: శ్రీ నృసింహ జయంతి :
ఈ శుభ దినమున - దేని వలన రోగములు సమసిపోయి అందరూ ఉత్తమ గతులు పొందుతారో, అదే ప్రహ్లాదోపాఖ్యానము - ప్రహ్లాదోపాఖ్యానం గూర్చి శ్రీ మహావిష్ణువు కూడా ఫలశృతి లో ఇదే చెప్పారు.
అలాంటి ప్రహ్లాదోపాఖ్యానం - పఠించి తరిద్దాము శ్రీ చాగంటి గారి వ్యాఖ్యానం
క|| ఇందు గల డందు లేడని,
సందేహము వలదు, చక్రి సర్వోపగతుం,
డెం దెందు వెదకి చూచిన,
నందందే కలడు, దానవాగ్రణి ! వింటే.
తండ్రీ ! శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశము ఉన్నదా, ఎక్కడ ఎక్కడ వెతికి చూస్తే అక్కడ ఉంటాడు నారాయణుడు. వ్యాపకత్వము చేత అన్నిటి యందు నిండి నిబిడీకృతమై ఉంటాడు అన్నాడు. ఓహో! అలాగా ఈ స్తంభములో ఉంటాడా అన్నాడు, పిల్లవాడు అంతటా ఉన్నాడు అంటున్నాడు.అప్పుడు వచ్చినది నరసింహావతారము.
హిరణ్యకశిపుడు మూడు వేళ్ళు ముడిచి చూపుడు వేలు పైకి తీసి చూపిస్తూ ఎక్కడో ఆపుతాడు. ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడనుండి పైకి రావాలి. రాకపోతే తనని నమ్ముకున్న భక్తుని మాట వమ్ము అయిపోతుంది. రావడము అంటూ జరిగితే శంఖ , చక్ర ,గద , పద్మములు పట్టుకున్న శ్రీమన్నారాయణునిగా వచ్చి హిరణ్యకశిపుని సంహారము చెయ్యడానికి బ్రహ్మగారు ఇచ్చిన వరము ప్రతి బంధకము .ఆయన ఎన్ని వరములు ఇచ్చాడో అన్ని వరములకు మినహాయింపుగా రావాలి. అన్ని వరములకు మినహాయింపుగా ఎక్కడనుండి రావాలో తన చేతిలో లేదు. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ ఆపితే అక్కడనుండి రావాలి.
మ|| ' హరి సర్వాకృతులం గలం ' డనుచు బ్రహ్లాదుండు భాషింప స
త్వరుడై ' యెందును లేడు లే ' డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానాజంగమస్థావరో త్కరగర్భంబుల
నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్
బ్రహ్మాండము అంతా నారసింహము అయిపోయి విష్ణు తత్వము అన్నిటిలోకి చేరిపోయింది నరసింహావతారముగా. అన్నిటా నిండిన నారసింహతత్వము ఎలా ఉంటుందో ఊహించాలి. హిరణ్యకశిపుడు వేలు తిప్పుతూ స్తంభమును చూపించి ఇందులో ఉన్నాడా, అన్నాడు. అంటే మళ్ళీ అదేమాట అడగవద్దు అంతటా ఉన్నాడు అంటాడు ప్రహ్లాదుడు, ఉంటే వస్తాడా అని అడిగితే వస్తాడు నాన్నా అన్నాడు అయితే పిలవమని అన్నాడు ...
కొడుకు మాట కాదని నిరూపించాలి హిరణ్యకశ్యపుడు. భక్తుని మాట నిలపెట్టాలి అని పరమేశ్వరుడు. ఇది ఆయన దయ. పిల్లవాడు ధైర్యముగా ఉన్నాడు పరమేశ్వరుడు అంటు మాట్లాడుతున్నాడు. అతని మాట నిలపెట్టడానికి బ్రహ్మాండమంతా నారసింహము అయిపోయింది. ఆ స్తంభమును ఒక్క దెబ్బ కొట్టి రమ్మను ఇందులోనుండి అన్నాడు. అలా అనడముతోనే పెళపెళా శబ్దములు చేస్తూఆ స్తంభము బద్దలు అయి అందులో నుండి విస్ఫులింగములు పైకి వచ్చి పెద్ద కాంతిమండలము కనపడి కన్నులతో చూడలేనంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటికి వచ్చింది. అందులోనుండి పట్టుపుట్టము కట్టుకుని స్వామి నిలబడ్డారు.
భయంకరమైన గర్జన చేస్తు ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన వేగమును వత్తిడినీ తట్టుకోలేక వేయి పడగలు కల ఆదిశేషుడు సార్వభౌమము మొదలైన దిగ్గజములు కూడా భూమియొక్క బరువుని ఓర్చలేక తలలు వంచాయి. ఆయన పాదములలో శంఖ , చక్ర , పద్మ రేఖలు ,నాగలి , అమృతభాండము మొదలైన దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి. బలిష్ఠమైన మోకాళ్ళు, ఐరావతము యొక్క తొండము వంటి బలిష్ఠమైన తొడలు, సన్నటి నడుము, దానికి పెట్టుకున్న మువ్వల వడ్డాణము, చప్పుడు చేస్తున్న గంటలు, మెడలో వేసుకున్న హారములు, నృసింహాకారము పైన సింహము యొక్క ముఖము పెద్ద దంష్ట్రలు భయంకరమైన వాటిని తెగకోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి. అదిరి పడిపోతున్న పెదవులు. మంధరపర్వత గుహలను పోలినటువంటి నాసికా రంధ్రములు. పుట్టలోనుండి పైకి వచ్చి కోపముతో ఊగుతున్న నాగుపాము ఎలా ఉంటుందో అలా ఆడుతున్న నాలుక. కోటి సూర్యుల ప్రకాశముతో గురి చూసి చూస్తున్న వెలిగిపోతున్న కన్నులు. నిక్క పొడుచుకున్న వెంట్రుకలు. పెట్టుకున్న పెద్ద కిరీటము.
అనంతమైన బాహువులయందు ఆయుధములు పట్టుకుని మహానుభావుడు అడుగుతీసి అడుగు వేస్తు వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల ఇటు అటూ ఊపితే కేసరములు కదలి విమానములో వెడుతున్న దేవతలు భ్రంశమై విమానములనుండి కిందపడిపోయి, ఆ మేఘములు అన్నీ కొట్టబడి, పర్వతములు అన్నీఘూర్ణిల్లి, సముద్రములన్నీ పొంగిపోయి, భూమండలము అంతా కలత చెంది స్వామి నరసిం హావతారము వచ్చింది ఇప్పటివరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వమును పొందనటువంటి విష్ణుమూర్తి అపారమైన కోపముతో తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు నిగ్రహించాడన్న కోపమును ఆపుకోలేక ఉగ్ర నృసింహావతారమై వచ్చాడని లోకము అంతా భీతిల్లిపోతే 33 కోట్లమంది దేవతలు ఆకాశములో నిలబడి స్థోత్రము చేస్తుంటే హిరణ్యకశిపుడు గదాదండముతో స్వామి చుట్టూ తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమని అంటే పెద్ద గర్జన చేస్తూ వెళ్ళి హిరణ్యకశిపుని డొక్కల దగ్గర పట్టుకుని పైకి ఎత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకని నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని పడగ పైకి ఎత్తితే ఎలా ఉంటుందో అలా పైకి ఎత్తి గడప దగ్గరకు తీసుకుని వచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, పగలు రాత్రి కాదు ప్రదోషవేళ, ఏ ఇతరమైన ప్రదేశము కాక పంచె పైకి తీసి తొడల మీద పెట్టుకుని, పంచ కట్టి ఉంటే దిక్కులు ఉంటాయి పైకి తీస్తే దిక్కులు ఉండవు. అదొక శాస్త్రము.
ప్రాణము ఉన్నది ప్రాణము లేనిదీ కాదు గోళ్ళు, జంతువుకాదు, పాముకాదు, ఆయుధము కాదు, అస్త్రము శస్త్రము కాదు, రాక్షసులు దేవతలు కాదు, యక్షులు, గంధర్వుల, కిన్నెరలు,కింపురుషులు, నరుడు కాదు నరసింహమై గంగానది సుడితిరుగుతున్నట్లుగా ఉన్న నాభి కనపడుతుండగా విశాలమైన వక్షస్థలముతో పెద్ద దంతములతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖము వంక చూసి మృత్యువు ఆసన్నమైనదని తెలివితప్పి తల వాల్చేసిన హిరణ్యకశిపుని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దింపి చీల్చి గోళ్ళని గొడ్డళ్ళుగా చేసి వక్ష:స్థలములో ఉన్న ఉర: పంజరములోని ఎముకలు అన్నిటినీ కోసేసి పటపట విరిచి పేగులు తీసి మెడలో వేసుకుని ధారలుగా కారుతున్న నెత్తురు దోసిళ్ళతో పట్టి త్రాగి ఒళ్ళు, బట్ట , కేసరములు అన్నీ నెత్తుటితో తడిసిపోతే అక్కడ ఉన్న రాక్షసగణములన్నిటినీ చంపి పెద్ద శబ్దము చేస్తూ డొల్ల బడిన హిరణ్య కశిపుని శరీరముని విసరివేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలు స్థోత్రము చేసారు.
ఏమి నారసింహ అద్భుత అవతారము? ఇంతమంది స్థోత్రము చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు. ఉగ్ర భావనతో ఊగిపోతున్నాడు. లక్ష్మీదేవిని చూసి అమ్మా నీవు నిత్యానపాయినివి ఆయన వక్ష:స్థలములో ఉంటావు. నిన్ను చూస్తే ప్రసన్నుడౌతాడు తల్లీ దగ్గరకు వెళ్ళమని అన్నారు. ఆమె నా భర్త ముఖము పూర్ణచంద్రబింబములా ఉంటుంది. ఇంత కోపముగా నేను ఎప్పుడూ చూడలేదు నేను కూడా దగ్గరకు వెళ్ళను అన్నది. శ్రీమహావిష్ణువు అవతారములలో లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళనటువంటి అవతారము నరసింహావతారమే.
అందరూ భయపడుతుంటే ప్రహ్లాదా! నీ గురించి వచ్చినదే ఈ అవతారము నీ స్వామి దగ్గరకు వెళ్ళి ప్రసన్నుని చెయ్యమని అన్నారు. చిన్న పిల్లవాడు అయిన ప్రహ్లాదుడు స్వామి వద్దకు వెళ్ళి పాదములను పట్టి నమస్కరించి పైన సింహముగా కింద నరుడిగా వచ్చి, పెద్దనోరుతో, గోళ్ళతో, గర్జన చేస్తే భయపడిపోతామని అనుకుంటున్నావా? నీకన్నా భయంకరమైనది లోకములో ఉన్నది దాని పేరు సంసారము. దానికి భయపడతాము గాని నీకు భయపడతామా ? అన్నాడు. బ్రహ్మాది దేవతల తలమీద పెట్టని చెయ్యి, లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి, పరమ భక్తుడిని అని పేరుపెట్టి ఏమీతెలియని అర్భకుడిని అయిన నాతల మీద చెయ్యిపెట్టి నాకోసము పరుగెత్తుకు వచ్చి నా మాట నిలపెట్టడానికి స్తంభమునుండి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయములో ఎంత కారుణ్యము ఉన్నదో నాకు తెలియదు అనుకుంటున్నావా? అరిస్తే భయపడతాను అనుకుంటున్నావా పరమేశ్వరా నీకు నమోవాక్కములు అని స్థోత్రము చేసాడు.
పరవశించిననరసింహస్వామి పరమ ప్రసన్నుడై ప్రహ్లాదుని ఎత్తుకుని తన తొడ మీద కూర్చోపెట్టుకుని నీ భక్తికి పొంగిపోతున్నాను ఏమి వరముకావాలో కోరుకోమని అన్నాడు. అంటే మళ్ళీ నన్ను మాయలో ముంచుదామని అనుకుంటున్నావా? నాకెందుకు వరాలు? నాకు ఎందుకు కోరికలు? ఏకోరికా లేదు.
నీపాదములయందు నిరతిశయ భక్తి కలిగి ఉంటే చాలు. నా తండ్రి అమాయకముతో నీకు వ్యతిరేకముతో బతికాడు ఆయనకు ఉత్తమగతులు కలిగేటట్లుగా అనుగ్రహించమని వేడుకుంటే ఏనాడు పట్టుకుని పైకి ఎత్తి తొడల మీద పెట్టుకున్నానో నీ తండ్రి నావంక చూసి స్తబ్దుడైనాడో నా గోళ్ళతో చీల్చి నెత్తురు తాగానో, ఆనాడు నీ తండ్రే కాదు అంతకుముందు 21 తరములు తరించాయి. ప్రహ్లాదా నీవు బెంగపెట్టుకోవద్దు. నీకు ఆశీర్వచనము చేస్తున్నాన దీర్ఘాయుష్మంతుడవై రాజ్యమును ధార్మికముగా పరి పాలించి పరమభాగవతోత్తముడవై అంత్యమునందు నన్ను చేరుకుంటావు. నీకధ ఎక్కడ చెప్పబడుతుందో, ఎక్కడ వినపడుతుందో, అక్కడ నేను ప్రసన్నుడను అవుతాను. ఎంతో సంతోషిస్తాను. సభామంటపములోని వారందరికీ నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది. దాని వలన రోగములు సమసిపోయి అందరూ ఉత్తమ గతులు పొందుతారు అని ప్రహ్లాదోపాఖ్యానమునకు శ్రీ మహావిష్ణువే ఫలశృతి చెప్పారు.