శ్లోకము - 6
న చైతద్ విద్మః కతరన్నో గరీయో
యద్ వా జయేమ యది వా నో జయేయుః |
యానేవ హత్వా న జిజీవిషామ
స్తేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ॥
చ - కూడ; ఏతత్ - ఇది; స విద్మః - - మాకు తెలియదు; కతరత్ - ఏది; నః - మాకు; గరీయః - ఉత్తమమో; యత్వా - ఒకవేళ; జయేమ - జయించడమో; యాన్ - ఎవరిని; ఏవ - నిశ్చయముగా; హత్వా - చంపి; న జిజీవిషౌమః - జీవింపగోరము; తే - వారందరు; అవస్థితాః - నిలిచి ఉన్నారు; ప్రముఖే - ఎదుటనే; ధార్తరాష్ట్రా - ధృతరాష్ట్రుని పుత్రులు.
వారిని జయించడము లేదా వారిచే జయింపబడడము అనే వాటిలో ఏది ఉత్తమమో కూడ మాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేమిక జీవించి ఉండడము వ్యర్థము. అయినా వారిప్పుడు యుద్ధరంగములో మా ఎదుట నిలిచి ఉన్నారు.
భాష్యము : యుద్ధము క్షత్రియుల ధర్మమే అయినప్పటికీని యుద్ధం చేసి అనవసరమైన హింసకు తెగించాలో లేదా యుద్దాన్ని త్యజించి భిక్షమెత్తి జీవించాలో అర్జునునికి తెలియలేదు. ఒకవేళ అతడు శత్రువును జయించకపోతే భిక్షాటనమే అతనికి జీవిక అవుతుంది. ఇరుపక్షాలలో ఎవ్వరైనా విజేతగా కావచ్చును కనుక విజయము సునిశ్చితము కూడ కాదు. ఒకవేళ విజయము వారి కొరకు వేచి ఉన్నా, (వారి కారణము న్యాయసమ్మతమేయైనా) యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు మరణిస్తే వారు లేకుండ జీవించడము అతికష్టమే అవుతుంది. అటువంటి పరిస్థితులలో అది వారికి వేరొక
రక్తమైన అపజయమే అవుతుంది. అర్జునుడు మహాభక్తుడే గాక మహాజ్ఞానవంతుడని, తన మనస్సుపై ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలవాడని ఈ భావనలు నిశ్చయంగా నిరూపిస్తున్నాయి.
రాజవంశంలో జన్మించినప్పటికిని భిక్షమెత్తి జీవించాలనే అతని కోరిక వైరాగ్యానికి మరొక చిహ్నము. ఈ గుణాలు, వాటితో పాటు (తన గురువైన) శ్రీకృష్ణుని ఉపదేశవాక్కులపై ఉన్నట్టి విశ్వాసము సూచించినట్లుగా అతడు నిజంగా ధర్మాత్ముడు అందుకే అర్జునుడు ముక్తికి పరమయోగ్యుడని నిర్ణయించబడింది. ఇంద్రియాలు నిగ్రహింపబడనిదే జ్ఞానస్థాయికి ఎదిగే అవకాశము లేదు; ఇక జ్ఞానము లేనిదే, భక్తి లేనిదే ముక్తికి అవకాశమే లేదు. లౌకిక సంబంధాలతో తనకు గల అపరిమిత విశేషణాలతో పాటుగా ఈ గుణాలన్నింటిలోను అర్జునుడు యోగ్యుడు.
శ్లోకము - 7
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః |
యయాచ్చ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేకహం శాధి మాం త్వాం ప్రపన్నం ||
కార్పణ్య - లోభము; దోష - బలహీనతచే; ఉపహత - పీడింపబడి; స్వభావః - స్వభావము; పృచ్ఛామి - నేను అడుగుతున్నాను; త్వాం - నిన్ను; ధర్మ - ధర్మములోి; సమ్మూడ - మోహము చెంది; చేతాః - హృదయములో; యత్ - ఏది; శ్రేయః - సర్వహితము; స్యాత్ - అవుతుందో; నిశ్చితం - నిశ్చయంగా; బ్రూహి - చెప్పమని; తత్ - అది; మే - నాకు; శిష్యః - శిష్యుడను; తే - నీక్కు; అహం - నేను; శాధి - ఉపదేశించుము; మాం - నేను; త్యాం - నీకు; ప్రపన్నం - శరణాగతుడను.
లోభమనే దోషము కారణంగా నేనిప్పుడు నా ధర్మవిషయములో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను, శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము చేయవలసింది.
భాష్యము : ప్రకృతి నియమానుసారము లౌకికకర్మల పద్దతే ఎల్లరి కలవరానికి కారణమౌతుంది. అడుగడుగునా కలతే ఉంటుంది కనుక జీవితలక్ష్యాన్ని నెరవేర్చడానికి సరియైన మార్గదర్శనము చేసే ప్రామాణికుడైన గురువు దరిచేరడము మనిషికి మంచిది. మనం కోరకుండానే కలిగే జీవిత కలతల నుండి ముక్తిని పొందడానికి ప్రామాణిక గురువు దరిచేరమని సకల వేదశాస్తాలు ఉపదేశిస్తున్నాయి. జీవితకలతలు ఎవ్వడూ రగిలించకుండానే ఏదో విధంగా రగుల్కొనే దావానలం లాంటివి. అదేవిధంగా ప్రపంచ పరిస్థితి ఎటువంటిదంటే మనం ఆ చికాకును కోరకపోయినా జీవితకలతలు అప్రయత్నంగా కలుగుతూనే ఉంటాయి. అగ్నిప్రమాదాన్ని ఎవ్వరూ కోరుకోరు, అయినా అది సంభవించి మనం కలతకు గురౌతాము. అందుకే జీవిత కలతలను పరిష్కరించడానికి, వరిష్కార విజ్ఞానాన్ని అర్థం చేసికోవడానికి పరంపరలో ఉన్నట్టి గురువును తప్పక ఆశ్రయించాలని వేదజ్ఞానము ఉపదేశిస్తున్నది. ప్రామాణిక గురువు ఉన్నట్టి వ్యక్తికి అన్నీ తెలుస్తాయి. అందుకే మనిషి లౌకిక కలతలలో ఉండిపోక గురువు చెంతకు చేరాలి. ఇదే ఈ శ్లోక సారాంశము.
లౌకిక కలతలలో ఉన్న వ్యక్తి ఎవ్వడు? జీవితసమస్యలను అర్ధం చేసికోనివాడే అటువంటివాడు. కలత చెందిన వ్యక్తి బృహదారణ్యకోపనిషద్లో (3.8.10) ఈ విధంగా వర్ణించబడ్డాడు. "యో వా ఏతదక్షరం గార్యవిదిత్వా స్మాల్గోకాత్ పైత్రి స కృపణః" మానవునిగా జీవితసమస్యలను పరిష్కరించనివాడు, ఆ విధంగా ఆత్మానుభవ విజ్ఞానాన్ని అర్థం చేసికోకుండానే శునక, సూకరాలులాగా ఈ జగత్తును విడిచిపెట్టిపోయేవాడే కృపణుడు, లోభి. జీవునికి మానవజన్మ అత్యంత విలువైన సంపద. జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి దానిని అతడు ఉపయోగించుకోగలుగుతాడు. అందుకే ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోనివాడు లోభి అనబడతాడు. ఇంకొక వైపు బ్రాహ్మణుడు, అంటే అన్ని జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ జన్మను ఉపయోగించుకోగలిగిన బుద్ధిమంతుడు ఉంటాడు. "య ఏతదక్షరం గార్గి విదిత్వాస్మా
ల్లోకాత్ పైత్రి స బ్రాహ్మణ:"
కుటుంబము, సంఘము, దేశము మున్నగువాటి పట్ట అమితానురాగముతో కృపణులు, అంటే లోభులు లౌకికభావనలోనే తమ కాలాన్ని వృథా చేస్తారు. సాధారణంగా మనిషి స్పర్శరోగము కారణంగా గృహస్థజీవనము పట్ల, అంటే భార్య, పిల్లలు ఇతర కుటుంబసభ్యుల పట్ల అనురక్తుడై ఉంటాడు. తాను తన కుటుంబమువారిని మృత్యువు నుండి కాపాడగలనని లేదా తన కుటుంబము, సంఘము తనను మృత్యువు నుండి రక్షించగలదని కృపణుడు భావిస్తాడు. ఇటువంటి సాంసారిక అనురక్తి నీచ జంతువులలో కూడ కనిపిస్తుంది. అవి కూడ తమ సంతానాన్ని రక్షించుకుంటాయి, వంశీయుల పట్ల తన అనురాగము, మృత్యువు నుండి వారిని రక్షించాలనే తన కోరికయే తన కలతలకు కారణములని తెలివి కలవాడైనందున అర్జునుడు అర్థం చేసికోగలిగాడు.
యుద్ధధర్మము తన కొరకు ఎదురు చూస్తున్నప్పటికిని లోభబలహీనత కారణంగా విధినిర్వహణ చేయలేకపోతున్నానని అతడు తెలిసికొన్నాడు. అందుకే ఒక నిశ్చితమైన పరిష్కారాన్ని చెప్పమని అతడు పరమగురువైన శ్రీకృష్ణుని అడుగుతున్నాడు. శిష్యునిగా అతడు తనను శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు. మిత్రచర్చలు ఆపాలని అతడు కోరుకున్నాడు. గురుశిష్యుల చర్చలు గంభీరంగా ఉంటాయి. అర్జునుడు ఇప్పుడు ప్రామాణిక గురువు ఎదుట గంభీరంగా మాట్లాడాలని అనుకుంటున్నాడు. అందుకే భగవద్గీత విజ్ఞానానికి శ్రీకృష్ణుడు ఆదిగురువయ్యాడు. గీతావగాహనకు అర్జునుడు తొలి శిష్యుడయ్యాడు. అర్జునుడు భగవద్గీతను అర్థం చేసికొన్న పద్ధతి గీతలోనే చెప్పబడింది. అయినా మనిషి శ్రీకృష్ణుని రూపానికి శరణుజొచ్చవలసిన అవసరం లేదని, శ్రీకృష్ణునిలో ఉన్నట్టి జన్మరహితునికి శరణాగతుడు కావాలని మూర్ఖులైన లౌకిక పండితులు
వ్యాఖ్యానిస్తుంటారు. శ్రీకృష్ణుని అంతర్భాహ్యాలకు తేడా లేదు. ఈ అవగాహన లేకుండ భగవద్గీతను అర్థం చేసికోవడానికి యత్నించేవాడు పరమమూర్ఖుడే అవుతాడు.
శ్లోకము - 8
నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్చోకముచ్చోషణమిన్త్రియాణాం |
అవావ్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యం ||
హే- నిశ్చయముగా; న ప్రపశ్యామి - నాకు కనపడడము లేదు; మమ - నా యొక్క; అవనుద్యాత్ - తొలగించుకునే; యత్ - ఏదైతే; శోకం - దుఃఖము; ఉచ్చోషణం - శోషింపజేస్తున్నట్టి; ఇన్ద్రియాణాం - ఇంద్రియాలను; అవాప్య - పొంది; భూమౌ - ధరిత్రిపై; అసపత్నం - శత్రురహితులు; ఋద్ధం - సంపన్నవంతము; రాజ్యం - రాజ్యము; సురాణాం - దేవతల; అపి - వంటి; చ - కూడ; ఆధిపత్యం - ఆధిపత్యము.
నా ఇంద్రియాలను శోషింపజేస్తున్నట్టి ఈ దుఃఖమును తొలగించుకునే మార్గం నాకు కనబడడం లేదు. దేవతల స్వర్గాధిపత్యంలాగా సంపన్నవంతము, శత్రురహితము అయినట్టి రాజ్యమును ధరిత్రిపై సాధించినప్పటికిని దానిని నేను తొలగించుకోలేను.
భాష్యము : ధర్మసూత్రాలు, నీతిసూత్రాలకు సంబంధించిన జ్ఞానముపై ఆధారపడినట్టి పలు తర్కాలను ప్రతిపాదిస్తున్నప్పటికిని అర్జునుడు తన నిజమైన సమస్యను గురువైన శ్రీకృష్ణభగవానుని సహాయము లేకుండ పరిష్కరించుకోజాలనట్టుగా కనిపిస్తున్నది. స్వీయ ఉనికినే శోషింపజేస్తున్నట్టి సమస్యలను తరిమి వేయడంలో తన నామమాత్ర జ్ఞానము వ్యర్థమైందని అతడు అర్థం చేసికోగలిగాడు. శ్రీకృష్ణుని వంటి గురువు సహాయము లేకుండ అటువంటి కలతలను పరిష్కరించడము అతనికి అసాధ్యము. పుస్తకజ్ఞానము, పాండిత్యము, ఉన్నత పదవుల వంటివి జీవితసమస్యలను పరిష్కరించడములో వ్యర్థమౌతాయి. కేపలము శ్రీకృష్ణుని వంటి గురువే దానికి సహాయం చేయగలుగుతాడు.
కనుక సారాంశమేమిటంటే నూటికి నూరుపాళ్ళు కృష్ణభక్తిభావనాయుతుడైన గురువే ప్రామాణిక గురువు. ఎందుకంటే ఆయనే జీవితసమస్యలను పరిష్కరించగలుగుతాడు. కృష్ణభక్తివిజ్ఞానంలో ప్రవీణుడైన వ్యక్తి తన సాంఘిక స్థితితో పట్టింపు లేకుండ నిజమైన గురువు కాగలుగుతాడని శ్రీచైతన్య మహాప్రభువు అన్నారు.
