శ్లోకము - 20
న జాయతే మ్రియతే వా కదాచిన్
నాయం భూత్వా భవితా వా న భూయః |
అజో నిత్యః శాశ్వతోఃయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే ||
న జాయతే - జన్మించదు; వ్రియతే వా - మరణము కూడా లేదు; కదాచిత్ - ఎన్నడును (భూత, భవిష్యత్, వర్తమానము); న - కాదు; అయం - ఇది; భూత్వా - జన్మించి; భవితా - జన్మించుచు; వా - లేదా; న - లేదు; భూయః - తిరిగి జన్మించడం; అజః - జన్మరహితమైనది; నిత్యః - నిత్యమైనది; శాశ్వతః - శాశ్వతమైనది; అయం - ఇది; పురాణః - పురాతనము; న హన్యతే - చంపబడదు; హన్యమానే - చంపబడినా; శరీరే - శరీరము.
ఆత్మకు ఎన్నడూ జన్మ గాని, మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు జన్మింపబోదు. అది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము చంపబడినా అది చంపబడదు.
భాష్యము : భగవంతుని అణుపరిమాణ అంశ గుణరీత్యా భగవంతునితో సమానమైనది. అది దేహములాగా మార్పు చెందదు. ఒక్కొక్కప్పుడు ఆత్మ స్థిరము లేదా కూటస్థమని పిలువబడుతుంది. దేహము ఆరు రకాలైన మార్పులకు లోనౌతూ ఉంటుంది. అది తల్లి గర్భము నుండి జన్మిస్తుంది, కొంత తడవు నిలిచి ఉంటుంది, పెరుగుతుంది, ఇతరాలను సృష్టిస్తుంది, క్రమంగా క్షీణిస్తుంది, చివరకు కాలగర్భంలో కలిసిపోతుంది. కాని ఆత్మ ఇటువంటి మార్పులకు లోను కాదు. ఆత్మ జన్మించదు కాని అది దేహాన్ని స్వీకరిస్తుంది కనుక దేహము జన్మిస్తుంది. ఇక్కడ ఆత్మ జన్మించదు కనుక దానికి మరణం కూడ లేదు. దేనికైతే జన్మ ఉన్నదో దానికి మరణం కూడ ఉంటుంది. ఆత్మకు జన్మ లేదు కనుక భూత భవిష్యత్ వర్తమానాలు కూడ లేవు అది నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. అది ఎప్పుడు ఉనికిలోకి వచ్చిందో చారిత్రిక ఆధారాలు లేవు. దేహభావనలో మనము ఆత్మ యొక్క పుట్టుక మున్నగువాటి చరిత్రను తెలిసికోగోరుతాము. దేహము ముసలిదైనట్లుగా ఆత్మ ఎస్నడును ముసలిది“కాదు.
అందుకే నామమాత్ర ముసలివాడు కూడ తన బాల్యంలో లేదా యౌవనములో కలిగియున్న ఉత్సాహాన్నే కలిగి ఉంటాడు. దేహమార్పులు ఆత్మపై ప్రభావాన్ని చూపవు. చెట్టులాగా లేదా ఇంకేదైనా భౌతికవస్తువులాగా ఆత్మ క్షీణించదు. అది ఇతరాలను సృష్టించదు. దేహము నుండి పుట్టిన సంతానము కూడ విభిన్న వ్యక్తిగతజీవులే. అయినా దేహకారణంగా వారు ఒకానొక వ్యక్తి సంతానంగా కనిపిస్తారు. ఆత్మ ఉనికి కారణంగా దేహము పెరుగుతుంది, కాని దానికి సంతానము గాని, మార్పు గాని లేవు. కనుక దేహంలో కలిగే ఆరు మార్పుల నుండి ఆత్మ విడివడి ఉంటుంది.
కఠోపనిషత్లో (1.2.18) కూడ ఇటువంటి శ్లోకమే మనకు కనబడుతుంది. అది ఈ విధంగా చెబుతుంది:
న జాయతే మ్రియతే వా విపశ్చిన్
నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ |
అజో నిత్యః శాశ్వతో' యం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే ||
ఈ శ్లోకానికి అర్థము, వ్యాఖ్యానము భగవద్గీతలోని దానికి సమానమేయైనా దీనిలో "విపశ్చిత్” అనే ఒక ప్రత్యేక పదము ఉన్నది. పండితుడు లేదా జ్ఞానవంతుడని దాని అర్థము.
ఆత్మ జ్ఞానపూర్ణమైనది లేదా సర్వదా చైతన్యపూర్ణమైనది. కనుక చైతన్యము ఆత్మ లక్షణము. ఆత్మ నిలిచి ఉండే స్థానమైన హృదయంలో ఆత్మను కనుగొనలేనప్పటికిని కేవలము చైతన్యాన్ని బట్టి ఆత్మ ఉనికిని మనిషి తెలిసికోగలుగుతాడు. ఒక్కొకప్పుడు మేఘాల కారణంగా లేదా వేరే ఇతర కారణంగా ఆకాశంలో మనము సూర్యుని చూడలేకపోవచ్చును. కాని సూర్యకాంతి ఉన్నది కనుక అది పగటి సమయమని మనము తెలిసికొంటాము. తెల్లవారుఝామున ఆకాశంలో కొంత వెలుగు రాగానే సూర్యుడు వచ్చాడని మనము అర్థం చేసికొంటాము. అదేవిధంగా అన్ని దేహాలలో, మనిషే గాని పశువే గాని చైతన్యము ఉన్న కారణంగా ఆత్మ ఉనికిని మనం తెలిసికోవచ్చును. అయినా ఈ జీవచైతన్యము భగవచ్చెతన్యానికి భిన్నమైనది. ఎందుకంటే భగవచ్చెతన్యము భూత భవిష్యత్ వర్తమానాల పూర్ణజ్ఞానంతో ఉంటుంది. కాగా వ్యక్తిగత జీవచైతన్యము మరుపుకు గురౌతుంది. జీవుడు తన నిజస్వభావాన్ని మరచిపోయినపుడు శ్రీకృష్ణుని పరమోత్కృష్టమైన ఉపదేశాల నుండి విద్యసు, జ్ఞానోపదేశాన్ని పొందవచ్చును. కాని శ్రీకృష్ణుడు మరుపు కలిగిన జీవాత్మ వంటివాడు కాదు. అదేయైతే శ్రీకృష్ణుని భగవద్గీత ఉపదేశాలు వ్యర్థములయ్యేవి.
