ఏఁ బదునాల్గులోకముల-సృష్టియొనర్చుచుఁ బెంచి పిమ్మటన్
దూబవలెన్ హరింతు నని-దొంగనుడుల్ వచియించు చుంటివే!
యేఁబదిమాట లేమిటికి?-ఇట్టి ప్రచారము మానకున్నచో
గూబలు సాఁగఁదీసెదను-గూయకు మిట్టివి ధూర్తమానవా! 1
ఎవ్వరు చూచినారు సృజి-యింపఁగ నీ పదునాల్గులోకముల్
సువ్వన సువ్వి సువ్వి యను-చొప్పెకదా! యొకఁడైనఁ జూచెనే
దవ్వులనుండియైన నొక-దానినినైన? వృథా ప్రగల్భముల్!
నవ్వుల పాలుఁజేసెదవె-నన్నిటులాడుచు ధూర్తమానవా! 2
ప్రతివర్షంబును నా వివాహ మను పే-రన్ బెక్కుచందాల దు
ర్మతి చందాలు వసూలుచేసి ప్రతియూ-రన్ గజ్జకట్టింతువే!
గతి యీమాత్రములేదె నాకరయ? నేఁ-గావించుకోలేనె? యీ
గతి నన్నీవు పరాభవించుటకు సం-కల్పింతువే మానవా! 3
కాపురముండ నిల్లు, నడ-కత్తెరలోఁ బడియుండఁ బెండ్లమున్,
మాపులు కున్కఁగాఁ బడక-మంచము, నెక్కగ నెక్కిరింతలున్,
సాపడఁ బైడికంచమును-జక్కగఁగూర్చి యుపన్యసింతువే?
నీపనిఁ బట్టెదన్ వినుము-నీవిది మానవ ధూర్తమానవా! 4
కొస కేమౌనొ యెఱుంగకుండ నుసితోఁ-గోణంగివై నీవు నీ
పుసికన్నుల్ మసిముక్కు దేబెమొగమున్-బువ్వాడు పెన్బోరెమున్
తొసినోరున్ గలిగించి వంచకుఁడవై-దుర్జాతి, నన్నొక్క మా
నిసినిం జేసెదవే! మనుష్యునివలెన్-నేనుంటినే మానవా! 5
కాలుంజేతులు ముక్కు మోములును చం-కల్ చన్నులున్ బేర్లు నీ
కేలా యున్నవొ; నాకు నట్లెకలవా?-యీరీతిగా నన్ను నీ
వేలా వర్ణనచేసినాడ వకటా!-యెందాక సైరింతు? నిన్
పాలార్తున్ మునుమున్న చెప్పితిని నీ-పాట్లన్నియున్ మానవా! 6
గుడులున్ గోపురముల్ కుశీలవుఁడవై-కూర్పించి చందాలతో
మడిమాన్యంబులు నాదు పేరుననె ని-ర్మాణంబు గావించుచున్
వడపప్పున్ బెరవారి కిచ్చెదవె? నీ-భావంబునం దేమి గీ
ల్పడఁగా నేర్చెడి? చెప్పు మింతటి దివా-లాఖోరువే మానవా! 7
వేదము లెట్లు బ్రహ్మముఖ-వీథులనుండి హరింపఁగాఁ బడున్;
పాదలి సోమకాసురుఁడు-వచ్చి త్రయిన్ హరియించె నంచు నే
చీదరఁ బొందకుండ చొఱ-చేఁపను జేసితివే ననున్ - సరే!
నీదయమీద నా బ్రదుకు-నిల్చెనె చెప్పుమ ధూర్తమానవా! 8
బలి యేపాపముఁ జేసినాఁ డతనిపై-వైరంబు నాకేల? త
ద్బలి రాజ్యంబు హరింప వంచకుండనై-ధర్మంబుఁ బోద్రోసి దో
ర్బలహీనుండగు నింద్రుఁ బ్రోవ నవతా-రం బెత్తినా నంచు లో
కులు నమ్మన్ వచియింతు వింకయిన బొం-కుల్ మానవా? మానవా! 9
పరులను, ధర్మదూరులను,-బంధురపాపనిమగ్నచిత్తులన్
గరుణను గాచి ప్రోచుటకు-గా మఱితో బలిచక్రవర్తినిన్
దిరిపెము నెత్తినాఁడ నని-దేబిరిగొట్టుమొగంబ, యెల్లెడన్
నిరతము చాటుచుండెదవె!-నీపనిఁ బట్టెద ధూర్తమానవా! 10
తనువెల్లన్ గులపెట్టి జీర్ణసుఖ రు-గ్దద్రువ్యధాపీడచే
త నహోరాత్రులు కామతృప్తి కొరకై-దారాడు స్వర్లోక నా
థుని పక్షంబయి దానశీలుని మహ-త్పూజ్యున్ బలిన్ సత్యవా
క్యనిరూఢున్ బొరియించినా ననుచుఁ బ-ల్కన్ జూతువే మానవా! 11
ఒక్కఁడు తండ్రిఁ జంపెనని-యోరిమిలేకయె గండ్రగొడ్డటన్
జక్కడగింప ధర్మువగు-నా కులమంతయు? దీనిజేయ నే
నొక్కఁడనే కనంబడితి-నో! యిటువంటివి పూర్వమందు నే
దిక్కులనేని విన్పడెనె?-తిక్కవదల్చెద ధూర్తమానవా! 12
ఉడుగక తొల్లి పెండ్లమును-నొక్కతె నామెడ కంటఁగట్టి యా
బిడ నెవఁడో హరించె నని-వెంగలిమాటలు చెప్పి యామెకై
యెడతెగకుండ బావురని-యేడ్చితినంచును నెన్నిరోజులో
బడబడ పెద్దగ్రంథములు-వ్రాసితివేమిర? ధూర్తమానవా! 13
మిడిమేలంబుగఁ దెచ్చిపెట్టితివిగా-మేనత్తతోఁ గూటమిన్
బడి మువ్వంకల ముండతోడ మధురా-పట్నంబులోఁ గూటమిన్
మెడకుంగట్టితి వెంతవాఁడవుర! నీ-మిట్టాటలన్ మానవా!
కడికండల్ తెగఁగోసివైచెదను గా-కశ్రేణికిన్ మానవా! 14
అవతారంబులనెత్తి చేయగల న-న్యాయంబు లన్నింటి నే
నవతారంబుల నెత్తకుండ మఱి చే-యన్ శక్తిలే దంచు న
న్నవమానించితి వింతకాల మిటు? ని-న్నాపాదమస్తంబుగా
నివురుంజేసెద నెవ్వరడ్డపడగా-నీ కుండిరో మానవా! 15
స్మృతులన్ వ్రాసితి నందు; వాస్మృతులలోఁ-జిత్రించి శ్రుత్యర్థముల్
ప్రతిపాదించితినందు; వయ్యది నిజం-బా? యెంతకాలంబు దు
ష్కృతి సాగింతువు, లోకవంచనములన్-జేయింతువో, చేతువో
పతితాత్మా, యిఁకనైన యీ వెడఁగు త్రో-వల్ మానవా? మానవా! 16
కలలోఁ గన్పడుచుండు బట్టబయలన్-గన్పట్ట రాకుండు గ
ఱ్దలు గ్రంథంబులు జెప్పుఁ గట్టెదుటఁ బ్ర-త్యక్షంబుఁ జెప్పండు లో
కులు కల్లోలపడంగ నీగతిని ట-క్కుల్ చెప్పు మాయావికిన్
తలతిక్కన్ వదలింతు నీపయిని చి-త్తభ్రాంతిపో మానవా! 17
ఈ టకటొంకు లేమిటికి?-నిల్లును వాకిలిఁ గట్టిపెట్టి యే
టేటను బెండ్లి సేయుమని-యే నెపుడైనను గోరియుంటినే!
చీటికి మాటికిన్ బరుల-జేబులు గొట్టుట ధర్మమార్గమే?
ఏటికి నీయబద్ధ మర-రే! యిఁక సాగునె? ధూర్తమానవా! 18
బొక్కెడుకూడు పట్టుమని-పొట్టకు తింటినె యొక్కపూటయేన్?
జక్కగ నొంటినిండ నొక-జానెడు గుడ్డను గప్పుకొంటినే!
ఒక్కటియేని మ్రుచ్చిలిక-యుంచితివే? యిఁక నీదుపాటు లే
నక్కయుఁ గుక్కయున్ బడదు;-నా పలుకుల్ విను ధూర్తమానవా! 19
పొక్కిలిగడ్డలేక, తన-పొయ్యికిఁ గట్టెలు లేక, మంటకున్
బిక్కినఁ గుండలోనికిని-బియ్యపునూకలు లేక, గంజిలో
లెక్కకు నుప్పుగల్లయిన-లేక, కృశించెడి పేదవానికిన్
ఱెక్కలు డుచ్చి సిల్గుల హ-రింతువె చెప్పర, ధూర్తమానవా! 20
మరణపు శయ్యమీఁద నొక-మారయినన్ నను దప్పకుండ సం
స్మరణము చేసినంతటనె-స్వర్గము వచ్చునటందు, వేగతిన్
బొరయును? నిట్లె నీ వెపుడు-బొంకుచునుందువు దీనికై నినున్
గఱకఱ గొంతు కోసెదను-కానివి చెప్పకు ధూర్తమానవా! 21
ఏ నొకజాతికూడు భుజి-యించుచు మిక్కిలి తక్కుజాతులన్
హీనముగాగఁ జూతునని-యెవ్వరు సెప్పిరి నీకు వంచకా!
మానవు లందఱున్ సరిస-మానులు గారొకొనాకు? మాయురే!
మానక నీవ యిట్టి యవ-మానముఁ జేతువె ధూర్తమానవా! 22
త్వరపడకుండ సంజపడు-దాఁకను తప్పుపనుల్ పొనర్చి పై
బొరుగున నున్న తోఁటలను-బూవులు మ్రుచ్చిలి కోసి తెచ్చి నా
శిరమునఁ బోసినంతటనె-చేసిన పాపము లొక్కసారిగా
మఱచెడునట్టి వెంగలినె-మానక యిట్టివి ధూర్తమానవా! 23
పసులను, జెట్టుచేమలను,-బక్షితతిన్, గ్రిమికీటకాదులన్
బుసుకున దాకినంతఁ దల-పోయవు స్నానముమాట; కాని మా
నిసి నినుఁ దాకినంతఁ దల-నిండుగ స్నానము ధర్మమార్గమే!
ముసిముసినవ్వు నవ్వెదవు-మోరెగబట్టుక ధూర్తమానవా! 24
బొచ్చు నొసంగి యెట్లు పరి-పూర్ణమనోరథసిద్ధిఁ బొందగా
వచ్చును? బిచ్చివాఁడనని-భావమునం దలపోయుచుంటివా?
పుచ్చును నీదు పాపములు-పోరచి మానుము యిట్టి వానినిన్;
బొచ్చెము లిట్లుచెప్పి ప్రజ-మోసము చేయకు ధూర్తమానవా! 25
ఒక దేవాలయమందు స్త్రీలకు రహ-స్యోత్సాహివై బోధముల్
నికరాదాయముతోడ జోడుచెవులున్-నిండించుచున్నావఁటే!
అకటా కొంపల నెన్ని దీసితివొ య-త్యాచారముల్ సల్పి, నీ
మొకమున్ రాసెద మానకున్న యెడలన్-ముమ్మాటికిన్ ధూర్తమానవా! 26
బిడ్డలకోసరమ్ము విల-పించెడి యా జవరాండ్రతోడుతన్
బిడ్డలు తప్పకుండఁ బ్రభ-వించెదరంచు సమాదరంబునన్
గడ్డముపట్టి "గర్భగుడి"-గర్భముఁ జేర్చుదువట్టెరేల నో
వెడ్డరి! నాకు మంచి పని-వెట్టితి వింతకు ధూర్తమానవా! 27
వాజను మానకున్న నప-వాదులు; తప్పవు శృంగభంగముల్;
రోజులు నీకుఁ జాల విసి-రో! జులుమింతకు మానకున్నచోఁ
బాజివియౌదు వీవు నగు-బాటు ఘటిల్లును; నింక మీఁద నీ
పోజును జూచి మోసపడి-పోవుట గల్గదు ధూర్తమానవా! 28
తిరిపెము నెత్తియెత్తి యతి-దీనతఁ దిర్గుచు జోలి బట్టుచున్
తిరుపతికొండ మీఁది కెగ-దేకుచు నచ్చట చెప్పుదెబ్బ లీ
వొరువుగఁ దిన్న లేశము ప్ర-యోజన ముండదు ధర్మమార్గమున్
బిఱిఁదికిఁ ద్రోసిపుచ్చి పర-పీడకుఁ బూనిన ధూర్తమానవా! 29
తిరుపతిఁ బుట్టి; రంగపురి-తెన్నుల వర్ధిలి; కాశిలోపలన్
మరణము పొందినప్పటికి-మారదు కర్మఫలానుభూతి; నీ
వెరిగియు దీని స్వార్థరతి-నెల్లవిధంబుల నెంతమందినో
పురపుర నెల్లవేళలను-మోసముఁ జేతువే ధూర్తమానవా! 30
ఇతరులఁ బర్వుతో బ్రదుక-నిచ్చుట నెన్నఁడు నేర్చికొందు వా
యతమగు నీ ప్రపంచసుఖ-మన్నది యొక్కటె నీ సుఖంబుగాఁ
బ్రతిదినమున్ స్మరించు సమ-భావము నెన్నఁడు నేర్చికొందు వు
న్నతిఁ గనుచుండి నీ ప్రజ ల-నారతమున్ నినుమెచ్చ మానవా! 31
చేసినవేమో చేసితివి-చెన్నటివై; యని నేను సైరణన్
జేసితి; నింకముందయినఁ-జేసిన తప్పుల దిద్దుబాటుకై
గాసిలియైన యత్నములు-గట్టిగఁ జేయక యూరకున్నచో
వేసరఁబోక కట్టి కుడి-పించెదఁ దప్పదు ధూర్తమానవా! 32
నే వచ్చి నీకుఁ గలలో
వావిరి చెప్పినది యెల్ల వ్రాయుటచేతన్
నీవే ధన్యుఁడ వైతివి
రావోయీ! త్రిపురనేని రామస్వామీ! 33
పైగా నాతనినే విమానముపయిన్-స్వర్గంబు గొంపోయి త
ద్భోగావాప్తిని గూర్చినాఁడ నని సు-ద్దుల్ చెప్పుచున్నాఁడవా?
జాగీరిచ్చునె యే ప్రభుండయిన రా-జద్రోహికిన్ స్వర్గమా?
నీ గాండ్రింపులు గట్టిపెట్ట నిఁకనే-నిన్ బూనవా? మానవా! 34
ఎడ్డెతనంబుఁ జూపెదవె!-యెంతని నే సహియింతు నిన్ను; నీ
కడ్డము వచ్చినంతటనె-యాతఁడు ధర్మవిదూరుడౌనె? పెన్
గడ్డము లేకయున్న నెటు-కాఁగలడయ్య ఋషీంద్రుఁ డెందు! నీ
నడ్డి విఱుంగు నింకపయి-నన్ మతిదప్పిన ధూర్తమానవా! 35
ఆ యాచార్యుఁ డెవఁడో తెల్పవుగ య-త్యాచారముం జల్పుచున్
కాయంబెల్లను రాజయక్ష్మయను రో-గంబందుటన్ గ్రుళ్ళి వే
యాయాసంబునఁ దూలుచున్నతఁడు నా-యాచార్యులం దొక్కఁడా?
నాయాజ్ఞా పరిపాలురం దొకఁడ! నన్-వంచింతువా? మానవా! 36
: శతకములు :
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము | మాతృ శతకము | కఱివేల్పు శతకము | మదనగోపాల శతకము | చక్కట్లదండ శతకము | సుందరీమణి శతకము | కాంతాలలామ శతకము | తాడిమళ్ళరాజగోపాల శతకము | భక్తమందార శతకము | కుక్కుటేశ్వర శతకము | భర్గ శతకము | లావణ్య శతకము | వేణుగోపాల శతకము | విశ్వనాథ శతకము | ఒంటిమిట్ట రఘువీరశతకము | మృత్యుంజయం | చెన్నమల్లు సీసములు | సంపఁగిమన్న శతకము | కుమార శతకము | శ్రీ అలమేలుమంగా శతకము | సూర్య శతకము | నీతి శతకము | శృంగార శతకము | వైరాగ్య శతకము | మంచి మాట వినర మానవుండ | సదానందయోగి శతకము | శివముకుంద శతకము | మృత్యుంజయ శతకము |