా చూడ్కుల సోయగం బా రతీ- । వరుడేయు శరపరంపరల లాగు
నవ్వెనా మంచిపున్నమచందమామ యిం- । పలర వెన్నెలగాయునట్టి బాగు
నడిచెనా విబుధపున్నాగంబు మత్తుచే । మించి వచ్చుచు జులాయించు పగిది
పల్కెనా యమృతంబు జిలుగుతేటగు జుంటి- । తేనెజాలటు కాల్వదీయు పగిది
తే. దాని మెయితళ్కు మెడకుల్కు దాని బెళ్కు । దాని వగనీటు బిగిదాటు దాని నేటు
దాని నీవేళ నా మది దలచి తాళ । వశమటే రామరామ లావణ్యసీమ. 60
సీ. భ్రమరఝంకారంబు పగిది నుపాంగంబు । కోపైన సుతిని ఘుంఘుమ్మురనగ
సిరిమించి మదిమించి చిరుతాళముల శబ్ద- । సంగతి ధిత్తతాఝమ్మనంగ
పరికింప వీనులపండువై పెద్దమ- । ద్దెళ నాదు తాహతోద్ధిమ్మనంగ
నెరనీటుపల్కు కిన్నెరమీటు గజ్జెలల్ । గోజారవంబు బల్మోజు దనర
తే. సంచుగా మేళమిటు జమాయించువేళ । నతివ మామీది వర్ణముల నభినయించు
వేడ్క దలచిన నా మది విరహమడప । వశమటే రామరామ లావణ్యసీమ. 61
సీ. జల్తారుపేటు గంజముచీరకుచ్చిళ్లు । గిల్కుమట్టెల తట్టి పల్కరింప
రవ కసీదా గోటు రయిక ముస్తీబుగా । కుచకుంభముల నాని గురుతుజూప
సికజుట్టు నునుబట్టు చెండ్లునీటు గల స- । దంసయుగంబుపైనంది బొదల
తళుకుబెడస తీరు బెళుకుకన్నుల సౌరు । వీనులతో నొగ్గి వియ్యమంద
తే. చందనము మైనలందిన సమయమునను । కంకణంబులు మొరయ పంఖాలు బూని
విసరవచ్చిన వగగన్న విధికినెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. 62
సీ. నీలాంబరౌర పెన్నెరుల సౌరుదనంబు । వీనులు శ్రీరాగవిభవమేలు
పొలతి నెమ్మొగము సంపూర్ణచంద్రిక మణి- । తము పరీక్షింప ఘంటారవంబు
సారంగ చూడ్కుల చపలత వీక్షింప । మెరుపగు లేగౌను మేఘరంజి
చాన రోమావళి శంకరాభరణంబు । తీరైన కెమ్మోవి దీపకళిక
ముదిత క్రొంజిగిమేను మోహన సద్గుణ । లావణ్యగరిమ కల్యాణి భళిర
తే. నడక మెల్లదనంబు పున్నాగ దాని । సురత మానందభైరవి సొంపు నాట
నెనయకుండినవేళ నా నెనరు తాళ । వశమటే రామరామ లావణ్యసీమ. 63
సీ. తమ్మిలో నవకందమము తేటలా చంద- । మామ యందముదీసి మోముజేసి
పూబంతిలో సౌరు ప్రొద్దులో తళ్కు క- । డాని చాయల గూర్చి మేనొనర్చి
మల్లెమొగ్గల చాలు మంచికెంపుల డాలు । వజ్రంపు జిగిని పల్వరుస దీర్చి
గాజుగిన్నెల నున్పు గట్టుగట్టిన వీణె- । కాయల తీరు చన్గవనొనర్చి
తే. నలువ నిర్మించె నీలాగు నాతి బాగు । నెన్నతరమౌనె కన్య నా కన్నులాన
దాని మది దల్చి నెమ్మోహతాప మాన । వశమటే రామరామ లావణ్యసీమ. 64
సీ. కుటిలకుంతలికి చన్గుదురు లున్నతమైన । వేళ నా మనసేమొ వేడ్క గాంచె
జలజాక్షి నునుపిరుందులు మిన్నలైన నా । మదికి చమత్కారమహిమ గల్గె
భ్రమరాలక సమర్తపాయమైనంత నా । తనువు బంగారుచాయను వహించె
రమణి నూగారు దట్టము మీరి నలుపెక్క । లేకురు మీసంబు లేర్పరించె-
తే. నింతివయసు నా వయసును నేకమైన । రథము తేజీలు నడిచిన విధమునొప్పె
దాని చూడక యింక నీ తమి నడంప । వశమటే రామరామ లావణ్యసీమ. 65
సీ. పసుపు నిగ్గైన దుప్పటితోడ కాటుక । మరకానుదస్తు రుమాలుతోడ
చెక్కిట కొనగోటిజీరలతోడ న- । వ్వెలదిచ్చు దొంతర విడెముతోడ
నతివ పల్మొనకాటు లారని మోవితో । వెన్నున కీల్జడవేటుతోడ
సొగసైన నిద్దురసొలుపుతో రతులను । బడలిన నెమ్మోము బాగుతోడ
తే. నే నితరకాంతల గూడిరాగానె యున్న । చిన్నె పరికించి మనమున చిడిముడగుచు
నపుడు నిను నీవె దూరుకొన్నది దలంప । వశమటే రామరామ లావణ్యసీమ. 66
సీ. శుకమును ముద్దాడుచో మోవి నొక్క నా । గంటి నే గని నినెరుంగక నిదేమొ
నినుజూడ వేరె భావన దోచునన మోము । చిన్నజేసుక శివా శివ యటంచు
తలవంచి బొటవ్రేల నిల గీరుకొంచు నే- । త్రముల నశ్రులు కుచాగ్రముల రాల
చిలచిల నెమ్మేను చెమ్మర గడగడ । వడకుచు నార్తారవమున నొక్క
తే. పాపమెరుగను నా యురోభవములాన । యన్ని దెలిసుండి నా బోటి యబల నిటుల
ననుట దోసంబు లనునాటి హౌసు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 67
సీ. శుకమా చికాకు సేయకుమా యటన్న శా- । రిక మాట వినుట నాయికము గాదు
పికమా భళాన యోపిక మానియున్న నీ- । విక కూయుచుండ భావికము గాదు
మదమా శబాసు షట్పదమా సరేనె నీ । రొద మానవైతివే ముదమె నీకు
బతిమాలుకొన్న నీ మతి మానలేవు మా- । రుత నీ చలంబు శాశ్వతము గాదు
తే. యనుచు నేనెంత వేడిన కనరు మాన- । రైరి వీరలు నామీది వైరమునను
సుంత దయచేసి కన్నుల చూడ వింత । వాదటే రామరామ లావణ్యసీమ. 68
సీ. తలిదండ్రినైన తూపుల నేయజూచు । మరుడు నన్నేరీతి కరుణ జూచు
గురుకాంత నిసుమంత కొదువలేక రమించు । జాబిల్లి యెటుల దోసము దలంచు
పాములు మ్రింగినప్పటికైన చావని । చలువతెమ్మెరకెట్లు జాలి బుట్టు
చిగురాకు దిని కండ్ల పొగరెక్కినది గండు- । కోయిల రొద యేల సేయకుండు
తే. నొకరిజోలికి బోని పూలకును బొడిచి । రసము గ్రోలెడి తేటి యీరసము నెంత
దెలుప నే జాల నీమీది మరులుతోన । వశమగునె రామరామ లావణ్యసీమ. 69
సీ. తరుణికెంతట దృష్టి తాకునో యని దాని । సొగసు కన్నులనిండ జూడ వెరతు
మిసిమైన నునుమేను కసుగందునని చేతు- । లెత్తి బిగ్గన కౌగిలింప వెరతు
నవకమౌ లేతచన్గవ సొక్కునని యెంచి । గట్టిగా చేకొద్ది బట్ట వెరతు
చిలచిల నమృతంబు జిలుకగా దాని చ- । క్కెరమోవి మొనపంట గరువ వెరతు
తే. గోల భయమంది యిక తాళజాలదనుచు । హాయి మీరగ నుపరతి నడుగ వెరతు
దాని సుగుణంబు రూపమింతని వచింప । వశమటే రామరామ లావణ్యసీమ. 70
సీ. చిలకముక్కున కాటు జెందని బింబంబు । పొగలేక నిల్చు కప్పురపు దివ్వె
కోయిల నొక్కుగా కొరకని చిగురాకు । ఘాటింపు పచ్చిమరాటి మొగ్గ
తుమ్మెద వ్రాలని కమ్మదామరపువ్వు । నవకమౌ మేల్దవనంపు మొల్క
సానపై దీరిన జాతివజ్రపురవ । వాసించు గోవజవాజి భరణి
తే. వలపుల మిటారి నిత్యము వచ్చు దారి । చూచి వేసారి మనమున సొలపు మీరి
మగువ నొకసారి నెనయక మరుని బారి । వశమటే రామరామ లావణ్యసీమ. 71
సీ. చాన నీ కెమ్మోవినాన నిదే మొదల్ । విడెమేమొ నోటికి వెగటులగును
లేమ నే నిను కౌగిలించ నిదే మొదల్ । కసిదీరదయ్యె నా కరములకును
నతివ నీతోడ మాటాడ నిదే మొదల్ । విన సైచదొకపాట వీనులకును
చెలియ నీతో పొందు సేయ నిదే మొదల్ । కరువయ్యె నిదుర నా కన్నులకును
తే. ప్రేమ నెటు దాతు మదికి మందేమి సేతు । నెపుడు నిను జూతు నింక నేనెటుల సైతు
బిరుదు నిక తీతు మరునిదే పెద్ద భీతు । వశమటే రామరామ లావణ్యసీమ. 72
సీ. హా శారచ్చంద్రనిభాస్య హా హరిమధ్య । హా కలకంఠి బింబామృతోష్ఠి
హా నవసరసీరుహాక్షి కోకస్తని । హా గజయాన దయాపయోధి
హా హేమవర్ణనిభాంగి బంభరవేణి । హా పద్మరాగకుందాభరదన
హా సైకతశ్రోణి హా గుణకల్యాణి । హా రాజరత్నమ కీరవాణి
తే. హా మరుని నాజిలో గెల్చినపుడె నీదు । కుసుమబాణునినగరెల్ల కొల్లసేయ
నెపుడు గల్గును చాన నీ హితము మాన । వశమటే రామరామ లావణ్యసీమ. 73
సీ. కల్కి నీ కుల్కుగుబ్బల నీటు దలపోసి । గజనిమ్మపండ్లపై కరుణ దరిగె
సఖి నీదు మోవిలో చవి నిరీక్షించిన । పంచదారను కోపగించవలసె
తరుణి నీ మంచిమెత్తనిమేను పరికించి- । నపుడె పూచెండ్లపై హవుసు మానె
కొమ్మ నీ ముద్దుపల్కుల నాదు మదినెంచి । చిలుకనెత్తను బాళి దగలదయ్యె
తే. వెలది నినుజేరి మదికేరి వేడ్కమీరి । గోర తొడజీరి మరుబారి కొదువదీరి
కడిమి నొకసారి చలపోరి కలయగోరి । వచ్చితినె రామరామ లావణ్యసీమ. 74
సీ. వనజాక్షి భువి రూపవతులెందు నిక లేరా । నవురుగా నొకవేళ నవ్వుకోరా
యెదటి భావంబు గుర్తెరిగి మన్నించరో । యెంచి యంతట పల్కరించుకోరా
యతినయోక్తుల క్షేమమడుగరో వలపించి । సతిపతులని యున్న జగములోన
శుకవాణి చెర్లాటలకు కలహించరో । కలహించి పిమ్మట గలుసుకోరా
తే. నింత నావలె బాళి నీయంత కఠిన । నెందు గానను జాణనయింది మొదలు
నతివ దానిల్లు బంగారమైరి యింత । వంచనటె రామరామ లావణ్యసీమ. 75
సీ. చివురాకుపై మంచు చెక్కిలి చెమటంచు। తొడగ రుమాలుచే తుడువబోదు
ననటుల బిగి గాంచి పెనుదొడలని యెంచి । యొనరుగా నెలవంక లునుపబోదు
నునుముత్యముల గాంచి చనుమొన లనిపించి । తెలియజాలక చేత నలుమబోదు
పటములో వ్రాసిన ప్రతిమను గాంచి నీ- । వంచు ప్రేమను కౌగిలించబోదు
తే. వెరవకని మోదమలర నామీద ప్రేమ । నింపగా రాద జాలి యొక్కింత గాద
తరుణి యికమీద విరహసాగరము నీద । వశమటే రామరామ లావణ్యసీమ. 76
సీ. అతివ నేనొకసారి యీనితే నీదు వా- । తెరతేనె లేమైన తరిగిపోనె
పణతి నేనిసుమంత బట్టితే నీ చను- । బంతు లంతటిలోనె వాడిపోనె
యలుకలేమిటికంచు పలుకరించంగానె । పలుకులో నమృతంబు లొలికిపోనె
కడుప్రేమ నొకసారి కౌగిలించంగానె । కలికి నీ తనువేమి కందిపోనె
తే. వనిత నాతోడ నొకసారి కెనయగానె । దర్పకుని బొక్కసము కేమి తక్కువగునె
చాన నిను మాన నాతోన చలము బూన- । వలెనటె రామరామ లావణ్యసీమ. 77
సీ. కోపమేటికి ముద్దుగిల్కు నెమ్మొగమెత్తి । చూడవే నను బాల సుగుణశీల
వలచివచ్చితినంచు వంచనేమిటికి నన్ । మన్నించవే భామ మధురసీమ
చుల్కసేయక తేనెజిల్క ప్రేమగ నొక్క । మాటాడవే యింతి మదనుదంతి
గబ్బిగుబ్బల రొమ్ము గదియించి నా యెద । నానవే యో చాన హంసయాన
తే. యేలనే గోల చలము నీకేల సైప- । జాల నీ జాలమేల నన్ చాలరతుల
దేల దయనేలకున్న నీవేళ తాళ । వశమటే రామరామ లావణ్యసీమ. 78
సీ. చేడె నిన్ కన్నుల జూడకయున్న నా । గడె బ్రహ్మకల్పముగా దలంతు
వనిత నీ చెరుగు మాసిన మూడునాళ్లు నే । క్షణమొక్క యుగముగా జరుపుచుందు
మదిరాక్షి వ్రతదినంబది గూడదను రేయు । నిమిషమొక్కేడుగా నిదుర గాతు
పొలతి పుట్టలు జూడపోవుచో నణుమాత్ర- । మును లెక్కగొని మనువని తలంతు
తే. రమణి మరులొగ్గి విరహానలమున కగ్గి । మరిమరిని తగ్గి సొగసుపై మనసు నొగ్గి
వేడుకల మ్రొగ్గియున్న నన్ వింతసేయ । వలెనటే రామరామ లావణ్యసీమ. 79
సీ. కలపంబు నెమ్మేన నలది యొద్దిక జేరి । వినుతించి కప్పురవిడె మొసంగి
యరవిరి సంపెందవిరులు సొంపుగ జుట్టి । కడుమోదమున బిగ్గ గౌగలించి
పెదవితేనియలిచ్చి మదనదాహము దీర్చి । కెమ్మోవిపై పలుగెంపులుంచి
పావురగతి కేరి పలికి చెక్కిలి జీరి । ముద్దిచ్చి లాలించి మోహరించి
తే. గుబ్బిచనుమొన లెదనాని గురుతులుంచి । తరుణి చౌశీతిబంధపద్ధతు లెరింగి
రతుల దేలించు నీ చమత్కృతి దలంప । వశమటే రామరామ లావణ్యసీమ. 80
సీ. ఏలనే యింత జాగేలనే తమి నిల్ప- । జాలనే కరుణ నన్నేలుకొనవె
మానవే చల మెంతదానవే కెమ్మోవి- । నానవే కౌగిట బూని వేడ్క
నేరమా పల్కు బంగారమా నాచోట । క్రూరమా మరి కానివారమటవె
యెంచవే రతుల దేలించవే చాల మ- । న్నించవే వగలు చాలించి యిపుడు
తే. చెరుకుసింగిణిదొర బారి తరముగాక । వెరచి మరులను తానయై వేడుకొనిన
తెలియవైతివి మనసులో దిగులు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 81
సీ. కలవి గ్రక్కకురె కోకిలలార మీ కూక । సుదతి నెమ్మొగమెత్తి చూచుదాక
చలము సేయకురె వెన్నెలలార మీ కాక । హరిమధ్య సుంత మాటాడుదాక
మురిపేల చల్వతెమ్మెరలార మీ రాక । చంచలాక్షిని కౌగిలించుదాక
మదనా సరేను మంచిది లేర నీ ఢాక । ననబోణి నాతోడ నెనయుదాక
తే. ననుచు నుండెడితరి తెలియకను నేను । కాచుకొని యుంటి నిటుల నీ కరుణ నమ్మి
దోసమెంచక నన్నింత మోసపుచ్చ । వచ్చునటె రామరామ లావణ్యసీమ. 82
సీ. అతివ నీ చనుమొన లంటనిచ్చిన కోటి- । శివలింగపూజల సేయు ఫలము
చాన నీ కెమ్మోవి నాననిచ్చిన చాలు । సోమపానము సేయుచున్న ఫలము
చెలి నీదు కటిని నా చెయి సోకితే చాలు । నవనిప్రదక్షిణంబైన ఫలము
కలకంఠి యొకసారి కలయనిచ్చిన చాలు । నతనుమంత్రము సిద్ధియగు ఫలము
తే. నెపుడు లోచూపు చూచి తదేకనిష్ఠ । దనరి శృంగారదేవతవని తలంచి
మానసిక మొనరించుచో మరుల తాళ । వశమటే రామరామ లావణ్యసీమ. 83
సీ. ధరణిపై హేమకర్దమముతో నీ మేను । సేయుచో నది పల్చనాయెననుచు
తరణిబింబము తెచ్చి తరచిన యాక్రింద । రాలిన సన్నపు రజము బోసి
మెదపిన బిరుసాయె నది కూడదని రవ- । ఘనసార మమృతంబు గలయనేసి
పదును గావించి యా పరమేష్ఠి నిర్మించె । గాబోలునని తోచు కలికి నీదు
తే. తనువు గెంజాయతళుకు వాసనల బిగివి- । నెంతని వచింతు నిన్ను నేనెపుడు గాంతు-
నట్టి నిను దల్ప మనసు మోహంబు నిలుప । వశమటే రామరామ లావణ్యసీమ. 84
సీ. మొనపంట కసిదీరగను చురుక్కున నొక్కి । నొచ్చెనో మోవంచు నూరడించు
కిలకిల నవ్వి చెక్కిలి నొక్కి నా సామి । కందెరా యంచు చన్గవలనంచు
ప్రొద్దాయ లెమ్మని గద్దించి పల్కుచు । కదిసి ప్రేమను వచ్చి కౌగిలించు
సురతంబునను చాల సొక్కితివని పైట- । చెరగెత్తి నెమ్మోము చెమటలొత్తు-
తే. నరసి చూడంగ నీ లోకతరబడైన । నాయికే కామసమరప్రదాయియైన
దాని వగలెంచి మనసు నెందాక నిల్ప । వశమటే రామరామ లావణ్యసీమ. 85
సీ. నిదురలేపిన కోపమొదవు నంచని మెల్ల- । గా వచ్చి వెన్కపక్కల పరుండు
నలతగా తన రాక తెలియకూరక నున్న । నెరగనట్టుగ మీద కరము వైచు
తిరిగి నేనపుడు వాతెర చురుక్కని నొక్క । లేచి నా నెమ్మోము చూచి నవ్వు
మరిచి నిద్దురబోవు తరిని నన్నితూ భంగ- । పరతురా యనుచు నిష్ఠురతలాడు
తే. యేమొనర్చితినన్న మీకెరుక లేదా । చేసినటువంటి పనులంచు చెలిమి గాంచు
దాని వగ దల్చి ప్రేమనెంతనుచు నోర్వ । వశమటే రామరామ లావణ్యసీమ. 86
సీ. చల్లని పన్నీరు జల్లించుకొన్న గా- । నణగదే మది విరహాగ్ని యేమొ
మంచిచందనము బుయించుకొన్నను గాని । తాళదే యీ మోహతాపమేమొ
కలకంఠపొడి పానకము చేసి ద్రావిన । నాగదె మదనదాహంబదేమొ
విరుల వీవనలతో విసరించుకొన్నను । దీరదే మరుని వికారమేమొ
తే. జాగు చేసిన నిక నోర్వజాల బాల । యేల నను చాల నేలుకోవె కృపాల-
వాల కలకాల మేరీతి వలపు దాచ । వశమటే రామరామ లావణ్యసీమ. 87
సీ. గంధంబుపై మంచిగంధంబుపూతతో । బొట్టుపై కుంకుమబొట్టుతో
పూలపై దురిమిన పూలతో కమ్మని । విడెముపై కపురంపు విడెముతోడ
కాటుకపై మిన్కుకాటుకతో కాళ్ల- । పసపుపై నలచిన పసపుతోడ
వలపుపై గ్రమ్మినవలపుతో గ్రక్కున । సొలపుపై బూనిన సొలపుతోడ
తే. నత్తవారింటి కరుదెంచునట్టివేళ । నెలత నను గాంచి చాల కన్నీరు నించి
యపుడు తలవంచి పలికిన హౌసు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 88
సీ. కన్నడదస్తురిగా సిగవేసి బా- । గున్నదా యని దువ్వు నొక్కవేళ
పాండ్యదేశస్త్రీల బాగుగ గొజ్జంగి- । రెక్కన జడనల్లు నొక్కవేళ
నల కళింగాంగనవలె గొప్పకీలుగం- । టొనరించి వగ చూపు నొక్కవేళ
చెలగి విదర్భకాంతలరీతి మెడలపై । నునుగొప్పు సవరించు నొక్కవేళ
తే. రతిహుమాపిట్టనుతి చమత్కృతికి దిట్ట । మగువ యికనెట్ట నణుతు నీ మరుని వెట్ట
నెలత దయ బుట్టకున్న నే నెనరు బట్ట । వశమటే రామరామ లావణ్యసీమ. 89
సీ. తీపైన బేషక్ మఠా పఠాన్ తురకి క- । చ్చీ మాదువాను తేజీల పాగ
దిట్టంపు మేల్ జుల్ఫ తీపిల్ల చిగురుఖాం- । డా కమ్మి యస్సల్ కడానిబొమ్మ
తరుణుల మేటి నిద్దాహొంతకారి బి- । త్తరుల మిన్నా తేటకురుచతేనె
గరిగె లేతాకు తేగా బాదుషా సాము- । వస్తాదు యెనలేని వన్నెలాడి
తే. జతను నే గూడి కోరమీసంబు తీటు । పంతముల నాటి వేడ్క నా భామతోటి
నెనయకుండిన దిగులు నెంతని వచింప । వశమటే రామరామ లావణ్యసీమ. 90
సీ. కలగంటినే రేయి కలహంసగామిని । ప్రేమచే నను చేరబిలిచినటుల
బలుకకుండిన చెయ్యి బట్టుక నింత మీ- । కలుకలేమంచు నన్నడిగినటుల-
నపుడు నే కసరిన నౌనౌను నిటుల సే- । నా గలదని కేరి నవ్వినటుల-
నంతట నే సుంత ననుమతించగనె యొ- । ద్దికను పూశయ్యకు దీసినటుల-
తే. నా యెడల మోవి మోవిని నాని నడుము । మెడల గదియించి హూ యని మీరినటుల-
నైన స్వప్నము వేడుకెంతనుచు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 91
సీ. లలన నీకుచదుర్గముల బలమ్మున గాని । వలరాజు కెదురించి నిలువలేను
తరుణి నీ యధరామృతంబు గ్రోలక గాని । మదనదాహమ వేరె మట్టుపడదు
వనిత నీ దయచూపు లను వృష్టిచే గాని । యంగజానలము చల్లారబోదు
కలికి నీ నవ్వువెన్నెలలు గాయక గాని । స్మరతాప మొకకొంత శాంతి గాదు
తే. నెనరు మితిలేదు కంటికి నిదుర రాదు । యితరమతి బోదు యాహార మింపు గాదు
మెలత యికమీదు నిజము నా మేను నీదు । వశము శ్రీరామరామ లావణ్యసీమ. 92
సీ. వేదండయాన యీ పూదండ గైకొని । నీ దండ కరుణ నన్నేలుకొనవె
కోపంబు మాని నీ రూపంబు నా స్మర- । తాపంబు దీరగా చూపరాదె
వాదేల విరహంబుచే దూల నణగింప- । రాదా లతాంగి రారాపు లేలె
యో యిందుముఖి నీవు నాయందు చలము ని- । ట్లైయుందువని దోచదాయె గదవె
తే. కనరు మాటలు చెవినాని కరుణమాని । మనసుమోడిని కొదవ నీ మాడ్కి బూని
యతివ నేడేమొ కాని యీ యలవిగాని । వలపుగదె రామరామ లావణ్యసీమ. 93
సీ. గజనిమ్మపండ్లు నే నజరు చేసెద గాని । బటువుగుబ్బలు సుంత బట్టనియవె
వెలలేని భూషణమ్ములు కానుకిత్తు నీ । చక్కెరకెమ్మోవి నొక్కనియవె
పడతి నే నీ కాకుమడుపులందిత్తు నన్ । కదసి కౌగిట వేడ్క నదుముకొనవె
తరలాక్షి నీదు పాదంబైన పట్టెద । విడెమైన రవ సమర్పింపగదవె
తే. స్నేహమౌచోట నింత నిర్మోహమౌట । తగవటే లేమ యీలాగు సుగుణధామ
తలచితే భామ నీమీద తగని ప్రేమ । వశమటే రామరామ లావణ్యసీమ. 94
సీ. స్త్రీలపై నతిబాళి జెందిన పురుషుల । కపకీర్తి దీనత నగుడు దిగులు
పరువుతక్కువ మోక్షపదవికి దొలుగుట । నైష్టికహీనంబు నవ్వుపాటు
చుట్టపక్కంబుల సుళ్లడగించుట గాసి । విబుధాళి గన్న భవిష్యహాని
మానంబు విడి యవమానంబు నొందుట । ధనము గోల్పోవుట తనువు చెడుట
తే. వసుధలోపల నెటువంటివారికైన । తగని వలపిట్లు గారాదు తరుణి నీదు
కృపను గాంచక మన్మథచపల మణప । వశమటే రామరామ లావణ్యసీమ. 95
సీ. ప్రణవమాలింప నీ మణితంబుగా నయ్యె । ధ్యానంబు నీ పదధ్యాన మయ్యె
లక్ష్యంబు నీ పట్టువక్షోజములు నయ్యె । యోగంబు నీదు సంయోగ మయ్యె
సుసమాధి మదనతంత్రసమాధిగా నయ్యె । జపము నీ సద్గుణచయము నయ్యె
బింబదృశ్యము నోష్ఠబింబదృశ్యము నయ్యె । స్మరణ యేవేళ నీ శరణ యయ్యె
తే. తరణికిరణాశనము జేసి తపమొనర్చు । వారలకునైన నిది గెల్వ దీరదయ్యె
యజుడు నిర్మించు మాయనేమంచు నెంచ- । వచ్చునే రామరామ లావణ్యసీమ. 96
సీ. వనిత నీ చెట్టబట్టినవేళ యెట్టిదో । సకలమనోవాంఛ సఫలమయ్యె
నను నీవు నిను నేను గనువేళ యెట్టిదో । నంతకంతకు మోహ మగ్గమయ్యె
మనమిద్దరము గూడుకొనువేళ యెట్టిదో । నిను జూడకను బాళి నిలువదయ్యె
వనజాక్షి నీవు పల్కినవేళ యెట్టిదో । నొకదానిపై చిత్తమొదుగదయ్యె
తే. నెటుల సైరింతు నిన్ను నేనెపుడు గాంతు । నేది యుపమెంతు నీ జాలినెటు లడంతు
మగువ దయయుంచునని చాల మది దలంతు । వరుసనిటు రామరామ లావణ్యసీమ. 97
సీ. నెమ్మేన కళలు ఘూర్ణిలగ గౌ నళికి ఘం- । టల తాబు కొల్కి పఠాలురనగ
రంగైన తాపితా రయిక చన్ పొగరున । బిగిసి పక్కున కుట్లు పిక్కటిల్ల
రత్నభూషణము లలంకరించంగ యీ । విరహాగ్ని వేడిమి వెళ్లనురక
గమగమలాడు గంధపుపూత లొక్కొక- । చోట పై రవరవ పేటులెత్త
తే. వచ్చి మనసిచ్చి ననుమెచ్చి వలపులెచ్చి । కరుణతో మచ్చికను గ్రుచ్చి కౌగలిచ్చి
కలయికకుజొచ్చినట్టి నీ ఘనత దలప । వశమటే రామరామ లావణ్యసీమ. 98
సీ. మగవారి నింతులే వగ నెచ్చరించుట- । లని సిగ్గుదోచదో వనజగంధి
పైకొన్నవేళ కోపము సేతురో యని । భయమైన కాదటే పల్లవోష్ఠి
సరివారు గన్న మోసమటంచు సుంతైన । మదికెగ్గు లేదటే మధురవాణి
యెరుక సేయక మోవి నెటు నొక్కనంచు తొం- । దర జెందదె మేను సరసిజాక్షి
తే. యవల పో పోవె తేపకు నంటరాకు । మొదటికూటివె పదివేలు ముదిత చాలు-
నింకమీదట నీ గుణమెల్ల తెలిసి । వచ్చెగదె రామరామ లావణ్యసీమ. 99
సీ. భాస్కరవంశదీపకయోగిబృందహృ- । త్కమలమార్తాండ మంగళము నీకు
సకలసురాసురసంసేవ్యపాదసా- । గరశాయి సహజమంగళము నీకు
కుజనగర్వవిఫాల నిజభక్తపాల । కరుణాపయోధి మంగళము నీకు
పార్థివేంద్రలలామఫలదాయకాభీష్ట । గజరాజవరద మంగళము నీకు
తే. ఘనసుగుణధామ ఘోరసంగ్రామభీమ । బుధజనస్తోమ నవ్యసంపూర్ణకామ
పతితపావనకృతినామ భవవిరామ । వరచరిత రామరామ లావణ్యసీమ. 100
సంపూర్ణము.
కవి పరిచయము
- శ్రీ వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)
: శతకములు :
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము | మాతృ శతకము | కఱివేల్పు శతకము | మదనగోపాల శతకము | చక్కట్లదండ శతకము | సుందరీమణి శతకము | కాంతాలలామ శతకము | తాడిమళ్ళరాజగోపాల శతకము | భక్తమందార శతకము | కుక్కుటేశ్వర శతకము | భర్గ శతకము | లావణ్య శతకము | వేణుగోపాల శతకము | విశ్వనాథ శతకము | ఒంటిమిట్ట రఘువీరశతకము | మృత్యుంజయం | చెన్నమల్లు సీసములు | సంపఁగిమన్న శతకము | కుమార శతకము | శ్రీ అలమేలుమంగా శతకము | సూర్య శతకము | నీతి శతకము | శృంగార శతకము | వైరాగ్య శతకము | మంచి మాట వినర మానవుండ | సదానందయోగి శతకము | శివముకుంద శతకము | మృత్యుంజయ శతకము |