విష్ణు భగవానుడు |
ఓం నమో వేంకటేశాయ
సర్వమూ కాలాధీనం. “కాలః కలయతా మహమ్” అని భగవద్గీత అనంతమైన కాలాన్ని భగవత్స్వరూపంగా నిరూపించింది. కాలము శ్రీమహావిష్ణువుయొక్క ఆజ్ఞతో ప్రవరిస్తూందని పెద్దలు సూచించినారు.
అనంత శక్తిమంతమైన కాలాన్ని సౌరం, చాంద్రం, సావనం, నాక్ష్మత్రం - అని నాల్గు విధాలుగా సూచించి, గణించడం జరిగింది. దక్షిణాదిలో సౌరచాంధ్రమానాలే గణనీయాలు. మనం చైత్ర వైశాఖాదిమాసాల్న్నీ పాడ్యమి (ప్రతిపత్), విదియ (ద్వితీయ), తదియ (తృతీయ), చవితి (చతుర్థి), మున్నగు తిథుల్మ్మీ చాంద్రమానం (ప్రకారం గణిస్తున్నాము. పున్నమనాడు చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి గణించేవి చైత్రాది మాసాలు. ఉదా॥ చిత్తా నక్షత్రములో పున్నమనాడు చంద్రుడుండటాన్ని లెక్కించి - చైత్రం అన్నారు. చంద్రుణ్ణి ఆధారంగా గణించే కాలమానం చాంద్రమానం. సూర్యుణ్ణి ఆధారంగా - సూర్యుడు ఒక్కొక్కరాశిలో ప్రవేశించి వుండే నెలరోజులకూ ఆయా మాసంగా ఉదా!॥ మకరమాసం ఇత్యాదిగా గణించడం సౌరమానం. (సూరః = సూర్యుడు,
సరతి చరతీతి సూరః - అని వ్యుత్పత్తి. సంచరించువాడని అర్థం. సూరసంబంధమైనది సౌరం). సౌరమానం మాసాలు ఆయా ఇంగ్లీషు తేదీలను పోలినవై ఎక్కువ శాతం ఆయా తేదీల్లోనే వస్తాయి. కనుకనే తమిళులకు ఏప్రిల్ ఒకటవ తేదీయే వమేషమాసారంభమై - సంవత్సరాది అవుతుంది. “రవేః సంక్రమణం రాశౌ సంక్రాంతి రితి కథ్యతే” అనుటచే ఒక్కొక్క మాసమూ ఒక్కొక్క సంక్రాంతి అవుతుంది. కాగా మకర సంక్రాంతి జనవరి 14 నుండి కర్మాటక సంక్రాంతి జూలై 16 వరకు ఉత్తరాయణం, జూలై 17 నుండి, జనవరి 13 వరకూ దక్షిణాయనం అంటున్నాము.
“అయనే దక్షిణే'రాత్రి రుత్తరే తు దివా భవేత్” అని కవపింజల సంపౌతావాక్యం. దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు. మానవులకు ఒక సంవత్సర కాలమైనది దేవతలకు ఒక అహోరాత్రయైన దినం. సూర్యుడు ధనూరాశిలో ఉండే మాసం ధనుర్మాసం. ఈ నెలలో ఉషఃకాలం చాలా ప్రాముఖ్యం! “ధనుస్సంక్రాంతి మారభ్య మాస మేకం ప్రతం చరేత్” అనుటచే ధనుర్మాసం నెలరోజులూ శ్రీహరిని విధిగా బ్రాహ్మీకాలంలో అర్చించాలి. ఇలా అర్చిస్తే “కోదండస్థే సవితరి ప్రత్యూషః పూజయే ద్ధరిమ్ | సహస్రాబ్దార్చన ఫలం దినేనైకేన సిద్ధ్యతి” - ధనుర్మాసంలో ఒక్కరోజు ఉషఃకాలంలో శ్రీహరిని అర్చిస్తే - వెయ్యేండ్లు నిత్యమూ అర్చించిన ఫలం సిద్ధిస్తుంది. 30 రోజులూ అర్చించేవారికి 80 వేలేండ్లు అర్చించిన - అంటే అనంతఫలం లభిస్తుంది. అనంతుణ్ణి అనంతంగా అర్చిస్తే అనంతఫలమే కదా సిద్ధిస్తుంది!
ధనుర్మాసం సౌరమానానుసారం రాగా, శుక్లపక్ష ఏకాదశి చాంద్రమానమైన తిథి. ప్రతిమాసంలోనూ రెండు ఏకాదశులు (శుక్ల - బహుళ) వస్తాయి. (అధిక మాసంలో మరో రెండు అధికం). సంవత్సరానికి 24 ఏకాదశులు. ప్రతి ఏకాదశికూడ ఎంతో పవిత్రమైనది. “గృహస్థో పబ్రహ్మచారీచ ఆహితాగ్ని స్తథైవచ । ఏకాదశ్యాం న భుంజీత పక్షయో 'శుభయోరపి” - బ్రహ్మచారి, గృహస్థుడు, నిత్యాగ్నిహోత్రుడూ ఎవడైనా కావచ్చు - ఉభయ ఏకాదశుల్లోనూ భోజనం చేయరాదని శాస్త్రవాక్యం ఇంతనిష్టతో కూడుకున్న ఏకాదశీ దినం శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ప్రీతియైనది. కనుకనే ఏకాదశిని “హరివాసరం” అన్నారు పెద్దలు.
24 ఏకాదశుల్లోనూ - సౌరమానంలో ప్రశస్తమైనధనుర్మాసంలో (మార్గశిర / పుష్యమాసాల్లో) వచ్చే శుక్లపక్ష ఏకాదశిని “వైకుంఠ ఏకాదశి”గా కీర్తిస్తున్నాము. దీన్నే “ముక్కోటి ఏకాదశి” అని ఆంధ్రులంటారు. సౌరమానం ధనుర్మాసంకాగా, అందువచ్చే' వైకుంఠ ఏకాదశి చాందధ్రమానానుసారిణి. శ్రీమన్నారాయణునికి సూర్యుడు కుడికన్ను. చంద్రుడు ఎడమ కన్ను, కన్నులు వేర్వేరుగానున్నా దృష్టి ఒక్కటేయైనట్లు, సూర్యచంద్రులు వేర్వేరుగా కన్పిస్తున్నా - కాంతితత్త్వం ఒక్కటే అనే మహాతత్త్వాన్ని ఈ పండుగ సూచిస్తూంది.
వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర పుష్య మాసాల్లో వస్తుంది. రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకొని వైకుంఠం చేరి, హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశినాడు శ్రీహరిని ప్రార్ధించి, తమ బాధను విన్నవించారు. స్వామి బ్రహ్మాదులకు దర్శన మిచ్చి, అభయ మొసగడం జరిగింది. కాగా దేవతల బాధా నివారణానికి ఈ ఏకాదశియే మార్గం చూపింది.
మరో వృత్తాంతం - మధుకైటభులను మహావిష్టువు సంహరించినపుడు వారు దివ్యరూపాలు ధరించి, దివ్య జ్ఞానాన్ని పొంది, “దేవా! వైకుంఠంవంటి మందిరాన్ని నిర్మించి, ఏకాదశళశీపూజ గావించి, నిన్ను దర్శించి, నమస్కరించి, ఉత్తరద్వారమార్గంలో నిన్ను సమీపించే వారికి శ్రీవైకుంఠ ప్రాప్తి కల్గించు”మని ప్రార్ధించారు. స్వామి “తథాస్తు” అని సంతోషంతో అనుగ్రహించారు. దీనికి “మోక్షోత్సవదిన” మనికూడా పేరు. ముక్కోటి దేవతలకు బాధలను నివారించిన ఏకాదశి కనుక “ముక్కోటి ఏకాదశి” అని పేరు. (ముక్కోటి అనేది 88 కోట్లకు సంకేతమని అంటారు).
- వైకుంఠదర్శనం కల్గిస్తుంది కనుక “వైకుంఠ ఏకాదశి”. భగవద్దర్శనం గావించేది కనుక “భగవదవలోకనదినం”.
- మార్గశిరమందలి శుక్ల ఏకాదశి - 'మోక్షదైకాదశి'. పుష్యశుక్ల ఏకాదశి - 'పుత్రదైకాదశి”.
- సుకేతుడనే రాజు విశ్వేదేవతల ఉపదేశానుసారం పుష్యశుక్ల ఏకాదశీవ్రతాన్ని ఆచరించి, భగవదనుగ్రహం వల్ల పుత్రవంతుడైనాడని పద్మపురాణం పేర్కొనింది.
- సకలపాపాలనుండి విముక్తి చెంది, శ్రీక్రైవల్యప్రాప్తితో జన్మరాహిత్యం చెందడానికి వైకుంఠ ఏకాదశీ వ్రతాన్ని మించిన ప్రతాచరణ .లేదు.
డేవదానవులు ఈ యేకాదశిరోజు ఉపవాసంతో రాత్రింబవళ్లూ శ్రమించి, క్షీరసాగరాన్ని మథించగా, ద్వాదశినాడు మహాలక్ష్మి సముద్రంనుండి వెలువడి వచ్చి, దేవతలకు ప్రత్యక్షమై, వారిని అనుగ్రహించింది. నాటి నుండి ఏకాదశినాడు పగలూ, రాత్రి ఉపవాసంతో వుండి, జాగరణ చేసి, శ్రీహరిని స్తుతించినవారికి స్వామికృపవల్ల ముక్తి కరతలామలకమవుతుందనే నమ్మకం ఏర్పడింది.
శుక్ల ఏకాదశినాడు సూర్యునినుండి వెలువడిన పదకొండవకళ చంద్రుణ్ణి ప్రవేశిస్తుంది. బహుళ ఏకాదశినాడు చంద్రమండలమునుండి పదకొండవ కళ సూర్యమండలాన్ని చేర్తుంది. ఇలా రాకపోకలవల్లనే “ఏకాదశి” అనే పేరు సార్థకమయింది. “ఏకాదశ్యాముపవసేన్న కదాచి దతిక్రమేత్” - ఏకాదశినాడు తప్పక ఉపవాసం చేయాలి. ఉపవాసం నాడు “ఉపవాసః స విజ్ఞేయః, సర్వభోగవివర్జితః” - పాపకృత్యాలకు దూరంగా వుండి, (చేయక) సకలభోగాలను వదలి, పుణ్యకార్యాలు చేయడమే ఉపవాసం అని పెద్దలమాట! ఇంద్రియ ప్రకోపాన్ని అణచి, 11 ఇంద్రియాలను (పంచకర్మేంద్రియ పంచజ్ఞానేంద్రియ మనస్సులు 11 ఇంద్రియాలు) భగవంతుని సన్నిధిలో వసింపజేయునదియే నిజమైన ఉపవాసం. ఏకదాశీవతం దశమిరాత్రితో ప్రారంభమై, ద్వాదశిఉదయంతో పూర్తి అవుతుంది. అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు!
ఎన్మిదేండ్లలోపు వయస్సున్న పిల్లలూ, ఎనభైయేండ్లు దాటిన వృద్ధులూ ఉపవాసం చేయాల్సినపనిలే దని కాత్యాయనస్మృతి పేర్కొనింది.
24 ఏకాదశుల పేర్లూ, ఫలాలూ సంగ్రహంగా తెలుసుకొందాం:
1) చైత్రశుక్ల ఏకాదశి - 'కామదా” - కోర్మెలు తీరుస్తుంది.
2) చైత్రబహుళ ఏకాదశి - “వరూధిని” - సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.
3) వైశాఖశుద్ధ ఏకాదశి - “మోహిని” - దరిద్రుడు ధనవంతు డగును.
4) వైశాఖ బహుళ ఏకాదశి - అపరా” - రాజ్యప్రాప్తి.
5) జ్యేష్టశుక్ల ఏకాదశి - “నిర్జల - ఆహార సమృద్ధి.
6) జ్యేష్ట బహుళ ఏకాదశి - “యోగినీ” - పాపములను హరిస్తుంది.
7) ఆషాఢశుద్ధ ఏకాదశి - 'దేవశయసీ” - సంపత్ ప్రాప్తి (విష్ణువు యోగనిద్రకు శయనించు రోజు)
8) ఆషాఢబహుళ ఏకాదశి - 'కామికా” - కోరిన కోర్మెలు ఫలిస్తాయి.
9) (శ్రావణశుక్ష ఏకాదశి - “పుత్రదా” - సక్సంతాన ప్రాప్తి.
10) శ్రావణబహుళ ఏకాదశి - “అజా” - రాజ్యపక్నీ పుత్ర ప్రాప్తి. ఆపన్నివారణం.
11) భాద్రపదశుద్ధ ఏకాదశి - “పరివర్తన” - (యోగ నిద్రలో విష్ణువు ప్రక్కకు పొర్లును కనుక పరివర్తన) యోగసిది.
12) భాద్రపద బహుళ ఏకాదశి - “ఇందిరా” - సంపదలు, రాజ్యము (ప్రాప్తించును.
13) ఆశ్వయుజశుక్ల్ష ఏకాదశి - “పాపాంకుశి - పుణ్యప్రదం.
14) ఆశ్చయుజ బహుళ ఏకాదశి - రమా” - స్వర్గప్రాప్తి,
15) కార్తికశుక్ల ఏకాదశి - 'ప్రబోధిని” = (యోగనిద్ర నొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు) జ్ఞానసిద్ధి.
16) కార్తిక కృష్ణ ఏకాదశి - ఉత్పత్తి" - దుష్ట సంహారము. (మురాసురుని సంహరించిన కన్య విష్ణుశరీరము నుండి జనించిన రోజు)
17) మార్గశిరశుక్ల ఏకాదశి - “మోక్షదా” - మోక్షప్రాప్తి. (ఇది వైకుంఠ ఏకాదశి)
18) మార్గశిర కృష్ణ ఏకాదశి-విమలా” (సఫలా) - అజ్ఞాన నివృత్తి.
19) పుష్యశుక్ల ఏకాదశి - “పుత్రదా” - పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి)
20) పుష్య కృష్ణ ఏకాదశి - కల్యాణీ (షట్తిలా) ఈతిబాధా నివారణం.
21) మాఘశుక్ల ఏకాదశి - “కామదా” (జయా) - శాపవిముక్తి.
22) మాఘకృష్ణ ఏకాదశి - “విజయా” - సకలకార్య విజయం. (ఇది భీష్మైకాదశి అని ప్రసిద్ధి)
23) ఫాల్గున శుక్ల ఏకాదశి - ఆమలకీ” - ఆరోగ్య ప్రదం.
24) ఫాల్గున కృష్ణ ఏకాదశి - 'సౌమ్యా” - పాపవిముక్తి.
(పురాణాలలో ఏకాదశులకున్న పేర్లవిషయంలో కొన్ని భేదాలు కన్పిస్తున్నాయి).
విష్ణు భగవానుడు - ఏకాదశి దేవి |
: ఏకాదశీ దేవీ జననము :
పూర్వం కృతయుగంలో చంద్రావతీనగరాన్ని పాలించే 'మురు'డనే రాక్షసు డుండేవాడు. దేవతల్ని జయించి, వేధించేవాడు. విష్ణువు వానితో వెయ్యేండ్లు యుద్ధం చేసి అలసి, విశ్రాంతికై ఒకగుహలో చేరి నిద్రించాడు. అట్టి శ్రీహరిని సంహరించడానికి మురుడు సిద్దపడగా, స్వామి శరీరంనుండి దివ్య తేజస్సులతో ఒక కన్య ఉద్భవించింది.
ఏకాదశి దేవి మారుణ్ణి సంహరించుట.. |
ఏకాదశీ తిథికి అధిదేవత ఏకాదశీదేవి. ఈమె విష్ణు దేహసముత్పన్న కనుక స్త్రీమూర్తియైన మహావిష్ణువే! “జన్య జనకంబులకు భేదశంక లేదు” కదా! సర్వోత్తమ తిథి - ఏకాదశి. ఏకాదశీ వ్రత ప్రభావాన్ని వివరించే కథలు చాలా వున్నాయి.
కుచేలుడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించి, మహైశ్వర్యవంతుడైనాడని ఐతిహ్యం. ధర్మరాజు ఆచరించి కష్టాలనుండి గట్టెక్కినాడు. రుక్మాంగదుడు ఆచరించి పుత్రప్రాప్తి నొందాడు. సకల దేవతా కృపా పాత్రు డైనాడు. మోక్షగామియైనాడు. క్షీరసాగరమథనం - లక్ష్మీ ఆవిర్భావం ఏకాదశినాడే జరిగాయి. వైఖానస రాజు ఆచరించి, పితరులకు ఉత్తమలోక ప్రాప్తి చేకూర్చాడు. అంబరీషుని ప్రత ప్రభావం జగద్విదితం!
: ఆధ్యాత్మిక స్ఫూర్తి :
వ్రతాలూ, పూజలూ అన్నీ ఇంద్రియనిగ్రహంతో భగవత్ కైంకర్యపరులై, జ్ఞానవిజ్ఞాన ఘనులై ముక్తులగుట కొరకే ఏర్పడిన విశిష్టసాధనాలు. ఆధ్యాత్మికతత్త్వం అంతర్లీనం కాకుండా భారతీయుల కర్మకాండ సిద్ధింపదు.
" సర్వకర్మలూ జ్ఞానంలో పరిసమాప్తం అవుతాయన్నది - భగవద్గీత. "
కనుక వైకుంఠ ఏకాదశీ వ్రతంలోనూ ఆధ్యాత్మిక నిధి విధిగా ఉంటుంది. యథాశక్తిగా ఏకాదశీ అంతర్గత తాత్త్వికానందరసాన్ని ఆస్వాదిస్తాం.
వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదా లున్నాయి. 'వైకుంఠి శబ్దం అకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ, విష్ణువుండే స్థానాన్నీకూడా సూచిస్తుంది. చాక్షుషమన్వంతరంలో '“వికుంఠ”ి అనే ఆమెనుండి అవతరించినందున విష్ణువు “వైకుంఠ” (వైకుంఠుడు) అయ్యాడు. మరియు జీవులకు నియంత, జీవులకు సాక్షి భూతముల స్వేచ్ఫావిహారాన్ని అణచేవాడు - అనీ అర్థాలున్నాయి. వైకుంఠము - అయినపుడు శ్వేతద్వీపమైన విష్ణుదేవుని స్థానం. పునరావృత్తి లేనిదీ, శాశ్వతమైనదీ అగు విష్ణుదేవుని పరమధామం. జీవులు వైకుంఠుణ్ణి అర్చించి, ఉపాసించి, వైకుంఠాన్ని చేరుటే ముక్తి. ఇంద్రియాలు ఇంద్రియాధిష్థాన నారాయణుణ్ణి సేవించుటే భక్తికదా!
“మనః షష్టా నీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి” అనిన గీతావాక్యానుసారం మనస్సూ, పదియింద్రియాలూ అనగా మొత్తం పదకొండు ఇంద్రియాలను శబ్దాది విషయాల ద్వారా జీవాత్మ ఆకర్షిస్తుంది. అంటే జీవాత్మ శరీరాన్ని వదలి వెళ్లేటప్పుడు కర్మేంద్రియాలను, ప్రాణాలను, బుద్ధిని కూడా తనతో తీసుకొని పోతుంది. జీవాత్మ ఒకశరీరం నుండి మరొక శరీరంలో ప్రవేశించేటప్పుడు మొదటి శరీరంనుండి మనస్సుతోపాటు ఇంద్రియాలనూ ఆకర్షించి, తీసుకవెళ్తుంది. మనస్సంటే అంతఃకరణం.
ఇటు వైకుంఠ మంటే పరంధామం. ఏకాదశి అంటే పదకొండు ఇంద్రియాల సమూహం. (5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు=11 ఇంద్రియాలు. మనస్సుకూడ ఒక ఇంద్రియమే!) ఈ 11 ఇంద్రియాలూ వైకుంఠునికి అర్పింప బడి, వైకుంఠుణ్ణి అర్చించి, సేవించి, ఉపాసించినపుడే - అవి పవిత్రములై వాటిద్వారా సుఖానుభూతి నొందే జీవుణ్ణి వైకుంఠంలో చేరుస్తాయి. కాగా “ఏకాదశేంద్రియాలను వైకుంఠార్చణం చేసి, వైకుంఠాన్ని చేరి, శాశ్వత ముక్తినొంది, ధన్యులు కాండి” - అని బోధిస్తూంది - “వైకుంఠ ఏకాదశి”. వికుంఠ మంటే - దెబ్బ తిననిది. ఇంద్రియాలు “వికుంఠాలు” అయినపుడే వైకుంఠసమర్చన ప్రశాంతంగా జరుగుతుంది.
ద్వాదశి - 192వ స్థితి, ఇదే ఇంద్రియాతీతదివ్యానంద స్థితి! ఏకాదశినాటి ఉపవాసం సత్త్వగుణానికి సంకేతం! ఒక వస్తువుకు మిక్కిలి దగ్గరగా మరొక వస్తువు నుంచినపుడు మొదటి వస్తువు యొక్క గుణం, వాసన రెండవదానిపై ప్రభావం చూపుతాయి కదా! అట్టే ఏకాదశేంద్రియాలతోక్తూడి జీవాత్మ, వైకుంఠునికి - ఉప = సమీపంలో, వాసః = నివసించుటవల్ల అత్యంత సామీష్య్సాన్నిధ్య ప్రభావం కారణంగా జీవాత్మపై పరమాత్మ ప్రభావం ప్రసరిస్తుంది. జీవుడు శుద్ధు డవుతాడు. ద్వాదశినాడు చక్రస్పానం గావించి, స్వామి ప్రసాదాన్ని స్వీకరించడంతో ద్వాదశాక్షరీమంత్రమయమైన వాసుదేవతత్త్వాన్ని అనుభవిస్తాడు - జీవాత్మ, ఈ అనుభవమేకలియుగ వైకుంఠమైన తిరుమల - శ్రీపుష్కరిణి ముక్కోటి ఏకాదశీ చక్రస్నానఫలం!
ఇది ధనుర్మాసం! “ ప్రణవో ధనుః ” అనుటచే ఓంకారమే ధనుస్సు. శ్రీవారిని ప్రణవమాూర్తిగా ఉపాసించుటే ధనుర్మాస పూజ. అందు 'వైకుంఠ ఏకాదశి” సర్వ సమర్పణ రూపమైన త్యాగానికీ, శుద్ధ సత్త్వగుణానికీ సంకేతం. స్వామి 'పవిత్రాణాం పవిత్రం, మంగళానాం మంగళం) కదా! అట్టి సుదర్శనరూపుని చేతిదివ్యాయుధం సుదర్శనచక్రం. ఇది కాలచక్రానికీ, దర్శనమాత్ర ముక్తిదాయకత్వానికీ ప్రతీక. సుదర్శనచక్ర స్నాన స్పర్శతో కూడిన జలంలో (పుష్కరిణీ తీర్ధంలో) స్నానం చేయడంతో జీవాత్మలు పరిశుద్ధులూ, సుదర్శనులూ” అవుతారు. ఇట్టి జీవులకు వైకుంఠ ద్వారాలు - ఒక రోజే కాదు - సర్వదా తెరువబడే వుంటాయి. ఇంతటి ప్రభావసంపన్నమైన వైకుంఠ ఏికాదశినీ, ద్వాదశినీ భక్తిశ్రద్ధలతో ఆచరించినవారికి పునర్జన్మ ఉండదు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - Tirumala Vaikunta Ekadashi |
: తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి :
కలియుగవైకుంఠమైన తిరుమల - శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహావైభవంగా నిర్వహింపబడుతుంది. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిళ్లు 'మూసివేస్తారు. పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొన్ని మరునాడు ద్వాదశి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న ముక్కోటి ప్రదక్షిణ మార్గాన్ని తెరచివుంచుతారు. ఈ ఏకాదశీ, ద్వాదశీ రెండురోజులూ శ్రీవారి దర్శనానంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణమార్గంలో వెళ్తారు. ఈ'ముక్కోటి ప్రదక్షిణ ప్రవేశద్వారాన్ని వైకుంఠ ద్వారమనీ, ఆ మార్గాన్ని వైకుంఠ ప్రదక్షిణ మనీ అంటారు.
వైకుంఠ ఏకాదశీ పర్వదినంనాడు ముక్కోటి ప్రదక్షిణ మార్గం రంగురంగుల విద్యుద్దీపాలతో, పూలమాలలతో మనోహరంగా అలంకరింపబడుతుంది. శ్రీ స్వామివారికి అత్యంతసమీపంలో వున్న ఈ ప్రదక్షిణమార్గంలో దర్శనానంతరం వెళ్లిన భక్తులు ఒకవిశిష్ట ఆశ్చర్య దివ్యానుభూతిని అనుభవిస్తారు.
: వైకుంఠ ద్వాదశి :
చక్ర స్నానం |
తిరుమలలో స్వామిపుష్కరిణిలో సంవత్సరంలో నాల్గుమార్లు చక్రస్నానం జరుగుతుంది.
1) భాద్రపద శుద్ధ చతుర్దశి _ అనంతపద్మనాభ వ్రతంనాడు,
2) 10 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో చివరి రోజు,
3) వైకుంఠ ఏకాదశిమరునాడు - ద్వాదశినాటీ్ ఉదయం,
4) రథసప్తమినాటి మధ్యాహ్నం.
ఈ నాల్లింటిలో వైకుంఠద్వాదశి నాటి ఉదయం జరిగే చక్రస్నానంలో భక్తులు అసంఖ్యాకంగా పాల్గొంటారు.
: విశేష పూజాదులు :
వైకుంఠ ఏకాదశినాడు ఉభయనాంచారుల్లో మలయప్పస్వామి సర్వాలంకారభూషితుడై తిరువీథుల్లో స్వర్ణరథం పై ఊరేగుతారు. ఆనాడు శ్రీవారిసన్నిధిలో “రాపత్తుతొడక్కం” జరిగి, శ్రీనమ్మాళ్వార్వారు సాయించిన “భగవద్విషయం” అనే అపరనామధేయాంకమైన “తిరువాయ్మొలి” అనే దివ్యప్రబంధంలోని నాల్గవ ఆయిరం అధ్యయనం ప్రారంభిస్తారు.
వైకుంఠద్వారం ద్వారా ఈనాడు వేలకొలది భక్తులు శ్రీస్వామి వారిని దర్శిస్తున్నందున ఈ ఉత్సవాన్ని “వైకుంఠ ద్వారస్థ భగవదాలోకనమహోత్సవం”గా కీర్తిస్తున్నారు. ద్వాదశినాటి చక్రస్నానంతో తామూ స్నానంచేసి, భక్తులు వైకుంఠ ఏకాదశీవ్రతఫలాన్ని పరిపూర్ణంగా పొందుచున్నారు.
(తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి విశేషాలు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యంగారు రచించిన “శ్రీనివాస వైభవం” నుండి గ్రహింపబడినవి. వారికి కృతజ్ఞతాంజలులు. )
“సదా వేంకటేశం స్మరామి స్మరామి”
| ఓం శాంతి శ్యాంతి శ్యాంతిః |
సమర్పణ: కోటి మాధవ్ బాలు చౌదరి ( ఎనుగంటి గోత్రము )