కిబా విప్ర, కిబా న్యాసి, శూద్ర కేనే నయ |
యై కృష్ణత్త్వవేత్తా, సీఇ గురు హయ ||
కృష్ణవిజ్ఞానంలో మనిషి ప్రవీణుడైతే అతడు విప్రుడైనా (వేదజ్ఞాన పండితుడు) లేదా హీన కులజుడైనా లేదా సన్న్యాసియైనా పూర్ణుడు, ప్రామాణికుడైన గురువు అవుతాడు (శ్రీవైతన్య చరితామృతము, మధ్యలీల, 8.128). కనుక కృష్ణభక్తివిజ్ఞానంలో ప్రవీణుడు కాకుండ ఎవ్వడూ ప్రామాణిక గురువు కాలేడు. వేదవాఙ్మయములో కూడ ఇది ఈ విధంగా చెప్పబడింది:
షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారదః |
అవైష్ణవో గురుర్ న స్యాడ్, వైష్ణవః శ్వపచో గురుః ||
వేదజ్ఞానంలోని అన్ని అంగాలలో ప్రవీణుడైనట్టి పండిత బ్రాహ్మణుడైనా వైష్ణవుడు కానిదే, అంటే కృష్ణభక్తివిజ్ఞానంలో నిష్ణాతుడు కానిదే గురువు కావడానికి అనర్హుడు. కాని హీనకులంలో పుట్టిన వ్యక్తియైనా వైష్ణవుడైతే, అంటే కృష్ణభక్తుడైతే గురువు కాగలుగుతాడు (పద్మపురాణము).
జన్మము, ముసలితనము, వ్యాధి, మరణము అనే సంసారక్షేశాలు ధనమును కూడబెట్టడం ద్వారా, ఆర్థికాభివృద్ధి ద్వారా తొలగించబడవు. ప్రపంచంలో చాలా చోట్ల సమస్త జీవనసౌకర్యాలతో నిండిన దేశాలు ఉన్నాయి. అవి సంపత్తులతో నిండి ఉన్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్నాయి. అయినా అక్కడ కూడ సంసారక్షేశాలు ఉన్నాయి. వారు అనేక రకాలుగా శాంతిని కోరుతున్నారు. కాని వారు శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి ద్వారా, అంటే కృష్ణభక్తిలో ఉన్నట్టి వ్యక్తి ద్వారా శ్రీకృష్ణుని లేదా భగవద్గీతను శ్రీమద్భాగవతాన్ని (కృష్ణవిజ్ఞానమును కలిగియున్నట్టివి) దరిచేరడం ద్వారానే నిజమైన సుఖాన్ని పొందగలరు.
ఆర్థికాభివృద్ది, లౌకిక సౌఖ్యాలు మానవుని కుటుంబ, సాంఘిక, జాతీయ లేదా అంతర్జాతీయ శోకాలను తొలగింపగలిగి ఉంటే భూమిపై శత్రురహిత రాజ్యమైనా లేదా స్వర్గమందలి దేవతలకు ఉన్నటువంటి ఆధిపత్యమైనా తన శోకాన్ని పోగొట్టజాలవని అర్జునుడు అనేవాడు కాదు. అందుకే అతడు కృష్ణభక్తిభావనలో శరణుజొచ్చాడు. శాంతి సామరస్యాలకు అదే చక్కని మార్గము. ఆర్థికాభివృద్ధి లేదా ఆధిపత్యము అనేది ప్రకృతి ప్రళయముతో ఏ క్షణమైనా నశించిపోతుంది. ఇప్పుడు మానవులు చంద్రలోకాన్ని చేరగోరినట్టుగా ఉన్నత లోకాలకు చేరే ప్రయత్నము కూడ ఒక్కదెబ్బతో నశించిపోతుంది. భగవద్గీత ఈ విషయాన్ని "క్షీణి పుణ్యే మర్త్యలోకం విశన్తి" పుణ్యకర్మల ఫలము నశించినపుడు జీవుడు ఆనందశిఖరము నుండి అధోజీవన స్థితికి తిరిగి పతనము చెందుతాడు అని ధ్రువపరచింది. ప్రపంచంలోని చాలామంది రాజకీయనాయకులు
ఈ విధంగానే పతనం చెందారు, అటువంటి పతనాలు కేవలము మరింత శోకానికే కారణమౌతాయి.
కనుక మనము మంచిని కొరుతూ శోకాన్ని నివారింపగోరితే అర్జునుడు చేయగోరినట్లుగా శ్రీకృష్ణుని ఆశ్రయించాలి. అంటే తన సమస్యను నిశ్చయముగా పరిష్కరించమని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు. ఇదే కృష్ణభక్తిభావనా విధానం.
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి » |