శ్లోకము - 45
యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్టా రణే హన్యుస్తన్నే క్షేమతరం భవేత్ ||
యది - ఒకవేళ; మాం - నన్ను; ఆప్రతీకారం - ప్రతీకారము చేయకపోయినా; అశస్తం - పూర్తిగా ఆయుధాలు ధరించకపోయినా; శస్తపాణయః - ఆయుధాలు చేపట్టిన; ధార్తరాష్ట్రా - ధృతరాష్ట్ర తనయులు; రణీ - రణరంగములో; హన్యుః - చంపితే; తత్ - అది; మే - నాకు; క్షేమతరం - మంచిదే; భవేత్ - అవుతుంది.
నిరాయుధుడను, ప్రతీకారం చేయనివాడను అయిన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయులు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది.
భాష్యము : క్షత్రియ యుద్ధనియమము ప్రకారం నిరాయుధుడు, సమ్మతింపనివాడు అయిన శత్రువును ఎదుర్కొనకూడదు. ఇది ఆచారము. అయినా అటువంటి హేయమైన పరిస్థితులలో శత్రువు దాడి చేసినప్పటికిని తాను యుద్ధం చేయబోనని అర్జునుడు నిర్ణయించుకున్నాడు. ఎదుటి పక్షమువారు ఎంతటి సమరోత్సాహముతో ఉన్నారో అతడు పట్టించుకోలేదు. మహాభగవద్భక్తుడు అవడం వలన కలిగినట్టి కోమలహృదయం కారణంగానే ఈ లక్షణాలన్నీ కలిగాయి.
శ్లోకము - 46
సంజయ ఉవాచ
ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోక సంవిగ్నమానసః ||
సంజయః ఉవాచ - సంజయుడు పలికాడు; ఏవం - ఈ విధంగా; ఉక్త్వా - పలికి; అర్జునః - అర్జునుడు; సంఖ్యే - రణరంగములో; రథ - రథం యొక్క; ఉపస్థ - ఆసనం మీద; ఉపావిశత్ - కూర్చుండిపోయాడు; విసృజ్య - ప్రక్కకు పడవేసి; సశరం - బాణాలతో పాటుగా; చాపం - ధనస్సును; శోక - శోకముచే; సంవిగ్న - ఉద్విగ్నుడై; మానసః - మనస్సులో.
సంజయుడు పలికాడు: రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను ప్రక్కు పడవేసి, దుఃఖముచే మనస్సు ఉద్విగ్నము కాగా రథంలో కూర్చుండిపోయాడు.
భాష్యము : శత్రువుల పరిస్థితిని గమనిస్తున్నప్పుడు అర్జునుడు రథంలో నిలబడి ఉన్నాడు. కాని అతడు ఎంతగా దుఃఖమగ్నుడయ్యాడంటే తన విల్లంబులను ప్రక్కకు పడవేసి తిరిగి కూర్చుండిపోయాడు. భగవద్భక్తిలో ఉన్నట్టి అటువంటి దయాపూర్ణుడు కోమల హృదయుడు అయిన వ్యక్తియే ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యుడు.
శ్రీమద్భగవద్గీతలోని "కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము” అనే మొదటి అధ్యాయానికి భక్తివేదాంతభాష్యము సమాప్తము
'భగవద్గీత' యధాతథము - పుస్తకము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి » |