కురుక్షేత్ర సంగ్రామం |
శ్లోకము - 3
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరస్తప ||
క్లైబ్యం - నవుంసకత్వము; మా స్మ - వద్దు; గమః - తీసికోవడము; పార్థ - ఓ పృథా కుమారా; ఏతత్ - ఇది; త్వయి - నీకు; న ఉపపద్యతే - తగదు; క్షుద్రం - నీచమైన; హృదయ - హృదయము యొక్క; దౌర్బల్యం - బలహీనతను; త్యక్త్వా - విడిచిపెట్టి; ఉత్తిష్ఠ - లెమ్ము; పరన్తప - శత్రువులను తపింపజేసేవాడా.
ఓ పార్థా! ఈ పతనకారణమైన నపుంసకత్వానికి లొంగకు, ఇది నీకు తగదు. ఓ పరంతపా! ఇటువంటి హృదయదౌర్భల్యమును విడిచిపెట్టి లెమ్ము.
భాష్యము : ఇక్కడ అర్జునుడు పృథాతనయునిగా సంబోధించబడ్డాడు. పృథా శ్రీకృష్ణజనకుడైన వసుదేవుని సోదరి. అందుకే అర్జునుడు శ్రీకృష్ణునితో రక్తసంబంధాన్ని కలిగి ఉన్నాడు. క్షత్రియ కుమారుడు యుద్ధం చేయడానికి నిరాకరిస్తే పేరుకు మాత్రమే క్షత్రియుడౌతాడు. అలాగే బ్రాహ్మణ తనయుడు పాపకార్యం చేస్తే పేరుకే బ్రాహ్మణుడౌతాడు. అటువంటి క్షత్రియులు, బ్రాహ్మణులు తమ తండ్రులకు తగిన పుత్రులు కారు. అందుకే అర్జునుడు అయోగ్యుడైన క్షత్రియ పుత్రుడు అవడాన్ని శ్రీకృష్ణుడు కోరుకోలేదు. అర్జునుడు శ్రీకృష్ణునికి అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆ శ్రీకృష్ణుడే రథం మీద ఇపుడు అతనికి ప్రత్యక్షంగా నిర్దేశము చేస్తున్నాడు. ఇన్ని యోగ్యతలు ఉన్నప్పటికిని అర్జునుడు యుద్ధాన్ని త్యజిస్తే అపకీర్తికరమైన కార్యము చేసినవాడౌతాడు. అందుకే అర్జునుని అటువంటి నైజము అతనికి తగినట్లుగా లేదని శ్రీకృష్ణుడు అన్నాడు. అత్యంత గౌరవనీయులైన భీష్ముడు, బంధువుల పట్ల పరమోదార స్వభావంతో యుద్ధం విడిచి పెడతానని అర్జునుడు వాదించాలని అనుకుంటే అటువంటి ఉదారత్వము కేవలము హృదయదౌర్భల్యమేనని శ్రీకృష్ణుడు భావించాడు. అటువంటి మిథ్యా ఉదారతను ఏ ప్రామాణికుడూ ఆమోదించడు. అందుకే అటువంటి ఉదారతను లేదా నామమాత్ర అహింసను అర్జునుని వంటి వ్యక్తులు శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశంలో తప్పక విడిచిపెట్టాలి.
శ్లోకము - 4
అర్జున ఉవాచ
కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్థాపరిసూదన ||
అర్జునః ఉవాచ - అర్జునుడు పలికాడు; కథం - ఎట్లా; భీష్మం - భీష్ముని, అహం - నేను; సంఖ్యే - యుద్ధంలో; ద్రోణం - ద్రోణుని; చ - కూడ; మధుసూదన - ఓ మధుదాసప సంహారీ; ఇషుభిః - బాణాలతో; ప్రతియోత్స్యామి - ఎదుర్కోగలను; పూజ అర్జా - పూజనీయులైనట్టివారు; ఆరిసూదన - ఓ శత్రుసంహారా.
అర్జునుడు పలికాడు : ఓ శత్రుసంహారా! ఓ మధుసూదనా! నాకు పూజనీయులైనట్టి భీష్మద్రోణుల వంటి వారిని యుద్ధంలో నేనెట్టా బాణాలతో ఎదుర్కోగలను?
భాష్యము : పితామహుడైన భీష్ముడు, గురువైన ద్రోణాచార్యుడు వంటి గౌరవనీయులైన పెద్దలు సర్వదా పూజనీయులు. ఒకవేళ వారు దాడి చేసినా వారిపై ఎదురుదాడి చేయకూడదు. పెద్దలతో వాగ్వివాదానికైనా దిగకపోవడం సాధారణ కట్టుబాటు. కొన్నిమార్లు వారు కటుపుగా ప్రవర్తించినా వారి పట్ల కటువుగా వర్తించకూడదు. అటువంటప్పుడు వారిని ఎదుర్కోవడం అర్జునునికి ఎట్లా సాధ్యపడుతుంది? కృష్ణుడు ఎప్పుడైనా తన తాత ఉగ్రసేనునిపై లేదా గురువు సాందీపని మునిపై దాడి చేయగలడా? ఈ తర్కాలను అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచాడు.
శ్లోకము - 5
గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్య మపీహ లోకే |
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుజ్జీయ భోగాన్ రుధిరప్రదిగ్దాన్ ||
గురూన్ - పెద్దలను; అహత్వా - చంపకుండ; హి - నిశ్చయముగా: మహానుభావాన్ - మహానుభావులు; శ్రేయః - ఉత్తమము3 భోక్తుం - జీవించడం; బైక్ష్య - భిక్షమెత్తి; అపి -
అయినా; ఇహ - ఈ జన్మలో; లోకే - ఈ లోకంలో; హత్వా - చంపి; అర్థ - లాభము; కామాన్ - కోరేవారిని; తు - కాని; గురూన్ - పెద్దలను; ఇహ - ఈ లోకంలో; ఏవ - నిక్కముగా; భుజ్జీయ - అనుభవించాలి; భోగాన్ - భోగాలను; రుధీర - రక్తముచే; ప్రదిగ్దాన్ - కళంకితమైనట్టి.
నా గురువులైనట్టి మహానుభావుల ప్రాణాలను పణంగా పెట్టి జీవించడం కంటే భిక్షమెత్తి ఈ లోకంలో జీవించడం ఉత్తమము. ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికిని వారు పెద్దలే. వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తము రక్తకళంకితమౌతుంది
భాష్యము : దుర్మార్గమైన కార్యంలో నెలకొని విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయినట్టి గురువు త్యజింపదగినవాడని శాస్త్ర నియమాలు తెలుపుతున్నాయి. దుర్యోధనుడు ఇచ్చిన ఆర్టిక సహాయము కారణంగానే భీష్ముడు, ద్రోణుడు అతని పక్షము వహించవలసి వచ్చింది. అయినా కేవలము ఆర్థిక కారణాల చేత వారు అటువంటి స్థానాన్ని స్వీకరించకుండ ఉండవలసింది. ఇటువంటి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవాన్ని కోల్పోయారు. అయినప్పటికిని వారు తనకు పెద్దలుగానే ఉంటారని, అందుకే వారిని వధించిన తరువాత భౌతికలాభాలను భోగించడమంటే రక్తకళంకితమైనవాటిని అనుభవించడమే అవుతుందని అర్జునుడు తలచాడు.