కృష్ణార్జునులు |
శ్లోకము - 30
దేహీ నిత్యమవధ్యోకయం దేహీ సర్వస్య భారత |
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి ||
దేహీ - భౌతికదేహానికి యజమాని; నిత్యం - ఎల్లప్పుడు; అవధ్యః - చంపబడడు; అయం - ఈ ఆత్మ; దేహే - దేహంలో; సర్వస్య - ప్రతియొక్కరి; భారత - ఓ భరత వంశీయుడా; తస్మాత్ - కనుక, సర్వాణి - అన్ని; భూతాని - (పుట్టినట్టి) జీవులు; త్వం - నీవు; శోచితుం - దుఃఖించడానికి; న అర్హసి - తగవు.
ఓ భరతవంశీయుడా! దేహంలో నివసించేవాడు ఏనాడును చంపబడడు, కనుక నీవు ఏ జీవి గురించి దుఃఖించవలసిన అవసరము లేదు.
భాష్యము : మార్పురహితమైన ఆత్మను గురించిన ఉపదేశ అధ్యాయాన్ని భగవంతుడు ఇప్పుడు ముగిస్తున్నాడు. శాశ్వతమైన ఆత్మను నానారకాలుగా వర్ణిస్తూ శ్రీకృష్ణభగవానుడు అది నిత్యమైనదని, దేహము తాత్కాలికమని ధ్రువపరిచాడు. కనుక పితామహుడు, గురువు అంటే భీష్మద్రోణులు యుద్ధంలో మరణిస్తారనే భయంతో క్షత్రియుడైన అర్జునుడు తన విధిని విడిచిపెట్టకూడదు. శ్రీకృష్ణుని ప్రామాణికతపై మనిషి భౌతికదేహానికి భిన్నంగా ఆత్మ ఉన్నదని విశ్వసించాలి. అంతేగాని ఆత్మ అనేది లేకపోవడం లేదా రసాయనాల చర్య ద్వారా ఒకానొక పరిపక్వస్థితిలో జీవలక్షణాలు ఉత్పన్నమౌతాయనడం కానేకాదు. ఆత్మ శాశ్వతమేయైనా హింస ప్రోత్సాహనీయము కాదు, కాని దాని అసలైన అవసరము ఉన్నట్టి యుద్ధసమయంలో అది అడ్డగించబడదు. ఆ అవసరము భగవంతుని అనుమతి పైననే సమర్థించబడుతుంది గాని తోచినట్లుగా కాదు.
శ్లోకము - 31
స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి |
ధర్మ్యాద్ధి యుద్దాచ్చేయోకన్యత్ క్షత్రియస్య న విద్యతే ||
స్వధర్మం - స్వీయధర్మము; అపి - కూడ; చ - నిజముగా; అవేక్ష్య - తలచి; వికమ్పితుం - సంశయించడం; న అర్హసి - నీకు తగదు; ధర్మ్యాత్ - ధర్మానుసారము; హి - నిజముగా; యుద్ధాత్ - యుద్ధము చేయడం కంటే; శ్రేయః - మేలైన కార్యము; అన్యత్ - వేరొక్కటి; క్షత్రియస్య - క్షత్రియునికి; న విద్యతే - లేదు.
క్షత్రియునిగా నీ విశేషమైన విధిని తలచి ధర్మానుసారము యుద్ధం చేయడము కంటే నీకు శ్రేయోదాయకమైన కార్యము వేరొక్కటి లేదని నీవు తప్పక తెలిసికోవాలి. కనుక సంశయించవలసిన అవసరమే లేదు.
భాష్యము : సంఘ పరిపాలనకు ఉన్నట్టి నాలుగు వర్గాలలో సత్సరిపాలన నిమిత్తము ఉన్నట్టి రెండవ వర్ణము క్షత్రియవర్ణమని పిలుపబడుతుంది. "క్షత్" అంటే హాని హాని కలుగకుండ రక్షించేవాడే క్షత్రియుడని (త్రాయతే రక్షించుట) పిలువబడతాడు. అడవిలో క్షత్రియులకు సంహారకార్యంలో శిక్షణ ఇవ్వబడుతుంది. క్షత్రియుడు అడవికి వెళ్ళి పులిని ముఖాముఖి ఎదుర్కొని, తన ఖడ్డాన్ని చేపట్టి దానితో పోరాడుతాడు. పులి చంపబడిన తరువాత దానికి రాచమర్యాదలతో దహనక్రియ నిర్వహిస్తారు. ఈ పద్ధతి ఈనాటికీ జైపూర్ రాష్ట్రంలోని క్షత్రియరాజులచే అనుసరించబడుతోంది. ధర్మయుతమైన హింస ఒక్కొకప్పుడు అత్యవసరమైన విషయము కనుక ఎదిరించడంలో సంహరించడంలో క్షత్రియులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబడుతుంది. అందుకే క్షత్రియులు నేరుగా సన్న్యాసాశ్రమం స్వీకరించకూడదు. అహింస రాజకీయాలలో తంత్రమేయైనా అదెన్నడును ఒక నిబంధన లేదా సిద్ధాంతము కాదు. ధర్మశాస్త్ర గంథాలలో ఈ విధంగా చెప్పబడింది :
ఆహవేషు మిథోఃన్యోన్యం జీఘాంసస్తో మహీక్షితః |
యుద్ధమానాః పరం శక్త్యా స్వర్గం యాస్త్యవరాబ్ముఖాః ||
యజ్ఞేషు పశవో బ్రహ్మన్ హస్యస్తే సతతం ద్విజైః |
సంస్కృతాః కిల మంత్రైశ్చ తేఃపి స్వర్గమవాష్నువన్ ||
యుద్ధరంగంలో తన శత్రురాజుతో యుద్ధం చేస్తూ మరణించే రాజు లేదా క్షత్రియుడు స్వర్గలోకాలను పాందడానికి అర్హుడౌతాడు. అలాగే యజ్ఞాగ్నిలో పశువులను బలి ఇవ్పడం ద్వారా బ్రాహ్మణులు కూడ స్వర్గాన్ని పొందుతారు. కనుక ధర్మానుసారము యుద్ధరంగంలో చేసే సంహారము, యజ్ఞాగ్నలో పశుసంహారము హింసాకలాపాలు కానేకావు, ఎందుకంటే అందులో ఉన్న ధర్మాల వలన ప్రతియొక్కరికీ లాభమే కలుగుతుంది. బలి ఇవ్వబడిన పశుపు ఒక రూపము నుండి వేరొక రూపానికి పరిణామక్రమము లేకుండానే శీఘ్రమే మానవజన్మను పొందుతుంది; యుద్ధరంగంలో చంపబడిన క్షత్రియులు కూడ స్వర్గలోకాలను చేరుకుంటారు. బ్రాహ్మణులు కూడ యజ్ఞనిర్వహణ ద్వారా వాటిని పొందుతారు.
స్వధర్మాలు, అంటే విశేషమైన విధులు రెండు రకాలుగా ఉన్నాయి. ముక్తిని పొందనంతవరకు మనిషి ముక్తిసాధనకై ధర్మానుసారము తన జన్మకు సంబంధించిన విధులను నిర్వహించాలి. మనిషి ముక్తిని పొందిన తరువాత అతని స్వధర్మము అంటే విశేషమైన విధి ఆధ్యాత్మికమే అవుతుంది. అది భౌతికదేహభావనలో ఉండదు. దేహాత్మభావనలో బ్రాహ్మణులకు, క్షత్రియులకు విశేషమైన విధులు ఉంటాయి. ఆ విధులు అనివార్యమైనవి. స్వధర్మము భగవంతుని చేతనే నిర్ణయించబడింది. ఇది నాలుగవ అధ్యాయంలో స్పష్టము చేయబడుతుంది. దేహస్థితిలో స్వధర్మము వర్ణాశ్రమధర్మమని లేదా మనిషి ఆధ్యాత్మికావగాహనకు సోపానమని పిలువబడుతుంది. వర్ణాశ్రమధర్మ స్థితి సుండే, అంటే వివిధ దేహగుణాలను బట్టి ఉన్నట్టి విశేష విధుల స్థితి నుండే మానవనాగరికత ప్రారంభమౌతుంది. ఏ కార్యరంగంలోనైనా ఉన్నతులైన ప్రామాణికుల ఆదేశానుసారము చేసే విశేషమైన విధి నిర్వహణ మనిషిని ఉన్నత జీవనస్థితికి చేరుస్తుంది.
శ్లోకము - 32
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావ్తం |
సుఖిః క్షత్రియాః పార్థ లభన్తె యుద్ధమీద్భశం ||
యదృచ్చయా - దానంతట అదే; చ - కూడ; ఉపవన్నం - వచ్చినట్టి; స్వర్గ - స్వర్గలోకాల; ద్వారం - ద్వారము; అపావృతం - తెరువబడినట్టి; సుఖినః - పరమ సౌఖ్యవంతులు; క్షత్రియాః - క్షత్రియులు; పార్థ - ఓ పృథా తనయా: లభన్తె - పొందుతారు; యుద్ధం - యుద్ధమును; ఈదృశం - ఇటువంటి.
ఓ పార్థా! స్వర్గద్వారాలను తమ కొరకు తెరిచే అటువంటి యుద్ధావకాశాలను కోరకుండానే పొందే క్షత్రియులు సౌఖ్యవంతులు.
భాష్యము : "ఈ యుద్ధంలో ఎటువంటి శుభము నాకు కనిపించడము లేదు. ఇది శాశ్వతమైన నరకవాసమునే కలిగిస్తుంది" అని పలికిన అర్జునుని తీరును జగద్గురువుగా శ్రీకృష్ణభగవానుడు తప్పుబడుతున్నాడు. అర్జునుని అటువంటి పలుకులు కేవలము అజ్ఞానము వలననే వచ్చాయి. తన ప్రత్యేక విధి నిర్వహణలో అతడు అహింసాయుతుడు కాగోరాడు. క్షత్రియుడు యుద్ధరంగంలో నిలవడం, ఆపై అహింసాయుతుడు కావడం మూర్ఖుల సిద్ధాంతము. వ్యాసదేవుని తండ్రి, గొప్ప ఋషి అయిన పరాశరునిచేరచింపబడిన ధర్మసూత్రాలలో, అంటే పరాశరస్మృతిలో ఈ విధంగా చెప్పబడింది :
క్షత్రియో హి ప్రజా రక్షన్ శస్త్రపాణిః ప్రదణ్ణయన్ |
నిర్జిత్య పరసైన్యాది క్షితిం ధర్మేణ పాలయేత్ ||
”పౌరులను అన్ని రకాలైన కష్టాల నుండి రక్షించడం క్షత్రియుని ధర్మము. ఆ కారణంగా అతడు శాంతిభద్రతల కొరకు తగిన సందర్భాలలో హింసను చేయవలసి ఉంటుంది. కనుక అతడు శత్రురాజుల సైన్యాలను జయించి ఆ విధంగా ధర్మబద్ధంగా ప్రవంచాన్ని పరిపాలించాలి. ఈ విషయాలన్నింటిని బట్టి అర్జునుడు యుద్దాన్ని మానడంలో ఎటువంటి కారణము లేదు. అతడు తన శత్రువులను జయిస్తే రాజ్యాన్ని అనుభవిస్తాడు; ఒకవేళ యుద్ధంలో మరణించవలసివస్తీ తన కొరకు ద్వారాలు తెరచుకొని ఉన్నట్టి స్వర్గానికి అతడు చేరుకుంటాడు. ఇందులో ఏదైనా సరే యుద్ధము అతనికి లాభదాయకమే అవుతుంది.