రెండు రకాల ఆత్మలు ఉన్నాయి. అవే అణుపరిమాణ ఆత్మ (అణు ఆత్మ), పరమాత్మ (విభు ఆత్మ). ఈ విషయము కఠోపనిషద్'లో (1.2.20) కూడ ఈ విధంగా ధ్రువపరుపబడింది.
అణో రణీయాన్ మహతో మహీయాన్
ఆత్మాన్య జంతోర్నిహితో గుహాయామ్ |
తమక్రతుః పశ్యతి వీతశోకో
ధాతుఃప్రసాదాన్మహిమానమాత్మనః ||
పరమాత్మ, అణుఆత్మ (జీవాత్మ) ఇద్దరు జీవుని ఒకే హృదయములో దేహమనే ఒకే వృక్షం మీద నిలబడి ఉన్నారు. భగవదనుగ్రహం వలన సమస్తమైన భౌతికవాంఛల నుండి, శోకాల నుండి బయటపడినవాడే ఆత్మ మహిమలను తెలిసికోగలుగుతాడు. రాబొవు అధ్యాయాలలో విదితము కానున్నట్లు శ్రీకృష్ణుడే పరమాత్మకు కూడ మూలము అర్జునుడు తన నిజస్వభావాన్ని మరచిపోయే అణుఆత్మ, అందుకే శ్రీకృష్ణునిచే లేదా ఆతని ప్రామాణిక ప్రతినిధిచే (గురువుచే) జ్ఞానాన్ని పొందడం అతనికి అవసరము.
శ్లోకము - 21
వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయం |
కథం స పురుషః పార్ధ ఘాతాయాతి హన్తి కం ||
వేద - తెలిసినవాడు; అవినాశినం - నశింపు లేనిది; నిత్యం - సర్వదా నిలిచి ఉండేది; యః - ఎవ్వడు; ఏనం - ఇది (ఆత్మ); అజం - పుట్టుక లేనిది; అవ్యయం - మార్పు లేనిది; కథం - ఎలా; సః - ఆ; పురుషః - వ్యక్తి; పార్థ - ఓ పార్థా (అర్జునా); కం - ఎవ్వడిని; ఘాతయతి - చంపిస్తాడు; హన్తి - చంపుతాడు; కం - ఎవ్వడిని.
ఓ పార్థా! ఆత్మ నశింపులేనిదని, నిత్యమైనదని, పుట్టుకలేనిదని, మార్పు చెందనిదని తెలిసినవాడు ఎవ్వరినైనా ఎలా వధిస్తాడు లేదా వధింపజేస్తాడు ?
భాష్యము : ప్రతీది దానికి తగిన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. పూర్ణజ్ఞానంలో నెలకొన్నవాడు ఎక్కడ, ఏ విధంగా ఒకదానిని దానికి తగిన ప్రయోజనంలో ఉపయోగించాలో ఎరిగి ఉంటాడు. అదేవిధంగా హింసకు కూడ దాని ప్రయోజనము ఉన్నది. దానిని ఏ విధంగా ప్రయోగించాలనేది జ్ఞానవంతునికి తెలిసి ఉంటుంది. శాంత స్వరూపుడైన న్యాయాధిపతి హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించినా నిందనీయుడు కాడు. ఎందుకంటే న్యాయసూత్రాలను అనుసరించే అతడు మరొక వ్యక్తి పట్ల హింసను ఆదేశిస్తున్నాడు. హంతకునికి మరణశిక్ష విధించాలని, అప్పుడు తాను చేసిన మహాపాపానికి అతడు తదుపరి జన్మలో దుఃఖము అనుభవించకుండ ఉండగలడని మానవ ధర్మశాస్త్రమైన మనుసంహిత సమర్థించింది. కనుక హంతకుడిని ఉరితీయడమనే రాజదండన నిజానికి లాభకరమే. అదేవిధంగా కృష్ణుడు యుద్ధానికి ఆదేశించినపుడు ఆ హింస పరమన్యాయము కొరకేనని నిర్ణయించాలి. ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని కొరకు చేసే యుద్ధకార్యంలో జరిగే అట్టి హింస అసలు హింసే కాదని చక్కగా ఎరిగి ఆదేశపాలన చేయాలి. ఎందుకంటే ఏ విధంగాను మనిషి, నిజానికి ఆత్మ చంపబడదు అందుకే న్యాయపరిపాలనకు నామమాత్ర హింస అనుమతించబడింది. శస్త్రచికిత్స రోగిని బాగు చేయడానికి ఉద్దేశించబడింది గాని చంపడం కొరకు కాదు. అందుకే శ్రీకృష్ణుని ఆదేశం మేరకు అర్జునుడు చేయబోయే యుద్ధం జ్ఞానపూర్ణమే అవుతుంది. అందులో పాపానికి అవకాశమే లేదు.
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి » |