గణపతి |
: సంకష్టహర గణపతి వ్రతం :
దారిద్ర్య శోక కష్టాలతో పీడింపబడే మానవులకు తరుణోపాయాన్ని తెలపమనీ, తక్షణం ఫలించే ఉపాయాన్ని తెలపమనీ పూర్వం ఋషులు కుమారస్వామిని అడిగారు. అందుకు కుమారస్వామి సంకష్టహర గణపతి వ్రతమని ఒకటున్నదని తెలిపి, దానిని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశించిన విధంగా తెలుపసాగాడు.
అరణ్యవాసం ఆజ్ణ్జాతవాసం రెండూ పూర్తి చేసినా, కౌరవులనుండి తమ రాజ్యం తాము పొందలేక బాధపడుతున్న ధర్మరాజుకి శ్రీకృష్ణుడు సంకష్టీ వ్రతం గురించి తెలియచేశాడు.
పూర్వం శివుని భర్తగా పొందగోరి ఇతరులకు శక్యం కానంతటి ఘోరతపస్సుని ఆచరించి కూడా ఫలితం పొందలేక, ఒకనాడు పార్వతీదేవి దిగులుతో పూర్వజుడైన హేరంబ గణపతిని* తలుచుకుంది. తలుచుకున్న వెంటనే ఎదుట ప్రత్యక్షమైన గణపతితో తాను నారదమహర్షి వద్ద సంకష్టహర గణపతి వ్రతమని ఒకటి విన్నాననీ, దాని విధానమేమిటో తెలియచేయాలనీ అడిగింది. అందుకు వినాయకుడు ఈ వ్రతాన్ని శుక్ల చవితి నాడు కాకుండా బహుళ చవితి నాడు చేస్తారంటూ, శ్రావణ బహుళ చవితి నాడు చేసే పూజనంతా విపులంగా వర్ణించి చెప్పాడు.
ఆరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి దంతధావనము పూర్తయిన తరువాత "గ్రాహ్యం వ్రతమిదం పుణ్యం సంకష్టహరణం శుభమ్" అంటూ సంకల్పం చెప్పుకొని, నల్లనువ్వులు కలిపిన నీళ్ళతో స్నానం చేసి, సాయంత్రం చంద్రోదయం అయ్యేదాకా ఉపవాసం ఉండి, గణేశునికి పూజ చేసి, ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టి వారి ఆశీర్వనాలని అందుకొని, గణేశ ప్రసాదాన్ని భుజించాలి. తరువాత, ఆ రాత్రంతా జాగారం చేసి, మరునాడు ఉదయం వ్రతవిరమణ చేయాలి.
అట్లా చేసినవారికి తాను ప్రసన్నుడై వారు కోరుకున్న కోరికలనన్నింటినీ తీరుస్తానని చెప్పి గణేశుడు అంతర్థానం కాగా, పార్వతీదేవి ఆచరించి, ఆరునెలలు గడిచేలోపే శివుడిని భర్తగా పొందింది. కాబట్టి, ఓ ధర్మరాజా! నీవు కూడా ఈ సంకష్టీ వ్రతం ఆచరించి ఫలితం పొందమనగా, ధర్మరాజు చేసి, యుద్ధంలో కౌరవులని జయించి, తాను రాజుగా గల రాజ్యాన్ని పొందాడు.
ఈ వ్రతం ధర్మార్థకామమోక్షాలని నాలిగింటినీ ప్రసాదిస్తుంది. కష్టాలను తొలిగిస్తుంది కాబట్టి దీనికి సంకష్టనాశనం అని పేరు. పూర్వం వాలి చేతిలో ఓడిపోయి బంధింపబడిన రావణాసురుడు, సీతాదేవిని కనుగొనలేక నీరసించిన హనుమంతుడూ, ఈ వ్రతం చేస్తామని సంకల్పించుకోగానే సత్ఫలితాలు పొందారు. దమయంతి, అహల్య కూడా తమ భర్తలకు దూరమై బాధ పడుతున్నప్పుడు ఈ వ్రతం ఆచరించి ఫలితం పొందారు. విద్యలో కానీ, ధనవిషయమై కానీ, సంతానప్రాప్తికి కానీ, మరి ఏ విషయకైనా ఎదురౌతున్న అన్ని ఆటంకాలను ఇది నాశనం చేస్తుంది అని స్కందుడు మహర్షులకు ఈ వ్రతకథ వివరించాడు.
మనం పార్వతీదేవికి పుత్రుడుగా పుట్టిన గణపతి గురించే ఎక్కువగా వింటుంటాం. ఈ కథలో చెప్పబడిన హేరంబుడు సృష్ట్యాదిలో ఓంకారం నుండి ఉద్భవించినవాడు.